57
ఇశ్రాయేలీయులు దేవుని వెంబడించరు
మంచి మనుష్యులు పోయారు. కానీ ఏ వ్యక్తి అది గమనించలేదు.
ఏం జరుగుతుందో ప్రజలు గ్రహించరు.
కానీ వారు మంచి మనుష్యులందరిని సమావేశపరచారు.
కష్టాలు వస్తున్నాయని ప్రజలు గ్రహించరు.
 
మంచి వాళ్లంతా భద్రతకోసం
సమావేశం చేయబడ్డారని వారికి తెలియదు.
అయితే శాంతి కలుగుతుంది. మరియు ప్రజలు వారి స్వంత పడకలమీద విశ్రాంతి తీసుకొంటారు.
వారు ఎలా జీవించాలని దేవుడు కోరుతాడో వారు అలా జీవిస్తారు.
 
“దయ్యాల పిల్లల్లారా, ఇక్కడకు రండి.
మీ తండ్రి లైంగిక పాపాల మూలంగా దోషి.
మరియు మీ తల్లి లైంగిక పరంగా తన శరీరాన్ని అమ్ముకొంటుంది. ఇక్కడకు రండి!
మీరు అబద్ధాలు చెప్పేవాళ్లు, చెడ్డవాళ్లు.
మీరు నన్ను ఎగతాళి చేస్తారు.
మీరు నన్ను వెక్కిరిస్తారు.
మీరు నా మీద నాలుకలు చాపుతారు.
మీరు చేయగోరేదంతా ఏమిటంటే ప్రతి పచ్చని చెట్టు కింది
తప్పుడు దేవుళ్లనూ పూజించటమే.
మీరు ప్రతికాలువ ప్రక్క పిల్లల్నీ చంపుతారు,
బండల స్థలాల్లో వారిని బలి ఇస్తారు.
నదులలో నున్నటి రాళ్లను పూజించటం మీకు ఇష్టం.
వాటిని పూజించుటకు మీరు వాటిమీద ద్రాక్షర సం పోస్తారు.
మీరు వాటికి బలులు ఇస్తారు. కానీ మీకు దొరికేది అంతా ఆ రాళ్లే.
ఇది నాకు సంతోషం కలిగిస్తుందని మీరు తలుస్తున్నారా?
లేదు! అది నాకు సంతోషం కలిగించదు.
మీరు ప్రతి కొండ మీద,
ప్రతి పర్వతంమీద మీ పడక వేసుకొంటారు.
మీరు ఆ స్థలాలకు వెళ్లి
బలులు అర్పిస్తారు.
తర్వాత మీరు ఆ పడకల మీదికి వెళ్లి,
ఆ దేవుళ్లను ప్రేమించటం ద్వారా నాకు వ్యతిరేకంగా పాపం చేస్తారు.
మీరు ఆ దేవతలను ప్రేమిస్తారు.
వాటి దిగంబర దేహాలను చూడటం మీకు ఇష్టం.
మీరు నాతో ఉన్నారు
కాని వాటితో ఉండేందుకు మీరు నన్ను విడిచి పెట్టారు.
నన్ను జ్ఞాపకం చేసుకొనేందుకు
సహాయపడే వాటిని మీరు దాచిపెట్టేస్తారు.
గుమ్మాల వెనుక, ద్వారబంధాల వెనుక వాటిని మీరు దాచిపెట్టేస్తారు.
మరియు మీరు వెళ్లి ఆ తప్పుడు దేవుళ్ళతో ఒడంబడికలు చేసుకుంటారు.
మొలెక్* దేవతకు అందంగా కనబడాలని
మీరు తైలాలు, పరిమళాలు ఉపయోగిస్తారు.
మీరు మీ సందేశకులను దూరదేశాలకు పంపించారు.
ఇది మిమ్మల్ని పాతాళానికి, మరణ స్థానానికి తీసుకొని వస్తుంది.
10 ఈ పనులు చేయటానికి మీరు కష్టపడి పని చేశారు
కానీ మీరు ఎన్నడూ అలసిపోలేదు.
మీరు కొత్త బలం కనుగొన్నారు.
ఎందుకంటే, వీటిలో మీరు ఆనందించారు గనుక.
11 మీరు నన్ను జ్ఞాపకం చేసికోలేదు
మీరు నన్ను కనీసం గుర్తించలేదు.
కనుక మీరు ఎవరిని గూర్చి చింతిస్తున్నారు?
మీరు ఎవరిని గూర్చి భయపడుతున్నారు?
మీరెందుకు అబద్ధం పలికారు?
చూడండి, చాలాకాలంగా నేను మౌనంగా ఉన్నాను.
మరి మీరు నన్ను గౌరవించలేదు.
12 మీ ‘మంచితనం’ గూర్చి, మీరు చేసే ‘మతపరమైన’ పనులు అన్నింటిని గూర్చి నేను చెప్పగలను.
కానీ అవన్నీ పనికిమాలినవి.
13 మీకు సహాయం అవసరమైనప్పుడు
మీరు మీ చుట్టూరా ప్రోగుచేసుకొన్న ఆ తప్పుడు దేవుళ్ళకు మొరపెట్టండి.
అయితే, వాటిన్నింటనీ గాలి కొట్టిపారేస్తుందని నేను మీకు చెబుతున్నాను.
ఒక్క గాలి విసురు వాటన్నింటినీ మీ వద్దనుండి తొలగించివేస్తుంది.
అయితే నా మీద ఆధారపడే వ్యక్తి
భూమిని సంపాదించుకొంటాడు.
ఆ వ్యక్తికి నా పరిశుద్ధ పర్వతం దొరుకుతుంది.”
యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు
14 మార్గం సరళం చేయండి; మార్గం సరళం చేయండి.
నా ప్రజలకోసం మార్గం చక్కజేయండి.
 
