53
పీడిత సేవకుడు
మేము ప్రకటించిన సంగతులను నిజంగా ఎవరు నమ్మారు? యెహోవా హస్తం ఎవరికి బయలు పరచబడింది?
యెహోవా ఎదుట ఆయన ఒక చిన్న మొక్కవలె ఉన్నాడు. ఎండిన భూమిలో ఎదుగుతున్న మొక్కవలె పెరిగాడు. మనము ఆయనలో చూడతగిన రూపముగాని తేజస్సుగాని, ఏమి లేదు. మనం ఆయనని చూడటానికి ఇష్టపడుటకు ఆయనలో ప్రత్యేకత ఏమీ మనకు కనబడదు. ఆయన నీచంగా ఎంచబడ్డాడు, మనుష్యుల చేత విడిచి పెట్టబడ్డాడు, ఆయన ఎంతో బాధ పొందిన మనిషి. రోగం బాగా ఎరిగిన వాడు. కనీసం ఆయన్ని కన్నెత్తి చూసేందుకు మనుష్యులు ముఖాన్ని దాచుకొన్నారు. ఆయన నీచంగా ఎంచబడ్డాడు. కనుక మనం ఆయన్ని లెక్కచేయలేదు.
నిశ్చయంగా ఆయన మన వ్యాధులను భరించాడు. మన బాధలను మోశాడు. అయినా, ఆయన్ని కొట్టిన వానిగాను, హింసించిన వానిగాను, బాధించిన వానిగాను, మనం తలంచాం. కాని మనం చేసిన చెడ్డ పనులకు ఆయన శ్రమపొందాల్సి వచ్చింది. మన దోషం మూలంగానే ఆయన నలుగగొట్టబడ్డాడు. మనకు సమాధాన మిచ్చిన శిక్ష ఆయన మీద పడింది. ఆయన గాయాల మూలంగా మనకు స్వస్థత కలిగింది. కానీ ఆయన ఇలా చేసిన తర్వాత కూడా మనం అందరం గోర్రెలవలె త్రోవతప్పి పోయి తిరిగాం. మనం మనకు ఇష్టమైన దారిలో పోయాం. మన అందరి దోషాన్ని యెహోవా ఆయన మీద వేశాడు.
ఆయన భాధించబడ్డాడు, శిక్షించబడ్డాడు, కానీ ఎన్నడూ ఎదురు చెప్పలేదు. వధించబడుటకు తీసుకొని పొబడే గొర్రెవలె ఆయన మౌనంగా ఉన్నాడు. ఒక గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించేటప్పుడు ఎలా మౌనంగా ఉంటుందో అలా ఆయన మౌనంగా ఉన్నాడు. తనను తాను రక్షించుకోవటానికి ఆయన నోరు తెరవలేదు. ఆయన అబద్ధపు తీర్పుపొంది, బంధించబడి తీసుకొని పోబడ్డాడు. ఆయన తరంలో ఈ విషయాలు ఎవరు మనస్సుకు తీసుకొన్నారు? ఆయన భూమిమీద నివసిస్తున్న వారిలో నుండి తొలగించబడ్డాడు. నా ప్రజల అపరాధాల కోసం ఆయన నలుగ కొట్టబడ్డాడు. ఆయన చనిపోయి ధనికునితో పాతి పెట్టబడ్డాడు. దుష్టులతో పాటు ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన దౌర్జన్యం చేయలేదు. ఆయన ఎన్నడూ మోసం చేయలేదు.
10 అయినా ఆయన్ని నలుగ గొట్టాలని శ్రమకలిగించాలని, యెహోవాకు ఇష్టం. యెహోవా ఆయన ప్రాణాన్ని పాప పరిహర బలిగా అర్పించితే ఆయన బహూకాలం జీవించి తన సంతానాన్ని చూస్తాడు. ఆయనలో యెహోవా చిత్తం సఫలమవుతుంది. 11 ఆయన తన ఆత్మలో ఎన్నో శ్రమల పొందిన తర్వాత వెలుగును చూచి సంతృప్తి చెందుతాడు.
నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానం వల్ల అనేకులను నీతిమంతులుగా చేస్తాడు. 12 ఈ కారణం చేత నేను గొప్ప ప్రజలతో ఆయన్ని గొప్పవాడినిగా చేస్తాను. బలముగల ప్రజలందరిలో ఆయనకు అన్నింటిలోనూ భాగం ఉంటుంది. ఎందుకంటే మనుష్యుల కోసం ఆయన తన ప్రాణం ఇచ్చిమరణించాడు. ఆయన నేరస్థులలో ఒకనిగా లెక్కించబడ్డాడు. అనేకుల పాపాల్ని ఆయన మోసి అపరాదుల కోసం విజ్ఞాపన చేసాడు.