66
దేశాలన్నింటికీ దేవుడు తీర్పు తీరుస్తాతడు
1 యెహోవా చెబుతోంది ఇదే,
“ఆకాశాలు నా సింహాసనం.
భూమి నా పాదపీఠం.
అందుచేత నాకు ఒక గృహం నిర్మంచగలం అని మీరనుకొంటున్నారా?
లేదు, నిర్మించ లేరు.
2 నా అంతట నేనే అన్నింటినీ చేశాను.
అన్నింటిని నేను చేసాను కనుక అవి అన్నీ ఇక్కడ ఉన్నాయి.” యెహోవా ఈ సంగతులు చెప్పాడు.
“నేను ఏ ప్రజల్ని లక్ష్యపెడతాను, నాతో చెప్పండి? పేదప్రజల్ని నేను లక్ష్యపెడతాను.
వీరు చాల దుఃఖంలో ఉన్న ప్రజలు. నా మాటలకు విధేయులయ్యే వారిని నేను లక్ష్యపెడతాను
3 కొంతమంది నాకు బలులు ఇచ్చేందుకు ఎడ్లను వధిస్తారు.
కానీ వారు ప్రజల్నికూడా కొడతారు.
ఆ మనుష్యులు నాకు బలులు ఇచ్చేందుకని గొర్రెలను వధిస్తారు.
అయితే వారు కుక్కల మెడలు కూడ విరుగగొడ్తారు.
మరియు పందుల రక్తం వారు నాకు అర్పిస్తారు.
ఆ మనుష్యులు ధూపం వేయటం జ్ఞాపకం ఉంచుకొంటారు. కాని పనికిమాలిన వారి విగ్రహాలను కూడా వారు ప్రేమిస్తారు.
ఆ మనుష్యులు నా మార్గాలను గాక వారి స్వంత మార్గాలనే ఎంచుకొంటరు.
భయం కరమైన వారి విగ్రహాలనే వారు పూర్తిగా ప్రేమిస్తారు.
4 కనుక వారి స్వంత రహస్యాలనే నేను ఉపయోగించాలని నేను నిర్ణయించుకొన్నాను.
అంటే, దేనికైతే వారు ఎక్కువగా భయపడతారో వాటినే ప్రయోగించి వారిని శిక్షించాలని నా ఉద్దేశం.
నేను ఆ ప్రజలను పిలిచాను
కాని వారు వినిపించుకోలేదు.
నేను వారితో మాట్లాడాను
కానీ వారు నా మాట వినలేదు కనుక నేనుకూడా వారికి అదే విధంగా చేస్తాను.
నేను కీడు అని చెప్పిన వాటినే ఆ ప్రజలు చేశారు.
నాకు ఇష్టంలేని వాటినే వారు జరిగించేందుకు ఎంచుకొన్నారు.”
5 యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యే ప్రజలారా,
మీరు యెహోవా చెప్పేవాటిని వినాలి.
“మీ సోదరులు మిమ్మల్ని ద్వేషించారు.
మీరు నన్ను వెంబడించినందువల్ల వారు మీకు విరోధంగా తిరిగారు.
యెహోవా ఘనపరచబడినప్పుడు మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము.
అప్పుడు మేము మీతోకూడ సంతోషిస్తాం, అని మీ సోదరులు చెప్పారు.
ఆ మనుష్యులు శిక్షించబడతారు.”
శిక్ష మరియు ఒక కొత్త రాజ్యం
6 వినండి! పట్టణం నుండి, దేవాలయం నుండి పెద్ద శబ్దం వస్తుంది. యెహోవా తన శత్రువులను శిక్షిస్తున్న శబ్దం అది. వారికి రావాల్సిన శిక్షనే యెహోవా వారికి ఇస్తున్నాడు.
