32
నాయకులు మంచివారిగాను, నీతిమంతులుగాను ఉండాలి
నేను చెప్పే విషయాలు విను. ఒక రాజు మంచిని పెంచే విధంగా పాలించాలి. నాయకులు ప్రజలను నడిపించేటప్పుడు వారు న్యాయమైన తీర్మానాలు చేయాలి. ఇలా జరిగితే, అప్పుడు గాలి వాన నుండి దాగుకొనే చోటులా ఉంటాడు ఆ రాజు. అది ఎండిన భూమిలో నీటి కాలువలు ప్రవహించినట్టుగా ఉంటుంది. వేడి ప్రదేశంలో ఒక పెద్ద బండ చాటున చల్లని నీడలా ఉంటుంది అది. ప్రజలు సహాయం కోసం రాజువైపు తిరుగుతారు, వారు ఆయన చెప్పే మాటలు నిజంగా వింటారు. ఇప్పుడు గందర గోళంలో పడిన మనుష్యులు గ్రహించగలుగుతారు. ఇప్పుడు తేటగా మాట్లాడలేని మనుష్యులు, అప్పుడు తేటగా, వేగంగా మాట్లాడగలుగుతారు. వెర్రివాళ్లు గొప్పవాళ్లని పిలువబడరు. రహస్య పథకాలు వేసే వారిని ప్రజలు గౌరవించరు.
తెలివి తక్కువ వాడు తెలివి తక్కువ సంగతులు చెబతాడు, అతడు చెడ్డపనులు చేయాలని తన మనసులో ఆలోచిస్తాడు. తెలివి తక్కువ వాడు తప్పు పనులు చేయాలనుకొంటాడు. తెలివి తక్కువ వాడు యెహోవాను గూర్చి చెడ్డ మాటలు చెబతాడు. తెలివి తక్కువ వాడు ఆకలితో ఉన్న వాళ్లను అన్నం తిననీయడు. తెలివి తక్కువ వాడు దప్పిగొన్న వారిని నీళ్లు తాగనివ్వడు. ఆ తెలివి తక్కువ వాడు చెడును సాధనంగా వాడుకొంటాడు. పేద ప్రజల దగ్గర్నుండి సమస్తం దోచుకొనేందుకు అతడు పథకం వేస్తాడు. ఆ తెలివి తక్కువ వాడు పేద ప్రజలను గూర్చి అబద్ధాలు చెబతాడు. వాని అబద్ధాలు పేదవారికి న్యాయం జరుగకుండా చేస్తాయి.
అయితే మంచి నాయకుడు మంచి పనులు చేయాలని ఆలోచిస్తాడు. ఆ మంచి పనులే అతణ్ణి మంచి నాయకుడ్ని చేస్తాయి.
కఠిన సమయాలు వస్తున్నాయి
స్త్రీలు కొందరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. మీరు క్షేమం అనుకొంటున్నారు. కానీ మీరు లేచి, నేను చెప్పే మాటలు వినాలి. 10 స్త్రీలారా మీరు ఇప్పుడు క్షేమంగా ఉన్నాం అనుకొంటున్నారు. కానీ ఒక సంవత్సరం తర్వాత మీకు కష్టం వస్తుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం మీరు కూర్చుకొనేందుకు ద్రాక్షపండ్లు ఉండవు గనుక మీరు ద్రాక్షపండ్లు ఏరుకోరు.
11 స్త్రీలారా మీరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. కానీ మీరు భయపడాలి. స్త్రీలారా, ఇప్పుడు మీరు క్షేమంగా ఉన్నాం అనుకొంటున్నారు. కానీ మీరు దిగులుపడాలి. మీ అందమైన వస్త్రాలు తీసివేసి, విచార వస్త్రాలు ధరించండి. ఆ బట్టలు మీ నడుములకు చుట్టుకోండి. 12 దుఃఖంతో నిండిన మీ రొమ్ములను ఆ దుఃఖవస్త్రాలతో కప్పుకొనండి. మీ పొలాలు ఖాళీగా ఉన్నాయి గనుక ఏడ్వండి. మీ ద్రాక్ష తోటలు ఒకప్పుడు ద్రాక్ష పండ్లు ఇచ్చాయి కానీ ఇప్పుడు అవి ఖాళీ. 13 నా ప్రజల భూమి కోసం ఏడ్వండి, ముళ్లకంపలు, గచ్చ పొదలు మాత్రమే అక్కడ పెరుగుతాయి గనుక ఏడ్వండి. పట్టణం కోసం, ఒకప్పుడు ఆనందంతో నిండిన అన్ని గృహాల కోసం ఏడ్వండి.
14 ప్రజలు రాజధాని నగరం విడిచి పెట్టేస్తారు. రాజ భవనం, గోపురాలు ఖాళీగా విడిచిపెట్టబడతాయి. ప్రజలు ఇండ్లలో నివసించరు. వారు గుహలలో నివసిస్తారు. అడవి గాడిదలు, గొర్రెలు పట్టణంలో నివసిస్తాయి. పశువులు అక్కడ గడ్డి మేయటానికి వెళ్తాయి.
15-16 దేవుడు పైనుండి తన ఆత్మను మనకు ఇచ్చేంతవరకు ఇది కొనసాగుతుంది. ఇప్పుడు దేశంలో మంచి లేదు. అది ఒక అరణ్యంలా ఉంది. కానీ భవిష్యత్తులో ఆ అరణ్యం కర్మెలు దేశంలా ఉంటుంది, అక్కడ న్యాయమైన తీర్పు వుంటుంది. మరియు కర్మెలు పచ్చని అడవిలా ఉంటుంది. అక్కడ మంచితనం ఉంటుంది. 17 ఆ మంచితనం శాంతి, భద్రతలు తెచ్చిపెడ్తుంది. 18 అందమైన శాంతి వనంలో నా ప్రజలు నివసిస్తారు. క్షేమకరమైన గుడారాల్లో నా ప్రజలు నివసిస్తారు. నెమ్మదైన, శాంతస్థలాల్లో వారు నివసిస్తారు.
19 కానీ ఈ సంగతులు జరుగక ముందు అరణ్యం కూలిపోవాలి. ఆ పట్టణం ఓడించబడాలి. 20 మీలో కొంతమంది ప్రతి కాలువ దగ్గరా విత్తనాలు విత్తుతారు. మీ పశువలను, గాడిదలను మీరు స్వేచ్చగా తిరుగ నిస్తారు, తిననిస్తారు. మీరు చాలా సంతోషంగా ఉంటారు.