7
ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యేక ప్రజలు
1 “మీరు స్వాధీనం చేసుకొనేందుకు ప్రవేశించబోతున్న దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్ములను తీసుకొని వస్తాడు. అనేక రాజ్యాలవాళ్లను — హిత్తీయులు, గిర్గాషీయులు, ఆమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీ యులు, యెబూసీయులు – మీకంటె బలంగల ఏడు గొప్ప రాజ్యాల వాళ్లను మీకోసం యెహోవా బలవంతంగా బయటకు వెళ్లగొడ్తాడు.
2 ఈ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా మీ అధికారం క్రింద ఉంచుతాడు. మీరు వారిని ఓడిస్తారు. మీరు వాళ్లను సర్వనాశనం చేయాలి. వాళ్లతో ఏ ఒడంబడిక చేసుకోవద్దు. వాళ్లకు దయ చూపించవద్దు.
3 ఆ ప్రజల్లో ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు, ఆ ఇతర రాజ్యాలకు చెందిన ఎవరినీ మీ కుమారులనుగాని కుమారైలనుగాని పెళ్లి చేసుకోనివ్వవద్దు.
4 ఎందుకంటే మీ పిల్లలు నన్ను వెంబడించకుండా ఆ ఇతరులు వారిని మళ్లిస్తారు. అప్పుడు మీ పిల్లలు ఇతర దేవుళ్లను సేవిస్తారు. కనుక యెహోవా మీ మీద కోపగిస్తాడు. వెంటనే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.
బూటకపు దేవుళ్లను నాశనం చేయండి
5 “ఈ రాజ్యలకు మీరు చేయాల్సింది యిదే, మీరు వారి బలిపీఠాలను విరుగగొట్టి, వాళ్ల స్మారక శిలలను ముక్కలుగా చేయాలి. వారి ఆశేర స్తంభాలను నరికి వేసి, వారి విగ్రహాలను కాల్చివేయండి.
6 ఎందుకంటే మీరు యెహోవాకు స్వంత ప్రజలు. భూమిమీద మొత్తం ప్రజలందరిలో మీరు ఆయనకు ప్రత్యేక ప్రజగా ఉండేందుకు — కేవలం ఆయనకు మాత్రమే చెందిన వారుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొన్నాడు.
7 యెహోవా ఎందుకు ప్రేమించి, ఏర్పాటు చేసుకొన్నాడు? ఇతర ప్రజలకంటే మీరు ఎక్కువమంది ఉన్నారని కాదు. సమస్త జనులలో మీరే అతి తక్కువ సంఖ్యవారు.
8 అయితే యెహోవా మహాశక్తితో మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. బానిసత్వంనుండి ఆయన మిమ్మల్ని స్వతంత్రులను చేసాడు. ఈజిప్టు రాజు ఫరో అధికారంనుండి ఆయన మిమ్మల్ని విడుదల చేసాడు. ఎందు కంటే యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుకను, మీ పూర్వీకులకు ఆయన చేసిన వాగ్దానాన్ని నిలుపు కోవాలనీ ఆయన అలా చేసాడు.
9 “అందుచేత మీ దేవుడైన యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన నమ్మదగినవాడు అని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన తన ఒడంబడికను నిలబెట్టుకొంటాడు. ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యే వారరందరికీ ఆయన తన ప్రేమ, దయ చూపుతాడు. వేయి తరాలవరకు ఆయన తన ప్రేమ, దయ చూపిస్తూనే ఉంటాడు.
10 అయితే యెహోవాను ద్వేషించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు. వాళ్లను ఆయన నాశనం చేస్తాడు. ఆయనను ద్వేషించే మనిషిని శిక్షించటంలో ఆయన నిదానించడు.
11 కనుక నేడు మీకు నేను ఇస్తున్న ఆజ్ఞలు, చట్టాలు నియమాలు విధేయత చూపే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.
12 “మీరు ఈ ఆజ్ఞలను ఆలకించి, వాటికి జాగ్రత్తగా విధేయులైతే, మీ దేవుడైన యెహోవా మీతో చేసిన ప్రేమ ఒడంబడికను నిలబెట్టుకొంటాడు. మీ పూర్వీకులకు ఆయన యిది వాగ్దానం చేసాడు.
13 ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఆశిర్వదిస్తాడు. మీ ప్రజల సంఖ్య యింకా యింకా పెరిగిపోతుంది. ఆయన మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. మీ పొలాలను మంచి పంటలతో ఆయన ఆశీర్వదిస్తాడు. ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె ఆయన మీకు ఇస్తాడు. మీ ఆవులకు దూడలను, గొర్రెలకు గొర్రె పిల్లలను ఇచ్చి ఆయన ఆశీర్వాదిస్తాడు. మీకు ఇస్తానని ఆయన మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీకు ఈ ఆశీర్వాదాలన్నీ లభిస్తాయి.
14 “ప్రజలదరికంటే మీరు ఎక్కువగా ఆశీర్వదించబడతారు. భార్వాభర్తల ప్రతి జంటకూ పిల్లలు పుడతారు. మీ పశువులకు దూడలు పుడతాయి.
15 సమస్త రోగాలనూ యెహోవా మీ నుండి తొలగించివేస్తాడు. ఇంతకు ముందు ఈజిప్టులో మీకు కలిగిన భయంకర వ్యాధులు ఏవీ ఆయన మీకు రానివ్వడు. కానీ ఈ వ్యాధులన్నింటిని మిమ్మల్ని ద్వేషించేవారిమీద ఆయన ఉంచుతాడు.
16 మీరు ఎవరిని ఓడించేందుకు మీ దేవుడైన యెహోవా సహాయం చేస్తాడో, ఆ ప్రజలందరినీ మీరు నాశనం చేయాలి. వారిమీద జాలి పడవద్దు. మరియప వారి దేవుళ్లను సేవించవద్దు. ఎందు కంటే వారు మీకు ఉరియవుతారు. మీరు వారి దేవుళ్లను సేవిస్తే, మీరు శిక్ష అనుభవిస్తారు.
యెహోవా తన ప్రజలకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుట
17 “ ‘ఈ రాజ్యాలు మనకంటే బలమైనవి. వారిని మనం ఎలా వెళ్లగొట్టగలము?’ అని మీ హృదయంలో అనుకోవద్దు.
18 వారిని గూర్చి మీరు భయపడకూడదు. ఫరోకు, ఈజిప్టు ప్రజలందరకు మీ దేవుడైన యెహోవా చేసిన దానిని మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి.
19 ఆయన వారికి కలిగించిన మహా కష్టాలను మీరు చూశారు. ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు మీరు చూశారు. మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించేందుకు యెహోవా ప్రయోగించిన ఆయన మహాశక్తిని, బలాన్ని మీరు చూశారు. మీరు భయపడే వారందరి మీదా అదే శక్తిని మీ దేవుడైన యెహోవా ప్రయోగిస్తాడు.
20 “మీ దగ్గర్నుండి పారిపోయి, దాక్కున్న వాళ్లందరినీ పట్టుకొనేందుకు మీ దేవుడైన యెహోవా కందిరీగలను సహా పంపిస్తాడు. ఆ ప్రజలందరినీ దేవుడు నాశనం చేస్తాడు.
21 మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు గనుక వారినిగూర్చి భయపడవద్దు. ఆయన మహాగొప్పవాడు. భీకరుడునైన దేవుడు.
22 ఆ రాజ్యాల ప్రజలు మీ దేశాన్ని కొంచెంకొంచెంగా విడిచి వెళ్లి పోయేటట్టు మీ దేవుడైన యెహోవా వారిని బలవంతపెడ్తాడు. వాళ్లందరినీ ఒకేసారిగా మీరు నాశనం చేయరు. మీరు అలా చేస్తే మీకు అడవి మృగాల బాధ విపరీతంగా పెరిగిపోతుంది.
23 అయితే మీ దేవుడైన యెహోవా ఆ రాజ్యాలను మీకు ఇస్తాడు. వారు నాశనం అయ్యేంతవరకు గొప్ప చిక్కుతో యెహోవా వారిని యుద్ధంలో గందరగోళ పరుస్తాడు.
24 వారి రాజులను ఓడించటానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు. మీరు వారిని చంపేస్తారు, వారు ఎన్నడైనా జీవించిన విషయం కూడా ప్రపంచం మరచిపోతుంది. మిమ్మల్ని అడ్డగించటం ఏ మనిషి తరం కాదు. మీరు వాళ్లందరినీ నాశనం చేస్తారు.
25 “మీరు వారి దేవుళ్ల విగ్రహాలను తప్పక కాల్చి వేయాలి. ఆ విగ్రహాల మీద ఉండే బంగారంకానీ వెండి గానీ మీరు తీసుకొంటే బాగుంటుందని మీరు ఆశించ కూడదు. ఆ వెండిగాని, బంగారంగాని మీకోసం మీరు తీసుకోకూడదు. మీరు అలా చేస్తే, మీరు చిక్కులో పెట్టబడతారు. (మీ జీవితాలు నాశనం అవుతాయి) ఎందుకంటే మీ యెహోవా దేవునికి ఆ విగ్రహాలు అసహ్యం.
26 యెహోవా అసహ్యించుకొనే ఆ విగ్రహాల్లో ఒక్కటికూడా మీరు మీ ఇంటిలోనికి తీసుకొని రాకూడదు. ఆ విగ్రహాలను మీరు మీ ఇంట్లోకి తీసుకొనివస్తే, ఆ విగ్రహాలవలె మీరూ కూడా నాశనం చేయబడతారు. మీరు వాటిని బాగా అసహ్యించుకోవాలి. ఆ విగ్రహాలను నాశనం చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు.