24
కుండ-మాంసం
నా ప్రభువైన యెహోవా మాట నాకు చేరింది. అది చెరలో తొమ్మిదవ సంవత్సరం, పదవనెల పదవ తేదీన జరిగింది. ఆయన ఇలా అన్నాడు, “నరపుత్రుడా, ఈ రోజు తారీఖు వేసి, ఈ చీటీ రాయి, ‘ఈ రోజు బబులోను రాజు సైన్యం యెరూషలేమును చుట్టుముట్టింది.’ విధేయులు కావటానికి తిరస్కరించే ఇశ్రాయేలు తెగవారికి ఈ కథ చెప్పు. వారికి ఈ విషయాలు చెప్పుము, ‘నా ప్రభవైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
 
“ ‘పొయ్యిమీద కుండ పెట్టుము.
కుండ పెట్టి, అందులో నీరు పొయుము.
దానిలో మాంసం ముక్కలు వేయాలి.
మంచి ముక్కలు వేయాలి. తొడ మాంసం, జబ్బ మాంసం వేయాలి.
మంచి ఎముకలతో కుండ నింపాలి.
వీటి కొరకు మందలో వున్న మంచి జంతువులను (పశువులను) వాడాలి.
కుండ కింద బాగా కట్టెలు వేర్చు.
మాంసం ముక్కలను పుడకబెట్టు.
ఎముకలు కూడా వుడికేలా రసాన్ని కాగబెట్టు!
 
“ ‘నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెప్పుతున్నాడు,
హంతకులున్న
ఈ నగరమునకు కీడు మూడింది.
తుప్పుమరకలున్న కుండలా యెరూషలేము ఉంది.
ఆ మచ్చలు తొలగింప బడవు!
కుండలో నుండి ప్రతి మాంసం ముక్కను బయటకు తీయుము.
ఆ మాంసాన్ని తినవద్దు! పాడైపోయిన ఆ మాంసం నుండి యాజకులను ఏమీ తీసుకోనివ్వద్దు.
యెరూషలేము ఆ తుప్పుపట్టిన కుండలా ఉంది.
ఎందువల్లననగా హత్యల రక్తం ఇంకా అక్కడ ఉంది!
రక్తాన్ని ఆమె రాళ్లమీద చిందించింది.
రక్తాన్ని ఆమె నేలపై పోసి దుమ్ముతో కప్పలేదు.*
నేనామె రక్తాన్ని రాతిబండమీద వుంచాను.
అందువల్ల అది కప్పబడదు.
చూచిన ప్రజలకు కోపం రావాలని, అమాయక ప్రజలను చంపినందుకు
వారామెను శిక్షించాలని నేనది చేశాను.
 
“ ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు,
నరహంతకులతో నిండిన ఈ నగరానికి కీడు మూడింది!
నిప్పు రాజెయ్యటానికి నేను కట్టెలు బాగా పేర్చుతాను.
10 కుండ కింద కట్టెలు బాగా పేర్చు.
నిప్పు రాజెయ్యి.
మాంసాన్ని బాగా ఉడకనియ్యి!
మసాల దినుసులు కలుపుము.
ఎముకలు కాలిపోనిమ్ము.
11 పిమ్మట బొగ్గుల మీద ఖాళీ కుండను వుండ నిమ్ము.
దాని మచ్చలు కాలి మెరిసేలా దానిని వేడెక్కనిమ్ము.
దాని మచ్చలు కరిగిపోతాయి.
తుప్పు (కిలుము) రాలిపోతుంది.
 
12 “ ‘యెరూషలేము తన మచ్చలు మాపుకోటానికి
బాగా శ్రమించవచ్చు.
ఆయినా దాని ‘తుప్పు’ పోదు!
కేవలం అగ్ని (శిక్ష) మాత్రమే ఆ తుప్పును పోగొడుతుంది.
 
13 “ ‘నీవు నాపట్ల పాపం చేశావు.
దానితో నీ చర్మం మాలిన్యమయ్యింది.
నిన్ను కడిగి శుభ్రపర్చాలను కున్నాను.
కాని నీ వంటిమీది మచ్చలు పోకుండెను
నీపట్ల నా తీవ్రమైన కోపం తీరేవరకు
నిన్ను కడిగే ప్రయత్నం మళ్లీ చేయను!
 
