12
యెఫ్తా మరియు ఎఫ్రాయిము
1 ఎఫ్రాయిము వంశంలోని మనుష్యులు వారి సైనికులందరినీ సమావేశ పరిచారు. తరువాత వారు నది దాటి సఫోను పట్టణం వెళ్లారు. వారు, “అమ్మోనీయులతో పోరాడేందుకు సహాయంగా నీవు మమ్మల్ని ఎందుకు పిలువలేదు? నీతోపాటే నీ ఇంటిని కాల్చివేస్తాము” అని యెఫ్తాతో అన్నారు.
2 వారికి యెఫ్తా జవాబు చెప్పాడు: “అమ్మోనీయులు మాకు చాలా కష్టాలు కలిగించారు. కనుక నేను, నా ప్రజలు వారి మీద యుద్ధం చేశాము. నేను మిమ్మల్ని పిలిచాను, కాని మాకు సహాయం చేయటానికి మీరు రాలేదు.
3 మీరు మాకు సహాయం చేయరని నాకు తెలిసింది. కనుక నేను నా ప్రాణాన్ని లెక్కచేయలేదు. అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి నేను నది దాటివెళ్లాను. వారిని ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేశాడు. ఇప్పుడు నాతో పోరాడటానికి మీరెందుకు ఈ వేళ వచ్చారు?”
4 అప్పుడు యెఫ్తా గిలాదు మనుష్యులను సమావేశ పరిచాడు. వారు ఎఫ్రాయిము మనుష్యులతో యుద్ధం చేసారు. ఎఫ్రాయిము మనుష్యులు గిలాదు వారిని అవమానించారు గనుక ఆ మనుష్యులతో వారు పోరాడారు. “గిలాదు వారైన మీరు ఎఫ్రాయిము మనుష్యులలో మిగిలిన వారే తప్ప మరేమీ కాదు. మీకు కనీసం సొంత దేశం కూడా లేదు. మీలో కొందరు ఎఫ్రాయిముకు మరికొందరు మనష్షేకు చెందినవారు” అని వారు అన్నారు. గిలాదు మనుష్యులు ఎఫ్రాయిము మనుష్యులను ఓడించారు.
5 ప్రజలు యోర్దాను నదిని దాటే రేవులను గిలాదు మనుష్యులు పట్టుకొన్నారు. ఆ రేవులు ఎఫ్రాయిము దేశానికి పోయేదారులు. ఎఫ్రాయిము వారిలో తప్పించుకున్నవాడు ఎప్పుడైనా నది దగ్గరకు వచ్చి, “నన్ను దాటనివ్వండి” అని చెబితే గిలాదువారు, “నీవు ఎఫ్రాయిము వాడవా?” అని అడుగుతారు. “లేదు” అని వాడు చెబితే
6 “షిబ్బోలెతు అనే మాట పలుకు” అని వారు అంటారు. ఎఫ్రాయిము మనుష్యులు ఆ మాటను సరిగ్గా పలుకలేరు. వారు ఆ మాటను “సిబ్బోలెతు” అని పలుకుతారు. కనుక అటువంటి వారిని ఒకడు “సిబ్బోలెతు” అని చెబితే అతడు ఎఫ్రాయిము వాడని గిలాదు వారికి తెలిసిపోతుంది. కనుక ఆ రేవు దగ్గరే వారు చంపేస్తారు. అలాగున వారు నలభై రెండువేల మంది ఎఫ్రాయిము మనుష్యులను చంపివేశారు.
7 ఆరు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు యెఫ్తా న్యాయమూర్తిగా ఉన్నాడు. అప్పుడు గిలాదు వాడైన యెఫ్తా చనిపోయాడు. వారు అతని పట్టణమైన గిలాదులో అతనిని పాతిపెట్టారు.
న్యాయాధిపతి ఇబ్సాను
8 యెఫ్తా తర్వాత ఇబ్సాను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయ్యాడు. ఇబ్సాను బేత్లెహేము నగరానికి చెందినవాడు.
9 ఇబ్సానుకి ముప్ఫై మంది కొడుకులు, ముప్ఫై మంది కుమార్తెలు ఉన్నారు. తమ బంధువులు కాని వారిని వివాహం చేసుకోవలసిందిగా అతను ముప్ఫై మంది కుమార్తెలను కోరాడు. తమ బంధువులు కాని ముప్ఫై మంది స్త్రీలను అతను కనుగొన్నాడు. వారిని అతని కుమారులు వివాహం చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఇబ్సాను ఏడు సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు.
10 తర్వాత ఇబ్సాను మరణించాడు. అతనిని బేత్లెహేం నగరంలో సమాధి చేశారు.
న్యాయాధిపతి ఏలోను
11 ఇబ్సాను అనంతరం, ఇశ్రాయేలు ప్రజలకు ఏలోను న్యాయాధిపతి అయ్యాడు. ఏలోను జెబూలూను వంశమునుండి వచ్చినవాడు. అతను ఇశ్రాయేలు ప్రజలకు పది సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు.
12 అప్పుడు జెబలూను వంశంనుండి వచ్చిన ఏలోను చనిపోయాడు. ఆయన ఆయ్యాలోను లోని జెబూలూను పట్టణంలో సమాధి చేయబడ్డాడు.
న్యాయాధిపతి అబ్దోను
13 ఏలోను మరణానంతరం, హిల్లేలు కుమారుడైన అబ్దోను అనే అతను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయ్యాడు.
14 అబ్దోను పిరాతోను అనే నగరానికి చెందినవాడు. అబ్దోనుకు 40 మంది కుమారులు, 30 మంది మనుమలు ఉన్నారు. వారు డెబ్భయి గాడిదలెక్కి తిరిగారు. ఇశ్రాయేలు ప్రజలకు అబ్దోను ఎనిమిదేళ్ల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు.
15 ఆ తర్వాత హిల్లేలు కుమారుడైన అబ్దోను మరణించాడు. అతనిని పిరాతోను నగరంలో సమాధి చేశారు. పిరాతోను ఎఫ్రాయిము అనే ప్రదేశంలో ఉంది. ఇది కొండదేశం లోనిది, అక్కడ అమాలేకీయుల ప్రజలు నివసించేవారు.