2
“అప్పుడు మీరు మీ సోదరులతో ‘మీరు నా ప్రజలు’ అనియు, మీ స్వంతవారితో ‘ఆయన మీ యెడల కరుణ చూపించాడు’ ” అని చెబుతారు.
“మీ తల్లితో గట్టిగా వాదించండి, ఎందుకంటే ఆమె నా భార్య కాదు! నేను ఆమె భర్తను కాను! వేశ్యలాగ ఉండటం మానుకోమని ఆమెతో చెప్పండి. ఆమె స్తనాల మధ్య నుండి ఆమె విటులను తొలగించి వేయుమని ఆమెతో చెప్పండి. ఆమె తన వ్యభిచారం మాను కోవటానికి నిరాకరిస్తే నేను ఆమె వస్త్రాలు తీసివేసి దిగంబరిగా చేస్తాను. ఆమెను, ఆమె పుట్టిన రోజున ఉన్నట్టుగానే చేస్తాను. నేను ఆమె ప్రజలను తొలగించివేస్తాను. ఆమె ఎండిపోయిన ఖాళీ ఎడారిలాగ ఉంటుంది. దాహంతో నేను ఆమెను చంపివేస్తాను. ఆమె పిల్లల మీద నేను జాలిపడను. ఎందుకంటే వారు వ్యభిచార సంతానం కనుక. వారి తల్లి ఒక వేశ్యలాగ ప్రవర్తించింది. వారి తల్లి, ఆమె చేసిన పనుల విషయంలో సిగ్గుపడాలి. ఆమె, ‘నేను నా విటుల దగ్గరకు వెళ్తాను, నా విటులు నాకు భోజనపానాలు ఇస్తారు. వారు ఉన్ని మరియు మేలు రకపు సన్నని వస్త్రాలు ఇస్తారు. ద్రాక్షామద్యం, ఒలీవనూనె వారు నాకు ఇస్తారు’ అని చెప్పింది.
“అందుచేత, యెహోవానైన నేను మీ (ఇశ్రాయేలు) మార్గాన్ని ముళ్లతో అడ్డువేస్తాను. నేను ఒక గోడ కట్టిస్తాను. అప్పుడు తన దారులను ఆమె తెలుసు కోలేక పోతుంది. ఆమె తన విటుల వెనుక పరుగులెత్తుతుంది కానీ ఆమె వారిని కలుసుకోలేక పోతుంది. ఆమె తన విటుల కోసం వెదుకుతుంది. కాని ఆమె వారిని కనుగొనలేక పోతుంది. అప్పుడు ఆమె, ‘నేను నా మొదటి భర్త (దేవుడు) దగ్గరకు వెళ్తాను. నేను ఆయనతో ఉన్నప్పుడు నా జీవితం బాగా ఉండింది. ఇప్పటికంటే నా జీవితం అప్పుడే మేలు’ అని ఆమె అంటుంది.
“ధాన్యం, ద్రాక్షారసం, నూనె ఇచ్చేవాడును నేనే అని ఆమెకు (ఇశ్రాయేలు) తెలియదు. నేను ఆమెకు వెండి బంగారాలు ఇంకా ఇంకా ఎక్కువగా ఇస్తూ పోయాను. కాని బయలు విగ్రహాలు చేయుటకు ఇశ్రాయేలీయులు ఈ వెండి బంగారాలు ఉపయోగించారు. కనుక నేను (యెహోవాను) తిరిగి వస్తాను. నా ధాన్యం కోతకు సిద్దంగా ఉన్నప్పుడు నేను దానిని తీసివేసుకొంటాను. ద్రాక్షలు సిద్దంగా ఉన్న సమయంలో నా ద్రాక్షారసం నేను తీసివేసికొంటాను. నా ఉన్ని, మేలురకపు వస్త్రాలు నేను తీసివేసికొంటాను. ఆమె తన నగ్న శరీరాన్ని కప్పుకునేందుకు వీటిని నేను ఆమెకు ఇచ్చాను. 10 కాని ఇప్పుడు నేను ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమె ప్రేమికులు ఆమె నగ్నత్వాన్ని చూస్తారు. నా శక్తి నుండి ఆమెను ఎవ్వరూ తప్పించలేరు. 11 నేను (దేవుడు) ఆమె సరదానంతా తీసివేస్తాను. ఆమె పండుగ రోజులు, ఆమె అమావాస్య విందులు, ఆమె విశ్రాంతి దినాలు, ప్రత్యేక విందులను నేను నిలిపి వేస్తాను. 12 ఆమె ద్రాక్షావల్లులను, అంజూరపు చెట్లను నేను నాశనం చేస్తాను. ‘నా విటులు వీటిని నాకు ఇచ్చారు’ అని ఆమె చెప్పింది. కాని ఆమె తోటలను నేను మార్చివేస్తాను. అవి భయంకరమైన అడవులుగా మారిపోతాయి. అడవి మృగాలు వచ్చి ఆ మొక్కలను తింటాయి.
