34
దేవుడు తన శత్రువులను శిక్షిస్తాడు
1 సకల రాజ్యములారా, దగ్గరగా వచ్చి, వినండి. ప్రజలారా, మీరంతా దగ్గరగా ఉండి వినండి. భూమి, భూమిమీద ఉన్న ప్రజలు అందరూ ఈ సంగతులు వినాలి.
2 సకల రాజ్యాల మీదా, వాటి సైన్యాల మీదా యెహోవా కోపంగా ఉన్నాడు. యెహోవా వాళ్లందర్ని నాశనం చేస్తాడు వాళ్లందరు చెంపబడేట్టు యెహోవా చేస్తాడు.
3 వారి శరీరాలు బయట పారవేయబడుతాయి. ఆ శవాలనుండి కంపువస్తుంది. వారి రక్తం కొండల నుండి ప్రవహిస్తుంది.
4 ఆకాశాలు కాగితం చుట్టలా చుట్టబడతాయి. నక్షత్రాలు చచ్చి, ద్రాక్ష లేక అంజూర చెట్ల ఆకులు రాలినట్లు రాలిపోతాయి. ఆకాశంలోని నక్షత్రాలన్నీ కరిగి పోతాయి.
5 “ఆకాశంలో నా ఖడ్గం రక్తసిక్తమైనప్పుడు ఇది జరుగుతుంది” అని యెహోవా చెబతున్నాడు.
చూడండి! యెహోవా ఖడ్గం ఎదోముగుండా దూసుకొనిపోతుంది. ఆ ప్రజలు దోషులని యెహోవా తీర్పు చెప్పాడు, గనుక వారు చావాల్సిందే.
6 ఎందుకంటే, బొస్రాలో, ఎదోములో చంపబడే సమయం ఒకటి ఉండాలని యెహోవా నిర్ణయించాడు గనుక.
7 కనుక పొట్టేళ్లు, పశువులు, బలమైన కోడెదూడలు చంపబడుతాయి. దేశం వాటి రక్తంతో నిండిపోతుంది. దుమ్ము వాటి కొవ్వుతో నిండిపోతుంది.
8 శిక్షా సమయం ఒకటి యెహోవా ఏర్పాటు చేశాడు గనుక ఆ సంగతులు జరుగుతాయి. ప్రజలు సీయోనుకు చేసిన కీడులకు వారు బదులు చెల్లించటానికి యెహోవా ఒక సంవత్సరాన్ని ఎంచుకొన్నాడు.
9 ఎదోము నదులు వేడి తారులా ఉంటాయి. ఎదోము నేల మండుతున్న గంధకంలా ఉంటుంది.
10 అగ్ని రాత్రింబవళ్లు మండుతూ ఉంటుంది. అగ్నిని ఎవ్వరూ ఆర్పివేయలేరు. ఎదోమునుండి పొగ శాశ్వతంగా లేస్తుంది. ఆ దేశం శాశ్వతంగా ఎప్పటికీ నాశనం చేయబడుతుంది. ఆ దేశంగుండా మళ్లీ ఎవ్వరూ ఎన్నడూ ప్రయాణం చేయరు.
11 పక్షులు, చిన్న జంతువులు ఆ దేశాన్ని స్వంతంగా వాడుకొంటాయి. గుడ్లగూబలు, కాకులు అక్కడ నివసిస్తాయి. ఆ దేశం “శూన్య ఎడారి” అని పిలువబడుతుంది.
12 స్వతంత్రులు, నాయకులు అంతా పోతారు. వారు పాలించేందుకు అక్కడ ఏమీ మిగిలి ఉండదు.
13 అక్కడి అందమైన గృహాలన్నింటిలో ముళ్ల కంపలు, పిచ్చిపొదలు పెరుగుతాయి. అడవి కుక్కలు, గుడ్లగూబలు ఆ ఇండ్లలో నివసిస్తాయి. అడవి జంతువులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొంటాయి. అక్కడ పెరిగే గడ్డి దుబ్బుల్లో పెద్ద పక్షులు నివసిస్తాయి.
14 అడవి పిల్లులు నక్కలతో కలిసి అక్కడ నివసిస్తాయి. అడవి మేకలు వాటి స్నేహితులను పిలుచుకొంటాయి. రాత్రులు తిరిగే జంతువులు అక్కడ విశ్రాంతి స్థలం చూచుకొంటాయి.
15 పాములు అక్కడ పుట్టలు పెడ్తాయి. పాములు అక్కడ గుడ్లు పెడ్తాయి. గుడ్లు పగులుతాయి పాము పిల్లలు ఆ చీకటి స్థలాల్లో పాకుతాయి. చచ్చిన శవాలను తినే పక్షులు, ఆడవాళ్లు వారి స్నేహితురాళ్లను కలుసుకొన్నట్టుగా అక్కడ కలుసుకొంటాయి.
16 యెహోవా గ్రంథాన్ని చూడండి. అక్కడ ఏమి వ్రాసి ఉందో చదవండి. ఏమీ తప్పిపోలేదు. ఆ జంతువులు కలిసి ఉంటాయని ఆ గ్రంథములో వ్రాయబడిఉంది. వాటిని ఒక్క చోట చేరుస్తానని దేవుడు చెప్పాడు. కనుక దేవుని ఆత్మ వాటిని ఒక్క చోట చేర్చటం జరుగుతుంది.
17 వాటి విషయంలో చేయాల్సిన దాన్ని దేవుడు నిర్ణయం చేశాడు. అప్పుడు దేవుడు వాటికి ఒక చోటు నిర్ణయించాడు. దేవుడు ఒక గితగీసి, వాటి స్థలం వాటికి చూపించాడు. అందుచేత ఆ దేశం ఆ జంతువులకు శాశ్వతంగా స్వంతం. సంవత్సరం వెంబడి సంవత్సరం అవి అక్కడే నివసిస్తాయి.