47
ఇశ్రాయేలు గోషెనులో స్థిరపడుట
యోసేపు ఫరో దగ్గరకు వెళ్లి, “నా తండ్రి, నా సోదరులు, వారి కుటుంబాలు మొత్తం ఇక్కడికి వచ్చారు. వారి పశువులు, కనాను దేశంలో వారికి కలిగినది మొత్తం వారితో తెచ్చుకొన్నారు. వారిప్పుడు గోషెనులో ఉన్నారు” అని చెప్పాడు. యోసేపు తన సోదరులలో అయిదుగురిని తనతో కూడ ఫరో ఎదుటికి తీసుకొని వెళ్లాడు.
“మీ వృత్తి ఏమిటి?” అని ఫరో ఆ సోదరులను అడిగాడు.
ఆ సోదరులు ఫరోతో, “అయ్యా, మేము గొర్రెల కాపరులం. మాకు ముందున్న మా పూర్వీకులు కూడా గొర్రెల కాపరులే” అని చెప్పారు. “కనాను దేశంలో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. మా పశువులకు అవరమైన గడ్డి ఉన్న పొలాలు ఎక్కడా లేవు. అందుచేత ఈ దేశంలో బతుకుదామని మేము ఇక్కడికి వచ్చాం. మీరు దయచేసి మమ్మల్ని గోషెను దేశంలో ఉండనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం” అని వారు ఫరోతో చెప్పారు.
అప్పుడు యోసేపుతో ఫరో చెప్పాడు: “నీ తండ్రి, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చారు. వారు నివసించేందుకు ఈజిప్టులో ఏ స్థలమైనా సరే నీవు వారికోసం కోరుకోవచ్చు. నీ తండ్రికి, నీ సోదరులకు శ్రేష్ఠమైన భూమి ఇవ్వు. గోషెను దేశంలో వారిని ఉండనివ్వు. వారు నైపుణ్యంగల కాపరులైతే, వారు నా పశువులకను కూడ చూసుకోవచ్చు.”
అప్పుడు యోసేపు తన తండ్రి యాకోబును ఫరో ఎదుటికి తీసుకొని వచ్చాడు. యాకోబు ఫరోను ఆశీర్వదించాడు.
అప్పుడు ఫరో “నీ వయస్సెంత?” అని యాకోబును అడిగాడు.
“నేను తక్కువ కాలం ఎక్కువ కష్టాలతో బతికాను. 130 సంవత్సరాలే నేను బతికాను. నా తండ్రి, ఆయన పూర్వీకులు నాకంటె చాలా ఎక్కువ కాలం బతికారు” అని ఫరోతో యాకోబు చెప్పాడు.
10 యాకోబు ఫరోను ఆశీర్వదించాడు. తర్వాత యాకోబు ఫరో ఎదుటి నుండి వెళ్లిపోయాడు.
11 యోసేపు ఫరోకు విధేయుడయ్యాడు. అతడు తన తండ్రికి, తన సోదరులకు ఈజిప్టలో మంచి భూమిని సమీపంగా ఇచ్చాడు. ఈజిప్టులో రామసేసు నగరానికి దగ్గరలోవున్న ఈ భూమి అతి శ్రేష్ఠమైంది. 12 మరియు తన తండ్రికి, సోదరులకు, వారి మనుష్యులందరికీ అవసరమైన ఆహారాన్ని యోసేపు వారికి ఇచ్చాడు.
ఫరోకోసం యోసేపు భూమి కొన్నాడు
13 కరువు కాలం మరీ తీవ్రం అయింది. దేశంలో ఎక్కడా ఆహారం లేదు. ఈ కష్టకాలం మూలంగా ఈజిప్టు, కనాను దరిద్రంగా తయారయ్యాయి. 14 ఆ దేశంలో ప్రజలు మరింత ధాన్యం కొన్నారు. యోసేపు ఆ ధనం ఆదా చేసి, దానిని ఫరో ఇంటికి తెచ్చాడు. 15 కొన్నాళ్లకు ఈజిప్టులోను కనానులోను ప్రజల దగ్గర పైకం అయిపోయింది. ధాన్యం కొనేందుకే వారి డబ్బు అంతా ఖర్చు పెట్టారు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్లి, “దయచేసి మాకు ధాన్యం ఇవ్వండి. మా డబ్బు అయిపోయింది. మేము భోజనం చేయకపోతే మీరు చూస్తుండగానే మేము మరణిస్తాం” అని చెప్పారు.
16 “మీ పశువుల్ని ఇవ్వండి, నేను మీకు ఆహారం ఇస్తాను” అని యోసేపు జవాబిచ్చాడు. 17 కనుక ప్రజలు ఆహారం కొనేందుకు వారి పశువులను, గుర్రాలను, మిగిలిన జంతువులన్నిటిని ఉపయోగించారు. ఆ సంవత్సరం యోసేపు వారికి ఆహారం ఇచ్చి, వారి పశువులను తీసుకున్నాడు.
