35
ఎదోముకు వ్యతిరేకంగా వర్తమానం
1 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
2 “నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు చూచి నా తరపున దానికి వ్యతిరేకంగా మాట్లాడు.
3 దానితో ఈ విధంగా చెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు,
“ ‘శేయీరు పర్వతమా, నేను నీకు విరోధిని!
నేను నిన్ను శిక్షిస్తాను. నిన్నొక పనికిమాలిన బీడు భూమిలా చేస్తాను.
4 నీ నగరాలను నేను నాశనం చేస్తాను.
నీవు నిర్మానుష్యమవుతావు.
అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.
5 “ ‘ఎందువల్లనంటే నీవు నా ప్రజలకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడూ, వారి శిక్షాకాల అంతిమదశలోనూ నీవు నీ కత్తిని వారిమీద ఉపయోగించావు.’ ”
6 కావున నా ప్రభువైన యెహోవా చెపుతున్నదేమంటే, “నా జీవ ప్రమాణంగా నేను నిశ్చయంగా చెప్పేదేమంటే, నిన్ను మృత్యువు కబళించివేసేలా చేస్తాను. మృత్యువు నిన్ను వెంటాడుతుంది. రక్తమును నీవు అసహ్యించుకోలేదు. కావున మృత్యువు నిన్ను తరుముకు వెళుతుంది.
7 శేయీరు పర్వతాన్ని పాడైపోయిన శూన్య ప్రదేశంగా చేస్తాను. ఆ నగరం నుండి వచ్చే ప్రతి వానినీ నేను చంపివేస్తాను. ఇంకా ఆ నగరంలోకి వెళ్ల ప్రయత్నించే ప్రతివానిని నేను చంపివేస్తాను.
8 దాని పర్వతాలన్నిటినీ శవాలతో కప్పివేస్తాను. ఆ శవాలు నీ కొండలన్నిటి మీద, నీ లోయలు, కనుమలన్నిటిలోను పడివుంటాయి.
9 నిన్ను శాశ్వతంగా ఏమీలేనివానిగా మార్చివేస్తాను. నీ నగరాలలో ఏ ఒక్కడూ నివసించడు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.”
10 “ఈ రెండు జనాభాలు, వారి దేశాలు (ఇశ్రాయేలు, యూదా) నావే. మేము వాటిని శాశ్వతంగా మా స్వంతం చేసుకుంటాము” అని నీవు అన్నావు.
కాని యెహోవా ఇలా అన్నాడు!
11 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “నీవు నా ప్రజల పట్ల అసూయచెంది ఉన్నావు. నీవు వారిపట్ల కోపంతో ఉన్నావు. నీవు వారిని అసహ్యించుకున్నావు. నీవు వారిని బాధించిన విధంగా నేను నిన్ను శిక్షిస్తానని నామీద ప్రమాణం చేసి చెపుతున్నాను! నేను నిన్ను శిక్షించి, నేను నా ప్రజలతోనే ఉన్నానని వారు తెలుసుకొనేలా చేస్తాను.
12 నీ అవమానాలన్నిటి గురించి నేను విన్నానని నీవు కూడ తెలుసుకుంటావు. ఇశ్రాయేలు పర్వతానికి వ్యతిరేకంగా నీవు అనేక చెడ్డ విషయాలు ప్రచారం చేశావు.
“ ‘ఇశ్రాయేలు నాశనం చేయబడింది! వాళ్లను మేము ఆహారం నమిలినట్లు నమిలి వేస్తాము!’ అని అంటూ నీవు ప్రచారం మొదలు పెట్టావు.
13 నీవు గర్వించి, నాకు వ్యతిరేకంగా అనేక విషయాలు చెప్పావు. నీవు చాలాసార్లు అలా మాట్లాడినావు. కాని నీవు మాట్లాడిన ప్రతి మాటా నేను విన్నాను! అవును. నీవన్నది నేను విన్నాను.”
14 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నేను నిన్ను నాశనం చేసినప్పుడు ఈ భూమి యావత్తూ సంతోషిస్తుంది.
15 ఇశ్రాయేలు దేశం నాశనమయినప్పుడు నీవు సంతోషించావు. అదే రీతిని నిన్ను నేను చూస్తాను. శేయీరు పర్వతం, ఎదోము దేశం మొత్తం నాశనం చేయబడతాయి. నేనే యెహోవానని మీరప్పుడు తెలుసుకుంటారు.”