లేవీకాండం
గ్రంథకర్త
ఈ గ్రంథం చివరి వచనం రచయిత ఎవరనేది మనకు తెలుపుతున్నది. “ఇవి యెహోవా సీనాయి కొండమీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు (27:34; 7:38; 25:1; 26:46). దేవుని చట్టాలకు సంబంధించిన అనేక చారిత్రక వివరాలను ఈ పుస్తకం నమోదు చేస్తున్నది (8-10; 24:10-23). లేవీకాండము అనే పేరు లేవి గోత్రం నుండి వచ్చింది. వీరిని దేవుడు తన యాజకులుగా, ఆరాధన నాయకులుగా ప్రత్యేక పరిచాడు. లేవీయుల బాధ్యతలు, మరింత ప్రధానంగా యాజకులకు సూచనలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వారు దైవారాధనలో ప్రజలకు సహాయపడవలసిన పద్ధతి. పవిత్ర జీవనం గురించి రాసి ఉంది.
రచనా కాలం, ప్రదేశం
ఇంచుమించు క్రీ. పూ 1446 - 1410
లేవీకాండంలో రాసి ఉన్న ధర్మశాస్త్రం దేవుడు మోషేకు సీనాయి కొండ వద్ద అందజేశాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీయుల కొంత కాలం అక్కడ ఉన్నారు.
స్వీకర్త
ఈ గ్రంథాన్ని యాజకులకు, లేవీయులు, రానున్న ఇశ్రాయేల్ తరాలకు రాయడం జరిగింది.
ప్రయోజనం
ప్రత్యక్షగుడారం నిర్మించ వలసిందిగా దేవుడు మోషేను కోరడంతో లేవికాండం మొదలవుతుంది. ఇప్పుడు వారి మధ్య నివసిస్తున్న వారి మహిమాన్విత దేవునితో సరైన సహవాసం కొనసాగించడమెలాగో ఆ విముక్త ప్రజలకు ఈ గ్రంథం వివరంగా చెబుతున్నది. ఆ జాతి అప్పుడే ఈజిప్టును, దాని సంస్కృతిని, మతాలను విడిచి వచ్చింది. ఆ జాతి పై ప్రభావం చూపగల సంస్కృతులు, మతాలు ఉన్న కనాను దేశంలో ప్రవేశించనున్నది. ఆ సంస్కృతులకు వేరుగా (పరిశుద్ధంగా) యోహోవాకు నమ్మకంగా ఉండడానికి కావలసిన నియమాలను లేవీకాండం వర్ణిస్తున్నది.
ముఖ్యాంశం
బోధ, సూచనలు
విభాగాలు
1. అర్పణల గురించి ఆజ్ఞలు – 1:1-7:38
2. దేవుని యాజకుల గురించి ఆజ్ఞలు – 8:1-10:20
3. దేవుని ప్రజలకు ఆజ్ఞలు – 11:1-15:33
4. బలిపీఠం, ప్రాయశ్చిత్త దినం గురించిన ఆజ్ఞలు – 16:1-34
5. ఆచరణాత్మక పవిత్రత – 17:1-22:33
6. విశ్రాంతి దినాలు, పండుగలు, ఉత్సవాలు – 23:1-25:55
7. దేవుని దీవెన పొందాలంటే షరతులు – 26:1-27:34
1
దహనబలి
యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారం నుండి అతనితో ఇలా అన్నాడు. “నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తేవాలంటే దాన్ని తన పశువుల్లో నుండి గానీ, మేకల, గొర్రెల మందల్లో నుండి గానీ తీసుకు రావాలి.
ఒకవేళ అతడు దహనబలిగా పశువుల్లో నుండి ఒక దాన్ని అర్పించాలనుకుంటే లోపం లేని మగ పశువును తీసుకు రావాలి. యెహోవా సమక్షంలో అది అంగీకారం పొందాలంటే దాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర అర్పించాలి. దహనబలిగా అర్పించే పశువు తల మీద అతడు తన చెయ్యి ఉంచాలి. అప్పుడు అతనికి ప్రాయశ్చిత్తం కలగడానికి అతని పక్షంగా అది ఆమోదం పొందుతుంది.
తరువాత అతడు యెహోవా సమక్షంలో ఆ కోడె దూడని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు దాని రక్తాన్ని తీసుకు వచ్చి ప్రత్యక్ష గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉన్న బలిపీఠం పైన చిలకరిస్తారు. తరువాత అతడు దహనబలి పశువు చర్మాన్ని ఒలిచి దాన్ని ముక్కలుగా కోయాలి.
తరువాత యాజకుడైన అహరోను కొడుకులు బలిపీఠం పైన కట్టెలు పేర్చి మంట పెట్టాలి. అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు ఆ పశువు శరీర భాగాలనూ, తలనూ, కొవ్వునూ ఒక పద్ధతి ప్రకారం ఆ కట్టెలపైన పేర్చాలి. కానీ దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని యెహోవా బలిపీఠం పైన దహనబలిగా దహించాలి. అప్పుడు అది నాకు కమ్మని సువాసననిస్తుంది.
10 గొర్రెల, మేకల మందల్లో నుండి దేనినైనా దహనబలిగా అర్పించాలనుకుంటే లోపం లేని పోతును తీసుకు రావాలి. 11 బలిపీఠం ఉత్తరం వైపు యెహోవా సమక్షంలో దాన్ని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం అన్ని వైపులా దాని రక్తాన్ని చిలకరించాలి.
12 అప్పుడు దాన్ని తలా, కొవ్వుతో పాటు ఏ భాగానికి ఆ భాగంగా ముక్కలు చేయాలి. తరువాత వాటిని బలిపీఠంపై ఉన్న మంటపై అమర్చిన కట్టెలపై ఒక పద్ధతిలో పేర్చాలి. 13 దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని బలిపీఠం పై దహించాలి. ఇది దహనబలి. ఇది యెహోవాకు కమ్మని సువాసన కలుగజేస్తుంది.
14 ఒక వ్యక్తి యెహోవాకు దహనబలిగా పక్షిని అర్పించాలనుకుంటే ఒక గువ్వని గానీ పావురం పిల్లని గానీ తీసుకురావాలి. 15 యాజకుడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకువచ్చి దాని తలను చేతితో తుంచివేయాలి. తరువాత దాన్ని బలిపీఠం పైన కాల్చాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కనే పిండాలి.
16 తరువాత దాని * 1:16 జీర్ణ కోశం, పేగులు మొదలైనవి.పొట్ట తీసివేసి బలిపీఠం తూర్పు వైపున బూడిద పోసే చోట పారెయ్యాలి. 17 అతడు దాని రెక్కల సందులో చీల్చాలి గానీ రెండు ముక్కలుగా చేయకూడదు. యాజకుడు దాన్ని బలిపీఠం పైన ఉన్న కట్టెలపై కాల్చాలి. ఇది దహనబలి, అంటే ఇది యెహోవాకు కమ్మని సువాసనను కలుగజేస్తుంది.”

*1:16 1:16 జీర్ణ కోశం, పేగులు మొదలైనవి.