లూకా రాసిన సువార్త
గ్రంథకర్త
దీని రచయిత లూకా అని సమకాలీన రచయితలు అందరూ అభిప్రాయపడ్డారు. లూకా సువార్త శైలిని బట్టి ఇతడు వైద్యుడని, రెండవ తరం క్రైస్తవుడని అర్థం అవుతున్నది. సాంప్రదాయికంగా ఇతడు యూదేతరుడని అందరి అభిప్రాయం. ఇతడు ముఖ్యంగా సువార్తికుడు. పౌలుతో కలసి మిషనెరీ ప్రయాణాల్లో పాల్గొన్నాడు (కొలోస్సి 4:14; 2 తిమోతి 4:11; ఫిలేమోను 24).
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 58 - 61
లూకా తన రచన కైసరయలో ఆరంభించి రోమ్ లో ముగించాడు. ముఖ్యంగా బేత్లేహేము, గలిలయ, యూదయ, యెరూషలేముల్లో గ్రంథ రచన జరిగింది.
స్వీకర్త
లూకా ఈ గ్రంథాన్ని తియోఫిలాకు అంకితం చేశాడు. ఈ పేరుకు అర్థం “దేవుణ్ణి ప్రేమించేవాడు.” ఈ వ్యక్తి అప్పటికే క్రైస్తవుడో లేక క్రైస్తవుడిగా మారడానికి అలోచిస్తున్నాడో తెలియదు. లూకా ఇతన్ని “ఘనుడైన” అని సంబోధించడం వల్ల (1:3) ఇతడొక రోమా అధికారి అని అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకంలో అనేక సాక్షాధారాలు యూదేతరుల కోసం లూకా రాశాడని సూచిస్తున్నాయి. లూకా ముఖ్యంగా “మనుష్య కుమారుడు,” “దేవుని రాజ్యం” (5:24; 19:10; 17:20, 21; 13:18) వంటి విషయాలపై దృష్టి కేంద్రీకరించాడు.
ప్రయోజనం
యేసు జీవిత చరిత్ర కథనం ఆయన్ను మనుష్య కుమారునిగా చూపెడుతున్నది. తియోఫిలాకు బోధించిన విషయాల గురించి అతనికి తేటతెల్లమైన అవగాహన కలగడం కోసం (1:4) లూకా ఈ పుస్తకం రాశాడు. క్రైస్తవులు హింస ఎదుర్కొంటున్న సమయంలో యేసును అనుసరించే వారిలో ఎలాటి హీనత, నిగూఢత లేదని సమర్థించడానికి లూకా రాశాడు.
ముఖ్యాంశం
యేసు, పరిపూర్ణ మానవుడు.
విభాగాలు
1. యేసు పుట్టుక, బాల్యం — 1:5-2:52
2. యేసు పరిచర్య ఆరంభం — 3:1 – 4:13
3. యేసు రక్షణకర్త — 4:14-9:50
4. యేసు సిలువ దిశగా పయనం — 9:51-19:27
5. యేసు యెరూషలేము జయప్రవేశం, సిలువ, పునరుత్థానం — 19:28-24:53
1
పరిచయం
ఘనులైన తియొఫిలా, మొదటి నుంచీ కళ్ళారా చూసిన వాక్య సేవకులు మనకు అప్పగించినట్టు మన మధ్య నెరవేరిన కార్యాలను గురించి వివరంగా రాయడానికి చాలా మంది పూనుకున్నారు. కాబట్టి నీకు ఉపదేశించిన సంగతులు కచ్చితంగా జరిగాయని నువ్వు తెలుసుకోవాలని వాటిని మొదటి నుండీ పరిశోధించి కూలంకషంగా తెలుసుకున్న నేను నీ కోసం వాటన్నిటినీ క్రమపద్ధతిలో రాయడం మంచిదని నాకు అనిపించింది.
బాప్తిసమిచ్చే యోహాను జనన ప్రకటన
యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశీకురాలు. ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు, న్యాయవిధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకొనేవారు. అయితే వారికి పిల్లలు లేరు. ఎలీసబెతు గొడ్రాలు. అంతేకాదు, వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు.
జెకర్యా ఒక రోజు తన శాఖ వారి వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో యాజకుడుగా సేవ చేస్తూ ఉండగా యాజకులు వారి సంప్రదాయం ప్రకారం చీట్లు వేస్తే ప్రభువు ఆలయం లోపలికి వెళ్ళి ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చింది. 10 ధూపం వేసే సమయంలో జనమంతా బయట ప్రార్థన చేస్తున్నారు.
11 ప్రభువు దగ్గర నుండి వచ్చిన దేవదూత ధూపవేదిక కుడి వైపున అతనికి కనిపించాడు. 12 జెకర్యా అతనిని చూసి, కంగారుపడి భయపడ్డాడు. 13 అప్పుడా దూత అతనితో, “జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు. 14 అతని మూలంగా నీకు హర్షం, మహదానందం కలుగుతుంది. అతడు పుట్టడం వలన చాలా మంది సంతోషిస్తారు.
