11
భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కో
నువ్వెక్కడకి వెళ్లినా అక్కడ మంచి పనులు చెయ్యి. కొంతకాలం గడిచాక నీ మంచి పనులనే విత్తులు మొలకలెత్తి పంట రూపంలో నీకు తిరిగి వస్తాయి.*
నీకున్నది వేర్వేరు వాటిమీద మదుపు పెట్టు. ప్రపంచంలో ఏమి చెడుగులు సంభవించనున్నాయో నీకు తెలియదు.
(నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలిగిన విషయాలు కొన్ని వున్నాయి.) మేఘాలు నీళ్లతో నిండివుంటే, అవి నేలపై వర్షిస్తాయి. చెట్టు నేలపైన కూలితే కూలినది ఉత్తరానికైనా, దక్షిణానికైనా అది పడ్డచోటునే వుంటుంది.
(అయితే, కొన్ని విషయాలు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోలేవు. అలాంటప్పుడు, నువ్వు సాహసించి ఏదో ఒకటి చెయ్యాలి.) మంచి వాతావరణం పరిస్థితులకోసం ఎదురు చూసేవాడు ఎన్నడూ తన విత్తనాలు చల్లలేడు. ప్రతి మేఘమూ వర్షించేస్తుందని భయపడే వాడు తన పంట కుప్పలు ఎన్నడూ నూర్చుకోలేడు.
గాలి ఎటు వీస్తుందో నీకు తెలియదు. బిడ్డ తన తల్లి గర్భంలో ఎలా పెరుగుతుందో నీకు తెలియదు. అలాగే, దేవుడు యేమి చేస్తాడో నీకు తెలియదు, కాని, అన్నీ జరిపించేది ఆయనే.
అందుకని, ప్రొద్దుటే నాట్లు వెయ్యడం మొదలెట్టు. సాయంత్రమయ్యేదాకా పని చాలించకు. ఎందుకంటే, ఏవి నిన్ను సంపన్నుని చేస్తాయో నీకు తెలియదు. ఏమో, నీ పనులు అన్నీ జయప్రదమవుతాయేమో.
బతికి ఉండటం మంచిది! సూర్యకాంతి కళ్లకి యింపు గొలుపుతుంది. నువ్వు ఎంత కాలం జీవించినా, నీ జీవితంలో ప్రతి ఒక్క రోజునూ అనుభవించు. అయితే, ఏదో ఒక రోజున నువ్వు మరణించక తప్పదని గుర్తుంచుకో. నీ జీవిత కాలంకంటె, నీ మరణానంతర కాలం చాలా ఎక్కువ. నువ్వు మరణించాక, నువ్వు చెయ్యగలిగినది శూన్యం, ఏమీ ఉండదు.
నీయౌవ్వన కాలంలోనే దేవుని సేవచెయ్యి
అందుకని, యువజనులారా, మీ యౌవ్వన కాలంలోనే మీరు సుఖాలు అనుభవించండి. ఆనందంగా ఉండండి! మీ మనస్సుకి ఏది తోస్తే, మీరు ఏది కోరుకుంటే అది చెయ్యండి. అయితే, మీరు చేసే పనులన్నింటికీ దేవుడు మిమ్మల్ని విచారిస్తాడని మాత్రం మరిచిపోకండి. 10 మీ కోపానికి మీరు లొంగిపోకండి. మీ శరీరం మిమ్మల్ని పాప మార్గాన నడపకుండా చూసుకోండి. ప్రజలు జీవిత ప్రారంభ దశలో తాము యౌవనస్థలుగా ఉన్నప్పుడు తెలివిలేని పనులు చేస్తారు.
* 11:1 నువ్వెక్కడకి … తిరిగివస్తాయి లేదా, “నీ ఆహారాన్ని నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడుతుంది.” 11:2 నీకున్నది … మదుపు పెట్టు లేక “ఒక భాగాన్ని ఏడుగురికో, ఎనమండుగురికో పంచి ఇయ్యి.” 11:10 మీ కోపానికి … చూసుకోండి లేక, ఆయా విషయాలను గురించి సతమతమవకండి. ఇబ్బందులనుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.