ఎస్తేరు
గ్రంథకర్త
రచయిత ఎవరో తెలియదు. అయితే ఇతడు పారశీక రాజాస్థానం గురించి బాగా పరిచయం ఉన్న యూదుడు. రాజాస్థానం లోని జీవన విధానం, సంప్రదాయాల గురించిన వర్ణనలు, ఈ గ్రంథంలోని సంభవాలు మొదలైన వాటిని బట్టి చూస్తే ఒక ప్రత్యక్ష సాక్షి ఈ పుస్తకం రాసినట్టు అర్ధమవుతున్నది. జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి వచ్చిన శేషప్రజను ఉద్దేశించి ఇతడు ఈ పుస్తకం రాశాడని పండితులు ఊహిస్తున్నారు. అయితే పుస్తకంలో అతన్ని గురించి గొప్పగా రాయడం వేరొక వ్యక్తి రాశాడనే అభిప్రాయం కలిగిస్తున్నది. అతని కాలంలో వయసులో చిన్నవాడెవరో రాసి ఉండవచ్చు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 465 - 358
పారసీక రాజు జెరిజిస్ పరిపాలన కాలంలో రచన జరిగింది. పారసీక రాజధాని షూషను కోటలో ఈ సంగతులన్నీ జరిగాయి.
స్వీకర్త
చీట్ల పండగ లేక పూరీము ఎలా మొదలైనదీ యూదులకు తెలియలని ఈ పుస్తకం రాయడం జరిగింది. పూరీము పండగ యూదులను దేవుడు రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి జరుపుకుంటారు. ఇది ఈజిప్టు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజల విడుదల వంటిదే.
ప్రయోజనం
మానవ సంకల్పానికీ దైవ సంకల్పానికీ మధ్య జరిగి ఘర్షణను చూపించడమే ఈ పుస్తకం ఉద్దేశం. జాతి పరమైన ద్వేషం అంటే దేవునికి అసహ్యం. ప్రమాద సమయాల్లో ఆయన తన ప్రజలకు జ్ఞానమిచ్చి సహాయం చేస్తాడు. తన ప్రజల జీవితాల్లో ఆయన హస్తం కనిపిస్తూ ఉంటుంది. మనుషులందరి నిర్ణయాలనూ చర్యలనూ ఉపయోగించుకుని తన చిత్తనుసారంగా, తన పథకాలను ఉద్దేశాలను ఆయన నెరవేర్చుకుంటాడు. ఎస్తేరు గ్రంథం పూరీము పండగ ఉనికిలోకి వచ్చిన వైనాన్ని తెలియజేస్తున్నది. నేటికీ యూదులు పూరీము సమయంలో ఎస్తేరు గ్రంథం చదువుకుంటారు.
ముఖ్యాంశం
జాతి అంతరించి పోకుండా కాపుదల.
విభాగాలు
1. ఎస్తేరు రాణి కావడం — 1:1-2:23
2. దేవుని ప్రజ యూదులకు వాటిల్లిన ప్రమాదం — 3:1-15
3. ఎస్తేరు, మొర్దేకై తీసుకున్న చర్యలు — 4:1-5:14
4. యూదులకు రక్షణ — 6:1-10:3
1
వష్తి రాణి పతనం
ఇండియా నుండి ఇతియోపియా* 1:1 ఇతియోపియా ఆ రోజులో కూషు దేశం వరకూ గల 127 సంస్థానాలను పరిపాలించిన అహష్వేరోషు కాలంలో జరిగిన విషయాలు ఇవి. ఆ కాలంలో అహష్వేరోషు రాజు షూషను కోటలో నుండి పరిపాలన సాగిస్తున్నాడు. తన పరిపాలన మూడో సంవత్సరంలో అతడు తన అధిపతులకు, సేవకులకు విందు చేశాడు. పర్షియా, మాదీయ శూరులూ రాజవంశికులూ సంస్థానాల అధిపతులూ అతని సముఖంలో ఉన్నారు. అతడు తన మహిమగల రాజ్య వైభవ ఐశ్వర్యాలనూ, తన విశిష్టత తాలూకు ఘనత ప్రతిష్టలనూ చాలా రోజులపాటు, అంటే 180 రోజులపాటు వారి ఎదుట ప్రదర్శించాడు.
ఆ రోజులు గడిచిన తరువాత రాజు ఏడు రోజుల పాటు విందు ఏర్పాటు చేయించాడు. అది షూషను కోటలో ఉన్న వారందరికీ, అంటే గొప్పవారు మొదలుకుని కొద్ది వారి వరకూ అందరికీ. అది రాజభవనం ఆవరణంలోని ఉద్యానవనంలో జరిగింది. ఆ ఉద్యానవనం ఆవరణలో పాలరాతి స్తంభాలకు ఉన్న వెండి రింగులకు ముదురు కెంపు రంగు నార తాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్లకు తెలుపు, నేరేడు వర్ణాల తెరలు వేలాడుతున్నాయి. వేరు వేరు రంగుల పాల రాయి పరచిన నేల మీద జలతారు కప్పి ఉన్న వెండి బంగారు తల్పాలు ఉన్నాయి.
అతిథులకు బంగారు పాత్రల్లో తాగేందుకు పోశారు. ప్రతి పాత్రా దేనికదే వేరుగా ఉంది. రాజు ఇష్టంగా ద్రాక్షారసాన్ని ధారాళంగా పోయించాడు. ఆ విందు పానం “ఎవరికీ ఎలాంటి నిర్బంధమూ లేదు” అన్న రాజాజ్ఞ ప్రకారం జరిగింది. ఏ అతిథి కోరినట్టు అతనికి చెయ్యాలని రాజు ముందుగానే తన అంతఃపుర సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు. వష్తి రాణి కూడా అహష్వేరోషు రాజ భవనంలో స్త్రీలకు విందు చేసింది.
10 ఏడో రోజున రాజు ద్రాక్షారసం సేవించి ఉల్లాసంగా మత్తెక్కి ఉన్న సమయంలో తన ముందు సేవాధర్మం జరిగించే మెహూమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే ఏడుగురు నపుంసకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 11 అక్కడ సమావేశమైన ప్రజానీకానికి, అధిపతులకు వష్తి రాణి తన అందాన్ని ప్రదర్శించాలని, ఆమె రాజ కిరీటం ధరించుకుని తన సన్నిధికి రావాలని చెప్పి పంపాడు. ఆమె అసమాన సౌందర్య రాశి.
12 వష్తి రాణి నపుంసకులు వినిపించిన రాజాజ్ఞ ప్రకారం రావడానికి ఒప్పుకోలేదు. రాజుకు చాలా కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలి పోయాడు. 13 కాబట్టి జ్ఞానులుగా పేరు పొందిన వారితో కాలం పోకడలను ఎరిగిన వారితో అతడు సంప్రదించాడు. చట్టం, రాజ్యధర్మం తెలిసిన వారి సలహా తీసుకోవడం రాజుకు వాడుక. 14 కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెను, మర్సెనా, మెమూకాను అనే ఏడుగురు అతనికి సన్నిహితంగా ఉండిన వారు. వీరికి రాజు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. రాజ్యంలో అత్యున్నత అధికార స్థానాల్లో ఉన్న పారసీకుల, మాదీయుల ఏడుగురు ప్రధానులు వీరే. 15 రాజు “రాజైన అహష్వేరోషు అనే నేను నపుంసకుల ద్వారా పంపిన ఆజ్ఞకు వష్తి రాణి లోబడ లేదు కాబట్టి చట్ట పరిధిలో ఆమెను ఏమి చేయాలి?” అని వారిని అడిగాడు.
16 మెమూకాను రాజు ఎదుటా ప్రధానుల ఎదుటా ఇలా జవాబిచ్చాడు. “వష్తి రాణి రాజుకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, రాజైన అహష్వేరోషు పాలనలోని సంస్థానాలన్నిటిలోని అధిపతులందరికీ, ప్రజలందరికీ వ్యతిరేకంగా తప్పు చేసింది. 17 స్త్రీలందరికీ ఈ విషయం తెలుస్తుంది. వారంతా తమ పురుషులను చులకన చేస్తారు. ఎలాగంటే, ‘అహష్వేరోషు రాజు తన రాణి వష్తిని తన సన్నిధికి పిలుచుకు రావాలని ఆజ్ఞాపిస్తే ఆమె రాలేదు’ అంటారు. 18 పారసీక, మాదీయ అధిపతుల భార్యలు రాణి చేసినది విని, రాణి పలికినట్టే ఈ రోజు రాజు అధిపతులందరితో పలుకుతారు. దీని వలన చాలా తిరస్కారం, కోపం కలుగుతాయి.
19 రాజుగారికి అంగీకారం అయితే రాజైన అహష్వేరోషు సమక్షంలోకి వష్తి రాణి ఇక ఎన్నడూ రాకూడదని మీరు ఆజ్ఞ ఇవ్వాలి. ఈ శాసనం స్థానంలో మరొకటి ఎన్నటికీ రాకుండేలా పారసీకుల, మాదీయుల చట్ట ప్రకారం దాన్ని రాయాలి. రాజు వష్తి కంటే యోగ్యురాలికి రాణి పదవి ఇవ్వాలి. 20 రాజు చేసే నిర్ణయం విశాలమైన మీ రాజ్యమంతటా ప్రకటించినట్టయితే, ఘనురాలు గానీ అల్పురాలు గానీ స్త్రీలందరూ తమ పురుషులను గౌరవిస్తారు.”
21 ఈ సలహా రాజుకీ అధికారులకీ నచ్చింది. కాబట్టి అతడు మెమూకాను మాట ప్రకారం చేశాడు. 22 ప్రతి మగ వాడు తన ఇంట్లో అధికారిగా ఉండాలని శాసించాడు. ప్రతి రాజ సంస్థానానికి దాని రాత లిపి ప్రకారం, ప్రతి జాతికీ దాని భాష ప్రకారం ఆదేశాలు వెళ్ళాయి. ఈ శాసనం సామ్రాజ్యం అంతటా రాజు వివిధ ప్రజల భాషల్లో రాసి పంపించాడు.

*1:1 1:1 ఇతియోపియా ఆ రోజులో కూషు దేశం