5
ఇశ్రాయేలు, దేవుని ప్రత్యేక తోట
ఇప్పుడు నేను నా స్నేహితునికి (దేవుడు) ఒక పాట పాడుతాను. నా స్నేహితునికి తన ద్రాక్షావనం మీద (ఇశ్రాయేలు) ఉన్న ప్రేమను గూర్చిన పాట ఇది.
 
మంచి సారవంతమైన భూమిలో
నా స్నేహితునికి ఒక ద్రాక్షతోట ఉంది.
నా స్నేహితుడు పొలందున్ని చదును చేశాడు.
అక్కడ మంచి ద్రాక్ష మొక్కల్ని అతడు నాటాడు.
ఆ పొలం మధ్యలో అతడు ఒక గోపురం కట్టాడు.
అక్కడ మంచి ద్రాక్షలు పండుతాయని
నా స్నేహితుడు ఎదురు చూశాడు.
కాని అక్కడ కారు ద్రాక్షలేపండాయి.
 
కనుక దేవుడు చెప్పాడు: “యెరూషలేములో నివసిస్తున్న ప్రజలారా, ఓ యూదా మనిషి,
నన్ను గూర్చి, నా ద్రాక్షాతోట గూర్చి ఆలోచించు.
నా ద్రాక్షా తోటకు సహాయపడుటకు ఇంతకంటె ఎక్కువ నేనేం చేయాలి?
నేను చేయగలిగింది అంతా చేశాను.
మంచి ద్రాక్షలు పండుతాయని నేను ఎదురు చూశాను.
కానీ కారు ద్రాక్షాలే ఉన్నాయి
ఎందుకు అలా జరిగింది?
 
“నా ద్రాక్షాతోటకు నేను ఏమి చేస్తానో ఇప్పుడు నేను మీతో చెబుతాను.
తోటను కాపాడుతోన్న ముళ్ల కంచెను
నేను లాగివేసి దాన్ని కాల్చేస్తాను.
దాని రాతి గోడను నేను కూలగొట్టేస్తాను.
ఆ రాళ్లు కాళ్ల కింద తొక్కబడతాయి.
నా ద్రాక్షా తోటను నేను బీడు భూమిగా చేస్తాను.
దాని మొక్కల్ని ఎవరూ లెక్క చేయరు. ఆ పొలంలో ఎవ్వరూ పని చేయరు.
కలుపు మొక్కలు, ముళ్ల పొదలు అక్కడ పెరుగుతాయి.
ఆ పొలం మీద వర్షించ వద్దని మేఘాలకు నేను ఆజ్ఞాపిస్తాను.”
 
సర్వశక్తిమంతుడైన యెహోవాకు చెందిన ద్రాక్షాతోట ఇశ్రాయేలు రాజ్యం యెహోవాకు ప్రియమైన ద్రాక్షావల్లి యూదా మనిషి.*
 
యెహోవా న్యాయం కోసం నిరీక్షించాడు.
కాని అక్కడ చంపటం మాత్రమే ఉంది.
అంతా లక్షణంగా ఉంటుంది అని యెహోవా నిరీక్షించాడు.
కానీ అక్కడ బాధించబడిన ప్రజల ఆర్త ధ్వనులే ఉన్నాయి.
 
మీరు చాలా కిక్కిరిసి నివసిస్తారు. ఇంక దేనికి స్థలంలేనంతగా మీరు ఇళ్లు నిర్మించేస్తారు. కానీ యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడు. మీరు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. దేశం మొత్తంలో మీరు మాత్రమే ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవా నాతో ఇలా చెప్పాడు, నేను అది విన్నాను, “ఇప్పుడు చాలా ఇళ్లు ఉన్నాయి. అయితే ఆ ఇళ్లన్నీ నాశనం చేయబడుతాయని నేను ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు అందమైన పెద్ద భవనాలు ఉన్నాయి. కానీ ఆ ఇళ్లు ఖాళీ అయిపోతాయి. 10 ఆ సమయంలో ఒక పదెకరాల ద్రాక్షాతోట కొంచెం మాత్రమే ద్రాక్షారసం ఇస్తుంది. చాలా బస్తాల గింజలతో కొద్దిపాటి ధాన్యం మాత్రం దిగుబడి అవుతుంది.”
11 మీరు ఉదయాన్నే లేచి మద్యం తాగాలని చూస్తుంటారు. ద్రాక్షారసంతో మత్తెక్కి రాత్రి చాలాసేపు మెళకువగా ఉంటారు. 12 మీరు ద్రాక్షారసంతో, సితారాలు, డప్పులు, పిల్లన గ్రోవులు, ఇతర సంగీత వాయిద్యాలతో మీరు విందులు చేసుకొంటారు. యెహోవా చేసిన కార్యాలు మీరు చూడరు. యెహోవా హస్తాలు ఎన్నెన్నో కార్యాలు చేశాయి. కాని మీరు వాటిని గమనించరు. అందుచేత అది మీకు చాలా కీడు.
13 యెహోవా చెబుతున్నాడు: “నా ప్రజలు బంధించబడి తీసుకొని పోబడతారు. ఎందుకంటే వారు నిజంగా నన్నెరుగరు. ఇశ్రాయేలులో నివసిస్తున్న మనుష్యులు ఇప్పుడు చాలా ప్రముఖలు. వారి సుఖ జీవనాలతో వారు సంతోషంగా ఉన్నారు. అయితే ఆ గొప్ప వాళ్లంతా దప్పిగొంటారు, ఆకలితో ఉంటారు. 14 అప్పుడు వారు చనిపోతారు, పాతాళం మరింత మంది మనుష్యులతో నిండిపోతుంది. ఆ మరణ స్థానం అపరిమితంగా దాని నోరు తెరుస్తుంది. అప్పుడు ఆ మనుష్యులంతా ఆ పాతాళంలోకి వెళ్లిపోతారు.”
15 ఆ మనుష్యులు తగ్గించబడతారు. ఆ గొప్పవాళ్లంతా తలలు వంచి నేలమీదికి చూస్తారు. 16 సర్వశక్తిమంతుడైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు, ఆయన గొప్పవాడని ప్రజలు తెలుసుకొంటారు. పవిత్ర దేవుడు సరైన వాటినే చేస్తాడు, ప్రజలు ఆయనను గౌరవిస్తారు. 17 ఇశ్రాయేలు ప్రజలు వారి దేశం విడిచి వెళ్లిపోయేట్టుగా దేవుడు చేస్తాడు, దేశం శూన్యం అవుతుంది. గొర్రెలు వాటికి ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తాయి. ఒకప్పుడు ధనికులదైన భూమిమీద గొర్రె పిల్లలు నడుస్తాయి.
18 ఆ మనుష్యుల్ని చూడండి. మనుష్యులు తాళ్లతో బండ్లను లాగినట్టు, వాళ్లు తమ పాపాల్ని దోషాన్ని వారి వెనుక లాగుతున్నారు. 19 వాళ్లు అంటారు: “దేవుడు చేయాలనుకొనే పనులు ఆయన త్వరగా చేస్తే బాగుండును. అప్పుడు జరిగేది ఏమిటో మాకు తెలుస్తుంది. యెహోవా పథకం త్వరగా జరిగిపోతే బాగుండును. ఆయన పథకం ఏమిటో అప్పుడు మాకు తెలుస్తుంది.”
20 ఆ మనుష్యులు మంచివాటిని చెడ్డవి అంటారు, చెడ్డవాటిని మంచివి అంటారు. వెలుగును చీకటి అని, చీకటిని వెలుగు అని వాళ్లు అనుకొంటారు. వాళ్లు చేదును తీపి, తీపిని చేదు అనుకొంటారు. 21 వాళ్లు చాలా తెలివిగల వాళ్లు అని ఆ మనుష్యులు తలస్తారు. వాళ్లు చాలా జ్ఞానంగలవాళ్లు అని తలస్తారు. 22 ద్రాక్షారసం తాగటంలో ఆ మనుష్యులు చాలా ప్రసిద్ది. మద్యము కలపటంలో వారు ప్రముఖులు. 23 మీరు వారికి డబ్బు చెల్లిస్తే, వారు నేరస్థుల్ని క్షమించేస్తారు. కానీ వారు మంచి వాళ్లకు న్యాయం జరుగనివ్వరు. 24 ఆ మనుష్యులకు చెడు సంగతులు సంభవిస్తాయి. గడ్డి, ఆకులు అగ్నితో కాల్చివేయబడినట్టు, వారి సంతతి వారు పూర్తిగా నాశనం చేయబడతారు. చచ్చి, ధూళిగా తయారయ్యే వేరులా వారి సంతానం వారు పూర్తిగా నాశనం చేయబడతారు. అగ్ని నాశనం చేసిన ఒక పువ్వులా వారి సంతతి వారు నాశనం చేయబడతారు. దాని బూడిద గాలితో కొటుకొని పోతుంది. సర్వశక్తిమంతుడైన
యెహోవా దేవుని ఉపదేశాలకు విధేయులయ్యేందుకు వారు నిరాకరించారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) సందేశాన్ని ఆ ప్రజలు అసహ్యించుకొన్నారు. 25 అందుచేత యెహోవా తన ప్రజల మీద చాలా కోపగించాడు. యెహోవా తన చేయి పైకెత్తి, వాళ్లను శిక్షిస్తాడు. పర్వతాలు సహా భయపడి పోతాయి. చచ్చిన శవాలు చెత్తలా వీధుల్లో పడి ఉంటాయి. కానీ దేవుడు మాత్రం ఇంకా కోపంగానే ఉంటాడు. ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన హస్తం ఇంకా పైకెత్తబడిఉంటుంది.
ఇశ్రాయేలును శిక్షించటానికి దేవుడు సైన్యాలను రప్పిస్తాడు
26 చూడండి! చాలా దూరంలో ఉన్న దేశాలకు దేవుడు ఒక సంకేతం ఇస్తున్నాడు. దేవుడు ఒక పతాకాన్ని ఎగుర వేస్తున్నాడు, మరియు ఆ ప్రజలను పిలిచేందుకు ఆయన ఈల వేస్తున్నాడు.
శత్రువు దూరదేశం నుండి వస్తున్నాడు. త్వరలోనే శత్రువు దేశంలో ప్రవేశిస్తాడు. వారు చాలా వేగంగా కదలుతున్నారు. 27 శత్రువు ఎన్నటికీ అలసిపోడు, పడిపోడు. వారెన్నటికీ నిద్రబోతులుగా నిద్రపోరు. వారి ఆయుధ పట్టాలు ఎల్లప్పుడూ సిద్దమే. వారి చెప్పుల తాళ్లు ఎప్పటికి తెగిపోవు. 28 శత్రువుల బాణాలు చాలా పదునుగా ఉంటాయి. వారి బాణాలన్నీ కొట్టడానికి సిద్ధంగా ఉంటాయి. గుర్రాల డెక్కలు బండలా గట్టిగా ఉంటాయి. వాటి రథాల వెనుక ధూళి మేఘాలుగా లేస్తుంది.
29 శత్రువు గట్టిగా అరిస్తే, అది సింహగర్జనలా ఉంటుంది. అది కొదమ సింహపు గర్జన అంత గట్టిగా ఉంటుంది. శత్రువు తాను పోరాడుతున్న ప్రజలను ఎదురులేకుండా పట్టి లాగుకొని పోతాడు. ప్రజలు కొట్టుమిట్టాడి, తప్పించుకొనేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్లను రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. 30 కనుక “సింహం” గట్టిగా సముద్ర ఘోషలా గర్జిస్తుంది. బంధించబడిన ప్రజలు నేలమీదికే చూస్తుంటారు, అప్పుడు చీకటి మాత్రమే ఉంటుంది. దట్టమైన ఈ మేఘంలో వెలుగంతా చీకటిగానే ఉంటుంది.
* 5:7 యూదా మనిషి ఇది “యూదా రాజు” లేక, “యూదా ప్రజలు” అయివుండవచ్చు.