7-8 “ఒక స్త్రీ నొప్పులు లేకుండా ప్రసవించదు. ఒక స్త్రీ నొప్పులు అనుభవించకుండనే తన శిశువును చూడటం అనేది ఎన్నడూ సంభవించలేదు. అదే విధంగా, ఒకే రోజున ఒక కొత్త ప్రపంచం ప్రారంభం అగుట ఎవ్వరూ ఎన్నడూ చూడలేదు. ఒకే రోజున ఒక కొత్త రాజ్యం ప్రారంభం అయినట్లు ఎవ్వరూ ఎన్నడూ వినలేదు. ప్రసవ వేదనలాంటి నొప్పులు దేశం మొదట అనుభవించాలి. ప్రసవ వేదనల తర్వాత దేశం తన పిల్లలకు- ఒక కొత్త దేశానికి – జన్మనిస్తుంది.
9 అదే విధంగా ఏదో కొత్తది జన్మించాల్సిన అవసరం లేకుండా నేను బాధ కలిగించను.”
యెహోవా ఇది చెబుతున్నాడు: “నేను నీకు పురిటినొప్పులు రానిచ్చినట్లయితే, అప్పుడు నీ కొత్త దేశం నీకు రాకుండా నేను ఆపుజేయను.” మీ దేవుడే ఇది చెప్పాడు.
10 యెరూషలేమా, సంతోషించు! యెరూషలేమును ప్రేమించే మీరందరూ సంతోషించండి.
విచారకరమైన విషయాలు యెరూషలేముకు సంభవించాయి. కనుక మీరు కొంతమంది మనుష్యులు విచారించారు. కానీ, అలాంటి మీరు ఇప్పుడు ఎంతో ఎంతో సంతోషించాలి.
11 ఎందుకంటే ఆమె స్థనాలనుండి పాలు వచ్చినట్లుగా మీకు కరుణ లభిస్తుంది. ఆ “పాలు” నిజంగా మిమ్మల్ని తృప్తిపరుస్తాయి.
ప్రజలారా, మీరు పాలు తాగుతారు.
మరియు మీరు యెరూషలేము మహిమను నిజంగా అనుభవిస్తారు.
12 యెహోవా చెబుతున్నాడు:
“చూడండి, నేను మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది.
భూమి మీద రాజ్యాలన్నింటిలోని ఐశ్వర్యాలు అన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు ప్రవహిస్తాయి.
మీరు చిన్న పిల్లల్లా ఉంటారు. మీరు ‘పాలు’ తాగుతారు.
మీరు ఎత్తబడి నా కౌగిటిలో ఉంటారు.
మీరు నా మోకాళ్లమీద ఊపబడతారు.
13 యెరూషలేములో మీరు ఓదార్చబడతారు.
ఒక తల్లి తన బిడ్డను ఓదార్చేలా నేను మిమ్మల్ని ఓదార్చుతాను.”
14 మీరు నిజంగా అనుభవించేవాటిని మీరు చూస్తారు.
మీరు స్వతంత్రులై, గడ్డి పెరుగునట్లు పెరుగుతారు.
యెహోవా సేవకులు ఆయన శక్తిని చూస్తారు.
కానీ యెహోవా శత్రువులు ఆయన కోపాన్ని చూస్తారు.
15 చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నాడు.
యెహోవా సైన్యాలు ధూళిమేఘాలతో వస్తున్నాయి. ఆ ప్రజలను యెహోవా తన కోపంతో శిక్షిస్తాడు.
యెహోవా కోపంగా ఉన్నప్పుడు,
ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన అగ్ని జ్వాలలను ప్రయోగిస్తాడు.
16 యెహోవా ప్రజలకు తీర్పు తీరుస్తాడు.
తర్వాత యెహోవా తన ఖడ్గంతోను, అగ్నితోను ఆ ప్రజలను నాశనం చేస్తాడు.
యెహోవా అనేకమంది ప్రజలను నాశనం చేస్తాడు.
