34
మోషే మరణించటం
1 మోషే మోయాబు పల్లపు ప్రాంతాల నుండి యెరికో దాటి నెబో కొండ మీద పిస్గా శిఖరం మీదికి వెళ్లాడు. గిలాదునుండి దానువరకు దేశం మొత్తం యెహోవా మోషేకు చూపించాడు.
2 ఎఫ్రాయిము, మనష్షేల దేశం అంతా, నఫ్తాలీ అంతా యెహోవా అతనికి చూపించాడు. యూదా దేశం మధ్యదరా సముద్రం వరకు ఆయన అతనికి చూపించాడు.
3 నెగెవు ప్రాంతాన్ని, సోయెరు నుండి ఈతచెట్ల పట్టణం యెరికోకు పోయే లోయ అంతా మోషేకు యెహోవా చూపించాడు.
4 “అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానంచేసిన దేశం యిదే. ‘మీ సంతతివారికి ఈ దేశం నేను యిస్తాను’ అని వారితో నేను చెప్పాను. నిన్ను ఆ దేశం చూడ నిచ్చాను, నీవు అక్కడికి వెళ్లలేవు” అని మోషేతో యెహోవా చెప్పాడు.
5 అప్పుడు యెహోవా సేవకుడు మోషే అక్కడ మోయాబు దేశములో చనిపోయాడు. ఇలా జరుగుతుందని యోహావా మోషేతో ముందే చెప్పాడు.
6 బెత్పెయోరు అవతల మోయాబు దేశంలోని లోయలో యెహోవా మోషేను పాతి పెట్టాడు. అయితే మోషే సమాధి ఎక్కడ ఉందో ఈ రోజువరకు ఎవరికీ తెలియదు.
7 మోషే చనిపోయినప్పుడు అతని వయస్సు 120 సంవత్సరాలు. అతని కళ్లు మసక కాలేదు. అతడు ఇంకా బలంగానే ఉన్నాడు.
8 ఇశ్రాయేలు ప్రజలు మోయాబు పల్లపు ప్రాంతాల్లో 30 రోజుల పాటు మోషే కోసం ఏడ్చారు. ఇది పూర్తి సంతాప దినాల సమయము.
యెహోషువ కొత్త నాయకుడవటం
9 అప్పుడు నూను కుమారుడైన యెహోషువ మీద మోషే చేతులు పెట్టిన కారణంగా యెహోషువ జ్ఞానాత్మతో పూర్తిగా నిండిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ మాట విన్నారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టు వారు చేసారు.
10 కాని ఆ సమయమునుండి మళ్లీ మోషేవంటి ప్రవక్త జన్మించలేదు. యెహోవా దేవునికి మోషే ముఖాముఖిగా తెలుసు.
11 ఈజిప్టు దేశంలో యెహోవా చేత పంపబడి మోషే చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు, ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు. ఆ అద్భుతాలు, మహాత్కార్యాలు ఈజిప్టులో ఫరోకు, అతని సేవకులందరికీ, ప్రజలందరికి చూపించబడ్డాయి.
12 మోషే చేయగా ఇశ్రాయేలు ప్రజలంతా చూసిన ఆ శక్తివంతమైన ఆశ్చర్యకార్యాలు ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు.