యోనా
1
దేవుని పిలుపు-యోనా పలాయనం
అమిత్తయి కుమారుడైన యోనాతో* యోహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా అన్నాడు: “నీనెవె ఒక మహానగరం. అక్కడి ప్రజలు చేస్తున్న అనేక నీచ కార్యాలను గురించి నేను విన్నాను. కావున నీవు ఆ నగరానికి వెళ్లి వారు చేసే చెడు పనులు మానుకొనుమని చెప్పు.”
దేవుని సలహా యోనా పాటించదలచలేదు. కావున యెహోవాకు దూరంగా యెనా పారిపోవటానికి ప్రయత్నించాడు. యోనా యొప్పే పట్టణానికి వెళ్లాడు. బహుదూరానగల తర్షీషు§ నగరానికి వెళ్లే ఒక ఓడను యోనా చూశాడు. యోనా తన ప్రయాణానికయ్యే ఖర్చు చెల్లించి ఓడలోనికి వెళ్లాడు. తర్షీషుకు వెళ్లే ఈ ఓడపైగల జనంతో కలిసి యోనా ప్రయాణం చేసి, యెహోవాకు దూరంగా పారిపోదలిచాడు.
పెనుతుఫాను
కాని యెహోవా సముద్రంలో పెనుతుఫాను లేవ దీశాడు. గాలివల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుఫాను తీవ్రంగా ఉంది. ఓడ పగిలిపోవటానికి సిద్దంగా ఉంది. ఓడ మునగకుండా అందులో ఉన్నావారు దానిని తేలిక చేయదల్చారు. కావున వారు సరుకును సముద్రంలో పారవేయడం మొదలుపెట్టారు. నావికులు చాలా భయపడ్డారు. ఓడలోనున్న ప్రతీవాడు తన దేవుని ప్రార్థించసాగాడు. యోనా మాత్రం పడుకోటానికి పడవ కి ంది భాగంలోకి వెళ్లాడు.
యోనా నిద్రపోతూ ఉన్నాడు. ఓడ అధికారి యోనాను చూసి ఇలా అన్నాడు: “నిద్రలే! నీవు ఎందుకు నిద్రపోతున్నావు? నీ దేవుణ్ణి ప్రార్థించు! బహుశః నీ దైవం నీ ప్రార్థన ఆలకించి మనల్ని రక్షించవచ్చు.”
తుఫానుకు కారణం
పిమ్మట ఓడలోని మనుష్యులు ఒకరితో ఒకరు, “మనకీ కష్టాలు ఎందుకు వచ్చాయో తెలుసు కోవటానికి మనం చీట్లు వేయాలి” అని అనుకున్నారు.
అందువల్ల వారు చీట్లు వేశారు. ఈ కష్టమంతా యోనా వల్ల వచ్చినదేనని చీట్లవల్ల తెలిసింది. అప్పుడు ఆ మనుష్యులు యోనాతో ఇలా అన్నారు: “మాకు ఈ కష్టమంతా నీ తప్పువల్లనే సంభవిస్తూ ఉంది! కావున నీవు ఏమి చేశావో మాకు చెప్పు. నీవు ఏమిపని చేస్తావు? నీవు ఎక్కడనుండి వస్తున్నావు? నీది ఏ దేశం? నీ ప్రజలు ఏవరు?”
అప్పుడు యోనా ఇలా అన్నాడు: “నేనొక హెబ్రీయుడను (యూదా జాతివాడను). పరలోక దేవుడైన యెహోవాను నేను ఆరాధిస్తాను. సముద్రాన్ని, భూమిని సృష్టించిన దేవుడు ఆయనే.”
10 తాను యెహోవా నుండి పారిపోతున్నట్లు యోనా వారికి చెప్పాడు. ఇది తెలుసుకున్న ఆ మనుష్యులు చాలా భయపడిపోయారు. ఆ మనుష్యులు యోనాను, “నీ దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి భయంకరమైన అపరాధం చేశావు?” అని అడిగారు.
11 గాలి, అలలు సముద్రంలో రాను రాను మరింత తీవ్రమవుతున్నాయి. అందువల్ల ఆ మనుష్యులు యోనాతో, “మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే ఏమిచేయాలి? సముద్రాన్ని శాంతింపచేయటానికి నీకు మేము ఏమిచేయాలి?” అని అడిగారు.
12 యోనా ఆ మనుష్యులతో ఇలా అన్నాడు: “నేను తప్పు చేశానని నాకు తెలుసు. అందువల్లనే ఈ తుఫాను సముద్రంలో చెలరేగింది. కావున నన్ను సముద్రంలోకి తోసివెయ్యండి. సముద్రం శాంతిస్తుంది”
13 కాని ఆ మనుష్యులు యోనాను సముద్రంలోకి తోసివేయటానికి ఇష్టపడలేదు. వారు ఓడను తిరిగి ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కాని వారలా చేయలేకపోయారు. గాలి, సముద్రపు అలలు రాను రాను మరింత తీవ్రమయ్యాయి.
యోనాకు శిక్ష
14 కావున ఆ మనుష్యులు యెహోవాకు ఇలా విన్న వించుకున్నారు: “ప్రభూ ఇతడు చేసిన చెడు కార్యాల దృష్ట్యా మేము ఈ మనుష్యుని సముద్రంలోకి తోసి వేస్తున్నాము. ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరారోపణ దయచేసి మామీద వేయకు. మేము అతన్ని చంపినందుకు దయచేసి నీవు మమ్ముల్ని చనిపోయేలాగు చేయవద్దు. నీవు యెహోవా అని మాకు తెలుసు. నీవు ఏది తలిస్తే అది చేస్తావు. కాని దయచేసి మాపట్ల కరుణ చూపు.”
15 పిమ్మట వారు యోనాను సముద్రంలోకి విసరివేశారు. తుఫాను ఆగిపోయింది. సముద్రం శాంతించింది! 16 ఆ మనుష్యులు ఇదంతా చూసి భయపడ సాగారు. యెహోవా పట్ల వారికి భక్తి ఏర్పడింది. వారు యెహోవాకు ఒక బలి సమర్పించి, ప్రత్యేక మొక్కులు మొక్కుకొన్నారు.
17 యోనా సముద్రంలో పడగానే యోనాను మింగటానికి ఒక పెద్ద చేపను యెహోవా పంపాడు. ఆ చేప కడుపులో యోనా మూడు పగళ్లు, మూడు రాత్రులు ఉన్నాడు.
* 1:1 యోనా యోనా బహుశః రెండవ రాజులు 14:25లో పేర్కొనబడిన ప్రవక్తే కావచ్చు. 1:2 నీనెవె అష్షూరు ముఖ్య పట్టణం. అష్షూరు సైన్యం కీ.పూ. 723-721లో ఉత్తర ఇశ్రాయేలును నాశనం చేసింది. 1:3 యొప్పే మధ్యధరా సముద్రం దగ్గర ఇశ్రాయేలు తీరంలో యొప్పే ఒక పట్టణం. § 1:3 తర్షీషు బహుశః ఇది స్పెయిన్‌లో ఒక నగరం కావచ్చు. ఇది పడమరన ఉంది. యోనా పారిపోగలిగిన దూర ప్రాంతం. నీనెవె పట్టణం ఇశ్రాయేలుకు తూర్పున ఉన్నది.