42
కలలు నిజం అయ్యాయి
1 ఈ సమయంలో కనాను దేశంలోను కరువు ప్రబలుతోంది. అయితే ఈజిప్టులో ధాన్యం ఉన్నట్టు యాకోబు తెలుసుకొన్నాడు: కనుక యాకోబు తన కుమారులతో ఇలా చెప్పాడు. “ఏమీ చేయకుండా ఇక్కడ ఎందుకు మనం కూర్చోవటం?
2 ఈజిప్టులో అమ్మకానికి ధాన్యం ఉన్నట్టు నేను విన్నాను. అందుచేత మనం అక్కడికి వెళ్లి మనం తినేందుకు ధాన్యం కొనుక్కోవాలి. అప్పుడు మనం చావకుండా బతుకుతాం.”
3 కనుక యోసేపు సోదరులు పదిమంది ధాన్యం కొనేందుకు ఈజిప్టు వెళ్లారు.
4 బెన్యామీనును యాకోబు పంపలేదు. (బెన్యామీను ఒక్కడే యోసేపుకు స్వంత తమ్ముడు). బెన్యామీనుకు ఏదైనా కీడు సంభవిస్తుందేమోనని యాకోబు భయపడ్డాడు.
5 కనానులో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎంతోమంది ప్రజలు కనానునుండి ఈజిప్టు వెళ్లారు. వారిలో ఇశ్రాయేలు కుమారులు కూడ ఉన్నారు.
6 ఆ సమయంలో ఈజిప్టు అంతటి మీద యోసేపు పాలకుడు. ఈజిప్టుకు వచ్చిన ప్రజలకు ధాన్యం అమ్మకం చేసేందుకు గాను నియమింపబడిన అధికారి యోసేపు. అయితే యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చి అతని ఎదుట సాష్టాంగపడ్డారు.
7 యోసేపు తన సోదరులను చూసాడు, వారెవరయిందీ అతనికి తెలుసు, కానీ యోసేపు వారిని ఎరుగనట్టే వారితో మాట్లాడాడు. అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. “ఎక్కడనుండి వచ్చారు మీరు?” అని అతడు అడిగాడు.
ఆ సోదరులు “మేము కనాను దేశంనుండి వచ్చాం. ఆహారం కొనేందుకు మేము వచ్చాం” అని జవాబిచ్చారు.
8 ఈ మనుష్యులు తన సోదరులని యోసేపుకు తెలుసును. కానీ అతను ఎవరయిందీ వారికి తెలియదు.
9 అతని అన్నల విషయంలో అతనికి వచ్చిన కలలను యోసేపు జ్ఞాపకం చేసుకొన్నాడు.
యోసేపు తన అన్నలతో, “మీరు ఆహారం కొనేందుకు రాలేదు. మీరు గూఢచారులు. మా బలహీనతలు తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు.
10 అయితే ఆ సోదరులు, “లేదండి అయ్యా, మీ సేవకులంగా మేము వచ్చాం. ఆహారం కొనేందుకు మాత్రమే మేం వచ్చాం.
11 మేమంతా అన్నదమ్మలం మా అందరి తండ్రి ఒక్కడే. మేము నిజాయితీగల మనుష్యులం, మేము గూఢచారలం కాము. ఆహారం కొనేందుకు మాత్రమే మేం వచ్చాం” అని అతనితో చెప్పారు.
12 అప్పుడు యోసేపు, “లేదు, లేదు, ఏ విషయంలో మేం బలహీనులమో తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు వారితో.
13 ఆ సోదరులు అన్నారు: “లేదు, మేమంతా అన్నదమ్ములం. మా కుటుంబంలో మొత్తం పన్నెండుమంది సోదరులం. మా అందరికీ తండ్రి ఒక్కడే. మా అందరిలో చిన్న తమ్ముడు ఇంకా ఇంటి దగ్గర మా తండ్రితోనే ఉన్నాడు. మరో తమ్ముడు చాలకాలం క్రిందటే చనిపోయాడు. మీ ముందర మేం సేవకుల్లాంటి వాళ్లం. మేము కనాను దేశం వాళ్లం.”
14 అయితే యోసేపు వారితో ఇలా అన్నాడు: “లేదు, నేను అన్నదే సరియైనట్టు నాకు తెలుస్తోంది. మీరు గూఢచారులు.
15 అయితే మీరు సత్యమే చెబతున్నట్టు మిమ్మల్ని రుజువు చేయనిస్తాను. మీ చిన్నతమ్ముడు ఇక్కడికి వచ్చేంతవరకు మిమ్మల్ని వదలి పెట్టనని ఫరో పేరు మీద ప్రమాణం చేసి చెబతున్నాను మిమ్మల్ని వదలిపెట్టనని.
16 కనుక మీలో ఒకరు తిరిగి వెళ్లి మీ చిన్న తమ్ముడ్ని ఇక్కడికి తీసుకొని రావాలి. అంతవరకు మిగిలిన వారు ఇక్కడే జైల్లో ఉండాలి. మీరు సత్యం చెబతున్నారో లేదో మేం చూస్తాం. అయితే మీరు గూఢచారులనే నా నమ్మకం.”
17 తర్వాత యోసేపు వాళ్లందర్నీ మూడు రోజుల పాటు చెరసాలలో పెట్టాడు.
షిమ్యోను బందీగా వుంచబడుట
18 మూడు రోజుల తర్వాత వారితో యోసేపు ఇలా అన్నాడు, “నేను దేవునికి భయపడేవాణ్ణి. అంచేత మీరు సత్యమే చెబతున్నారని రుజువు చేసేందుకు మీకు ఒక అవకాశం ఇస్తాను. ఇలా మీరు చేస్తే నేను మిమ్మల్ని బతకనిస్తాను.
19 మీరు నమ్మకమైన మనుష్యులైతే, మీ సోదరులలో ఒకరు ఇక్కడ జైల్లో ఉండాలి. మిగిలినవారు మీ వాళ్లకోసం ధాన్యం తీసుకొని వెళ్లవచ్చు.
20 అప్పుడు మీ చిన్న తమ్ముడ్ని ఇక్కడికి తీసుకొని రండి. ఈ విధంగా, మీరు సత్యం చెబతున్నారేమో నేను తెలుసుకొంటాను.”
ఆ సోదరులు దీనకి ఒప్పుకొన్నారు.
21 “మన చిన్న తమ్ముడికి మనం చేసిన కీడు మూలంగా శిక్ష అనుభవిస్తున్నాం. అతడు కష్టంతో ఉండటం మనం కళ్లారా చూశాం. రక్షించమని అతడు మనల్ని బతిమలాడాడు. కానీ వినటానికి గూడ మనం నిరాకరించాం. అందుకే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం” అని వాళ్లలో వారు చెప్పుకొన్నారు.
22 అప్పుడు రూబేను, “ఆ పిల్లవానికి మీరేమి కీడు చేయకండి అని నేను మీతో చెప్పాను కాని మీరు నా మాట వినకపోయారు. కనుక అతని మరణం మూలంగానే ఇప్పుడు మనం శిక్ష పొందుతున్నాం,” అని వాళ్లతో చెప్పాడు.
23 యోసేపు తన సోదరులతో మాట్లాడేందుకు ఒక అనువాదకుడ్ని వాడుకొన్నాడు. అందుచేత వారి భాష యోసేపు గ్రహించినట్లు ఆ సోదరులకు తెలియదు. కానీ వారు చెప్పిన ప్రతి మాటా యోసేపు విని, గ్రహించాడు.
24 వారి మాటలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి. అందుచేత యోసేపు వాళ్లను విడిచి వెళ్లి ఏడ్చేసాడు. కొంచెం సేపయ్యాక యోసేపు మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ సోదరులలో ఒకడైన షిమ్యోనును పట్టుకొని మిగిలిన సోదరులు చూస్తుండగానే కట్టివేసాడు.
25 వారి సంచులను ధాన్యంతో నింపమని కొందరు సేవకులతో యోసేపు చెప్పాడు. ఈ ధాన్యం కోసం ఆ సోదరులు యోసేపుకు సొమ్ము చెల్లించారు. కానీ యోసేపు ఆ డబ్బు ఉంచుకోలేదు. ఆ డబ్బును తిరిగి వారి సంచుల్లోనే పెట్టేసాడు యోసేపు. అప్పుడు వారి ప్రయాణానికి అవసరమైన వాటన్నింటిని యోసేపు వారికి ఇచ్చాడు.
26 కనుక ఆ సోదరులు ఆ ధాన్యం గాడిదలమీద వేసుకొని వెళ్లిపోయారు.