15 అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు, ద్రాక్షారసం గానీ సారాయి గానీ సేవించడు. తల్లి గర్భాన పుట్టింది మొదలు అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు. 16 ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు. 17 తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు మళ్ళించి, అవిధేయులు నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునేలా చేస్తాడు. తద్వారా ప్రభువు కోసం సిద్ధపాటు కలిగిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు ఏలీయా ఆత్మతో బలప్రభావాలతో ప్రభువుకు ముందుగా వస్తాడు” అన్నాడు.
18 దేవదూతతో జెకర్యా, “ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేను ముసలివాణ్ణి, నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు” అన్నాడు 19 దూత, “నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు. 20 నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి. అయితే నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకూ నువ్వు మూగవాడివై మౌనంగా ఉంటావు” అని అతనితో అన్నాడు.
21 ప్రజలు జెకర్యా కోసం ఎదురు చూస్తూ, ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడెందుకో అనుకుంటూ ఉన్నారు. 22 అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేక పోయాడు. ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు. 23 అతడు సేవ చేసే కాలం పూర్తి అయిన తరవాత ఇంటికి వెళ్ళి పోయాడు.
24 ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె ఐదు నెలల పాటు ఇతరుల కంట బడలేదు. 25 ఆమె, “దేవుడు నన్ను కనికరించి మనుషుల్లో నా అవమానాన్ని తొలగించడానికి ఇలా చేశాడు” అనుకుంది.
క్రీస్తు జనన ప్రకటన
26 ఎలీసబెతు ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు తన దూత గాబ్రియేలును గలిలయలోని నజరేతు అనే ఊరిలో 27 దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో ప్రదానం అయిన కన్య దగ్గరికి పంపించాడు. ఆ కన్య పేరు మరియ.
28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో, “అనుగ్రహం పొందినదానా, నీకు శుభం. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు” అని పలికాడు.
29 ఆమె ఆ మాటకు కంగారు పడిపోయి ఈ అభివందనం ఏమిటి అని ఆలోచించుకొంటుండగా, 30 దూత, “మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది. 31 ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు. 32 ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. 33 ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని ఆమెతో చెప్పాడు.
34 మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది. 35 ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు. 36 పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది. గొడ్రాలు అనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల. 37 దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు.
38 అందుకు మరియ, “నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక” అంది. అప్పుడా దూత వెళ్ళిపోయాడు.
మరియ ఎలీసబెతును సందర్శించడం
39-40 ఇది జరిగిన కొద్దికాలానికే మరియ లేచి యూదయ మన్యంలో జెకర్యా ఉండే ఊరికి త్వరగా చేరుకుని ఇంట్లోకి పోయి ఎలీసబెతుకు వందనం చేసింది. 41 ఎలీసబెతు ఆ అభివందనం వినగానే, ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు. అప్పుడు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా అంది.
42 “స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందినది. 43 నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం! 44 నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు. 45 ప్రభువు ఆమెకు వెల్లడి చేసినది తప్పక జరుగుతుందని నమ్మిన ఆమె ధన్యురాలు” అంది.
మరియ స్తోత్ర పాఠం
1సమూ 2:1-10
46 అప్పుడు మరియ ఇలా అంది, “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది.
47 ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు.
48-49 నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది.
సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం.
50 ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది.
51 ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు. గర్విష్ఠులను, వారి అంతరంగంలోని ఆలోచనలను బట్టి చెదరగొట్టాడు.
52 బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు
53 ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు.
54-55 అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి,
వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు,
ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు.”
56 మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి, ఆ పైన తన ఇంటికి వెళ్ళిపోయింది.
బాప్తిసమిచ్చే యోహాను జననం
57 ఎలీసబెతు నెలలు నిండి కొడుకుని కన్నది. 58 అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు, బంధువులు విని ఆమెతో కలిసి సంతోషించారు. 59 వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయబోతుండగా 60 తల్లి, “అలా కాదు. ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి” అంది. 61 అందుకు వారు, “నీ బంధువుల్లో ఆ పేరుగల వారెవరూ లేరు గదా” అని, 62 “వాడికి ఏ పేరు పెట్టాలి?” అని తండ్రిని సైగలతో అడిగారు. 63 అతడు పలక తెమ్మని, “బాబు పేరు యోహాను” అని రాశాడు. అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు. 64 వెంటనే అతని నోరు తెరుచుకుంది, నాలుక సడలి, అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు. 65 అది చూసి చుట్టుపక్కల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది. ఈ సమాచారం యూదయ మన్యంలో అంతటా చెప్పుకోసాగారు. 66 జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉండటం చూసి, “ఈ బిడ్డ ఎలాటి వాడవుతాడో!” అనుకున్నారు. 67 అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు,
68 “ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక.
ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు.
69 తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు.
70-73 మన శత్రువులబారి నుండీ మనలను ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణ నిచ్చాడు.
దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు.
ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను,
అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికీ ఈ విధంగా జరిగించాడు.
74-75 మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది,
పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో,
పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ,
భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే,
మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం.
76-78 ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు.
మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి,
వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా,
ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు.
79 మన పాదాలను శాంతి మార్గంలో
నడిపించేలా చీకటిలోను, చావు నీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది.
ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పై నుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేశాడు.”
80 ఆ బాలుడు ఎదిగి, ఆత్మలో బలం పుంజుకుంటూ, ఇశ్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు.