5
ఆ కాలంలో ప్రవక్తలైన హగ్గయి,* ఇద్దో కొడుకు జెకర్యా దేవుని పేరిటి ప్రవచించారు. యూదా, యెరూషలేములలోని యూదులను వాళ్లు ప్రోత్సహించారు. దానితో, షియల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవలు యెరూషలేములోని దేవాలయ నిర్మాణ కృషిని తిరిగి ప్రారంభించారు. దేవుని ప్రవక్తలందరూ వారితో ఉండి, ఆ పనికి తోడ్పడుతూ వచ్చారు. ఆ కాలంలో యూఫ్రటీసునది పశ్చిమ ప్రాంతానికి తతైనైయు అధిపతి. తతైనైయు, షెతర్బోజ్నయి, వారి సహో ద్యోగులు నిర్మాణ కృషి సాగిస్తున్న జెరుబ్బాబెలు, యేషూవ, తదితరుల వద్దకు వెళ్లి, “ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి, దీన్ని సరికొత్తదానిగా రూపొందించడానికి మీకు ఎవరు అనుమతినిచ్చారు?” అని నిలదీశారు. అంతేకాదు, వాళ్లు జెరుబ్బాబెలును, “ఈ భవనం పని చేస్తున్న వాళ్ల పేర్లు యేమిటి?” అని కూడా ప్రశ్నించారు.
అయితే, యూదా నాయకుల మీద దేవుని దృష్టివుంది. దర్యావేషు చక్రవర్తికి భవన నిర్మాతలు లేఖలు పంపుకున్నారు. చక్రవర్తి సమాధానం పంపేదాకా, వాళ్లు పనిని నిలుపు చేయవలసిన అవసరం లేకపోయింది. వాళ్లు తమ నిర్మాణ కృషిని కొనసాగించారు.
యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతాధిపతి అయిన తతైనైయు, షతర్బోజ్నయి, వారి ముఖ్య సహోద్యోగులు దర్యావేషు చక్రవర్తికి ఒక లేఖ పంపారు. ఆ లేఖ నకలు ఇది:
 
దర్యావేషు చక్రవర్తికి
 
శుభం!
దర్యావేషు చక్రవర్తికి మేము ఇందు మూలంగా తెలియజేసేది ఏమంటే, తమ ఆదేశం మేరకు యూదా రాజ్యంలో గొప్ప దేవుని ఆలయానికి మేము వెళ్లాము. యూదాలోని ప్రజలు ఆ ఆలయాన్ని పెద్దపెద్ద రాళ్లతో కడుతున్నారు. గోడల్లో వాళ్లు పెద్ద దూలాలు పరుస్తున్నారు ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారు. వాళ్లు చాలా వేగంగా నిర్మాణం సాగిస్తున్నారు. త్వరలోనే పనిపూర్త వుతుంది.
వాళ్లు చేస్తున్న పనిని గురించి మేము వాళ్ల నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడిగాము. “ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మించేందుకూ, కొత్తదానిగా దాన్ని రూపొందించేందుకూ మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?” అని మేము ప్రశ్నించాము. 10 మేము వాళ్లు పేర్లు కూడా అడిగాము. వాళ్లెవరో మీరు తెలుసు కోగలిగేందుకు వీలుగా మేము వాళ్ల పేర్లు వ్రాసి పెట్టాలని అనుకున్నాము.
11 వాళ్లు మాకు ఇచ్చిన సమాధానం యిది:
 
“మేము భూ, పరలోకాల అధిపతియైన యెహోవా దేవుని సేవకులం. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు మహారాజొకడు నిర్మించి ముగించిన దేవాలయాన్ని మేమిప్పుడు తిరిగి నిర్మిస్తున్నాం. 12 కాని, మా పూర్వీకులు దేవునికి కోపం తెప్పించారు. ఆయన వారిని బబులోను రాజైన నెబుకద్నెజరుకు లోబరిచాడు. నెబుకద్నెజరు ఈ దేవాలయాన్ని నిర్మూలించాడు, ప్రజలను బలవంతాన బబులోనుకు బందీలుగా తీసుకుపోయాడు. 13 అయితే, కోరెషు చక్రవర్తి దేవాలయం తిరిగి నిర్మింపబడాలని ఒక ప్రత్యేకాజ్ఞ జారీ చేశాడు. 14 కోరెషు గతంలో యెహోవా దేవాలయం నుంచి కొల్లగొట్టిన వెండి, బంగారు వస్తువులను బబులోనులోని అబద్ధపు దేవత ఆలయంనుంచి బయటికి తీయించాడు. నెబుకద్నెజరు గతంలో ఆ వస్తువులను యెరూషలేములోని ఆలయం నుంచి కొల్లగొట్టి, వాటిని బబులోను లోని తన అబద్ధపు దేవత దేవాలయంలో ఉంచాడు. ఇప్పుడు కోరెషు చక్రవర్తి ఆ వెండి, బంగారు వస్తువులను షేష్బజ్జరుకు ఇచ్చాడు. కోరెషు షేష్బజ్జరును ప్రాంతీ యాధికారిగా నియమించాడు.”
 
15 కోరెషు షేష్బజ్జరును ఇలా ఆదేశించాడు: “నువ్వీ వెండి, బంగారు వస్తువులను తీసుకుపోయి, వాటిని తిరిగి యెరూషలేములోని దేవాలయంలో పెట్టు. గతంలో ఉన్న చోటనే దేవాలయాన్ని తిరిగి నిర్మింప జేయి.”
16 షేష్బజ్జరు వచ్చి, యెరూషలేములోని దేవాలయానికి పునాదులు నిర్మించాడు. ఆనాటి నుంచి నేటిదాకా పని కొనసాగింది. అయితే, ఆ పని యింకా పూర్తి కాలేదు.
17 ఇప్పుడిక, తమకి సమ్మతమైతే, చక్రవర్తిగారి ఆధికారికా చారిత్రక పత్రాలను గాలించండి. యెరూషలేములో దేవాలయం నిర్మించుమని కోరెషు చక్రవర్తి ఆజ్ఞ జారీచేశారన్న మాట నిజమేనేమో పరిశీలించండి. తర్వాత తమరీ విషయంలో తీసుకున్న నిర్ణయమేమిటో దయచేసి మాకొక లేఖద్వారా తెలియజేయండి.
* 5:1 హగ్గయి హగ్గయి 1:1 చూడండి. 5:1 ఇద్దో కొడుకు జెకర్యా జెకర్యా 1:1 చూడండి.