40
పవిత్ర గుడారాన్ని మోషే నిలబెట్టాడు
1 అప్పుడు మోషేతో యెహోవా యిలా చెప్పాడు:
2 “మొదటి నెల మొదటి రోజున పవిత్ర గుడారాన్ని నిలబెట్టు.
3 ఒడంబడిక పెట్టెను సమావేశ పవిత్ర గుడారంలో పెట్టు. తెరతో ఆ పెట్టెను కప్పివేయి.
4 తర్వాత బల్లను లోపలికి తీసుకురా. బల్లమీద ఉండాల్సిన వస్తువులను దాని మీద ఉంచు. తర్వాత దీపస్తంభాన్ని గుడారంలో ఉంచు.
5 ధూపార్పణ కోసం బంగారపు వేదికను గుడారంలో పెట్టు, ఒడంబడిక పెట్టెకు ముందర ఈ వేదికను పెట్టు. తర్వాత పవిత్ర గుడారపు ప్రవేశానికి తెరవేయి.
6 “పవిత్ర గుడారపు (సన్నిధి గుడారం) ప్రవేశానికి ముందర దహనబలి అర్పణల పీఠాన్ని ఉంచు.
7 ఈ బలిపీఠానికి, సన్నిధి గుడారానికి మధ్య గంగాళం ఉంచు. గంగాళంలో నీళ్లు పోయాలి.
8 ఆవరణ చుట్టూ తెరలు తగిలించాలి. తర్వాత ఆవరణ ప్రవేశం దగ్గర తెరవేయాలి.
9 “అభిషేకతైలం ఉపయోగించి పవిత్ర గుడారాన్ని, అందులో ఉండే సమస్తాన్ని అభిషేకించు. ఈ వస్తువుల మీద నీవు తైలం పోసినప్పుడు వాటిని నీవు పవిత్రం చేస్తావు.
10 దహన బలులను దహించే బలిపీఠాన్ని, అభిషేకించు, బలిపీఠం మీద ఉండే సమస్తాన్నీ అభిషేకించు. ఆ బలిపీఠాన్ని నీవు పవిత్రం చేస్తావు. అది అతి పరిశుద్ధంగా ఉంటుంది.
11 తర్వాత గంగాళాన్ని, దాని కింద దిమ్మను అభిషేకించు. ఆ వస్తువులను పవిత్రం చేసేందుకు ఇలా చేయి.
12 “అహరోనును, అతని కుమారులను సన్నిధి గుడారం ప్రవేశం దగ్గరకు తీసుకురా. నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి.
13 తర్వాత అహరోనుకు ప్రత్యేక వస్త్రాలను తొడిగించాలి. తైలంతో అతన్ని అభిషేకించి అతన్ని పవిత్రం చెయ్యి. అప్పుడే అతడు యాజకుడుగా సేవచేయగలడు.
14 తర్వాత అతని కుమారులకు వస్త్రాలు తొడిగించాలి.
15 వాళ్ల తండ్రిని నీవు అభిషేకించినట్టే కుమారులను కూడా అభిషేకించు. అప్పుడు వాళ్లు కూడా యాజకులుగా నా సేవ చేయగలరు. వాళ్లను నీవు అభిషేకించినప్పుడు వాళ్లు యాజకులవుతారు. రాబోయే కాలమంతా ఆ కుటుంబము యాజకులుగా కొనసాగుతారు.”
16 మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం అతడు చేసాడు.
17 కనుక సరైన సమయంలో పవిత్రగుడారం నిలబెట్టబడింది. వారు ఈజిప్టు విడిచిన తర్వాత అది రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు.
18 యెహోవా చెప్పినట్టే పవిత్ర గుడారాన్ని మోషే నిలబెట్టాడు. అతడు దిమ్మలను ముందుగా కింద పెట్టాడు. తర్వాత ఆ దిమ్మల మీద చట్రాలను పెట్టాడు. తర్వాత అతడు కమ్ములను అమర్చి, స్తంభాలను నిలబెట్టాడు.
19 ఆ తర్వాత పవిత్ర గుడారం కప్పును మోషే నిలబెట్టాడు. తర్వాత గుడారపు కప్పు మీద మరో కప్పును అతడు వేసాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటినీ చేసాడు.
20 దేవుని ఆజ్ఞలు రాయబడ్డ రాతి పలకలను ఒడంబడిక పెట్టెలో మోషే పెట్టాడు. ఆ పెట్టెకు కర్రలను మోషే పెట్టాడు. తర్వాత అతడు ఆ పెట్టెకు మూత పెట్టాడు.
21 తర్వాత ఆ పవిత్ర పెట్టెను గుడారంలోకి మోషే తీసుకు వచ్చాడు. సరైన చోట అతడు తెర వేసాడు. ఇది సన్నిధి గుడారంలో పవిత్ర పెట్టెను మరుగు చేస్తుంది. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే వీటన్నింటినీ చేసాడు.
22 తర్వాత సన్నిధి గుడారపు బల్లను మోషే పెట్టాడు. గుడారం ఉత్తరాన అతడు దీన్ని పెట్టాడు. (పవిత్ర స్థలంలో) తెరముందర అతడు దీన్ని పెట్టాడు.
23 తర్వాత యెహోవా సన్నిధిలో బల్ల మీద రొట్టెను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు అతడు దీన్ని చేసాడు.
24 తర్వాత మోషే దీపస్తంభాన్ని సన్నిధి గుడారంలో పెట్టాడు. గుడారం దక్షిణాన, బల్లకు ఎదుట అతడు దీపస్తంభం పెట్టాడు.
25 తర్వాత యెహోవా సన్నిధిలో దీపస్తంభం మీద దీపాలను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు.
26 తర్వాత బంగారపు ధూపవేదికను సన్నిధి గుడారంలో మోషే పెట్టాడు. ఆ వేదికను తెరముందర అతడు పెట్టాడు.
27 తర్వాత ఆ బంగారు బలిపీఠం మీద సువాసనగల పరిమళ ధూపం అతడు వేసాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు.
28 తర్వాత పవిత్ర గుడారం ప్రవేశానికి మోషే తెర వేసాడు.
29 పవిత్ర గుడారం, సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర దహన బలులను దహించే బలిపీఠాన్ని మోషే పెట్టాడు. అప్పుడు ఒక దహన బలి అర్పణను ఆ బలిపీఠం మీద మోషే అర్పించాడు. యెహోవాకు ధాన్యార్పణ కూడ అతడు అర్పించాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటినీ చేసాడు.
30 తర్వాత మోషే సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య గంగాళం ఉంచాడు, కడుక్కొనేందుకు గంగాళంలో నీళ్లు పోసాడు.
31 మోషే, అహరోను, అహరోను కుమారులు వారి కాళ్లు చేతులు కడుక్కొనేందుకు ఈ గంగాళాన్ని ఉపయోగించారు.
32 వారు సన్నిధి గుడారంలో ప్రవేశించినప్పుడల్లా కాళ్లు కడుక్కొనేవారు. వాళ్లు బలిపీఠాన్ని సమీపించిన ప్రతీసారీ వాళ్లను వాళ్లు కడుక్కొనేవారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్లు ఇలా చేసారు.
33 తర్వాత గుడారపు ఆవరణలో తెరలను మోషే తగిలించాడు. మోషే గుడారపు ఆవరణలో బలిపీఠాన్ని పెట్టాడు. తర్వాత అతడు ఆవరణ ప్రవేశం దగ్గర తెరను వేసాడు. కనుక అతడు చేయాలని చెప్పి యెహోవా తనకు అప్పగించిన పని అంతా మోషే ముగించాడు.
యెహోవా మహిమ
34 అంతా ముగించిన తర్వాత సన్నిధి గుడారాన్ని ఒక మేఘం ఆవరించింది. యెహోవా మహిమ ఆ పవిత్ర గుడారాన్ని నింపివేసింది.
35 ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచిపోగా యెహోవా మహిమ దాన్ని నింపేసింది. కనుక మోషే ఆ సన్నిధి గుడారంలో ప్రవేశించలేక పోయాడు.
36 (ప్రజలు ఎప్పుడు సాగిపోవాల్సిందీ చూపెట్టిన మేఘం) పవిత్ర గుడారంనుండి మేఘం పైకి లేచినప్పుడు, ప్రజలు ప్రయాణం మొదలు పెట్టేవారు.
37 అయితే ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచి ఉన్నప్పుడు ప్రజలు సాగిపోయే ప్రయత్నం చేయలేదు. మేఘం లేచేంతవరకు వాళ్లు ఆ స్థలంలోనే ఉండిపోయారు.
38 కనుక యెహోవా మేఘం పగటివేళ పవిత్ర గుడారం మీద నిలిచి ఉండేది. మరియు రాత్రివేళ ఆ మేఘంలో అగ్ని ఉండేది. కనుక ఇశ్రాయేలు ప్రజలంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘాన్ని చూడగలిగారు.