15 మహోన్నతుడైన దేవుడు, పైకిఎత్త బడినవాడు
శాశ్వతంగా జీవించేవాడు,
పవిత్రుడైన దేవుడు అనే నామం గలవాడు చెబుతున్నాడు:
“నేను ఉన్నతమైన పవిత్ర స్థానంలో నివసిస్తాను.
అయితే దుఃఖంలో ఉన్న దీన జనులతో కూడా ఉంటాను.
ఆత్మలో దీనంగా ఉండేవారికి నేను నూతన జీవం ప్రసాదిస్తాను.
హృదయమందు విచారంగా ఉన్నవారికి నేను నూతన జీవితం ప్రసాదిస్తాను.
16 నేను శాశ్వతంగా పోరాటం కొనసాగించను.
నేను ఎప్పటికీ కోపంగానే ఉండను.
నేను కోపంగా కొనసాగితే మనిషి ఆత్మ,
వారికి నేను ఇచ్చిన జీవం నా ఎదుటనే మరణిస్తుంది.
17 ఈ ప్రజలు చెడు కార్యాలు చేశారు. అది నాకు కోపం కలిగించింది.
కనుక నేను ఇశ్రాయేలును శిక్షించాను.
నేను కోపంగా ఉన్నాను గనుక
అతని నుండి నేను తిరిగిపోయాను.
మరియు ఇశ్రాయేలు నన్ను విడిచిపెట్టాడు.
ఇశ్రాయేలు తనకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్లాడు.
18 ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్లింది నాకు తెలుసు. కనుక నేను అతణ్ణి స్వస్థపరుస్తాను (క్షమిస్తాను).
నేను అతణ్ణి ఆదరించి, అతడు బాగానే ఉంది అనుకొనేట్టు చేసే మాటలు నేను చెబుతాను. అప్పుడు అతడు, అతని ప్రజలు విచారంగా ఉండరు.
19 ఆ ప్రజలకోసం ‘శాంతి’ అనే కొత్త పదం నేను ఉపదేశిస్తాను.
నాకు సమీపంగా ఉన్న ప్రజలకు, చాలా దూరంగా ఉన్న ప్రజలకు, నేను శాంతి ప్రసాదిస్తాను.
ఆ ప్రజలను నేను స్యస్థపరుస్తాను (క్షమిస్తాను).”
ఈ సంగతులు యెహోవా చెప్పాడు.
 
20 అయితే చెడ్డవాళ్లు భీకరంగా ఉన్న మహాసముద్రంలాంటి వాళ్లు.
వారు నెమ్మదిగా, శాంతంగా ఉండలేరు.
వారు కోపంగా ఉన్నారు,
మహాసముద్రంలా మట్టిని కెలుకుతారు.
21 “దుష్టులకు శాంతి లేదు”
అని నా దేవుడు చెబుతున్నాడు.
* 57:9 మొలెక్ తప్పుడు దేవత. హీబ్రూలో “రాజు” అని అర్థం ఇచ్చే మాటలాంటిది ఈ పేరు.