17 ఆ ప్రజలు వారి ప్రత్యేక తోటలో ఆరాధించుకొనేందుకు, వారిని పవిత్రం చేసుకోవాలని చెప్పి, వారిని వారు కడుగుకొంటారు. ఈ ప్రజలు వారి తోటల్లోనికి ఒకరిని ఒకరు వెంబడిస్తారు. ఆ తర్వాత వారి విగ్రహాలను వారు పూజిస్తారు. కానీ, యెహోవా ఆ ప్రజలందరిని నాశనం చేస్తాడు. “పందులు, ఎలుకల మాంసం, ఇతర మైల వస్తువులు ఆ ప్రజలు తింటారు. అయితే ఆ ప్రజలంతా ఏకంగా నాశనం చేయబడతారు.” (సాక్షాత్తూ యెహోవా ఈ సంగతులు చెప్పాడు.)
18 “ఆ మనుష్యులకు దుష్టతలంపులు ఉన్నాయి, దుష్టకార్యాలు చేస్తారు. అందుచేత వారిని శిక్షించేందుకు నేను వస్తున్నాను. రాజ్యాలన్నింటిని, ప్రజలందరినీ నేను సమావేశం చేస్తాను. ప్రజలంతా కలిసి వచ్చి నా శక్తిని చూస్తారు.
19 కొంతమంది మనుష్యులకు నేను ఒక గుర్తువేస్తాను-వారిని నేను రక్షిస్తాను. రక్షించబడిన ఆ ప్రజల్లో కొందరిని తర్షీషు, లిబియా, లూద్, (విలుకాండ్ర దేశం), తూబాలు, గ్రీసు, దూరదేశాలు అన్నింటికీ నేను పంపిస్తాను. ఆ ప్రజలు నా ఉపదేశాలు ఎన్నడూ వినలేదు. ఆ ప్రజలు నా మహిమను ఎన్నడూ చూడలేదు. అందుచేత రక్షించబడిన ప్రజలు నా మహిమను గూర్చి దేశాలకు చెబుతారు.
20 మరియు వారు అన్ని దేశాలనుండి మీ సోదరులను, సోదరీలను తీసుకొని వస్తారు. నా పవిత్ర పర్వతం యెరూషలేముకు మీ సోదరీలను వారు తీసుకొని వస్తారు. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, రథాలు బండ్లమీద మీ సోదరులు, సోదరీలు వస్తారు. ఇశ్రాయేలీయులు పవిత్ర పళ్లెములలో యెహోవా మందిరానికి తీసుకొనివచ్చే కానుకలవలె మీ సోదరులు, సోదరీలు ఉంటారు.
21 ఈ మనుష్యుల్లో నుండి కూడ కొందరిని యాజకులుగా, లేవీలుగా ఉండేందుకు నేను ఏర్పరచు కొంటాను.” (యెహోవా ఈ సంగతులు చెప్పాడు.)
క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి
22 “నేను ఒక నూతన ప్రపంచాన్ని చేస్తాను మరియు నూతన ఆకాశం, నూతన భూమి శాశ్వతర గా నిలుస్తాయి. అదే విధంగా మీ పేర్లు, మీ పిల్లలు శాశ్వతంగా నాతో కూడ ఉంటారు.
23 ప్రతి ఆరాధన రోజు, ప్రజలంతా నన్ను ఆరాధించేందుకు వస్తారు. ప్రతి సబ్బాతు నాడూ, ప్రతి నెల మొదటిరోజున వారు వస్తారు.
24 “ఈ ప్రజలు నా పవిత్ర పట్టణంలో ఉంటారు. మరియు పట్టణం బయటకు వెళ్తే నాకు విరోధంగా పాపం చేసిన మనుష్యుల శవాలను వారు చూస్తారు. ఆ శవాలు పురుగులు పట్టి ఉంటాయి. ఆ పురుగులు ఎన్నటికి చావవు. అగ్ని జ్వాలలు ఆ శవాలను కాల్చివేస్తాయి మరియు ఆ జ్వాలలు ఎన్నటికీ ఆరిపోవు.”