3
యోబు తన పుట్టిన రోజును శపించుట
1 అప్పుడు యోబు తన నోరు తెరచి, తాను పుట్టిన రోజును శపించాడు.
2-3 అతడు ఇలా అన్నాడు:
“నేను పుట్టిన ఆ రోజు ఉండకుండా పోవును గాక.
‘పిల్లవాడు పుట్టాడు!’ అని చెప్పబడిన ఆ రాత్రి ఉండకుండా పోవునుగాక. అది పోవునుగాక.
4 ఆ రోజు చీకటి అవును గాక.
ఆ రోజును దేవుడులక్ష్యపెట్టకుండును గాక. ఆ రోజున వెలుగు ప్రకాశింపకుండును గాక.
5 ఆ రోజు మరణాంధకారమవును గాక.
ఆ రోజును ఒక మేఘము కప్పివేయును గాక.
నేను పుట్టిన ఆనాటి వెలుగును కారు మేఘాలు భయపెట్టి వెళ్లగొట్టును గాక.
6 గాఢగంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక.
ఆ రాత్రి సంవత్సరపు దినములలో ఒకటిగా ఎంచబడకుండును గాక.
ఆ రాత్రిని ఏ నెలలో కూడ చేర్చవద్దు.
7 ఆ రాత్రి ఎవడును జననం కాకపోపును గాక.
ఆ రాత్రి ఏ ఆనంద శబ్దం వినుపించకుండా ఉండును గాక.
8 శాపాలు పెట్టే మంత్రగాళ్లు నేను పుట్టిన ఆ రోజును శపించెదరు గాక.
సముద్రపు రాక్షసికి కోపం పుట్టించుట ఎట్లో ఎరిగిన మనుషులు వారు.
9 ఆ నాటి వేకువ చుక్క చీకటి అవునుగాక.
ఆ రాత్రి ఉదయపు వెలుగుకోసం కనిపెట్టి ఉండును గాక.
కానీ ఆ వెలుగు ఎన్నటికీ రాకుండును గాక.
ఆ రాత్రి సూర్యోదయపు మొదటి కిరణాలు చూడకుండును గాక.
10 ఎందుకనగా ఆ రాత్రి, నా తల్లి గర్భద్వారాలను మూసివేయలేదు.
(అది పుట్టకుండా అరికట్టలేదు) అది నా కన్నులనుండి కష్టాలను దాచలేదు.
11 నేను పుట్టినప్పుడే నేనెందుకు మరణించలేదు?
నా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు నేనెందుకు మరణించలేదు?
12 నా తల్లి ఎందుకు నన్ను తన మోకాళ్లమీద పెట్టుకొంది?
నా తల్లి స్తనములు నాకెందుకు పాలిచ్చాయి?
13 నేను పుట్టినప్పుడే నేను మరణించి ఉంటే
ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండేవాణ్ణి.
14 భూమి మీద బతికిన రాజులు, జ్ఞానులతో బాటు విశ్రాంతిలో ఉంటే ఎంత బాగుండును
ఆ రాజులు, జ్ఞానులచే నిర్మింపబడిన ఆ కట్టడాలు ఇప్పుడు నాశనమై పోయాయి.
15 నేను కూడ ఆ పాలకులతో పాటు పాతిపెట్టబడి ఉంటే ఎంత బాగుండును.
వారికి బంగారం ఉంది, వారి ఇండ్లను వెండితో నింపుకొన్నారు!
16 నేను పుట్టినప్పుడే చనిపోయి,
మట్టిలో పాతి పెట్టబడిన శిశువుగా ఎందుకు ఉండలేదు?
ఎన్నడూ వెలుగు చూడని శిశువులా నేను ఉంటే
ఎంత బాగుండును.
17 చెడ్డ మనుష్యులు సమాధిలో ఉన్నప్పుడు తొందర కలిగించటం మానివేస్తారు.
అలసిపోయిన మనుష్యులకు సమాధిలో విశ్రాంతి లభిస్తుంది.
18 ఖైదీలు కూడా సమాధిలో సుఖంగా ఉంటారు.
కాపలాదారుల స్వరం వారు వినరు.
19 ప్రముఖ ప్రజలు, సామాన్య ప్రజలు అన్ని రకాల ప్రజలు సమాధిలో ఉంటారు.
మరియు బానిస తన యజమాని నుండి విడుదల అవుతాడు.
20 “శ్రమ పడుతూ, చాలా విచారంగా ఉన్న మనిషిని ఇంకా బతుకుతూ ఉండనియ్యటం ఎందుకు?
ఆత్మ వేదనతో ఉన్న వానికి జీవం ఇవ్వబడటం ఎందుకు?
21 ఆ మనిషి చావాలని కోరుకొంటాడు. కాని చావురాదు.
విచారంలో ఉన్న ఆ మనిషి దాగి ఉన్న ఐశ్వర్యాలకంటే మరణంకోసం ఎక్కువగా వెదకుతాడు.
22 ఆ మనుష్యులు సమాధిని కనుగొన్నప్పుడు చాలా సంతోషిస్తారు.
వారు పాతిపెట్ట బడినప్పుడు ఆనందిస్తారు.
23 దేవుడు వారి భవిష్యత్తును రహస్యంగా ఉంచుతాడు.
వారి చుట్టూ ఒక గోడ కడతాడు.
24 నేను భోజనం చేయను. కాని నేను దుఃఖధ్వనులు చేస్తాను.
కాని సంతోషంతో కాదు. నా ఆరోపణలు నీళ్లలా ప్రవహిస్తున్నాయి.
25 నాకు ఏదో దారుణం జరుగుతుందేమో అని భయ పడ్డాను.
అలానే జరిగింది నాకు!
26 నాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు.
నాకు విశ్రాంతి లేదు. కష్టం మాత్రమే ఉంది!”