గలతీయులకు రాసిన పత్రిక
గ్రంథకర్త
ఈ పత్రిక రచయిత అపోస్తలుడు పౌలు. అది సంఘంలో ఇది ఏకగ్రీవ అంగీకారం పొందిన సత్యం. ఆసియా మైనర్ లో పౌలు తన మిషనెరీ ప్రయాణంలో అతడు ఇక్కడ కొన్ని సంఘాలు స్థాపించాడు. వాటికి ఈ పత్రిక రాశాడు. గలతియ కూడా రోమ్, కొరింతు లాగా ఒక నగరం కాదు. అనేక నగరాలూ సంఘాలూ ఉన్న ఒక రాష్ట్రం. ఈ ఉత్తరం అందుకున్న వారు పౌలు మూలంగా ప్రభువును నమ్మారు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 49 - 57
పౌలు బహుశా అంతియొకయ నుండి గలతియ క్రైస్తవులకు ఈ పత్రిక రాశాడు. అంతియొకయ అతని నివాస స్థలం.
స్వీకర్త
గలతియ ప్రాంతంలోని అనేక సంఘాలకు పౌలు రాశాడు.
ప్రయోజనం
యూదు మతబోధకుల కపట సువార్తను ఖండించడం ఈ పత్రిక ఉద్దేశం. ఈ యూదు బోధకులు రక్షణ కోసం సున్నతి కూడా అవసరమని నేర్పించారు. రక్షణకు అసలైన పునాది గురించి గలతియులకు తెలియజెప్పడానికి పౌలు ఈ పత్రిక రాశాడు. పౌలు తన అపోస్తలిక అధికారాన్ని స్థాపిస్తూ తాను బోధించిన సువార్తను సమర్థించాడు. కృప ద్వారా విశ్వాసం మూలంగా మాత్రమే మనుషులు నిర్దోషులుగా తీర్చబడతారు. వారు కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే, ఆత్మ ఇచ్చే స్వేచ్చానుసారంగా మాత్రమే తమ నూతన జీవితాలు గడపాలి.
ముఖ్యాంశం
క్రీస్తులో స్వాతంత్ర్యం.
విభాగాలు
1. పరిచయం — 1:1-10
2. సువార్త నిర్ధారణ — 1:11-2:21
3. విశ్వాసం మూలంగా నిర్దోషులుగా తీర్చబడడం — 3:1-4:31
4. విశ్వాసయుతమైన స్వేచ్చాపూరితమైన జీవిత అభ్యాసం — 5:1-6:18
1
పలకరింపులు
మనుషుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపొస్తలుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ, నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు. తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.
మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు. నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్‌.
లేఖ ముఖ్యాంశం, సందర్భం
క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు వేరే సువార్త అనేది లేదు. క్రీస్తు సువార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వారు కొంతమంది ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక. మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక.
10 ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా? లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషులను తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషులను తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు.
పౌలు ప్రకటించిన సువార్త అతనికి ప్రత్యేకంగా వెల్లడి అయ్యింది, ఇతర అపొస్తలుల నుంచి పొందినది కాదు
11 సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి. 12 మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.
13 నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి. 14 అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను. 15 అయినా తల్లిగర్భంలోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుణ్ణి ప్రకటించాలని 16 ఆయనను నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు. 17 నాకంటే ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్ళలేదు, అరేబియా దేశానికి వెళ్ళి ఆ తరువాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను.
18 మూడు సంవత్సరాలైన తరవాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వెళ్లి అతనితో పదిహేను రోజులున్నాను. 19 అతనిని తప్ప అపొస్తలుల్లో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను.
20 నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను చెపుతున్నాను. 21 ఆ తరువాత సిరియా, కిలికియ ప్రాంతాలకు వచ్చాను. 22 క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ 23 “మునుపు మనలను హింసించిన వాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు” అనే విషయం మాత్రమే విని, 24 వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరిచారు.