8
దానియేలు దర్శనం-పొట్టేలుమరియు మేకపోతు
1 బెల్షస్సరు రాజుగా ఉన్న మూడవ సంవత్సరంలో, నాకు ఈ దర్శనము కనిపించింది. ఇది మొదటి దర్శనానికి తర్వాత వచ్చింది.
2 ఆ దర్శనంలో నేను షూషనులో ఉన్నట్లు చూశాను. ఏలాం రాష్ట్రంలో షూషను ఒక రాజధాని నగరం. నేను ఊలయి నది ప్రక్క నిలబడి ఉన్నాను.
3 నా కన్నులెత్తి ఊలయి నదికి ప్రక్కగా ఒక పొట్టేలు నిలబడి ఉండడం చూశాను. ఆ పొట్టేలుకి రెండు పొడుగాటి కొమ్ములుండెను. కాని ఒకటి మరొకదాని కంటె పొడుగైనది. పొడుగాటి కొమ్ము తర్వాత పుట్టింది.
4 ఆ కొమ్ములతో పొట్టేలు పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి పరుగెత్తడం చూశాను. ఏ మృగమూ పొట్టేలుని ఎదురించలేక పోయింది. మరియు ఎవ్వరూ దీనినుండి ఇతర జంతువుల్ని కాపాడలేక పోయారు. ఆ పొట్టేలు చేయదలచిందంతా చేస్తూంది. అందువల్ల పొట్టేలు చాలా శక్తివంత మయింది.
5 నేను ఆ పొట్టేలు గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఒక మేకపోతు పడమర నుండి రావడం చూశాను. అది భూమి అంతటా చుట్టి వచ్చింది. దాని కాళ్లు భూమిని కూడా తాకలేదు. ఈ వేకపోతుకు ఒక పెద్ద కొమ్ము దాని కళ్ల మధ్యన ఉంది.
6 ఆ మేకపోతు ఊలయి నదికి ప్రక్కగా నిలబడివున్న రెండు కొమ్ములు గల పొట్టేలు వద్దకు వచ్చింది. మేకపోతు చాలా కోపంగా ఉంది.
7 మేకపోతు పొట్టేలువైపు పరుగెత్తి చాలా కోపంతో కలబడి పొట్టేలు రెండు కొమ్ముల్ని విరుగ కొట్టింది. మేకపోతును పొట్టేలు ఎదిరించలేకపోయింది. మేకపోతు పొట్టేలుని నేలకు పడవేసి దాన్ని త్రొక్కివేసింది. ఆ మేకపోతు నుండి పొట్టేలుని కాపాడగలిగిన వారెవ్వరూ లేకపోయిరి.
8 అందువల్ల మేకపోతు చాలా బలంగా పెరిగింది. కాని అది శక్తివంతంగా వున్నప్పుడు, దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది. తర్వాత ఆ పెద్ద కొమ్ము స్థానంలో నాలుగు వేరే కొమ్ములు మొలిచాయి. ఆ నాలుగు కొమ్ములు ఆకాశపు నాలుగు దిక్కులలో పెరిగాయి.
9 తర్వాత ఆ నాలుగు కొమ్ములలో ఒకదాని నుండి ఒక చిన్న కొమ్ము పెరిగి బాగా పెద్దదయింది. అది దక్షిణ దిక్కుగా, తూర్పు దిక్కుగా, సుందర దేశం దిక్కుగా పెరిగింది.
10 ఆ చిన్నకొమ్ము బాగా పెద్దదయి ఆకాశాన్ని అంటేంత వరకు పెరిగింది. అది నక్షత్రాల్ని కూడా క్రిందికి త్రోసి కాళ్ల క్రింద త్రొక్కి వేసింది.
11 ఆ చిన్న కొమ్ము బాగా గర్వించి ఆ నక్షత్రాల సైన్యాధి పతికి ఎదురు తిరిగింది. అది పరిపాలకుని అనుదిన బల్యర్పణాన్ని ఆపివేసి. ఆయన ఆలయాన్ని పడగొట్టింది.
12 తిరుగుబాటు జరిగినందున (పరిశుద్ధుల) సైన్యం మరియు అనుదిన బలి దాని వశం చేయ బడ్డాయి. సత్యం నేలకు అణచి వేయబడింది. చేసిన ప్రతి దానిలో అది బాగా అభివృద్ధి చెందింది.
13 అంతట ఒక పరిశుద్ధుడు మాట్లాడటం విన్నాను. ఇంకొక పరిశుద్ధుడు మొదటి వానిని ఇలా అడిగాడు: “ఈ దర్శనం నెరవేరటానికి ఎంత కాలం పడుతుంది? అనుదిన బలిని గూర్చిన దర్శనం, నాశనం కలిగించు తిరుగుబాటు, పరిశుద్ధ స్థలం మరియు పరిశుద్ధుల సైన్యం కాళ్ల క్రింద త్రొక్కబడటం ఇవన్నియు నెరవేరటానికి ఎంతకాలము పడుతుంది?”