18 అయితే ఆ తర్వాత సంవత్సరం ప్రజల దగ్గర జంతువులు లేవు, ఆహారం కొనేందుకు ఉపయోగించటానికి ఏమీ లేవు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్లి “మా దగ్గర ఇంకేమీ డబ్బు లేదని మీకు తెలుసు. మా పశువులన్నీ మీవే ఇప్పుడు. మా దగ్గర నీవు చూస్తున్న మా శరీరాలు, మా భూమి తప్ప ఇంకేమి లేవు. 19 మీరు చూస్తుండగానే నిశ్చయంగా మేము చనిపోతాం. కానీ, మీరు మాకు ఆహారం ఇస్తే, మేము మా భూమిని ఫరోకు ఇస్తాం, మేము ఆయన బానిసలంగా ఉంటాము. మేము నాట్లు వేయటానికి మాకు విత్తనాలు ఇవ్వండి. అప్పుడు మేము చావక బతుకుతాం. భూమి మా కోసం మరోసారి పంటను ఇస్తుంది” అని చెప్పారు.
20 కనుక యోసేపు ఈజిప్టులోని భూమి అంతటినీ ఫరోకోసం కొన్నాడు. ఈజిప్టులోని ప్రజలంతా వారి భూములను యోసేపుకు అమ్మివేసారు. వారు చాలా కరువుతో ఉన్నందుచేత ఇలా చేసారు. 21 మరియు ప్రజలందకు ఫరోకు బానిసలయ్యారు. ఈజిప్టు అంతటిలో ప్రజలు ఫరోకు బానిసలు. 22 యాజకుల స్వంత భూములను మాత్రమే యోసేపు కొనలేదు. యాజకుల పనికి ఫరో జీతం ఇచ్చాడు గనుక వారు వారి భూములను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆ డబ్బును ఆహారం కొనేందుకు వారు ఉపయోగించుకొనేవారు.
23 యోసేపు ప్రజలతో చెప్పాడు, “ఇప్పుడు మిమ్మల్ని, మీ భూముల్ని ఫరోకోసం నేను కొన్నాను. కనుక నేను విత్తనాలు ఇస్తాను, మీరు మీ భూముల్లో నాట్లు వేయవచ్చును. 24 కోతకాలంలో మీ పంటలో అయిదింట ఒక వంతు ఫరోకు ఇవ్వాలి. అయిదింట నాలుగు వంతులు మీకోసం మీరు ఉంచుకోవచ్చు. మీరు ఉంచుకొనే గింజలను మీ ఆహారం కోసమూ, వచ్చే సంవత్సరం విత్తనాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ కుటుంబాలను, పిల్లలను పోషించుకోవచ్చు.”
25 ప్రజలు, “మీరు మా ప్రాణాలు రక్షించారు. మేము సంతోషంగా మీకు, ఫరోకు బానసలంగా ఉంటాం” అన్నారు.
26 కనుక ఈ సమయంలో యోసేపు ఆ దేశంలో చట్టం చేసాడు. ఆ చట్టం నేటికీ కొనసాగుతుంది. భూమిలోనుండి వచ్చే దిగుబడి అంతటిలోనూ అయిదింట ఒక వంతు ఫరోకు చెందుతుంది అనేది ఆ చట్టం. భూములన్నీ ఫరో స్వంతం. యాజకుల భూమి మాత్రమే ఫరో స్వంతం కాలేదు.
నన్ను ఈజిప్టులో పాతిపెట్టవద్దు
27 ఇశ్రాయేలు (యాకోబు) ఈజిప్టులో ఉన్నాడు. గోషెను దేశంలో నివసించాడు. అతని కుటుంబం పెరిగి చాలా పెద్దది అయింది. ఈజిప్టులో వారు ఆ భూమిని సంపాదించి వర్ధిల్లారు.
28 యాకోబు ఈజిప్టులో 17 సంవత్సరాలు జీవించాడు. కనుక యాకోబు వయస్సు 147 సంవత్సరాలు. 29 తాను త్వరలో చనిపోతానని తెలిసి, ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారుడు యోసేపును తన దగ్గరకు పిల్చాడు. “నీవు నన్ను ప్రేమిస్తే, నీ చేయి నా తొడకింద పెట్టి ప్రమాణం చేయి. నేను చెప్పినట్లు నీవు చేస్తానని, నాకు నీవు నమ్మకంగా ఉంటావని వాగ్దానం చేయి. నేను మరిణించినప్పుడు నన్ను ఈజిప్టులో పాతిపెట్టవద్దు. 30 నా పూర్వీకులు పాతి పెట్టబడిన చోట నన్ను పాతిపెట్టు. ఈజిప్టు నుండి నన్ను తీసుకొనిపోయి, మన కుటుంబ సమాధుల స్థలంలో నన్ను పాతిపెట్టు” అన్నాడు.
“నీవు చెప్పినట్టు చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నా” అని యోసేపు జవాబిచ్చాడు.
31 అప్పుడు యాకోబు, “నాకు ప్రమాణం చేయి” అన్నాడు. అందుకు యోసేపు అలా చేస్తానని ప్రమాణం చేసాడు. అంతట ఇశ్రాయేలు పడక మీద తన తల వెనుకకు వాల్చాడు.*
* 47:31 అంతట … వాల్చాడు భాషలో దుడ్డుకర్ర మీదకు ముందుకు వంగి ఆరాధించెను అని కూడ అర్థం.