5
గోడమీది వ్రాత
రాజైన బెల్షెస్సరు తన వెయ్యిమంది అధికారులకు ఒక గొప్ప విందు ఇచ్చాడు. వారితో కలిసి రాజు ద్రాక్షామద్యం సేవిస్తూ ఉన్నాడు. బెల్షెస్సరు ద్రాక్షామద్యం తాగుతుండగా బంగారు, వెండి పాత్రలు తీసుకురమ్మని అతతడు సేవకుల్ని ఆజ్ఞాపించాడు. తన తండ్రి అయిన నెబుకద్నెజరు ఆ పాత్రల్ని యెరూషలేము ఆలయం నుంచి తీసుకువచ్చాడు. బెల్షెస్సరు తన సామంతులు, తన భార్యలు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్షామద్యం పానం చేయాలని కోరాడు. కనుక యెరూషలేము ఆలయం నుంచి తెచ్చిన ఆ ప్రాత్రల్ని వారు తీసుకు వచ్చారు. రాజు మరియు అతని సామంతులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు ఆ పాత్రల్లో పానం చేశారు. త్రాగుచూవారు బంగారం వెండి, కంచు, ఇనుము, కర్ర రాయి మొదలైన వాటితో తయారు చేయబడిన తమ దేవుళ్లను కీర్తించారు.
అప్పుడు ఉన్నట్టుండి, ఒక వ్యక్తి చేతి వ్రేళ్లు కనబడిగోడమీద వ్రాయసాగాయి. రాజగృహములో దీపం ప్రక్కగా గోడమీద ఆ చెయ్యి వ్రాసింది. ఆ చెయ్యి వ్రాస్తుండగా, రాజు చూశాడు.
రాజైన బెల్షెస్సరు భయభ్రాంతుడయ్యాడు, భయంవల్ల అతని ముఖం ఒకటి కొట్టుకొనసాగాయి. అతని కాళ్లు చాలా బలహీనంగా ఉండటంవల్ల, అతడు నిలబడలేక పోయాడు. అప్పుడు ఇంద్రజాలకుల్ని, కల్దీయుల్ని, తన సమక్షమునకు తీసుకురావలసిందిగా కోరాడు. ఆ వివేకవంతులతో, “గోడమీద ఈ వ్రాతను చదివే ఏ వ్యక్తికైనా నేను బహుమతి ఇస్తాను, అతను దాని అర్థం కూడా తెలపాలి. ఊదారంగు వస్త్రాలు అతనికి బహుకరిస్తాను. అతని మెడలో ఒక బంగారు గొలుసు వేస్తాను. అతనిని రాజ్యంలో మూడవ ఉన్నత పరిపాలకునిగా చేస్తాను” అని చెప్పాడు.
అందువల్ల వివేకవంతులందరు లోనికి వచ్చారు. కాని వారు ఆ వ్రాతను చదవలేకపోయారు. దాని అర్థాన్నికూడా చెప్పలేకపోయారు. బెల్షెస్సరు, అతని అధికారులు కలవరపడ్డారు. అతనికి చింత, భయం కూడా ఎక్కువయ్యాయి. ఆ భయంతో అతని ముఖం తెల్ల బోయింది.
10 విందు జరుగుతున్న ఆ ప్రదేశానికి రాజు యొక్క తల్లి వచ్చింది. ఆమె రాజు, అతని అధికారుల మాటలు విన్నది. “రాజా, నీవు చిరకాలం వర్ఖిల్లాలి. ఏమీ భయపడకు. భయంతో నీ ముఖం కలత చెంద నివ్వకు. 11 నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు. పవిత్ర దేవుళ్ల* ఆత్మ అతనిలో ఉంది. నీ తండ్రి పరిపాలించే రోజుల్లో అతను రహస్య విషయాలు తెలుసుకోగలనని నిరూపించాడు. చాలా చురుగ్గా, వివేక వంతంగా ఉన్నట్లుగా కూడా అతను కనిపించాడు. ఇటువంటి విషయాల్లో అతను దేవతలవంటివాడు. నీ తండ్రి నెబుకద్నెజరు ఈ వ్యక్తిని వివేకవంతులందరికీ అధికారిగా నియమించాడు. అతను ఇంద్ర జాలకులందరికి, కల్దీయులందరికి ఆధిపత్యం వహించాడు. 12 నేను మాటలాడుతున్న వ్యక్తి వేరు దానియేలు. రాజు అతనికి బెల్తెషాజరు అని నామకరణం చేశాడు. బెల్తెషాజరు చాలా బుద్ధిమంతుడు. అతనికి చాలా విషయాలు తెలుసు. అతను కలయొక్క అర్ధాలు చెప్పగలడు. రహస్య విషయాలు వివరించగలడు. కఠినమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరం చెప్పగలడు. దానియేలును పిలిపించు. గోడమీది వ్రాతకుగల అర్థమేమిటో అతను చెప్పగలడు” అని ఆమె చెప్పింది.
13 అందువల్ల దానియేలును రాజు వద్దకు తీసుకు వచ్చారు. దానియేలుతో రాజు, “నీ పేరేనా దానియేలు, రాజైన మా తండ్రి యూదానుండి బందీగా తీసుకొని వచ్చినవాడవు నీవేనా? 14 నీలో దేవతల ఆత్మ ఉన్నదని నేను విన్నాను. నీవు చురుకైనవాడవనీ, చాలా వివేక వంతుడవనీ, రహస్యాలను నీవు అర్థం చేసుకో గలవనీ విన్నాను. 15 వివేకవంతుల్నీ ఇంద్రజాలకుల్నీ గోడమీది వ్రాత చదవటానికి నా వద్దకు తీసుకువచ్చారు. కాని వారు నాకు గోడమీది వ్రాతకుగల అర్థాన్ని తెలుప లేకపోయారు. 16 నేను నిన్ను గురించి విన్నాను. మర్మముల అర్థం ఏమిటో నీవు చెప్పగలవని విన్నాను. కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవని కూడా విన్నాను. గోడమీది వ్రాతను చదివి, దాని అర్థాన్ని నీవు వివరించగలిగితే, నీకు ఊదారంగుగల బట్టలు ధరింపజేస్తాను. నీ మెడకు బంగారు గొలుసు వేస్తాను. తర్వాత రాజ్యంలో నీవు మూడవ ఉన్నత పరిపాలకుడవు కాగలవు” అని అన్నాడు.
17 తర్వాత దానియేలు రాజుతో, “బెల్షెస్సరు రాజా, నీ కానుకలు నీవద్దనే ఉంచుకొనుము. లేకపోతో ఆ బహుమతుల్ని మరెవరికైనా ఇవ్వవచ్చు. కాని నీ కోసం నేను గోడమీది వ్రాతను చదువగలను. మరియు దాని అర్థమేమిటో నీకు వివరించగలను” అని చెప్పాడు.
18 “రాజా, సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరును మహా శక్తిమంతమైన రాజుగా చేశాడు. దేవుడు అతన్ని అతి ముఖ్యుడుగా చేశాడు. 19 పెక్కు దేశాలకు చెందిన ప్రజలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు నెబుకద్నెజరును చూచి భయపడుచుండిరి. ఎందు కంటే సర్వోన్నతుడైన దేవుడు అతన్ని అతి ముఖ్యుడైన రాజుగా చేసిన కారణంవల్ల. నెబుకద్నెజరు ఒక వ్యక్తిని చంపదలచినట్లయితే, అతనిని చంపేవాడు. ఒక వ్యక్తిని జీవింప తలచుకుంటే, అతణ్ణి జీవించేలా చేసేవాడు. మనుష్యుల్ని ముఖ్యులుగా చేయదలుచు కుంటే, ఆ మనుష్యుల్ని ముఖ్యులుగా చేసేవాడు. హీనులుగా చేయదలచుకుంటే, హీనులుగా చేసేవాడు.
20 “కాని నెబుకద్నెజరు గర్విష్ఠి అయినాడు, మొండి వాడయ్యాడు. అందువల్ల అతని నుండి అధికారం తీసుకొనబడింది. అతని రాజ సింహాసనం తొలగించబడింది. అతని ప్రభావం తొలగించబడింది. 21 అతని బుద్ధి జంతువుల బుద్ధివలె మారింది. అతను అడవిగాడిదలతో నివసించసాగాడు. ఎద్దువలె పచ్చిక మేసాడు. మంచువల్ల తడిసాడు. అతను పాఠం నేర్చు కొనే వరకు ఈ సంగతులు జరిగాయి. తర్వాత సర్వోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాల్ని పాలించు వాడని, తనకు నచ్చిన వానికి రాజ్యాలు అప్పగించ గలడని తెలుసుకొన్నాడు.
22 “నెబుకద్నెజరు కుమారుడవైన బెల్షెస్సరూ! ఈ విషయాలు నీకు ఇంతకు మునుపే తెలుసు, 23 అయినా నిన్ను నీవు తగ్గించుకొనలేదు. అందుకు బదులుగా నీవు పరలోకమందున్న ప్రభువుకు విరొధంగా హెచ్చించుకున్నావు. యెహోవా ఆలయం నుండి నీవు త్రాగే పాత్రలు నీ కోసం ఆజ్ఞాపించి తెప్పించావు. తర్వాత నీవు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, రాజో ద్యోగులు ఆ పాత్రలనుండి ద్రాక్షామద్యం పానం చేశారు. నీవు వెండి, బంగారు, కంచు, ఇనుము, రాయి, కర్రలతో చేయబడిన దేవుళ్లను కీర్తించావు. అవి నిజమైన దేవుళ్లు కావు. అవి చూడలేవు, వినలేవు, లేక ఏమీ అర్థం చేసుకోలేవు. కాని నీ జీవితం మీదను, నీవు చేసేవాటి మీదను, అధికారంగల దేవుణ్ణి నీవు గౌరవించలేదు. 24 ఆ కారణం వల్ల, దేవుడు గోడమీద వ్రాసే హస్తాన్ని పంపించాడు. 25 ఈ క్రింది మాటలే గోడమీద వ్రాయబడినవి:
 
