15
మోయాబుకు దేవుని సందేశం
ఇది మోయాబును గూర్చి విచారకరమైన సందేశం:
 
ఒక రాత్రి ఆర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది.
ఆ రాత్రి పట్టణం నాశనం చేయబడింది.
ఒక రాత్రి కిర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది.
ఆ రాత్రే పట్టణం నాశనం చేయబడింది.
రాజ కుటుంబం, దీబోను ప్రజలు ఉన్నతమైన పూజాస్థలాల్లో మొరపెట్టేందుకు వెళ్తున్నారు.
నెబో కోసం, మేదెబా కోసం మోయాబు ప్రజలు మొరపెడ్తున్నారు.
ప్రజలంతా వారి విచారం వ్యక్తం చేయటానికి తలలు బోడిగుండ్లు చేసుకొన్నారు.
మోయాబు అంతటా ఇంటి కప్పుల మీద, వీధుల్లో
ప్రజలు నల్ల బట్టలు ధరిస్తున్నారు.
ప్రజలు ఏడుస్తున్నారు.
హెష్బోను, ఏలాలేయు పట్టణాల ప్రజలు చాలా గట్టిగా ఏడుస్తున్నారు.
చాలా దూరంలో ఉన్న యహసు పట్టణంలో మీరు వారి ఏడ్పులు వినవచ్చును.
చివరికి సైనికులు కూడా భయపడుతున్నారు.
సైనికులు భయంతో వణకుచున్నారు.
 
మోయాబు విషయంలో దుఃఖంతో నా హృదయం ఘోషిస్తుంది.
ప్రజలు భద్రత కోసం పారిపోతున్నారు.
దూరంలో ఉన్న సోయరుకు వారు పారిపోతున్నారు.
ఎగ్లాతు షెలిషియాకు వారు పారిపోతున్నారు.
ప్రజలు కొండ మార్గంగా లూహీతుకు వెళ్తున్నారు.
ప్రజలు ఏడుస్తున్నారు.
ప్రజలు హొరొనయీము మార్గంలో వెళ్తున్నారు. ప్రజలు చాలా గట్టిగా విలపిస్తున్నారు.
కానీ నిమ్రీము యేరు ఎడారిలా ఎండిపోయింది.
మొక్కలన్నీ చచ్చాయి.
ఏదీ పచ్చగా లేదు.
అందుచేత ప్రజలు వారి స్వంత సామగ్రి సర్దుకొని మోయాబు విడిచిపెడ్తున్నారు.
వారు ఆ సామగ్రిమోస్తూ నిరవంజి చెట్ల నది దగ్గర సరిహద్దు దాటుతున్నారు.
 
 
ఏడ్వటం మోయాబు అంతటా వినబడుతుంది.
చాలా దూరంలో ఉన్న ఎగ్లయీము పట్టణంలో ప్రజలు ఏడుస్తున్నారు. బెయేరేలీము పట్టణంలో ప్రజలు ఏడుస్తున్నారు.
దీమోను పట్టణపు నీళ్లు పూర్తిగా రక్తమయం అయిపోయాయి.
మరియు నేను (యెహోవాను) దీమోనుకు ఇంకా ఎక్కువ కష్టాలు కలిగిస్తాను.
మోయాబులో నివసిస్తున్న కొద్దిమంది శత్రువునుండి తప్పించుకొన్నారు.
కానీ ఆ ప్రజలను తిని వేయటానికి నేను సింహాలను పంపిస్తాను.