న్యాయాధిపతులు
గ్రంథకర్త
న్యాయాధిపతులు వాచకంలో ఈ పుస్తకం ఎవరు రాశారన్న ఆధారాలు కనిపించవు. అయితే యూదుల సంప్రదాయ గాథలను బట్టి సమూయేలు ప్రవక్త రాశాడని తెలుస్తున్నది. సమూయేలు చివరి న్యాయాధిపతి. న్యాయాధిపతులు గ్రంథకర్త రాజరిక వ్యవస్థ ఆరంభ దినాల్లో జీవించిన విషయం స్పష్టమే. “ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు” (న్యాయాధి 17:6; 18:1; 19:1; 21:25) అనే మాటలు పదే పదే రావడం ఈ గ్రంథరచన జరిగిన కాలానికీ ఈ గ్రంథంలో ఉన్న పరిస్థితులకూ ఉన్న తేడాను గురుతు చేస్తున్నాయి. “న్యాయాధిపతులు” అంటే “రక్షకులు” అని అర్ధం. న్యాయాధిపతులు అంటే స్థూలంగా ఇశ్రాయేల్ జాతిని విదేశీ శత్రువుల నుండి విడిపించిన వారు. వీరు కొంతమందైనా పాలకులుగా వివాదాలు పరిష్కరించిన వారుగా వ్యవహరించారు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 1550 - 1025
మధ్యకాలం. బహుశా దావీదు పరిపాలన కాలంలో గ్రంథ రచన జరిగింది అని చెప్పవచ్చు. మానవ పరంగా ఈ గ్రంథరచన వెనుక ఉన్న ఉద్దేశం యెహోషువా మరణ సమయం నుండి నెలకొని ఉన్న అస్తవ్యస్థమైన పద్దతులు కన్నా రాజరిక వ్యవస్థ మెరుగని నిరూపించడమే.
స్వీకర్త
ఇశ్రాయేల్ ప్రజలు, భవిష్యతులో చదివే వారంతా.
ప్రయోజనం
కనాను దేశం స్వాధీన కాలం నుండి ఇశ్రాయేల్ మొదటి రాజు వరకు ఆ జాతి చరిత్రను ఆవిష్కరించడం. కేవలం ఉన్నదున్నట్టుగా చరిత్రను తెలియజెప్పడం కాదు గానీ న్యాయాధిపతుల కాలంలో దేవజ్ఞాన దృష్టిని (24:14-28; 2:6-13) గ్రంథస్తం చేయడం ఈ గ్రంథం ఉదేశం. యెహోవా తాను అబ్రాహాముకు చేసిన నిబంధనకు ఏ విధంగా నమ్మకంగా ఉన్నాడో తెలియజేయడం, ప్రజలు ఆ నిబంధనను వమ్ము చేసినప్పటికీ యెహోవా మాత్రం తన నిబంధనకు కట్టుబడి ఉంటాడని చెప్పడం గ్రంథం ఉద్దేశం. ప్రతి తరంలోనూ దేవుడు దుర్మార్గంలో పోరాడేందుకు ఎవరో ఒకరిని (ఆది 3:15) లేపుతున్నట్టయితే అప్పటికి పూ ర్తి అయిన తరాలెన్నో న్యాయాధిపతుల సంఖ్య కూడా అన్ని ఉండాలి.
ముఖ్యాంశం
శైథిల్యం, విడుదల.
విభాగాలు
1. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేల్ ప్రజల స్థితిగతులు — 1:1-3:6
2. ఇశ్రాయేల్ న్యాయాధిపతులు — 3:7-16:31
3. ఇశ్రాయేలీయుల పాపాలను ప్రదర్శించే సంఘటనలు — 17:1-21:25
1
ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం
1:11-15; యెహో 15:15-19
యెహోషువ చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చెయ్యడానికి తమలో ఎవరు ముందుగా వాళ్ళ మీదికి వెళ్ళాలో యెహోవా తమకు తెలపాలని ప్రార్థన చేశారు. యెహోవా “ఆ దేశాన్ని యూదాజాతి వారికి ఇచ్చాను, వాళ్ళే ముందు వెళ్ళాలి” అని చెప్పాడు. అప్పుడు యూదా జాతి వాళ్ళు తమ సహోదరులైన షిమ్యోను జాతివారితో “మనం కనానీయులతో యుద్ధం చెయ్యడానికి మా వాటా భూమిలోకి మాతో కలిసి రండి, మేము కూడా మీతో కలిసి మీ వాటా భూమిలోకి వస్తాం” అని చెప్పారు. షిమ్యోనీయులు వాళ్ళతో కలిసి వెళ్ళారు.
కనానీయుల మీదికి యూదావారు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీయులను వారికి అప్పగించాడు గనుక వాళ్ళు బెజెకు ప్రాంతంలో పదివేలమందిని హతం చేశారు. వాళ్ళు బెజెకు దగ్గర అదోనీ రాజు బెజెకును చూసి అతనితో యుద్ధం చేసి కనానీయులను, పెరిజ్జీయులను, హతం చేశారు. అదోనీ బెజెకు పారిపోయినప్పుడు వాళ్ళు అతణ్ణి తరిమి పట్టుకుని అతని కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోసేశారు అప్పుడు అదోనీ బెజెకు “ఇలా కాళ్లు, చేతుల బొటన వేళ్ళు కోసిన డెభ్భైమంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకోనేవాళ్ళు. నేను చేసినదానికి దేవుడు నాకు ప్రతిఫలమిచ్చాడు” అన్నాడు. వాళ్ళు అతణ్ణి యెరూషలేముకు తీసుకొచ్చారు. అతడు అక్కడ చనిపోయాడు.
యూదావంశం వారు యెరూషలేముపై కూడా యుద్ధం చేసి దాన్ని పట్టుకుని కొల్లగొట్టి ఆ పట్టణాన్ని కాల్చివేశారు. తరువాత యూదా వంశంవారు అరణ్య ప్రాంతాల్లో, దక్షిణదేశంలో లోయలో ఉన్న కనానీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళారు. 10 ఇంకా యూదా వంశం వారు హెబ్రోనులో ఉన్న కనానీయుల మీదికి వెళ్లి, షేషయిని, అహీమానుని, తల్మయిని హతం చేశారు. 11 వారు హెబ్రోనులొ ఉండి దెబీరులో నివాసం ఉంటున్న వాళ్ళ మీదికి యుద్ధానికి వెళ్ళారు. హెబ్రోనుకు అంతకుముందు పేరు కిర్యతర్బా. అక్కడ షేషయి, ఆహీమాను, తల్మయి అనే వాళ్ళని హతమార్చారు. అక్కడినుండి వారు దెబీరులో కాపురం ఉంటున్నవారిని హతమార్చారు. దెబీరును పూర్వం కిర్యత్ సేఫెరు అనే వారు.
12 “కిర్యత్ సేఫెరును కొల్లగొట్టిన వాడికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను” అని కాలేబు ప్రకటించినప్పుడు 13 కాలేబు తమ్ముడు కనజు కొడుకు ఒత్నీయేలు దాన్ని పట్టుకున్నాడు గనుక కాలేబు తన కుమార్తె అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసాడు. 14 ఆమె తన భర్త ఇంటికి వచ్చాక తన తండ్రిని కొంత పొలం అడగమని అతణ్ణి ప్రేరేపించింది. ఆమె గాడిద దిగినప్పుడు కాలేబు “నీకేం కావాలి?” అని అడిగాడు. 15 అందుకు ఆమె “నాకు దీవెన ఇవ్వు. నాకు దక్షిణ భూమి ఇచ్చావు, నీటి మడుగులు కూడా నాకు ఇవ్వు” అంది. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులు, పల్లపు మడుగులు ఇచ్చాడు.
16 మోషే మామ అయిన కేయిను వారసులు యూదావంశం వారితో కలిసి ఖర్జూరచెట్ల పట్టణంలోనుంచి* 1:16 ఖర్జూరచెట్ల పట్టణంలోనుంచి యెరికో పట్టణం అరాదుకు దక్షిణంవైపు ఉన్న యూదా అరణ్యానికి వెళ్లి అక్కడ ఆ జనంతో కలిసి నివసించారు. 17 యూదావంశం వారు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కలిసి వెళ్లి జెఫతులో ఉంటున్న కనానీయులను హతం చేసి ఆ పట్టణాన్ని నాశనం చేసి, ఆ పట్టణానికి హోర్మా 1:17 హోర్మా నాశనం అనే పేరు పెట్టారు. 18 యూదావంశం వారు గాజాను, దాని ప్రాంతాన్ని, అష్కెలోనును దాని ప్రాంతాన్ని, ఎక్రోనును దాని ప్రాంతాన్ని ఆక్రమించారు.
19 యెహోవా యూదావంశం వారికి తోడుగా ఉన్నాడు కనుక వాళ్ళు కొండ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మైదాన ప్రాంతాల్లో ఉంటున్నవాళ్లకు ఇనుప రథాలు ఉన్న కారణంగా వాళ్ళను తరిమివేయలేక పోయారు. 20 మోషే మాట ప్రకారం హెబ్రోనును కాలేబుకు ఇచ్చినప్పుడు, అతడు ముగ్గురు అనాకు వంశీకులను అక్కడనుంచి పారద్రోలి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 21 కాని, బెన్యామీనీయులు యెరూషలేములో ఉంటున్న యెబూసీయులను వెళ్లగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో నేటివరకూ యెరూషలేములో కలిసి నివసిస్తున్నారు.
22 యోసేపు సంతతివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు. 23 పూర్వకాలంలో లూజు అనే పేరుగల బేతేలును వేగు చూడడానికి యోసేపు గోత్రికులు దూతలను పంపినప్పుడు 24 ఆ గూఢచారులు, ఆ పట్టణంలోనుంచి ఒకడు రావడం చూసి “దయచేసి ఈ పట్టణంలోకి వెళ్ళే దారి మాకు చూపిస్తే మేము నీకు ఉపకారం చేస్తాం” అని చెప్పారు. 25 అతడు ఆ పట్టణంలోకి వెళ్ళే దారి వాళ్లకు చూపించినప్పుడు, వాళ్ళు ఆ పట్టణంలోని వారిని కత్తివాత హతం చేశారు. అయితే, ఆ వ్యక్తిని, అతని కుటుంబంలోని వాళ్ళందరినీ వదిలేశారు.
26 ఆ వ్యక్తి, హిత్తీయ దేశానికి వెళ్లి ఒక పట్టణం కట్టించి దానికి లూజు అనే పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ దాని పేరు అదే.
27 మనష్షె గోత్రంవారు బేత్షెయానును, తయినాకును, దోరును, ఇబ్లెయామును, మెగిద్దో పట్టణాలను, వాటి పల్లెలను వశం చేసుకోలేదు. ఎందుకంటే కనానీయులు ఆ ప్రదేశంలోనే ఉండాలని తెగించి పోరాడారు. 28 ఇశ్రాయేలీయులు బలం పుంజుకున్న తరువాత కనానీయులతో వెట్టిపనులు చేయించుకున్నారు గాని వాళ్ళను పూర్తిగా వెళ్ళగొట్టలేదు.
29 ఎఫ్రాయిమీయులు గెజెరులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు. గెజెరులో కనానీయులు వాళ్ళ మధ్యే నివాసం ఉన్నారు.
30 జెబూలూనీయులు కిత్రోనులో ఉన్నవాళ్ళను, నహలోలు నివాసులను వెళ్లగొట్ట లేదు. కనానీయులు వారి మధ్యే ఉంటూ వాళ్లకు వెట్టిపనులు చేసేవాళ్ళుగా ఉన్నారు.
31 ఆషేరీయులు అక్కోలో ఉన్నవాళ్ళను, సీదోనులో ఉన్నవాళ్ళను, అహ్లాబు వారిని, అక్జీబు వారిని, హెల్బావారిని, అఫెకు వారిని, రెహోబు వారిని, 32 ఆ ప్రదేశంలో ఉన్న కనానీయులను వెళ్లగొట్టకుండా వాళ్ళ మధ్యనే నివాసం ఉండనిచ్చారు. నఫ్తాలీయులు బేత్షెమెషు వారిని బేతనాతు వారిని వెళ్లగొట్ట లేదు, 33 బేత్షెమెషులో ఉన్న వాళ్ళ చేత, బేతనాతులో ఉన్నవాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకున్నారు.
34 అమోరీయులు దానీయులను మైదాన ప్రాంతానికి రానివ్వకుండా కొండ ప్రదేశానికి వెళ్ళగొట్టారు. 35 అమోరీయులు హెరేసు కొండలో అయ్యాలోనులో, షయల్బీములో నివాసం ఉండాలని గట్టి పట్టు పట్టినప్పుడు యోసేపు గోత్రికులు బలవంతులు గనుక వాళ్ళ చేత వెట్టిపనులు చేయించుకున్నారు. 36 అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకుని హస్సెలా వరకూ వ్యాపించింది.

*1:16 1:16 ఖర్జూరచెట్ల పట్టణంలోనుంచి యెరికో పట్టణం

1:17 1:17 హోర్మా నాశనం