13 “ఆమె బయలు దేవతలను సేవించింది. కనుక ఆమెను నేను శిక్షిస్తాను. బయలు* దేవతలకు ఆమె ధూపం వేసింది ఆమె వస్త్రాలు ధరించి, నగలు, ముక్కుకమ్మి పెట్టుకొంది. అప్పుడు ఆమె తన విటుల దగ్గరకు వెళ్లి నన్ను మరిచిపోయింది.” యెహోవా ఈ విషయం చెప్పాడు.
14 “కనుక నేను (యెహోవా) ఆమెతో ప్రేమగా మాట్లాడుతాను. ఆమెను ఎడారిలోకి నడిపించి ఆమెతో నేను మృదువుగా మాట్లాడుతాను. 15 అక్కడ ద్రాక్షాతోటలను ఆమెకు ఇస్తాను. ఆకోరు లోయను (శ్రమగల) ఒక నిరీక్షణ ద్వారంగా ఇస్తాను. అప్పుడు తన యౌవన దశలో ఈజిప్టు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఆమె జవాబు చెపుతుంది.” 16 యెహోవా ఇలాగున చెపుతున్నాడు.
“ఆ సమయంలో ‘నా భర్తవు’ అని నీవు నన్ను పిలుస్తావు. ‘నా బయలు’ అని నీవు నన్ను పిలవవు. 17 ఆమె నోటినుండి బయలు దేవత పేర్లను నేను తొలగించివేస్తాను. అప్పుడు ఆ బయలు దేవతల పేర్లను ప్రజలు మరల ఉపయోగించరు.
18 “ఆ సమయంలో పోలంలోని పశువులకు, ఆకాశంలోని పక్షులకు, నేలమీద ప్రాకే ప్రాణులకు ఇశ్రాయేలీయులకోసం నేను ఒక ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధ ఆయుధాలు నేను విరుగగొడతాను. ఆ దేశంలో ఆయుధాలు ఏవీ మిగలవు. ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా పడుకోగల్గు నట్లు నేను దేశాన్ని క్షేమంగా ఉంచుతాను. 19 మరియు నేను (యెహోవా) నిన్ను శాశ్వతంగా నా వధువుగా చేసుకొంటాను. మంచితనం, న్యాయం, ప్రేమ, కరుణలతో నిన్ను నేను నా వధువుగా చేసుకొంటాను. 20 నిన్ను నాకు నమ్మకమైన వధువుగా చేసుకొంటాను. అప్పుడు నీవు నిజంగా యెహోవాను తెలిసికొంటావు. 21 ఆ సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను.” యెహోవా ఇలాగున చెపుతున్నాడు.
 
“నేను ఆకాశాలతో మాట్లాడుతాను.
అవి భూమికి వర్షాన్ని ఇస్తాయి.
22 ధాన్యం, ద్రాక్షా మద్యం, నూనెలను భూమి ఇస్తుంది.
అవి యెజ్రెయేలు అవసరాలను తీరుస్తాయి.
23 భూమిమీద ఆమెను నేను నాటుతాను.
లో-రూహామాకు నేను దయచూపిస్తాను.
లో-అమ్మీకీ ‘నీవు నా ప్రజ’ అని నేను చెపుతాను.
‘నీవు మా దేవుడవు’ ” అని వారు నాతో చెపుతారు.
* 2:13 బయలు ఇశ్రాయేలు వాళ్లు నివసించే ప్రాంతంలో కనానీయులు పూజించే అబద్ధపు దేవుళ్లు.