10
మిడతలు
యెహోవా మోషేతో, “ఫరో దగ్గరకు వెళ్లు. నేనే అతణ్ణి అతని అధికారులని మొండిగా చేస్తాను. నా మహత్తర అద్భుతాలను నేను వాళ్లకు చూపించాలని నేనే ఇలా చేసాను. అలాగే ఈజిప్టులో నేను చేసిన అద్భుతాలు, ఇతర మహత్యాల విషయం మీరుకూడ మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు చెప్పవచ్చని వీటిని చేసాను. అప్పుడు నేనే యెహోవానని మీరంతా తెల్సుకొంటారు” అని చెప్పాడు.
మోషే, అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లారు. “ ‘ఎంత కాలం నీవు నాకు లోబడకుండా తిరస్కరిస్తావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల యెహోవా దేవుడు అంటున్నాడు అని వారు అతనితో చెప్పారు. నీవు నా ప్రజలను వెళ్లనివ్వకపోతే, రేపు నీ దేశంలోకి మిడతలను తీసుకొస్తాను. నేల అంతా మిడతలతో నిండి పోతుంది. నీకు నేల కనబడనంత విస్తారంగా మిడతలు ఉంటాయి. వడగళ్ల వానలో మిగిలింది యింకేమైనా ఉంటే, దాన్ని కాస్తా మిడతలు తినేస్తాయి. పొలాల్లో చెట్ల ఆకులన్నిటినీ మిడతలు తినేస్తాయి. మీ ఇండ్లు మీ అధికారుల ఇండ్లు, ఈజిప్టులో ఉన్న మొత్తం ఇండ్లన్నీ మిడతలతో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు, తాతలు ఎన్నడైనా చూచిన వాటికంటే ఎక్కువ మిడతలు ఉంటాయి. ఈజిప్టులో మనుష్యులు నివాసం మొదలు పెట్టినప్పటినుండి ఎన్నడైనా ఉన్న మిడతల కంటె ఎక్కువ మిడతలు ఉంటాయి.’ ” తరువాత మోషే ఫరోను విడిచి, వెనుదిరిగాడు.
“ఇంకెన్నాళ్లు ఈ మనుష్యులు మనల్ని చిక్కుల్లో పెడతారు. మగవాళ్లందర్నీ వారి యెహోవా దేవుడ్ని ఆరాధించుకొనేందుకు వెళ్లనివ్వు. నీవు వాళ్లను వెళ్లనియ్యకపోతే, నీవు గుర్తించక ముందే, ఈజిప్టు నాశనం అయిపోతుంది” అని ఫరో అధికారులు అతనితో చెప్పారు.
కనుక మోషే అహరోనులను తన దగ్గరకు మళ్లీ తీసుకురమ్మని ఫరో తన అధికారులతో చెప్పాడు. “మీరు వెళ్లి మీ యెహోవా దేవుడ్ని ఆరాధించండి, అయితే ఎవరెవరు వెళ్లుచున్నది నాకు సరిగ్గా చెప్పండి?” అన్నాడు ఫరో.
“మా ప్రజలలో పడుచువాళ్లు, వృద్ధులు వెళ్తారు! మాతోబాటు మా కుమారులు మా కుమార్తెలను, మా గొర్రెల్ని మా పశువుల్ని కూడ తీసుకుపోతాం. ఇది మా యెహోవా పండుగ గనుక మేమంతా వెళ్తాము” అని జవాబిచ్చాడు మోషే.
10 ఫరో వాళ్లతో, “నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని వెళ్లనిచ్చే ముందు యెహోవా నిజంగా మీతో ఉండి తీరాలి. చూస్తోంటే, 11 మీరేదో దుర్మార్గం తలపెట్టి నట్లుంది. మగాళ్లు వెళ్లి యెహోవాను ఆరాధించవచ్చు. అసలు మీరడిగింది అదే. అంతేగాని మీరంతా మొత్తం వెళ్లి పోయేందుకు వీల్లేదు” అని చెప్పి మోషే, అహరోనులను ఫరో పంపించి వేసాడు.
12 యెహోవా మోషేతో “ఈజిప్టు మీద నీ చేయి ఎత్తు, మిడతలు వచ్చేస్తాయి. ఈజిప్టు మొత్తం నేలమీద మిడతలు ఆవరించేస్తాయి. వడగళ్లు నాశనం చేయకుండా మిగిలిన పంట అంతటినీ ఆ మిడతలు తినేస్తాయి” అని చెప్పాడు.
13 కనుక మోషే ఈజిప్టు దేశం మీద తన కర్ర ఎత్తగా తూర్పు నుండి బలంగా గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ రోజంతా, రాత్రి అంతా గాలి వీచింది. తెల్లవారేటప్పటికి ఈజిప్టు అంతటా మిడతల్ని తెచ్చి పడేసింది ఆ గాలి.
14 మిడతలు ఈజిప్టు దేశంలోకి ఎగిరివచ్చి నేలమీదంతటా కమ్మాయి. ఈజిప్టులో ఇది వరకు ఎన్నడూ లేనన్ని మిడతలు వచ్చేసాయి. పూర్వం ఎన్నడూ అన్ని మిడతలు ఉండలేదు. 15 నేల అంతా మిడతలు కమ్మేశాయి. దేశం అంతా చీకటి అయిపోయింది. వడగళ్లు నాశనం చేయకుండా మిగిల్చిన చెట్లలో ప్రతి ఫలాన్ని, నేలమీద ఉన్న ప్రతి మొక్కనూ మిడతలు తినేసాయి. మొత్తం ఈజిప్టులో ఎక్కడేగాని ఏ చెట్లకూ మొక్కలకూ ఒక్క ఆకు గూడ మిగల్లేదు.
16 వెంటనే మోషే అహరోనులను పిలిపించాడు ఫరో, “మీకు, మీ యెహోవా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసాను. 17 ఈ సారికి నా పాపాలు క్షమించండి. నా దగ్గర్నుండి ఈ మృత్యువును (మిడతలను) తీసివేయమని యెహోవాను అడగండి” అని చెప్పాడు ఫరో.
18 మోషే ఫరో దగ్గరనుండి వెళ్లిపోయి యెహోవాను ప్రార్థించాడు. 19 కనుక యెహోవా ఆ గాలిని మార్చేసాడు. పడమటినుండి గాలి బలంగా వీచేటట్టు చేసాడు. ఆ గాలి మిడతలన్నింటినీ ఎర్ర సముద్రంలోకి కొట్టేసింది. ఈజిప్టులో ఒక్క మిడతకూడ మిగల్లేదు. 20 అయితే యెహోవా ఫరోను మాత్రం ఇంకా మొండిగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో వెళ్లనివ్వలేదు.
అంధకారం
21 అప్పుడు యెహోవా, “నీ చెయ్యి పైకెత్తు, ఈజిప్టు చీకటిమయం అవుతుంది. చీకటిలో తడవులాడేటంత కటిక చీకటి కమ్ముతుంది” అని మోషేతో చెప్పాడు.
22 కనుక మోషే తన చేతిని పైకి ఎత్తగానే ఒక చీకటి మేఘం ఈజిప్టును ఆవరించేసింది. ఈజిప్టులో మూడు రోజుల పాటు ఆ చీకటి ఉండిపోయింది. 23 ఎవ్వరూ ఎవ్వర్నీ చూడలేక పోయారు. మూడు రోజుల వరకు ఎవ్వరూ వాళ్ల స్థానాలు విడిచి పెట్టలేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే ప్రదేశాలన్నింటిలో వెలుగు ఉంది.
24 ఫరో మళ్లీ మోషేను పిలిపించి, “వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీరు మీ పిల్లల్ని మీతో కూడా తీసుకొని వెళ్లొచ్చు. కాని మీ గొర్రెల్ని, పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టిండి” అన్నాడు.
25 “మా గొర్రెల్ని, పశువుల్ని మాతో కూడ తీసుకొని వెళ్లడమేకాదు, మేము వెళ్లేటప్పుడు మీరు కూడ కానుకలు, బలి అర్పణలు మాకు యివ్వాలి. మా యెహోవా దేవుడ్ని ఆరాధించడానికి ఈ బలులను మేము వాడుకొంటాము. 26 యెహోవాను ఆరాధించేందుకు మా జంతువుల్ని కూడ మేము తీసుకొని వెళ్తాము. ఒక్క డెక్క కూడ ఇక్కడ విడిచి పెట్టబడదు. యెహోవాను ఆరాధించేందుకు ఏమేమి కావాలో సరిగ్గా మాకూ ఇంకా తెలియదు. మేము వెళ్తున్న చోటికి చేరిన తర్వాతే అది మాకు తెలుస్తుంది. అందుచేత యివన్నీ మేము తీసుకెళ్లాల్సిందే” అని మోషే అన్నాడు.
27 యెహోవా ఫరోను ఇంకా మొండిగా చేసాడు. అందుచేత ఫరో ప్రజలను వెళ్లనివ్వలేదు. 28 అప్పుడు ఫరో మోషేతో, “పో, నా దగ్గర్నుండి వెళ్లిపో! నీవు మళ్లీ ఇక్కడకు రాకూడదు. నన్ను కలుసుకోవాలని మరోసారి వస్తే, నీవు చస్తావు” అన్నాడు.
29 “మోషే ఫరోతో, నీవు చెప్పింది నిజమే. నిన్ను చూడ్డానికి నేను మళ్లీ రాను” అని చెప్పాడు.