19
లోతు అతిథులు
ఆ సాయంకాలం, ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ పట్టణం వచ్చారు. పట్టణ ద్వారం దగ్గర కూర్చొని ఉన్న లోతు ఆ దేవదూతల్ని చూశాడు. లోతు లేచి, దేవదూతల దగ్గరకు వెళ్లి, సాష్టాంగ పడ్డాడు. లోతు ఇలా అన్నాడు: “అయ్యలారా, దయతో నా ఇంటికి రండి, నేను మీకు సేవ చేస్తాను. అక్కడ మీరు మీ కాళ్లు కడుక్కొని, రాత్రి బస చేయవచ్చును. ఆ తరువాత మీరు మీ ప్రయాణం కొనసాగించవచ్చు.”
“లేదు. ఈ రాత్రికి మేము ఈ ఖాళీ స్థలంలో బస చేస్తాం” అన్నారు దేవదూతలు.
కాని, వారిని తన ఇంటికి రమ్మని లోతు బలవంతము చేసెను. అంచేత లోతు ఇంటికి వెళ్లడానికి దేవదూతలు ఒప్పుకొన్నారు. వారు ఇంటికి వెళ్లగానే, వారు తినేందుకు లోతు భోజనం తయారు చేసాడు, వాళ్ల కోసం రొట్టెలు చేసాడు. లోతు వండిన భోజనం దేవదూతలు తిన్నారు.
ఆ రాత్రి పండుకొనక ముందు, పట్టణం నలుమూలల నుండి పురుషులు చిన్నలూ, పెద్దలూ లోతు ఇంటికి వచ్చారు. సొదొమ ప్రజలు లోతు ఇంటిని చుట్టుముట్టి, లోతును పిల్చారు. “ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు మనుష్యులు (దేవదూతలు) ఎక్కడ? వాళ్లను బయటకు మా దగ్గరకు తీసుకురా. మేము వాళ్లను సంభోగించాలి” అన్నారు.
లోతు బయటకు వెళ్లి, తన వెనుకగా తలుపు మూసాడు. “వద్దు, నా సోదరులారా, దయచేసి ఈ చెడ్డపని మీరు చేయవద్దని బతిమాలాడుతున్నాను” అని ఆ మనుష్యులతో చెప్పాడు. “చూడండి, నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ఇదివరకు ఎన్నడూ ఏ పురుషునివద్ద పడుకోలేదు. నా కూతుళ్లను మీకు ఇస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు వాళ్లను చేసుకోండి. కాని దయచేసి ఈ మనుష్యులను మాత్రం ఏమీ చేయకండి. వీళ్లు నా ఇంటికి వచ్చారు, నేను వాళ్లను కాపాడాలి” లోతు ఆ మనుష్యులతో అన్నాడు.
“దారిలోనుంచి తప్పుకో” అంటూ ఇంటి చుట్టూ ఉన్నవాళ్లంతా అరిచారు. “ఈ లోతు ఒక యాత్రికుడుగా మన పట్టణం వచ్చాడు. ఇప్పుడు మనకే నీతులు చెబుతున్నాడు” అని వాళ్లలో వాళ్లు చెప్పుకొన్నారు. అప్పుడు వాళ్లు లోతుతో, “వాళ్లకు చేసే వాటికంటే ఎక్కువ కీడు నీకు చేస్తాం” అని చెప్పారు కనుక ఆ మనుష్యులు లోతు దగ్గరకు మరింత సమీపంగా వెళ్లి, తలుపు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు.
10 అయితే లోతు ఇంటిలో వున్న ఆ యిద్దరు మనుష్యులు తలుపు తెరచి లోతును లోపలికి లాగేసారు. తర్వాత వాళ్లు తలుపు మూసేసారు. 11 ద్వారమునకు వెలుపల ఉన్న మనుష్యులు గ్రుడ్డివాళ్లు అయ్యేటట్టు ఆ దేవదూతలు చేసారు. కనుక ఇంటిలోనికి ప్రవేశించాలని ప్రయత్నించిన ఆ మనుష్యులు, పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అందరు గుడ్డివాళ్లయిపోయి ద్వారం ఎక్కడుందో కనుక్కోలేక పోయారు.
సొదొమ నుండి తప్పించుకోవటం
12 “మీ కుటుంబాలకు చెందిన వాళ్లు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉన్నారా? అల్లుళ్లు, కుమారులు, కుమార్తెలు, లేక ఇంకెవరైనా మీ కుటుంబంలో ఉన్నారా? మీ కుటుంబానికి చెందిన వాళ్లు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉంటే, వాళ్లను ఇప్పుడే ఈ చోటు విడిచిపెట్టమని చెప్పాలి. 13 మేము ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాం. ఈ పట్టణంలో ఉన్న దుష్టత్వాన్ని గూర్చి యెహోవా అంతా చూశాడు. కనుక ఈ పట్టణాన్ని నాశనం చేయటానికి యెహోవా మమ్ముల్ని పంపించాడు” అని ఆ ఇద్దరు మనుష్యులు లోతుకు చెప్పారు.
14 కనుక లోతు బయటకు వెళ్లి, తన కుమార్తెలను పెళ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాట్లాడాడు. “త్వరగా ఈ పట్టణం వదిలిపెట్టిండి. యెహోవా దీన్ని త్వరగా నాశనం చేస్తాడు” అన్నాడు లోతు. అయితే లోతు పరిహాసం చేస్తున్నాడనుకొన్నారు వాళ్లు.
15 మర్నాడు సూర్యోదయాన దేవదూతలు లోతును తొందరపెట్టి ఈలాగన్నారు. “చూడు, ఈ పట్టణం శిక్షించబడుతుంది. కనుక ఇంక నీతో ఉన్న నీ భార్యను, నీ యిద్దరు కుమార్తెలను తోడుకొని ఈ స్థలం విడిచిపెట్టు. అప్పుడు ఈ పట్టణంతోబాటు నీవు నాశనంగాకుండా ఉంటావు.”
16 కాని, లోతు కలవరపడి, వెళ్లిపోయేందుకు త్వరపడలేదు. కనుక ఆ ఇద్దరు మనుష్యులు, (దేవదూతలు) లోతు, అతని భార్య, అతని యిద్దరు కుమార్తెల చేతులు పట్టుకొన్నారు. లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుంచి క్షేమంగా బయటకు నడిపించారు. లోతు, అతని కుటుంబం యెడల యెహోవా దయ చూపెట్టాడు. 17 అందుచేత లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. వారు బయటకు వచ్చాక, ఆ మనుష్యులలో ఒకరు ఇలా అన్నారు: “ఇప్పుడు మీ ప్రాణం కాపాడుకోవటానికి పారిపొండి. మళ్లీ వెనక్కు తిరిగి పట్టణం వైపు చూడకండి. లోయలో ఎక్కడా ఆగకండి. పర్వతాలు చేరేంత వరకు పరుగెత్తండి. అలా చేయకపోతే, పట్టణంతో పాటు మీరూ నాశనం అయిపోతారు.”
18 అయితే ఆ ఇద్దరు మనుష్యులతో లోతు ఇలా చెప్పాడు: “అయ్యలారా, అంత దూరం పరుగెత్తమని నన్ను బలవంతం చేయవద్దు. 19 మీ సేవకుడైన నా మీద మీరు చాలా దయ చూపించారు. నన్ను రక్షించటం మీరు చూపించిన మహా గొప్ప దయ. కానీ, నేను పర్వతాల వరకు పరుగెత్తలేను. నేను మరీ నిదానమైతే, ఆ నగరానికి సంభవించవలసిన శిక్ష నాకు తగిలి నేను మరణిస్తాను. 20 అయితే చూడండి, ఇక్కడికి సమీపంలో ఒక చిన్న ఊరుంది. నన్ను ఆ ఊరికి పారిపోనివ్వండి, అక్కడ నా ప్రాణం రక్షించబడుతుంది.” 21 దేవదూత లోతుతో, “సరే మంచిది, అలాగే కానివ్వు. నీవు వెళ్తున్న ఆ ఊరిని నేను నాశనం చేయను. 22 అయితే అక్కడికి వేగంగా పరుగెత్తు. నీవు క్షేమంగా ఆ ఊరు చేరేంతవరకు, సొదొమను నేను నాశనం చేయను” అనెను. (ఆ ఊరు చిన్నది గనుక అది సోయరు అని పిలువబడింది.)
సొదొమ, గొమొర్రాల నాశనం
23 సూర్యోదయం అయ్యేటప్పటికి లోతు సోయరులో ప్రవేశిస్తున్నాడు. 24 సొదొమ గొమొర్రాలను యెహోవా నాశనం చేయటం మొదలు బెట్టాడు. ఆకాశం నుండి అగ్ని గంధక వర్షాన్ని యెహోవా పంపించాడు. 25 కనుక ఆ పట్టణాలను యెహోవా నాశనం చేసాడు, మరియు ఆ లోయను, ఆ నగరాల్లో నివసిస్తోన్న ప్రజలందరిని, చెట్లన్నింటిని ఆయన నాశనం చేశాడు.
26 వారు పారిపోతూ ఉండగా లోతు భార్య వెనుకకు తిరిగి పట్టణం వైపు చూసింది. ఆమె వెనుకకు తిరిగిచూడగానే ఉప్పుస్తంభం అయిపోయింది.
27 ఆ ఉదయమే పెందలకడ అబ్రాహాము లేచి నిన్న యెహోవా ఎదుట నిలిచిన స్థలానికి వెళ్లాడు. 28 అబ్రాహాము సొదొమ గొమొర్రాలవైపు కిందుగా చూశాడు. ఆ లోయ ప్రదేశమంతా అబ్రాహాము చూశాడు. ఆ చోటనుండి విస్తారమైన పొగలు రావటం చూశాడు. అది ఒక మహాగొప్ప మంటనుండి లేచిన పొగలా కనబడింది.
29 ఆ లోయలోని పట్టణాలను దేవుడు నాశనం చేసాడు. అయితే దేవుడు ఇది చేసినప్పుడు, అబ్రాహాము అడిగిన దానిని ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. లోతు ప్రాణాన్ని దేవుడు రక్షించాడు, కాని లోతు నివసించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేసాడు.
లోతు, అతని కుమార్తెలు
30 సోయరులో జీవితం గడిపేందుకు లోతు భయపడ్డాడు. కనుక అతడు, అతని ఇద్దరు కుమార్తెలు వెళ్లి పర్వతాల్లో నివాసం చేశారు. అక్కడ ఒక గుహలో వారు నివసించారు. 31 ఒక రోజున పెద్ద కుమార్తె చిన్న కుమార్తెతో ఇలా చెప్పింది: “భూమిమీద అంతటా స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకొని కుటుంబం కలిగి ఉంటారు. కానీ మనం పెళ్లి చేసుకొని పిల్లలు కలిగేందుకు ఇక్కడ ఎవ్వరూ మగవాళ్లు లేరు. మన తండ్రి ముసలివాడు. 32 కానీ మన కుటుంబం సాగాలి గనుక మనకు పిల్లలు పుట్టడం కోసం మనం మన తండ్రిని ఉపయోగించుకోవాలి. మనం మన తండ్రి దగ్గరకు వెళ్లి, ఆయనతో పాటు మధుపానం చేసి, ఆయనకు మత్తు కలిగిద్దాం. అప్పుడు మనం ఆయనతో పండుకోవచ్చు.”
33 ఆ రాత్రి ఇద్దరు అమ్మాయిలో తమ తండ్రి దగ్గరకు వెళ్లి, అతనికి ద్రాక్షారసాన్ని తాగించి మత్తుగా చేశారు. అప్పుడు పెద్దమ్మాయు తన తండ్రి పడక మీదకు వెళ్లి, అతనితో లైంగికంగా కలసికొన్నది. లోతు తాగిన మత్తులో ఉన్నాడు గనుక, ఆమె ఎప్పుడు తనతో పండుకొన్నది, లేచి వెళ్లినది, అతనికి తెలియలేదు.
34 మర్నాడు పెద్దమ్మాయి చిన్నమ్మాయితో చెప్పింది: “గత రాత్రి నా తండ్రితో నేను పండుకొన్నాను. ఈ రాత్రి మళ్లీ మనం ఆయనకు ద్రాక్షారసముతో మత్తు కలిగిద్దాం. అప్పుడు నీవు ఆయన పడక మీదకి వెళ్లి ఆయనతో లైంగికంగా కలసికొనవచ్చు. ఈ విధంగా మన కుటుంబం అంతం కాకుండా పిల్లలు పుట్టేందుకు మనం మన తండ్రిని ఉపయోగించుకోవచ్చు.” 35 కనుక ఆ రాత్రి తమ తండ్రికి మత్తు ఎక్కేంతవరకు ఆ ఇద్దరు అమ్మాయిలూ తమ తండ్రికి ద్రాక్షారసాన్ని తాగించారు. అప్పుడు చిన్నమ్మాయి అతని పడక మీదకి వెళ్లి అతనితో పడుకొంది. అతని కుమార్తె అతనితో పండుకొన్నట్టు లోతుకు మరల తెలియలేదు.
36 అందుచేత లోతు కుమార్తెలు ఇద్దరూ గర్భవతులయ్యారు. వారి తండ్రి వారి శిశువులకు తండ్రి. 37 పెద్ద కుమార్తెకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె ఆ కుమారునికు మోయాబు* అని పేరు పెట్టింది. నేటికి జీవిస్తోన్న మోయాబు ప్రజలందరికి అతడు తండ్రి. 38 చిన్న కుమార్తెకు కూడ ఒక కొడుకు పుట్టాడు. ఆమె తన కుమారునికి బెన్నమ్మి అని పేరు పెట్టింది. నేటికి జీవిస్తోన్న అమ్మనీ ప్రజలందిరికి బెన్నమ్మి తండ్రి.
* 19:37 మోయాబు “తండ్రి ద్వారా” అని దీని అర్థం. 19:38 బెన్నమ్మి “నా తండ్రి కుమారుడు” అని దీని అర్థం.