యోహాను రాసిన మొదటి పత్రిక
గ్రంథకర్త
ఈ పత్రికలో దీని రచయిత పేరు కనిపించదు. కానీ సంఘం ఎంతో స్పష్టం బలంగా మొదటి నించీ ఇస్తూ వచ్చిన సాక్ష్యం ప్రకారం దీని రచయిత శిష్యుడు, అపోస్తలుడు యోహాను (లూకా 6:13, 14). ఈ లేఖల్లో యోహాను పేరు కనిపించకపోయినప్పటికీ ఇతడే రచయిత అనడానికి మూడు ఆధారాలు ఉన్నాయి. రెండవ శతాబ్ది రచయితలు యోహానునే ఈ పత్రిక రాసినట్టు పేర్కొన్నారు. రెండవది, ఈ పత్రికలో యోహాను సువార్త పదజాలం, శైలి ఉన్నాయి. మూడవదిగా రచయిత తాను యేసు శరీరాన్ని చూశానని, తాకానని చెప్పాడు. ఈ మాట యోహానుకు తప్పక వర్తిస్తుంది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 85 - 95
ఎఫెసులో తన వృద్ధాప్యంలో యోహాను ఇది రాశాడు.
స్వీకర్త
ఈ లేఖ ఎవరికి రాశాడో ఇక్కడ స్పష్టంగా చెప్పలేదు. కానీ ఇందులోని విషయాన్నీ బట్టి, విశ్వాసులకె రాశాడనుకోవచ్చు (1:3-4; 2:12-14). అనేక ప్రదేశాల పరిశుద్ధుకోసం అతడు రాసి ఉండవచ్చు. స్థూలంగా అంతటా ఉన్న క్రైస్తవులన్నమాట. 2:1, “నా చిన్న పిల్లలారా.”
ప్రయోజనం
మనం ఆనందంతో నిండి పోవాలనీ, పాపం నుండి తప్పించుకోవాలనీ, రక్షణ నిశ్చయత కలిగి ఉండాలనీ విశ్వాసి క్రీస్తుతో వ్యక్తిగత సంబంధంలోకి రావాలనీ, సహవాసం పెంపొందాలనీ యోహాను రాశాడు. యోహాను ముఖ్యంగా సంఘం నుంచి వేరై పోయి సువార్త సత్యం నుండి మనుషులను దూరం చేయజూస్తున్న అబద్ధ బోధకుల సమస్యను ముఖ్యంగా చర్చించాడు.
ముఖ్యాంశం
దేవునితో సహవాసం
విభాగాలు
1. అవతారం వాస్తవికత — 1:1-4
2. సహవాసం — 1:5-2:17
3. మోసాన్ని పసిగట్టడం — 2:18-27
4. ప్రస్తుతం పవిత్ర జీవనానికి ప్రేరణ — 2:28-3:10
5. నిశ్చయతకు పునాది ప్రేమ — 3:11-24
6. అబద్ధ ఆత్మల వివేచన — 4:1-6
7. పవిత్రీకరణకు అవశ్యకమైన సంగతులు — 4:7-5:21
1
కుటుంబానికి తండ్రితో సహవాసం (క్రీస్తు అవతారం వల్ల సహవాసం సాధ్యమైంది)
ఆది నుండి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ, మా కళ్ళతో చూసిందీ, దగ్గరగా గమనించిందీ, మా చేతులతో తాకిందీ మీకు ప్రకటిస్తున్నాం. ఆ జీవం వెల్లడైంది. తండ్రితో ఉండి ఇప్పుడు బయటకు కనిపించిన ఆ శాశ్వత జీవాన్ని మేము చూశాం కాబట్టి మీకు సాక్షమిస్తూ దాన్ని మీకు ప్రకటిస్తున్నాం.
సహవాసం తండ్రితో, కుమారుడితో కూడా
మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని మేము చూసిందీ, విన్నదీ మీకు ప్రకటిస్తున్నాం. నిజానికి మన సహవాసం తండ్రితోను, ఆయన కుమారుడు యేసు క్రీస్తుతోను ఉంది. మీ ఆనందం సంపూర్తి కావాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాం.
సహవాసానికి షరతు: వెలుగులో నడవాలి
దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.
లోపలున్న పాపాన్ని గుర్తించాలి
మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.
పాపం ఒప్పుకోలు, క్షమాపణ, శుద్ధి
కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. 10 మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.