యోహాను రాసిన సువార్త
గ్రంథకర్త
యోహాను 21:20-24 ను బట్టి ఈ సువార్త రచయిత జెబెదయి కుమారుడు యోహాను అని తెలుస్తున్నది. యోహాను తనను యేసు శిష్యుడిగా చెప్పుకున్నాడు. అతడు, అతని సోదరుడు యాకోబు “ఉరిమే వారు” అని పేరు పొందారు (మార్కు 3:17). యేసు జీవిత సంభవాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం వీరిద్దరికీ దక్కింది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 80 - 95
యోహాను తన సువార్తను ఎఫెసు నుండి రాసి ఉండవచ్చు. రచన జరిగిన ముఖ్య ప్రదేశాలు బేతని, గలిలయ, యూదయ, సమరయ, యెరూషలేము.
స్వీకర్త
యోహాను సువార్తను అతడు యూదులకు రాశాడు. యేసే మెస్సియ అని రుజువు చెయ్యడం యోహాను ఉద్దేశం. వారు “యేసే క్రీస్తు అని, ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారా అయన నామాన్ని బట్టి జీవం పొందాలని” రచయిత ఉద్దేశం.
ప్రయోజనం
20:31 లో చెప్పినట్టు ఈ సువార్త ఉద్దేశం క్రైస్తవులను విశ్వాసంలో స్థిరపరచి నిర్ధారించడం. “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి అయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.” యేసే దేవుడు అని యోహాను స్పష్టంగా ప్రకటించాడు (1:1). అన్నిటినీ అయన ఉనికిలోకి తెచ్చాడు (1:3). ఆయనే వెలుగు (1:4, 8, 12), జీవం (1:4; 5:26; 14:6). యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని రుజువు చేయడానికి యోహాను తన సువార్త రాశాడు.
ముఖ్యాంశం
యేసు దేవుని కుమారుడు.
విభాగాలు
1. యేసు జీవనాథుడు — 1:1-18
2. మొదటి శిష్యులకు పిలుపు — 1:19-51
3. యేసు బహిరంగ పరిచర్య — 2:1-16:33
4. ప్రధాన యాజకుని ప్రార్థన — 17:1-26
5. యేసు సిలువ, పునరుత్థానం — 18:1-20:10
6. యేసు పునరుత్థానానంతర పరిచర్య — 20:11-21:25
1
యేసు క్రీస్తు దైవత్వం
హెబ్రీ 1:5-13
ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే. ఆ వాక్కు ప్రారంభంలో దేవుడితో ఉన్నాడు.
ఆయన అవతార పూర్వ కార్యం
హెబ్రీ 1:2
సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం సమస్త మానవాళికీ వెలుగుగా ఉంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది. చీకటి ఆ వెలుగును లొంగదీసుకోలేక పోయింది.
బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య
యోహా 1:29-34; మత్తయి 3:1-17; మార్కు 1:1-11; లూకా 3:1-23
దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను. అందరూ తన ద్వారా ఆ వెలుగును నమ్మడం కోసం అతడు ఆ వెలుగుకు సాక్షిగా ఉండడానికి వచ్చాడు. ఈ యోహానే ఆ వెలుగు కాదు. కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు.
యేసుక్రీస్తు నిజమైన వెలుగు
యోహా 8:12; 9:5; 12:46
లోకంలోకి వస్తున్న నిజమైన వెలుగు ఇదే. ఈ వెలుగు ప్రతి వ్యక్తినీ వెలిగిస్తూ ఉంది. 10 లోకం అంతా ఆయన ద్వారానే కలిగింది. ఆయన లోకంలో ఉన్నాడు. అయినా లోకం ఆయనను తెలుసుకోలేదు.
కుమారులు, అవిశ్వాసులు
1యోహా 2:5, 11, 12; 3:1
11 ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు. కానీ వారు ఆయనను స్వీకరించలేదు. 12 తనను ఎవరెవరు అంగీకరించారో, అంటే తన నామంలో నమ్మకం ఉంచారో, వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే హక్కును ఆయన ఇచ్చాడు. 13 వారంతా దేవుని వలన పుట్టినవారే గాని, వారి పుట్టుకకు రక్తమూ, శరీర వాంఛలూ, మనుషుల ఇష్టాలూ కారణం కానే కావు.
ఆయన అవతారం
మత్తయి 1:18-23; లూకా 1:30-35; రోమా 1:3, 4
14 ఆ వాక్కు శరీరంతో మన మధ్య కృపా సత్యాల సంపూర్ణ స్వరూపంగా నివసించాడు. తండ్రి నుండి వచ్చిన ఏకైక కుమారునికి ఉండే మహిమలాగా ఉన్న ఆయన మహిమను మేము చూశాము.
బాప్తిసమిచ్చే యోహాను సాక్ష్యం
మత్తయి 3:1-17; మార్కు 1:1-11; లూకా 3:1-18
15 యోహాను ఆయనను గురించి పెద్ద స్వరంతో ఇలా సాక్ష్యం చెప్పాడు, “నా వెనుక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు, అంటూ నేను ఎవరిని గురించి చెప్పానో ఆయనే ఈయన.”
16 ఆయన సంపూర్ణతలో నుండి మనమందరం కృప తరువాత కృపను పొందాం. 17 మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కృప, సత్యం యేసు క్రీస్తు మూలంగా కలిగాయి. 18 దేవుణ్ణి ఇంతవరకూ ఎవరూ చూడలేదు. తండ్రిని అనునిత్యం హత్తుకుని ఉండే దేవుడైన ఏకైక కుమారుడే ఆయనను వెల్లడి చేశాడు.
19 యెరూషలేము నుండి యూదులు, “నువ్వు ఎవరు?” అని యోహానును అడగడానికి యాజకుల నుండీ లేవీయుల నుండీ కొందరిని పంపించారు. అప్పుడు అతడు ఇదే సాక్ష్యం ఇచ్చాడు. 20 అతడు, “నాకు తెలియదు” అనకుండా, “నేను క్రీస్తును కాదు” అంటూ ఒప్పుకున్నాడు. 21 కాబట్టి వారు, “అయితే నువ్వు ఎవరివి? ఏలీయావా?” అంటే అతడు, “కాదు” అన్నాడు. “నువ్వు ప్రవక్తవా?” అని అడిగితే కాదని జవాబిచ్చాడు. 22 దాంతో వారు, “అయితే అసలు నువ్వు ఎవరివి? మమ్మల్ని పంపిన వారికి మేమేం చెప్పాలి? అసలు నీ గురించి నువ్వేం చెప్పుకుంటున్నావ్?” అన్నారు. 23 దానికి అతడు, “యెషయా ప్రవక్త పలికినట్టు నేను,
‘ప్రభువు కోసం దారి తిన్నగా చేయండి’ అని
అరణ్యంలో బిగ్గరగా కేక పెట్టే ఒక వ్యక్తి స్వరాన్ని” అన్నాడు.
24 అలాగే అక్కడ పరిసయ్యులు పంపిన కొందరున్నారు. 25 వారు, “నువ్వు క్రీస్తువు కావు, ఏలీయావు కావు, ప్రవక్తవూ కావు. అలాంటప్పుడు మరి బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు?” అని అడిగారు. 26 దానికి యోహాను, “నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను. కాని మీ మధ్య మీరు గుర్తించని వ్యక్తి నిలిచి ఉన్నాడు. 27 నా వెనుక వస్తున్నది ఆయనే. నేను ఆయన చెప్పుల పట్టీ విప్పడానికి కూడా యోగ్యుణ్ణి కాదు” అని వారితో చెప్పాడు. 28 ఈ విషయాలన్నీ యొర్దాను నదికి అవతల వైపు ఉన్న బేతనీలో జరిగాయి. ఇక్కడే యోహాను బాప్తిసం ఇస్తూ ఉండేవాడు.
29 మరుసటిరోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, “చూడండి, లోకపాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల! 30 ‘నా వెనక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు’ అంటూ నేను ఎవరి గురించి చెప్పానో ఆయనే ఈయన. 31 నేను ఆయనను గుర్తించలేదు, కానీ ఆయన ఇశ్రాయేలు ప్రజలకు వెల్లడి కావాలని నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తూ వచ్చాను.”
32 యోహాను ఇంకా సాక్షమిస్తూ, “ఆత్మ ఒక పావురంలా ఆకాశం నుండి దిగి వచ్చి ఆయనపై నిలిచి పోవడం చూశాను. 33 నేను ఆయనను గుర్తు పట్టలేదు. కాని ‘ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలిచిపోవడం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు’ అని నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాకు చెప్పాడు. 34 ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, సాక్షం ఇచ్చాను.”
యేసుక్రీస్తు బహిరంగ పరిచర్య
యోహా 1:35-12:50
35 మరుసటి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలబడి ఉన్నాడు. 36 అప్పుడు యేసు అక్కడ నడిచి వెళ్తుంటే యోహాను ఆయన వైపు చూసి, “ఇదిగో, చూడండి, దేవుని గొర్రెపిల్ల” అన్నాడు.
37 అతడు చెప్పిన మాట విని ఆ యిద్దరు శిష్యులు యేసు వెనకే వెళ్ళారు. 38 యేసు వెనక్కి తిరిగి, వారు తన వెనకాలే రావడం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు. వారు, “రబ్బీ, (రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం) నువ్వు ఎక్కడ ఉంటున్నావ్?” అని అడిగారు. 39 ఆయన, “వచ్చి చూడండి” అన్నాడు. వారు వచ్చి ఆయన ఉంటున్న స్థలం చూశారు. అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది. దాంతో వారు ఆ రోజుకి ఆయనతో ఉండిపోయారు.
40 యోహాను మాట విని ఆయన వెనకాల వెళ్ళిన ఇద్దరిలో ఒకరు అంద్రెయ. ఇతడు సీమోను పేతురు సోదరుడు. 41 ఇతడు అన్నిటికంటే ముందు తన సోదరుడైన సీమోనును వెతికి పట్టుకుని, అతనితో, “మేము మెస్సీయను (మెస్సీయ అంటే క్రీస్తు అని అర్థం) కనుక్కున్నాం” అని చెప్పాడు. 42 యేసు దగ్గరికి అతణ్ణి తీసుకుని వచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నువ్వు యోహాను కొడుకువి, నీ పేరు సీమోను. నిన్ను ఇక కేఫా అని పిలుస్తారు” అన్నాడు (కేఫా అనే మాటకి పేతురు (రాయి) అని అర్థం).
43 మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో, “నా వెనకే రా” అన్నాడు. 44 ఫిలిప్పు సొంత ఊరు బేత్సయిదా. అంద్రెయ, పేతురుల సొంత ఊరు కూడా అదే. 45 ఫిలిప్పు నతనయేలును చూసి, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు” అని చెప్పాడు.
46 దానికి నతనయేలు, “నజరేతులో నుండి మంచిదేమన్నా రాగలదా?” అన్నాడు. ఫిలిప్పు, “నువ్వే వచ్చి చూడు” అన్నాడు. 47 నతనయేలు తన దగ్గరికి రావడం యేసు చూసి, “చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు” అన్నాడు. 48 అప్పుడు నతనయేలు, “నేను నీకెలా తెలుసు?” అన్నాడు. అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలవక ముందు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అన్నాడు.
49 దానికి నతనయేలు, “బోధకా, నువ్వు దేవుని కుమారుడివి! ఇశ్రాయేలు రాజువి నువ్వే” అని ఆయనకు బదులిచ్చాడు. 50 అందుకు యేసు, “ఆ అంజూరు చెట్టు కింద నిన్ను చూశానని చెప్పినందుకే నువ్వు నమ్మేస్తున్నావా? దీని కంటే గొప్ప విషయాలు చూస్తావు” అన్నాడు. 51 తరువాత యేసు ఇలా అన్నాడు, “నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఆకాశం తెరుచుకోవడం, దేవుని దూతలు మనుష్య కుమారుడి మీదుగా ఎక్కడం, దిగడం చేస్తూ ఉండడం మీరు చూస్తారు.”