14 “ ‘నేనే యెహోవాను. నీకు శిక్ష విధింపబడుతుందని చెప్పాను. ఆది వచ్చేలా నేను చేస్తాను. నేను శిక్షను ఆపను. నిన్ను గురించి నేను విచారించను. నీవు చేసిన చెడు కార్యాలకు నేను నిన్ను శిక్షిస్తాను.’ ” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
యెహెజ్కేలు భార్య మరణం
15 పిమ్మట యెహోవా సందేశం నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 16 “నరపుత్రుడా, నీవు నీ భార్యను మిక్కిలి ప్రేమిస్తున్నావు. కాని ఆమెను నీనుండి నేను తీసుకొనబోతున్నాను. నీ భార్య ఆకస్మాత్తుగా చనిపోతుంది. ఆయినా నీవు మాత్రం నీ విచారాన్ని వ్యక్తం చేయకూడదు. నీవు బిగ్గరగా ఏడ్వకూడదు. నీవు కన్నీళ్లు కార్చకూడదు. 17 కాని నీ వెక్కి ఏడ్పు శబ్దాలను బయటకు వినరానీయవద్దు. చని పోయిన నీ భార్య కొరకు నీవు ఏడ్వవద్దు. నీవు మామూలుగా వేసుకొనే బట్టలనే ధరించాలి. నీ తలపాగా, నీ చెప్పులు ధరించుము. నీ విచారాన్ని వ్యక్తం చేయటానికి నీవు నీ మీసాలను కప్పివుంచవద్దు. సామాన్యంగా వ్యక్తులు మరణించినప్పుడు ప్రజలు తినే ఆహారాన్ని నీవు తినవద్దు.”
18 మరునాటి ఉదయం దేవుడు చెప్పిన విషయాలను నేను ప్రజలకు తెలియజేశాను. ఆ సాయంత్రం నా భార్య చనిపోయింది. ఆ మరునాటి ఉదయం దేవుడు ఆజ్ఞాపించిన విధంగా నేను అన్నీ చేశాను. 19 అప్పుడు ప్రజలు నాతో, “నీవిలా ఎందుకు చేస్తున్నావు? దీని అర్థం ఏమిటి?” అని ప్రశ్నించారు.
20 అందుకు వారతో నేనిలా అన్నాను: “యెహోవా మాట నాకు విన్పించింది. 21 ఇశ్రాయేలు వంశంవారితో మాట్లడమని ఆయన నాకు చెప్పాడు. నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: ‘చూడండి, నేను నా పవిత్ర స్థలాన్ని నాశనం చేస్తాను. మీరా స్థలాన్ని చూచి గర్వపడుతున్నారు. దానిని శ్లాఘిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ స్థలాన్ని చూడాలని మీరు ఉబలాట పడుతూ వుంటారు. మీరు నిజంగా ఆ స్థలమంటే ఇష్టపడుతూ వున్నారు. కాని నేనాస్థలాన్ని నాశనం చేస్తాను. మీరు మీ వెనుక వదిలిపెట్టిన మీ పిల్లలంతా యుద్ధంలో చంపబడతారు. 22 నేను చనిపోయిన నా భార్య విషయంలో ఏమి చేశానో, మీరు కూడా ఆలానే చేస్తారు. మీ దుఃఖాన్ని సూచించటానికి మీరు మీసాలను కప్పుకొనరు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సామాన్యంగా ప్రజలు తినే ఆహారాన్ని మీరు తినరు. 23 మీరు మీ తలపాగాలు, చెప్పులు ధరిస్తారు. మీరు మీ విచారాన్ని వ్యక్తం చేయరు. మీరు ఏడ్వరు. మీ పాపాల కారణంగా మీరు నశించిపోతారు. మీ దుఃఖాన్ని మీరు ఒకరికొకరు నిశ్శబ్దంగా తెలియజేసుకుంటారు. 24 కావున యెహెజ్కేలు మీకు ఒక ఉదాహరణ. అతడు చేసినవన్నీ అలానే మీరూ చేస్తారు. ఆ శిక్షా కాలం సమీపిస్తున్నది. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసు కుంటారు.’ ”
25-26 “నరపుత్రుడా, ప్రజల నుండి ఆ సురక్షిత ప్రాంతాన్ని (యెరూషలేమును) నేను తీసుకుంటాను. ఆ అందమైన స్థలం వారిని సంతోషపెడుతూ ఉంది. వారు దానిని చూడాలని కుతూహల పడుతూ వుంటారు. వారు నిజంగా ఆ స్థలమంటే బాగా ఇష్టపడుతున్నారు. ఆ నగరాన్ని, వారి పిల్లలను నేను వారినుండి తీసుకొంటాను. ఆ సమయంలో చావగా మిగిలిన వారలో ఒకడు యెరూషలేమును గూర్చిన ఒక చెడువార్తను తీసుకొని వస్తాడు. 27 అప్పుడు నీవతనితో మాట్లాడ గలుగుతావు. ఇక నీవెంత మాత్రమూ మౌనంగా వుండవు. ఈ రకంగా నీవు వారికి ఒక ఉదాహరణగా ఉంటావు. నేను యెహోవానని అప్పుడు వారు తెలుసుకుంటారు.”
* 24:7 రక్తాన్ని… కప్పలేదు మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైన ఆహార నిమిత్తం ఒక జంతువును చంపినప్పుడు దాని రక్తాన్ని నేలమీద వేసి మట్టి కప్పాలి. తద్వారా ఆ జంతువు యెక్క ప్రాణాన్ని తిరిగి దేవునికి ఇస్తున్నట్లు అవుతుందని ధర్మశాస్త్రం తెలుపుతుంది. చూడండి లేవి. 17:1-16, మరియు ద్వితీ. 12:1-25. రక్తాన్ని మట్టితో కప్పకపోతే ఆ రక్తమే చంపిన వానికి వ్వతిరేకంగా సాక్షి అవుతుంది. చూడండి, ఆది. 4:10 యెబు 15:8 యెషయా 26:21.