తీతుకు రాసిన పత్రిక
గ్రంథకర్త
తీతుకు రాసిన లేఖ రచయితగా పౌలు తనను చెప్పుకున్నాడు. “దేవుని దాసుడు, యేసు క్రీస్తు అపోస్తలుడు” గా తనను అభివర్ణించుకున్నాడు (తీతు 1:1). పౌలుకు, తీతుకు మధ్య పరిచయం గురించి అస్పష్టత ఉంది. అతడు పౌలు పరిచర్యలో క్రైస్తవుడు అయ్యాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే “మన అందరి విశ్వాస విషయములో నా నిజ కుమారుడగు తీతుకు” అని పౌలు రాశాడు (1:4). పౌలు తీతును స్నేహితునిగాను, సువార్తలో జత పనివానిగాను ఎంతో గౌరవించాడు. అతని అపేక్ష, శ్రద్ధ, ఇతరులకు అతడు చేకూర్చిన ఆదరణల నిమిత్తం మెచ్చుకున్నాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 63 - 65
పౌలు ఈ ఉత్తరం నికొపొలి నుండి తీతుకు రాశాడు. అపోస్తలుని మొదటి రోమ్ చెర అనంతరం విడుదల అయిన తరువాత రాశాడు. ఎఫెసులో పరిచర్యకై తిమోతిని పంపి పౌలు తీతుతోకలిసి క్రేతు లంకకు వెళ్ళాడు.
స్వీకర్త
క్రేతులో ఉన్న మరొక ఆత్మీయ కుమారుడు, సాటి పనివాడు అయిన తీతు.
ప్రయోజనం
క్రేతులో అప్పుడే ఏర్పడిన సంఘాల్లోని లోపాలను సరిదిద్దడం. అందులోని క్రైస్తవులు క్రమశిక్షణ లేకుండా ఒక పధ్ధతి అనేది లేకుండా ఉన్నారు. వారికి సహాయం అవసరం. (1) సంఘాల్లో కొట్టగా పెద్దలను ఏర్పాటు చెయ్యాలి. (2) క్రేతులో ఉన్న క్రైస్తవేతరుల ఎదుట మంచి విశ్వాస సాక్ష్యం ఇవ్వడానికి వారిని సిద్ధ పరచాలి.
ముఖ్యాంశం
ప్రవర్తన నియమావళి
విభాగాలు
1. అభివాదం — 1:1-4
2. పెద్దల నియామకం — 1:5-16
3. వివిధ వయో బృందాల గురించిన సూచనలు — 2:1-3:11
4. అంతిమ పలుకులు — 3:12-15
1
స్థానిక సంఘాల్లో దైవ క్రమం
దేవుడు ఎన్నుకున్న వారి విశ్వాసాన్ని స్థిరపరచడం కోసం, వారు దైవ భక్తికి అనుగుణమైన సత్యం గురించిన ఎరుకలో నిలకడగా ఉండేలా, అబద్ధమాడలేని దేవుడు కాలానికి ముందే వాగ్దానం చేసిన శాశ్వత జీవం గురించిన నిశ్చయతలో పౌలు అనే నేను దేవుని సేవకుణ్ణి, యేసు క్రీస్తు అపొస్తలుణ్ణి. సరైన సమయంలో ఆయన ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగించిన సందేశం వలన తన వాక్కును వెల్లడి చేశాడు.
మన అందరి ఉమ్మడి విశ్వాసం విషయంలో నా సొంత కుమారుడు తీతుకు రాస్తున్న లేఖ. తండ్రియైన దేవుని నుండీ, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండీ కృప, కరుణ, శాంతి సమాధానాలు నీకు కలుగు గాక.
నేను నీకు ఆదేశించినట్టు నువ్వు ఇంకా క్రమపరచని వాటిని క్రమపరచి, ప్రతి పట్టణంలోని క్రీస్తు ప్రభువు సంఘంలో పెద్దలను నియమించడం కోసం నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చాను.
సంఘపెద్ద నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య కలవాడై ఉండాలి. అతని పిల్లలు లెక్కలేనితనంగా క్రమశిక్షణ లేనివారు అనే పేరు లేకుండా విశ్వాసులై ఉండాలి. అధ్యక్షుడు దేవుని ఇంటి సేవ నిర్వహించేవాడు కాబట్టి నిందారహితుడుగా ఉండాలి. అతడు అహంకారి, ముక్కోపి, ద్రాక్ష మద్యానికి అలవాటు పడినవాడు, దెబ్బలాడేవాడు, దురాశపరుడు అయి ఉండకూడదు. అతిథి ప్రియుడు, మంచిని ప్రేమించేవాడు, ఇంగిత జ్ఞానం గలవాడు, నీతిపరుడు, పవిత్రుడు, ఆశలను అదుపులో ఉంచుకొనేవాడు, నమ్మదగిన బోధను స్థిరంగా చేపట్టడం ద్వారా క్షేమకరమైన సిద్ధాంతం బోధిస్తూ ప్రజలను హెచ్చరించడంలో, ఎదిరించే వారి వాదాలను ఖండించడంలో సమర్ధుడుగా ఉండాలి.
10 ఎందుకంటే అక్రమకారులు, ముఖ్యంగా సున్నతి పొందిన వారు చాలామంది ఉన్నారు. వారి మాటలు ఎందుకూ పనికి రానివి. వారు మనుషులను తప్పుదారి పట్టిస్తారు. 11 వారి నోళ్ళు మూయించడం అవసరం. వారు సిగ్గుకరమైన స్వలాభం కోసం బోధించకూడని వాటిని బోధిస్తూ, కుటుంబాలను పాడు చేస్తున్నారు.
12 వారిలో ఒకడు, వారి స్వంత ప్రవక్తే ఇలా అన్నాడు, ‘క్రేతు ప్రజలు ఎంతసేపూ అబద్ధికులు, ప్రమాదకరమైన దుష్టమృగాలు, సోమరులైన తిండిబోతులు.’ 13-14 ఈ మాటలు నిజమే. అందుచేత వారు యూదుల కల్పిత గాథలనూ, సత్యం నుండి మళ్ళిన వారి ఆజ్ఞల గురించి సమయం వ్యర్థం చేసుకోకుండా పట్టించుకోకుండా విశ్వాసంలో స్థిరపడడం కోసం వారిని కఠినంగా మందలించు.
15 పవిత్రులకు అన్నీ పవిత్రమే. కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదీ పవిత్రం కాదు. కానీ వారి హృదయం, వారి మనస్సాక్షి కూడా అపవిత్రాలే. 16 దేవుడు తమకు తెలుసని వారు చెప్పుకొంటారు గాని తమ క్రియల వలన దేవుడెవరో తమకు తెలియదు అన్నట్టు ఉన్నారు. నిజానికి వారు అసహ్యులు, అవిధేయులు, ఎలాంటి సత్కార్యం విషయంలోనూ పనికి రానివారు.