యెహెజ్కేలు
గ్రంథకర్త
బూజీ కుమారుడు, యాజకుడు, ప్రవక్త అయిన యెహెజ్కేలు. ఇతడొక యాజక కుటుంబంలో యోరుషలేములో పెరిగాడు. బబులోను చెర కాలంలో యూదులతో కలిసి జీవించాడు. యెహెజ్కేలు ప్రవచనాల్లో అతడి యాజక వంశ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తరచుగా అతడు ఆలయం, యాజకత్వం, ప్రభువు మహిమ, బలి అర్పణల వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు.
రచనా కాలం, ప్రదేశం
క్రీ. పూ. 593 - 573
యెహెజ్కేలు బబులోనులో ఈ పుస్తకం రాశాడు. ఇశ్రాయేలు, ఈజిప్టు, అనేక ఇతర ఇరుగుపొరుగు జాతుల గురించి ప్రవచనాలు పలికాడు.
స్వీకర్త
బబులోనులోను, స్వదేశంలోను ఉన్న ఇశ్రాయేలీయిలు. తరువాత కాలాల్లో చదివేవారంతా
ప్రయోజనం
తీవ్ర పాపాల్లో ఉండి, ఎంత మాత్రం నిరీక్షణ లేని తన వారినికి యెహెజ్కేలు పరిచర్య జరిగించాడు. తన ప్రవచన పరిచర్య ద్వారా ఆ జాతిని తక్షిణ పశ్చాత్తాపానికి, రానున్న యుగంలో ఆత్మనిబ్బరం కలిగించడానికి ప్రయత్నించాడు. దేవుడు మానవ వార్తాహరుల ద్వారా పనిచేస్తాడని అతడు నేర్పించాడు. ఓటమిలోను, నిరాశలోను దేవుని ప్రజలు ఆయన సార్వభౌమత్వాన్ని ఒప్పుకోవాలి. దేవుని వాక్కు ఎన్నటికీ విఫలం కాదు. దేవుడు అంతటా ఉన్నాడు. ఎక్కడైనా ఆయన్ను ఆరాధించవచ్చు. యెహెజ్కేలు గ్రంథం మనం చీకటి కాలంలో సైతం దిక్కు తోచని సమయాల్లో సైతం దేవుణ్ణి వెదకాలని గుర్తు చేస్తున్నది. మనం మన బ్రతుకులు పరీక్షించుకోవాలి. ఏకైక నిజ దేవునితో ఏకీభవించాలి.
ముఖ్యాంశం
ప్రభువు మహిమ
విభాగాలు
1. యెహెజ్కేలు పిలుపు — 1:1-3:27
2. యోరుషలేము, యూదయ, ఆలయాలకు వ్యతిరేకంగా ప్రవచనాలు — 4:1-24:27
3. ఇతర జాతులకు వ్యతిరేకంగా ప్రవచనాలు — 25:1-32:32
4. ఇశ్రాయేలీయిలు గురించి ప్రవచనాలు — 33:1-39:29
5. పూర్వక్షేమస్దితి కలుగుతుందన్న దర్శనం — 40:1-48:35
1
దేవుని మహిమ ప్రకాశం, నలుగు జీవుల దర్శనం
నా వయస్సు ముప్ఫయ్యవ సంవత్సరం నాలుగో నెల ఐదో రోజున ఉన్నట్టుండి ఆకాశం తెరుచుకుంది. నేను దైవ దర్శనాలు చూశాను. ఆ రోజుల్లో నేను కెబారు నది దగ్గర బందీల మధ్య నివసిస్తున్నాను. అది యెహోయాకీను రాజును బందీగా పట్టుకెళ్ళిన తరువాత ఐదో సంవత్సరం. ఆ నెల ఐదో రోజున కల్దీయుల దేశంలో కెబారు నది పక్కన బూజీ కొడుకూ, యాజకుడూ అయిన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు బలంగా వచ్చింది. అక్కడే యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది.
అప్పుడు ఉత్తరం వైపు నుండి ఒక తుఫాను వస్తుండడం చూశాను. ఒక మహా మేఘం, దానిలో ప్రజ్వలించే అగ్ని కనిపించాయి. ఆ మేఘంలో గొప్ప కాంతి కనిపించింది. ఆ కాంతి దాన్ని ఆవరించి ఉంది. ఆ మేఘంలో మండే అగ్ని మెరుగు పెట్టిన కంచులా ఉంది. దాని మధ్యలో నాలుగు జీవుల్లాంటి ఒక స్వరూపం కనిపించింది. అవి మానవ రూపంలో ఉన్నాయి. ఒక్కో దానికి నాలుగు ముఖాలు ఉన్నాయి. అలాగే నాలుగు రెక్కలు ఉన్నాయి.
వాటి కాళ్లు తిన్నగా ఉన్నాయి. వాటి అరికాళ్ళు దూడ డెక్కల్లా ఉన్నాయి. అవి మెరుగు పెట్టిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి. అయినా మనుషులకున్నట్టే వాటికి చేతులు ఉన్నాయి. అవి వాటి నాలుగు రెక్కల కింద ఉన్నాయి. నాలుగు జీవుల ముఖాలూ, రెక్కలూ ఇలా ఉన్నాయి. వాటి రెక్కలు పక్కనే ఉన్న మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. అవి వెళ్తున్నప్పుడు ఏ వైపుకీ తిరగడం లేదు. అవన్నీ ముందుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
10 వాటి ముఖాలు ఎదుట నుంచి చూస్తే మనిషి ముఖాల్లా ఉన్నాయి. కుడివైపు నుండి చూస్తే సింహం ముఖంలా ఎడమవైపు నుండి చూస్తే ఎద్దు ముఖంలా ఉన్నాయి. ఇంకా ఈ నాలుగు జీవులకీ డేగ లాంటి ముఖాలు ఉన్నాయి. 11 వాటి ముఖాలు అలాంటివే. వాటి రెక్కలు పైకి విచ్చుకుని ఉన్నాయి. దాంతో ఒక జత రెక్కలు మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. ఇంకో జత రెక్కలు వాటి దేహాలను కప్పుతూ ఉన్నాయి. 12 అవి అన్నీ ముందుకు సాగి వెళ్తున్నాయి. అటూ ఇటూ తిరుగకుండా ఆత్మ నిర్దేశించిన మార్గంలో వెళ్తున్నాయి.
13 ఈ జీవులు రగులుతున్న నిప్పు కణికల్లా, దివిటీల్లా కనిపిస్తున్నాయి. ప్రకాశవంతమైన అగ్ని ఆ జీవుల మధ్య కదులుతూ ఉంది. అక్కడ నుండి మెరుపులు వస్తున్నాయి. 14 ఆ జీవులు వెనక్కీ ముందుకీ కదులుతున్నాయి. దాంతో అవి మెరుపుల్లా కనిపిస్తున్నాయి.
నాలుగు చక్రాల దర్శనం
15 తరువాత నేను ఆ జీవులను చూస్తుంటే వాటి పక్కనే నేలపైన చక్రాల వంటివి కనిపించాయి. 16 ఆ చక్రాల నిర్మాణం ఇలా ఉంది, ప్రతి చక్రం గోమేధికంలా ఉంది. నాలుగు చక్రాలూ ఒకేలా ఉన్నాయి. ఒక చక్రంలో మరో చక్రం ఇమిడి ఉన్నట్టుగా ఉన్నాయి.
17 అవి కదిలినప్పుడు అన్నీ నాలుగు వైపులకీ కదులుతున్నాయి. ఏదీ వెనక్కి తిరగడం లేదు. 18 వాటి అంచులు ఎత్తుగా ఉండి భయం పుట్టిస్తున్నాయి. వాటి అంచుల చుట్టూ కళ్ళు ఉన్నాయి. 19 ఆ జీవులు కదిలినప్పుడల్లా వాటితో పాటు ఆ చక్రాలు కూడా కదిలాయి. జీవులు భూమి పై నుండి పైకి లేచినప్పుడు ఆ చక్రాలు కూడా లేచాయి. 20 ఆత్మ ఎక్కడికి కదిలి వెళ్తున్నాడో జీవులు కూడా అక్కడికి వెళ్తున్నాయి. చక్రాలు జీవులతో పాటు లేస్తున్నాయి. ఎందుకంటే ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది. 21 ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది కాబట్టి జీవులు కదిలినప్పుడు చక్రాలు కూడా కదిలాయి. జీవులు నిశ్చలంగా నిలిచిపోయినప్పుడు చక్రాలు కూడా నిలిచిపోయాయి. జీవులు భూమిపై నుండి పైకి లేచినప్పుడు చక్రాలు కూడా లేచాయి.
22 ఆ జీవుల తలల పైగా విశాలమైనది ఒకటి కనిపించింది. అది మెరుస్తున్న మంచు గడ్డలా ఆ జీవుల తలల పైగా వ్యాపించినట్టు కనిపించింది. అది అద్భుతం గానూ, ఆశ్చర్యాన్ని కలిగించేది గానూ ఉంది. 23 ఆ విశాలమైన దాని కింద జీవులు తమ రెక్కలు చాపుకుని ఉన్నాయి. ఒకదాని రెక్కలు మరోదాని రెక్కలను తాకుతూ ఉన్నాయి. ప్రతి జీవీ తన రెండు రెక్కలతో తన దేహాన్ని కప్పుకుంటూ ఉంది. అలా ప్రతి జీవికీ దేహాన్ని కప్పుకోడానికి రెండు రెక్కలున్నాయి.
24 ఆ తరువాత నేను వాటి రెక్కల శబ్దం విన్నాను. అది పరుగులెత్తే నీటి శబ్దంలా ఉంది. సర్వశక్తిగల దేవుని స్వరంలా ఉంది. అవి కదిలినప్పుడల్లా గాలివాన శబ్దం వినిపించింది. ఒక సైన్యం చేస్తున్న శబ్దంలా తోచింది. అవి కదలకుండా ఆగినప్పుడు తమ రెక్కలను కిందకి వాల్చి ఉంచాయి. 25 అవి ఆగిపోయి తమ రెక్కలు చాపినప్పుడు వాటి తలల పైన ఉన్న విశాలమైన దానికి పైగా ఒక స్వరం వినిపించింది.
26 వాటి తలల పైగా ఉన్న ఆ విశాలమైనదాని పైన ఒక సింహాసనం లాంటిది కనిపించింది. అది నీలకాంత మణిలా ఉంది. ఆ సింహాసనం పైన మానవ స్వరూపంలో ఉన్న ఒక వ్యక్తి కూర్చున్నట్లు కనిపించింది.
27 అప్పుడు ఒక ఆకారాన్ని నేను చూశాను. అతని నడుము పైగా అగ్నితో మండుతున్న లోహంలా నాకు కనిపించింది. అతని నడుము కింద చుట్టూ అగ్నిలా, ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. 28 అది వర్షం కురిసినప్పుడు మబ్బుల్లో కనిపించే మేఘధనస్సులా, దాని చుట్టూ ఉండే ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. అది యెహోవా మహిమలా కనిపించింది. అది చూసి నేను సాగిలపడ్డాను. అప్పుడు ఒక స్వరం నాతో మాట్లాడటం నేను విన్నాను.