మెనే మెనే టెకేల్ ఊఫర్సీన్.
 
26 “ఈ మాటలకు అర్థం ఇది:
 
మెనే:
అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూసి దాన్ని ముగించాడు.
27  టేకల్:
అనగా దేవుడు నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు.
28  ఊఫర్సిన్:
అనగా నీ రాజ్యం నీ వద్దనుండి తీసి వేయబడి
మాదీయులకూ పారసీకులకూ విభజింపబడింది.”
 
29 తర్వాత బెల్షెస్సరు ఊదారంగు బట్టలు దానియేలు ధరించేలా ఆజ్ఞ ఇచ్చాడు. అతని మెడకు బంగారు గొలుసు ధరింపజేశాడు. అతను రాజ్యంలో మూడవ గొప్ప పాలకుడని ప్రకటింపజేశాడు. 30 ఆ రాత్రే బబులోను రాజైన బెల్షెస్సరు హతుడయ్యాడు. 31 దర్యావేషు అనే పేరుగల మాదీయుడు క్రొత్తగా రాజు అయ్యాడు. దర్యావేషు సుమారు అరవై రెండు యేండ్లవాడు.
* 5:11 పవిత్ర దేవుళ్ల పవిత్ర దేవుని ఆత్మ అని అర్థం.