26
ప్రథమ పంట
“మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు త్వరలో ప్రవేశిస్తారు. మీరు అక్కడ మీ నివాసం ఏర్పరచుకొన్నప్పుడు మీరు ప్రథమ ఫలాలు కొన్ని తీసుకొని ఒక బుట్టలో పెట్టాలి. యెహోవా మీకు ఇస్తున్న దేశంలో అది మీకు లభించిన ప్రథమ పంట అవుతుంది. ఈ ప్రథమ పంట కొంత ఉన్న ఆ బుట్టను తీసుకొని, మీ దేవుడైన యెహోవా నిర్ణయించే స్థలానికి వెళ్లండి. అది యెహోవా తనకోసం ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పాటు చేసుకొనే స్థలం. అప్పటికి అక్కడ పరిచర్య చేస్తుండే యాజకుని దగ్గరకు మీరు వెళ్లాలి. ‘యెహోవా మనకు ఇస్తానని మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలోనికి నేను వచ్చేసానని నా దేవుడైన యెహోవాకు నేడు నేను ప్రకటిస్తాను’ అని నీవు ఆతనితో చెప్పాలి.
“అప్పుడు నీ చేతిలోని బుట్టను యాజకుడు తీసుకొంటాడు. నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట అతడు దానిని క్రింద ఉంచుతాడు. అప్పుడు అక్కడ నీ దేవుడైన యెహోవా ఎదుట నీవు ఇలా చెప్పాలి: ‘నా పూర్వీకుడు ఒక సంచార అరామీయుడు. ఆతడు ఈజిప్టులోనికి వెళ్లి, అక్కడ నివసించాడు. ఆతడు అక్కడికి వెళ్లినప్పుడు అతని కుటుంబంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అయితే అక్కడ ఈజిప్టులో అతడు అనేకమంది ప్రజలుగా, శక్తివంతమైన ఒక గొప్ప జనంగా తయారయ్యాడు. ఈజిప్టువాళ్లు మమ్మల్ని నీచంగా చూశారు. వాళ్లు మమ్మల్ని కష్టపెట్టి, బానిస పని బలవంతంగా మాతో చేయించారు. అప్పుడు మేము మా పూర్వీకుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, వారిని గూర్చి ఆరోపణ చేసాము. యెహోవా మా మొర్ర విన్నాడు. మా కష్టం, మా కఠినమైన పని, మా శ్రమ ఆయన చూశాడు. అప్పుడు యెహోవా తన మహా శక్తి, ప్రభావాలతో ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. గొప్ప అద్భుతాలు, మహాత్మ్యాలు ఆయన చేసినాడు. భయంకరమైన సంగతులు జరిగేటట్టు ఆయన చేసాడు. కనుక ఆయనే మమ్మల్ని ఈ దేశానికి తీసుకొనివచ్చాడు. పాలు, తేనెలు ప్రవహించుచున్న ఈ మంచి దేశాన్ని ఆయన మాకు యిచ్చాడు. 10 ఇప్పుడు యెహోవా, నీవు మాకు యిచ్చిన దేశంలోని ప్రథమ పంటను నీకు తెచ్చాను.’
“తర్వాత నీ పంటను నీ దేవుడైన యెహోవా ఎదుట క్రింద పెట్టాలి. మరియు మీరు ఆయనను ఆరాధించాలి. 11 అప్పుడు మీ దేవుడైన యెహోవా మీకూ, మీ కుటుంబానికీ ఇచ్చిన మంచి పదార్థాలన్నింటినీ మీరు తిని ఆనందించనచ్చును. మీ మధ్య నివసించే లేవీయులు, విదేశీయులతో మీరు వాటిని పంచుకోవాలి.
12 “ప్రతి మూడవ సంవత్సరం దశమభాగాల సంవత్సరం. ఆ సంవత్సరం మీ పంటలోని దశమ భాగాలన్నీ అర్పించటం పూర్తి అయ్యాక దానిని మీరు లేవీయులకు, విదేశీయులకు, ఆనాథలకు, విధవలకు ఇవ్వాలి. అప్పుడు వారు ప్రతి పట్టణంలో తిని తృప్తి పడవచ్చు. 13 మీ దేవుడైన యెహోవాతో మీరు ఇలా చెప్పాలి: ‘నా పంటలోని పవిత్ర భాగాన్ని (దశమ భాగం)నేను నా ఇంటినుండి తీసాను. దానిని లేవీయులకు, విదేశీయులకు, అనాథలకు, విధవలకు నేను ఇచ్చాను. నీవు నాకు ఇచ్చిన ఆదేశాలన్నిటినీ నేను పాటించాను. నేను వాటిని మరచిపోలేదు. 14 నేను దుఃఖ సమయంలో ఈ ఆహారాన్ని తినలేదు. నేను అపవిత్రంగా ఉన్నప్పుడు ఈ ఆహారాన్ని కూర్చలేదు. ఈ ఆహారంలో ఏదీ చనిపోయిన వారికి నేను అర్పించలేదు. యెహోవా, నా దేవా, నేను నీకు విధేయుడనయ్యాను. నీవు నాకు ఆదేశించిన వాటన్నింటినీ నేను చేసాను. 15 పరలోకంలోని నీ పవిత్ర నివాసంనుండి క్రిందికి చూడు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించు. నీవు మా పూర్వీకులకు వాగ్దానం చేసినట్టు మాకు ఇచ్చిన, పాలు, తేనెలు ప్రవహించుచున్న దేశాన్ని నీవు ఆశీర్వదించు.’
యెహోవా ఆజ్ఞలకు విధేయులు కావాలి
16 “ఈ ఆజ్ఞలు, నియమాలు అన్నింటికీ మీరు విధేయులు కావాలని నేడు మీ దేవుడైన యెహోవా మీకు ఆదేశిస్తున్నాడు. మీ నిండు హృదయంతో, మీ నిండు ఆత్మతో వాటిని జాగ్రత్తగా పాటించండి. 17 యెహోవా మీ దేవుడు అని ఈ వేళ మీరు చెప్పారు. ఆయన మార్గాల్లో నడుస్తామనీ, ఆయన ప్రబోధాలను పాటిస్తామనీ, ఆయన చట్టాలకు ఆజ్ఞలకు విధేయులం అవుతామనీ మీరు ప్రమాణం చేసారు. మీరు చేయాల్సిందిగా ఆయన చెప్పే ప్రతిదీ చేస్తామనీ మీరు చెప్పారు. 18 ఈ వేళ యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా స్వీకరించాడు. ఆయన దీన్ని మీకు వాగ్దానం చేసాడు. మీరు ఆయన ఆదేశాలన్నింటికీ విధేయులు కావాలని కూడా యెహోవా చెప్పాడు. 19 యెహోవా తాను చేసిన రాజ్యాలన్నింటికంటె మిమ్మల్ని గొప్పవాళ్లనుగా చేస్తాడు. మెప్పు, కీర్తి, ఘనత ఆయన మీకు ఇస్తాడు. మరియు ఆయన వాగ్దానం చేసినట్టు మీరు ఆయన స్వంత ప్రత్యేక ప్రజలుగా ఉంటారు.”