యిర్మీయా
గ్రంథకర్త
యిర్మీయా తన లేఖికుడు బారూకుతో కలిసి ఈ పుస్తకం రాశాడు. ఇతడు యాజకుడు, ప్రవక్త కూడా. హీల్కియా అనే యాజకుని కొడుకు (2 రాజులు 22:8 లో కనిపించే ప్రధాన యాజకుడు కాదు). అనాతోమ అనే కుగ్రామానికి చెందినవాడు (1:1). బారూకు అనే లేఖికుడు ఇతని పరిచర్యలో సహాయం చేశాడు. తన ప్రవచనాలను యిర్మీయా చెబుతుండగా బారూకు రాశాడు. అతడు ఆ ప్రవచనాల ప్రతులను కూడా రాసి భద్రం చేసేవాడు (36:4, 32, 45:1). ఇతన్ని “విలాప ప్రవక్త” అన్నారు (9:1, 13:17, 14:17 చూడండి). దాడి చేయనున్న బబులోను వారి మూలంగా యూదా జాతి పైకి రానున్న తీర్పుల గురించి ప్రవచించడం ద్వారా కొంత వివాదాస్పద వ్యక్తిగా ఉండేవాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 740 - 680
బబులోను చెర కాలంలో గ్రంథ రచన పూర్తి అయింది. అయితే పుస్తకం ఎడిటింగు మరి కొంతకాలం వరకు కొనసాగిందని కొందరి అభిప్రాయం.
స్వీకర్త
యూదయ, యెరూషలేము ప్రజానీకం, తరువాత ఉండబోయే బైబిలు పాఠకులంతా.
ప్రయోజనం
క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తరువాత దేవుడు తన ప్రజలతో చేయబోయే కొత్త నిబంధన యొక్క స్పష్టమైన ఆకారాన్ని యిర్మీయా గ్రంథం ప్రదర్శిస్తున్నది. ఈ కొత్త నిబంధన దేవుని ప్రజలకు పూర్వక్షేమస్థితి కలిగే సాధనం. ఎందుకంటే ఆయన వారి హృదయాలల్లో తన ధర్మశాస్త్రం ఉంచుతాడు. రాతి పలకలపై గాక మాంసపు గుండెలపై దాన్ని రాస్తాడు. యిర్మీయా గ్రంథంలో యూదాను గురించిన అంతిమ ప్రవచనాలు హెచ్చరికలు ఉన్నాయి. జాతి మొత్తంగా దేవుని వైపు తిరగాలన్న పిలుపు ఈ పుస్తకంలో ఉంది. అదే సమయంలో యూదు జాతిలో ఎడతెగక కొనసాగుతున్న విగ్రహారాధన, దుర్నీ తిదృష్ట్యా వినాశనం తప్పదన్న సత్యాన్ని ఈ గ్రంథం గుర్తిస్తుంది.
ముఖ్యాంశం
తీర్పు
విభాగాలు
1. యిర్మీయాకు దేవుని పిలుపు — 1:1-19
2. యూదాకు హెచ్చరికలు — 2:1-35:19
3. యిర్మీయా బాధలు — 36:1-38:28
4. యెరూషలేము పతనం, దాని పరిణామాలు — 39:1-45:5
5. ఇతర జాతుల గురించి ప్రవచనాలు — 46:1-51:64
6. చారిత్రిక అనుబంధం — 52:1-34
1
బెన్యామీను గోత్ర ప్రాంతంలోని అనాతోతులో నివసించే యాజకుల్లో ఒకడు, హిల్కీయా కొడుకు అయిన యిర్మీయా పలుకులు. ఆమోను కొడుకు యోషీయా యూదాకు రాజుగా ఉన్నప్పుడు అతని పాలనలో 13 వ సంవత్సరం యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమయ్యాడు. యోషీయా కొడుకు యెహోయాకీము యూదాకు రాజుగా ఉన్న రోజుల్లో, యోషీయా కొడుకు సిద్కియా యూదాను పాలించిన 11 వ సంవత్సరం అయిదో నెలలో యెరూషలేము ప్రజలు చెరలోకి వెళ్ళే వరకూ ఆ వాక్కు అతనికి ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు.
యిర్మీయా పిలుపు
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
“నీ తల్లి గర్భంలో నీకు రూపం రాక ముందే నువ్వు నాకు తెలుసు. నువ్వు గర్భం నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను.
జనాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను.”
అందుకు నేను “అయ్యో, యెహోవా ప్రభూ, నేను చిన్న పిల్లవాణ్ణి కదా, నాకు మాట్లాడడం చేత కాదు” అన్నాను.
అయితే యెహోవా నాతో ఇలా అన్నాడు. “నేను పిల్లవాణ్ణి అనవద్దు. నేను నిన్ను పంపేవారందరి దగ్గరకీ నువ్వు వెళ్ళాలి.
నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారితో చెప్పాలి.
వారికి భయపడవద్దు. నిన్ను విడిపించడానికి నేను నీతో ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు.”
అప్పుడు యెహోవా తన చేత్తో నా నోరు తాకి ఇలా అన్నాడు. “ఇదిగో, నేను నా మాటలు నీ నోటిలో ఉంచాను.
10 పెళ్లగించడానికీ విరగగొట్టడానికీ నశింపజేయడానికీ కూలదోయడానికీ కట్టడానికీ నాటడానికీ
నేను ఈ రోజు జనాల మీదా రాజ్యాల మీదా నిన్ను నియమించాను.”
11 యెహోవా వాక్కు నాకు కనబడి “యిర్మీయా, నీకేం కనబడుతున్నది?” అని అడిగాడు. అందుకు నేను “బాదం చెట్టు కొమ్మ కనబడుతున్నది” అన్నాను. 12 అప్పుడు యెహోవా “నువ్వు బాగా కనిపెట్టావు. నేను చెప్పిన మాటలు నెరవేర్చడానికి నాకు ఆత్రుతగా ఉంది” అన్నాడు.
13 రెండోసారి యెహోవా వాక్కు నాకు కనబడి “నీకేం కనబడుతున్నది?” అని అడగ్గా, నేను “మరుగుతున్న బాన ఒకటి నాకు కనబడుతున్నది. అది ఉత్తరం వైపుకు తిరిగి ఉంది” అన్నాను. 14 అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “ఉత్తరం నుండి ఈ దేశప్రజల మీదికి వినాశనం రాబోతున్నది. 15 ఇదిగో, నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యాల జాతులన్నిటినీ పిలుస్తాను. వారిలో ప్రతివాడూ యెరూషలేము ద్వారాల్లో, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలన్నిటికీ యూదా పట్టణాలన్నిటికీ ఎదురుగా తమ ఆసనాలు వేసుకుని కూర్చుంటారు. 16 అప్పుడు యెరూషలేము ప్రజలు నన్ను విడిచి అన్యదేవుళ్ళకు ధూపం వేసి, తమ స్వంత చేతులతో చేసిన విగ్రహాలను పూజించి చేసిన చెడుతనాన్ని బట్టి నేను వారిపై నా తీర్పులు ప్రకటిస్తాను.”
17 “కాబట్టి లేచి నిలబడు! నేను నీకాజ్ఞాపించినదంతా వారికి ప్రకటించు. నువ్వు వారికి భయపడ వద్దు. లేదా, నేనే నీకు వారంటే భయం పుట్టిస్తాను. 18 యూదా రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, యాజకుల దగ్గరికి, దేశ ప్రజల దగ్గరికి, ఈ దేశంలో నీవెక్కడికి పోయినా, నిన్ను ఒక ప్రాకారం ఉన్న పట్టణంగా, ఇనప స్తంభంగా, ఇత్తడి గోడగా ఉండేలా ఈ రోజు నియమించాను. 19 వారు నీతో యుద్ధం చేస్తారు గాని నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను కాబట్టి వారు నీపై విజయం పొందలేరు. ఇదే యెహోవా వాక్కు.”