విలాప వాక్యములు
గ్రంథకర్త
ఈ గ్రంథంలో మాత్రం గ్రంథకర్త పేరు లేదు. అయితే క్రైస్తవ సంప్రదాయ గాథలను బట్టి యిర్మీయా దీని రచయిత అని తెలుస్తున్నది. గ్రంథకర్త యెరూషలేము విధ్వంసం ఫలితాలను కళ్ళారా చూశాడు. శత్రుదాడికి అతడు ప్రత్యక్షసాక్షి (1:13-15). ఈ రెండు సంభవాల సమయాల్లో యిర్మీయా అక్కడ ఉన్నాడు. యూదా జాతి దేవునిపై తిరుగుబాటు చేసి ఆయనతో తన నిబంధనను ఉల్లంఘించింది. దేవుడు బబులోనును సాధనంగా వాడుకుని తన ప్రజలను శిక్షించాడు. ఈ గ్రంథంలో వర్ణించిన తీవ్రమైన హింసలు అలా ఉండగా 3 వ అధ్యాయం లో ఒక నిరీక్షణ గురించిన వాగ్దానం కనిపిస్తున్నది. యిర్మీయా దేవుని మంచితనాన్ని గుర్తుచేసుకున్నాడు. దేవుని నమ్మకత్వం అనే సత్యం ద్వారా అతడు యూదా జాతికి ఓదార్పునిస్తున్నాడు. దేవుని కనికరాన్ని, ఎన్నటికీ విఫలం కాని ఆయన ప్రేమను వారికి తెలుపుతున్నాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 587 - 516
బబులోనీయులు యెరూషలేమును ముట్టడించి ధ్వంసం చేసిన సంభవాలను ప్రత్యక్ష సాక్షిగా అభివర్ణించాడు.
స్వీకర్త
చెర అనంతరం ఉన్న హెబ్రీయులు. ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చిన వారు, బైబిలు పఠతలంతా.
ప్రయోజనం
జాతి పాపం, వ్యక్తిగత పాపం రెంటికీ పరిణామాలు ఉంటాయి. తన ప్రజలను తిరిగి తన వద్దకు రప్పించుకోడానికి దేవుడు పరిస్థితులను, సాధనాలను ఉపయెగించుకుంటాడు, దేవునిలో మాత్రమే ప్రజలకు నిరీక్షణ ఉంది. చెరలో ఉన్న యూదులను దేవుడు శేషంగా మిగిల్చినట్టే ఆయన తన కుమారుడు యేసును రక్షకునిగా అనుగ్రహించాడు. పాపం శాస్వత మరణాన్ని తెస్తుంది. అయితే దేవుడు తన రక్షణ ప్రణాళిక ద్వారా నిత్యజీవాన్ని ఇస్తున్నాడు. విలపవాక్యములు గ్రంథం మన పాపం, తిరుగు బాటులకు ప్రతిగా దేవుని ఉగ్రత మనపై కుమ్మరించడం జరుగుతుందని స్పష్టం చేస్తున్నది. (1:8-9; 4:13; 5:16.)
ముఖ్యాంశం
విలాపం
విభాగాలు
1. యిర్మీయా యోరుషలేము కోసం విలపించడం — 1:1-22
2. పాపం దేవుని ఉగ్రతను కొనితెస్తుంది — 2:1-22
3. దేవుడు తన ప్రజలను ఎన్నటికీ విడిచిపెట్టడు — 3:1-66
4. యోరుషలేము మహిమ అంతరించి పోయింది — 4:1-22
5. యిర్మీయా తన ప్రజల కోసం చేసిన విజ్ఞాపన — 5:1-22
1
నిర్మానుష్యమైన యెరూషలేము
ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన పట్టణం* 1:1 పట్టణం యెరూషలేము పట్టణం, ఇప్పుడు వెలవెలబోయింది.
ఒకప్పుడు శక్తివంతమైన దేశం, ఇప్పుడు వితంతువులా అయ్యింది.
ఒకప్పుడు అన్య జాతుల్లో రాకుమారిలా ఉండేది, ఇప్పుడు బానిస అయింది.