14 అతడు నాతో ఇలా అన్నాడు: “దానికి రెండువేల మూడువందల రోజులు పడుతాయి. అప్పుడు పవిత్ర స్థలం తిరిగి పరిశుద్ధం చేయబడుతుంది.”
దానియేలుకి దర్శనం వివరించబడింది
15 దానియేలు అను నేను ఈ దర్శనం చూశాను. అది యేమిటో తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తూండగా మానవుని వంటి ఒకతను నా ఎదుట నిలిచాడు.
16 తర్వాత ఒక మనిషి స్వరం ఊలయి నదిమీది నుంచి వినవచ్చింది, “గాబ్రియేలూ, ఈ దర్శనమును ఈ వ్యక్తికి వివరింపుము.”
17 నేను నిలుచుండిన స్థలానికి గాబ్రియేలు రాగా నేను భయభ్రాంతుడనై నేలమీద సాష్టాంగపడ్డాను. గాబ్రియేలు దూత నాతో, “మానవపుత్రుడా!, ఈ దర్శనం అంత్యకాలానికి సంబంధించిందని తెలుసు కొనుము” అని చెప్పాడు.
18 గాబ్రియేలు దూత నాతో మాటలాడుతూ ఉండగా, నేను నేలమీద సాష్టాంగపడి, గాఢనిద్ర పోయాను. అప్పుడు అతను నన్ను తాకి పైకి లేవనెత్తాడు.
19 గాబ్రియేలు దూత ఇలా చెప్పాడు: “శ్రమకాలపు చివరిలో ఏమి జరుగుతుందో నీకు ఇప్పుడు చెపుతాను. ఈ దర్శనం నియమించబడిన అంత్యకాలానికి సంబంధించింది అని అన్నాడు.
20 “రెండు కొమ్ములు గల పొట్టేలును నీవు చూశావు. ఆ కొమ్ములు మాదీయ, పారసీన దేశాలు.
21 బొచ్చుగల మేకపోతు గ్రీకు రాజు, దాని కళ్ల మధ్యవున్న పెద్ద కొమ్ము మొదటి రాజు.
22 ఆ కొమ్ము విరిగి పోయింది. ఆ స్థానంలో నాలుగు కొమ్ములు మొలిచాయి. ఆ కొమ్ములు మొదటి రాజు సామ్రాజ్యంనుంచి చీలిన నాలుగు రాజ్యాలు. కాని ఆ నాలుగు రాజ్యాలు మొదటి రాజువలె బలిష్ఠంగా ఉండవు.
23 “ఆ రాజ్యాలకు అంతం సమిపించే సమయాన, వారి దుష్టత్వం నిండినప్పుడు, మొండితనపు ముఖముగలిగి జిత్తులమారి అయిన ఒక రాజు లేస్తాడు. ఈ రాజు తన శక్తి వల్ల కాకుండానే మహా శక్తిమంతుడవుతాడు.
24 ఇతడు భయంకరమైన నాశనాన్ని తెస్తాడు. ఇతడు చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. అతను శక్తిమంతులైన మనుష్యుల్ని చివరికి దేవుని ప్రత్యేక జనుల్ని కూడా నాశనం చేస్తాడు.
25 “ఈ రాజు చాలా మోసగాడు, జిత్తులమారి అయివుండి, తన యుక్తి ఉపయోగించి, వంచనతో గెలుపొందుతారు. తాను అతి ముఖ్యుడనని భావిస్తాడు. ప్రజలు క్షేమంగా ఉన్నా మని తలస్తూన్నప్పుడు ఇతడు చాలా మందిని, రాజధి రాజును సహితం ఎదిరిస్తాడు. అయినా ఇతడు నాశనం చేయబడతాడు, కాని మానవ శక్తివల్ల కాదు.
26 “ఆ కాలాన్ని గురించి నీకివ్వబడిన దర్శనం నిజమైంది. కాని ఆ దర్శనానికి ముద్ర వేయి. ఎందుకనగా అది అంత్యకాల సంబంధమైనది.”
27 దానియేలు అను నేను అలసిపోయి చాలా రోజలు జబ్బు పడ్డాను. రాజుకు పనిచేసే నిమిత్తం నేను మరల లేచి వెళ్ళాను. కాని నేను ఆ దర్శనాన్ని తలంచుకుని కలతచెందాను. కాని దాని అర్థమేమిటో నాకు తెలియలేదు.