యెహెజ్కేలు
1
పరిచయం
1-3 నేనొక యాజకుణ్ణి. నా పేరు యెహెజ్కేలు. బూజీ కుమారుణ్ణి. దేశభ్రష్టుడనై చెరలో ఉన్నాను.* బబులోనులో నేను కెబారు కాలువ పక్కన ఉండగా ఆకాశం తెరువబడింది. అప్పుడు నాకు దైవసంబంధమైన దర్శనాలు కలిగాయి. అది ముఫ్పైవ సంవత్సరంలో నాల్గవ నెల (జూన్) ఐదవ రోజున జరిగింది. బబులోను రాజైన యెహోయాకీను ప్రవాసంలో చెరపట్టబడ్డాక ఐదవ సంవత్సరం, ఆ నెలలో ఐదవ రోజున యెహోవా వాక్కు యెహెజ్కేలుకు విన వచ్చింది. ఆ స్థలంలో యెహోవా ప్రభావం అతని మీదికి వచ్చింది.
యెహోవా సింహాసనపు రథం
ఉత్తరాన్నుండి గాలి దుమారం లేచి వస్తున్నట్లు నేను (యెహెజ్కేలు) చూశాను. అది ఒక పెను మేఘం. దాని నుండి అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంది. దానిచుట్టూ వెలుగు దేదీప్యమానంగా ఉంది. అగ్నిలో కణకణలాడే లోహంలా అది మెరుస్తూ ఉంది. దాని లోపల నాలుగు జంతువులు ఉన్నాయి. వాటి రూపం మానవ రూపంలా ఉంది. కాని ప్రతీ జంతువుకు నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. వాటి కాళ్లు నిట్ట నిలువుగా ఉన్నాయి. వాటి పాదాలు ఆవు పాదాల్లా ఉన్నాయి. అవి మెరుగుదిద్దిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి. వాటి రెక్కల కింద మనుష్యుల చేతులు వంటివి ఉన్నాయి. అక్కడ మొత్తం నాలుగు జంతువులున్నాయి. వాటిలో ప్రతి ఒక్క జంతువుకూ నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు వాటి ముఖాల గురించి వివరిస్తాను. వాటి రెక్కలు ఒకదానితో ఒకటి తాకుతున్నాయి. అవి కదిలినప్పుడు ఆ జంతువులు పక్కకి తిరుగలేదు. అవి చూస్తూవున్న దిశలోనే అవి కదిలి వెళ్ళాయి.
10 ప్రతి జంతువుకు నాలుగు ముఖాలున్నాయి. ప్రతి ఒక్కటి ముందువైపు మనుష్య ముఖం కలిగిఉంది. కుడివైపు సింహపు ముఖం ఉంది. ఎడమ పక్క ఎద్దు ముఖం ఉంది. వెనుకవైపు గరుడ ముఖం ఉంది. 11 తమ రెక్కలతో ఆ జంతువులు తమ శరీరాలను కప్పుకున్నాయి. రెండు రెక్కలు విప్పుకొని పక్కదాని రెక్కలను తాకుతున్నాయి. మరి, రెండు రెక్కలు శరీరాన్ని కప్పుకొవటానికి వినియోగించు కుంటున్నాయి. 12 ప్రతి జంతువు చూస్తూవున్న దిశలోనే అవి కదిలి వెళ్లాయి. గాలి§ ఎటువీస్తే అవి అటు కదిలివెళ్లాయి. కానీ, అవి కదలినప్పుడు వాటి ముఖాలు పక్కకి తిరగలేదు. 13 ఆ జంతువులు ఆ విధంగా కనిపించాయి.
జంతువుల మధ్యలోవున్న లోపలి ప్రాంతంలో కాలుతున్న బొగ్గు నిప్పుల్లా కనబడిన ఏదో ఒకటి ఉంది. ఈ అగ్ని ఆ జంతువుల చుట్టూ కదలుతున్న చిన్న కాగడాల్లా ఉంది. ఆ అగ్ని ప్రకాశవంతగా వెలిగి దానినుండి మెరుపు మెరిసింది. 14 మెరుపు వంటి వేగంతో ఆ జీవులు వెనుకకు, ముందుకు కదులుతున్నాయి!
15-16 నేనా జంతువుల వైపు చూడగా నాలుగు చక్రాలు కన్పించాయి. ఆ చక్రాలన్నీ ఒకే విధంగా కనిపించాయి. ఒక్కొక్క ముఖానికి ఒక చక్రం చొప్పున ఉన్నాయి. ఆ చక్రాలు భూమిని తాకాయి. చక్రాలు స్వచ్ఛమైన పసుపువన్నె గోమేధికంతో చేయబడినట్లు కానవచ్చాయి. ఒక చక్రంలో మరో చక్రం ఉన్నట్లు కన్పించింది. 17 ఆ చక్రాలు ఏ దిశలోనైనా కదలగలవు. కాని అవి కదలినప్పుడు జంతువులు మాత్రం తిరుగలేదు.
18 ఆ చక్రాల అంచులు ఎత్తుగా, భయంకరంగా ఉన్నాయి. ఆ నాలుగు చక్రాల అన్ని అంచుల చట్టూ కళ్లు ఉన్నాయి.
19 ఆ జంతువులతోపాటు చక్రాలు ఎప్పుడూ కదు లుతూనే ఉండేవి. జంతువులు ఆకాశంలోకి లేచినప్పుడు వాటితోపాటు చక్రాలు కూడా లేచేవి. 20 గాలి (ఆత్మ) వాటిని ఎటు పోవాలని కోరితే అవి అటు వెళ్లాయి. అప్పుడు చక్రాలు కూడా వాటితో వెళ్లాయి. ఎందువల్లనంటే ఆ జంతువుల యొక్క గాలి శక్తి చక్రాలలోనే ఉంది. 21 అందువల్ల జీవులు కదిలితే చక్రాలు కూడా కదిలేవి. జీవులు ఆగితే చక్రాలు కూడా ఆగేవి. చక్రాలు గాలిలోకి వెళితే, జీవులు కూడా వాచితో పాటు వెళ్లాయి. ఎందువల్లనంటే గాలి (ఆత్మ శక్తి) చక్రాలలోనే ఉంది.
22 ఆ జీవులపై ఒక ఆశ్చర్యకరమైన వస్తువు కన్పించింది. అది ఒక పెద్ద పాత్ర బోర్లించినట్లుగా ఉంది. అది మంచులా స్వచ్చంగా ఉంది. అది జీవుల తలలచుట్టూ గాలిలో తేలియాడుతూ ఉంది. 23 ఈ పాత్రకింద ప్రతి జంతువుయొక్క రెక్కలు పక్కనున్న జంతువును తాకేటట్లు ఉన్నాయి. రెండు రెక్కలు ఒక వైపున మరో రెండు రెక్కలు మరో వైపున శరీరాన్ని కప్పుతూ వ్యాపించాయి.
24 పిమ్మట నేను ఆ రెక్కల చప్పుడు విన్నాను. జంతువులు కదలినప్పుడల్లా, ఆ రెక్కలు గొప్ప శబ్దం చేసేవి. మహా నీటి ప్రవాహం ఘోషించినట్లు వాటి రెక్కల చప్పుడు వినిపించింది. సర్వశక్తిమంతుడైన దేవుని గంభీర శబ్దంలాగ ఆ శబ్దం వినిపించింది. ఒక సైన్యంగాని, ఒక ప్రజా సమూహంగాని చేసే రణగొణధ్వనుల్లా అవి వినవచ్చాయి. ఆ జంతువులు కదలటం మానినప్పుడు అవి వాటి రెక్కలను తమ పక్కలకు దించివేసేవి.
25 జంతువులు కదలటం మానివేసి, రెక్కలను దించివేశాయి. పిమ్మట మరొక పెద్ద శబ్దం వచ్చింది. అది వాటి తలలపైవున్న ఆకాశమండలం లాంటి పాత్ర మీదుగా వచ్చింది. 26 ఆ పాత్రలాంటి వస్తువుపై మరొకటి కన్పించింది. అది ఒక సింహాసనంలా ఉంది. అది నీలమణిలా మెరుస్తూ ఉంది. ఆ సింహాసనంపై మనిషివంటి ఒక స్వరూపం కూర్చున్నట్లు కన్పించింది! 27 నడుము నుండి పైవరకు అతనిని పరికించి చూశాను. కాలుతున్న లోహంలా అతడు కన్పించాడు. అతని చుట్టూ అగ్ని ప్రజ్వరిల్లుతున్నట్లు కానవచ్చింది! అతని నడుము నుండి కిందికి చూడగా, అంతా అగ్నిలా కన్పించింది. అది అతని చుట్టూ ప్రకాశిస్తూ ఉంది. 28 ఆయన చుట్టూ ప్రకాశించే వెలుగు ఇంద్రధనుస్సులా ఉంది. అది యెహోవా మహిమలా ఉంది. అది చూచి నేను సాష్టాంగపడ్డాను. నా శిరస్సు నేలకు ఆనించాను. అప్పుడు నాతో మాట్లాడే ఒక కంఠస్వరం విన్నాను.
* 1:1-3 దేశభ్రష్టుడనై చెరలో ఉన్నాను రాజైన నెబుకద్నెజరు యూదా దేశపు యూదులను దేశంనుండి వెడలగొట్టి అన్య దేశాలలో నివసించేలా చేశాడు. 1:1-3 ముఫ్పైవ సంవత్సరం ఇది ఏ సంవత్సరమో స్పష్టంగా తెలియదు. ప్రవాస కాలంలో ఐదవ సంవత్సరం కావచ్చు. యెహెజ్కేలు తన పుస్తకాన్ని తన చివరి దర్శనంతో గాని, లేదా మొదటి దానివంటిదితో గాని మొదలు పెట్టియుండవచ్చు. 1:5 జంతువులు జీవులు అని పాఠాంతరం. § 1:12 గాలి లేక ఆత్మ.