రాత్రివేళ ఎంతో శోకిస్తూ ఉంది.
కన్నీటితో దాని చెంపలు తడిసిపోయాయి.
దాని ప్రేమికులెవ్వరూ దాన్ని ఆదరించలేదు.
దాని స్నేహితులందరూ దానికి ద్రోహం చేశారు.
వాళ్ళు దాని శత్రువులయ్యారు.
యూదా పేదరికం, బాధ అనుభవించి, దాస్యంలోకీ, చెరలోకీ వెళ్ళింది.
అన్యజనుల్లో నివాసం ఉంది.
దానికి విశ్రాంతి లేదు.
దాన్ని తరిమే వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. తప్పించుకునే దారే లేదు.
నియమించిన పండగలకు ఎవరూ రాలేదు గనక సీయోను దారులు సంతాపంతో ఉన్నాయి.
పట్టణపు గుమ్మాలు ఒంటరివయ్యాయి. యాజకులు మూలుగుతున్నారు.
దాని కన్యలు దుఃఖంతో ఉన్నారు.
అది అమితమైన బాధతో ఉంది.
దాని విరోధులు అధికారులయ్యారు. దాని శత్రువులు వర్ధిల్లుతున్నారు.
దాని పాపం అధికమైన కారణంగా యెహోవా దాన్ని బాధకు గురి చేశాడు.
విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని వెళ్ళారు.
సీయోను కుమారి అందమంతా పోయింది.
దాని అధిపతులు పచ్చిక దొరకని దుప్పిలా ఉన్నారు.
వాళ్ళు శక్తి లేనివాళ్ళుగా తరిమే వాళ్ళ ముందు నిలబడ లేక పారిపోయారు.
దానికి బాధ కలిగిన కాలంలోనూ, ఆశ్రయం లేని కాలం లోనూ, పూర్వం తనకు కలిగిన శ్రేయస్సు అంతా యెరూషలేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంది.
దాని ప్రజలు విరోధుల చేతుల్లో పడిన కాలంలో దానికి ఎవ్వరూ సాయం చెయ్యలేదు.
దాని విరోధులు దానికి కలిగిన నాశనం చూసి పరిహసించారు.
యెరూషలేము ఘోరమైన పాపం చేసింది.
ఆ కారణంగా అది ఒక రుతుస్రావం రక్తం గుడ్డలాగా అయ్యింది.
దాన్ని ఘనపరచిన వాళ్ళందరూ దాని నగ్నత్వం చూసి దాన్ని తృణీకరించారు.
అది మూలుగుతూ వెనుదిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది.
దాని చెంగులకు మురికి అంటింది.
దాని ఎదుట ఉన్న శిక్ష అది గుర్తు చేసుకోలేదు.
అది ఎంతో వింతగా పతనం అయ్యింది.
దాన్ని ఆదరించేవాడు ఒక్కడూ లేడు.
యెహోవా, నాకు కలిగిన బాధ చూడు.
శత్రువులు ఎంత బలంగా ఉన్నారో చూడు!
10 దాని శ్రేష్ఠమైన వస్తువులన్నీ శత్రువుల చేతికి చిక్కాయి.
దాని సమాజ ప్రాంగణంలో ప్రవేశించకూడదని ఎవరి గురించి ఆజ్ఞాపించావో ఆ ప్రజలు దాని పవిత్ర ప్రాంగణంలో ప్రవేశించడం అది చూస్తూ ఉంది.
11 దాని కాపురస్థులందరూ మూలుగుతూ ఆహారం కోసం వెదుకుతున్నారు.
తమ ప్రాణం నిలుపుకోవడం కోసం తమ శ్రేష్ఠమైన వస్తువులు ఇచ్చి ఆహారం కొన్నారు.
యెహోవా, నన్ను చూడు. నేను విలువ లేని దానిగా అయ్యాను.
12 దారిలో నడిచిపోతున్న ప్రజలారా, ఇలా జరిగినందుకు మీకు ఏమీ అనిపించడం లేదా?
యెహోవాకు తీవ్రమైన కోపం వచ్చిన రోజున నాకు కలిగించిన బాధవంటి బాధ ఇంకా ఎవరికైనా కలిగిందేమో మీరు ఆలోచించి చూడండి.
13 పై నుంచి ఆయన నా ఎముకల్లోకి అగ్ని పంపించాడు.
అది నా ఎముకలను కాల్చేసింది. ఆయన నా కాళ్ళకు వల పన్ని నన్ను వెనక్కి తిప్పాడు.
ఆయన నిరంతరం నాకు ఆశ్రయం లేకుండా చేసి నన్ను బలహీనపరిచాడు.
14 నా అతిక్రమం అనే కాడి నాకు ఆయనే కట్టాడు.
అవి మూటగా నా మెడ మీద ఉన్నాయి.
నా బలం ఆయన విఫలం చేశాడు.
శత్రువుల చేతికి ప్రభువు నన్ను అప్పగించాడు. నేను నిలబడ లేకపోతున్నాను.
15 నాకు అండగా నిలిచిన శూరులను ఆయన విసిరి పారేశాడు.
నా శక్తిమంతులను అణగదొక్కడానికి ఆయన నాకు వ్యతిరేకంగా ఒక సమాజాన్ని లేపాడు.
ద్రాక్షగానుగలో వేసి ద్రాక్షలు తొక్కినట్టు ప్రభువు, కన్యక అయిన యూదా కుమారిని తొక్కాడు.
16 వీటిని బట్టి నేను ఏడుస్తున్నాను.
నా కంట నీరు కారుతోంది.
నా ప్రాణం తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వాళ్ళు నాకు దూరమైపోయారు.
శత్రువులు విజయం సాధించారు గనుక నా పిల్లలు దిక్కుమాలిన వాళ్ళయ్యారు.
17 ఆదరించేవాడు లేక సీయోను చేతులు చాపింది.
యాకోబుకు చుట్టూ ఉన్న వాళ్ళను యెహోవా అతనికి విరోధులుగా నియమించాడు.
వాళ్ళకు యెరూషలేము ఒక రుతుస్రావ రక్తం గుడ్డలాగా కనిపిస్తోంది.
18 యెహోవా న్యాయవంతుడు. నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను.
ప్రజలారా, వినండి, నా యాతన చూడండి. నా కన్యలూ, బలవంతులైన నా శూరులూ బందీలుగా వెళ్ళిపోయారు.
19 నా ప్రేమికులను నేను పిలిపించినప్పుడు వాళ్ళు నన్ను మోసం చేశారు.
నా యాజకులూ, నా పెద్దలూ తమ ప్రాణాలు నిలుపుకోడానికి ఆహారం వెదుకుతూ వెళ్లి పట్టణంలో ప్రాణం పోగొట్టుకున్నారు.
20 యెహోవా, నన్ను తేరి చూడు. నాకు అమితమైన బాధ కలిగింది. నా కడుపు తిప్పుతోంది.
నేను చేసిన దారుణమైన తిరుగుబాటు కారణంగా నా గుండె నాలో తలక్రిందులై పోతూ ఉంది.
వీధుల్లో మా పిల్లలు కత్తివాత పడుతున్నారు. ఇంట్లో చావు ఉంది.
21 నా మూలుగు విను. నన్ను ఆదరించేవాడు ఒక్కడూ లేదు. నువ్వు నాకు కష్టం కలిగించావన్న వార్త నా శత్రువులు విని సంతోషంగా ఉన్నారు.
నువ్వు ప్రకటించిన ఆ రోజు రప్పించు, అప్పుడు వాళ్ళకు కూడా నాకు జరిగినట్టే జరుగుతుంది.
22 వాళ్ళు చేసిన చెడుతనం అంతా నీ ఎదుటికి వస్తుంది గాక.
నా అతిక్రమాల కారణంగా నువ్వు నాకు కలిగించిన హింస వాళ్ళకు కూడా కలిగించు.
నేను తీవ్రంగా మూలుగుతున్నాను. నా గుండె చెరువై పోయింది.

*1:1 1:1 పట్టణం యెరూషలేము పట్టణం