27 ఆ సోదరులు ఆ రాత్రి ఒకచోట బస చేసారు. ఆ సోదరులలో ఒకడు కొంచెం ధాన్యం తన గాడిద కోసమని తన సంచి తెరిచాడు. అతని డబ్బు అతని సంచిలోనే కనబడింది.
28 అతడు, “చూడండి, ధాన్యంకోసం నేను చెల్లించిన డబ్బు ఇదిగో. ఈ డబ్బును ఎవరో మళ్లీ నా సంచిలో పెట్టేసారు” అని మిగతా సోదరులతో చెప్పాడు. ఆ సోదరులకు చాలా భయం వేసింది, “దేవుడు మనకు ఏం చేస్తున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
ఆ సోదరులు యాకోబుతో చెప్పటం
29 ఈ సోదరులు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయాలన్నీ యాకోబుతో చెప్పారు.
30 వాళ్లు ఇలా చెప్పారు: “ఆ దేశ పాలకుడు మాతో కఠినంగా మాట్లాడాడు. మేము అక్కడి ప్రజల్ని నాశనం చేయాలనుకొనే గూఢచారులమని అనుకొన్నాడు అతడు.
31 కానీ మేము నిజాయితీపరలం అని, గూఢచారులకు చెందినవాళ్లం కాదని మేము చెప్పాం.
32 మేము పన్నెండుమంది సోదరులం అని చెప్పాం. కనానులో ఇంటి దగ్గర మా తండ్రితో మా చిన్న తమ్ముడు ఒకడు ఉన్నాడని మరియు మా మరియొక చిన్న తమ్ముడు ఒకడు చనిపోయాడని మేము అతనితో చెప్పాం.
33 “అప్పుడు, ఆ దేశపాలకుడు మాతో ఇలా అన్నాడు: ‘మీరు నమ్మకమైన వాళ్లని రుజువు చేయటానికి ఇదొక మార్గం. మీ సోదరులలో ఒకడ్ని నా దగ్గర ఉంచండి. మీ ధాన్యం మీ కుటుంబాలకు తీసుకొని వెళ్లండి.
34 తర్వాత మీ కనిష్ఠ సోదరుడ్ని నా దగ్గరకు తీసుకొని రండి. అప్పుడు నిజంగా మీరు నిజాయితీపరులో, లేక మమ్మల్ని నాశనం చేసేందుకు పంపబడిన గూఢచారులో నాకు తెలుస్తుంది. మీరు చెప్పేది నిజమైతే మీ సోదరుడ్ని మళ్లీ మీకు అప్పగిస్తాను. అతణ్ణి మీకు అప్పగిస్తాను, మా దేశంలో మీరు స్వేచ్ఛగా ధాన్యం కొనుక్కోవచ్చు.’ ”
35 అప్పుడు ఆ సోదరులు వారి సంచుల్లో నుండి ధాన్యం తీయటానికి వెళ్లగా వారిలో ప్రతి సోదరునికి తన ధాన్యపు సంచిలో తన డబ్బు సంచి కనిపించింది. ఆ సోదరులు, వారి తండ్రి కూడ ఆ డబ్బును చూచి చాలా భయపడిపోయారు.
36 యాకోబు, “నేను నా పిల్లలందర్నీ పోగొట్టకోవాలని మీరు అనుకొంటున్నారా? యోసేపు పోయాడు. షిమ్యోను పోయాడు. ఇప్పుడు బెన్యామీనును గూడ మీరు తీసుకొని పోవాలనుకొంటున్నారు” అని వాళ్లతో అన్నాడు,
37 అప్పుడు రూబేను, “నాయనా, బెన్యామీనును గనుక నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపేసేయ్. నన్ను నమ్ము. బెన్యామీనును నేను మళ్లీ నీ దగ్గరకు తీసుకొని వస్తాను” అని తన తండ్రితో చెప్పాడు.
38 అయితే యాకోబు చెప్పాడు: “బెన్యామీనును మీతో నేను వెళ్లనివ్వను. అతని సోదరుడు మరణించాడు, నా భార్య రాహేలు కుమారులలో ఇతను ఒక్కడే మిగిలాడు. ఈజిప్టు ప్రయాణంలో ఇతనికి ఏమైనా సంభవిస్తే నేను చచ్చిపోతాను. నా వృద్ధాప్యంలో దుఃఖంతోనే మీరు నన్ను సమాధికి పంపిస్తారు.”