32
యిర్మీయా భూమిని కొనుట
యూదా రాజైన సిద్కియా పాలనలో పదవ సంవత్సరం* గడుస్తు ఉండగా యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా పాలన పదవ సంవత్సరం జరుగుతూ ఉండగా నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరంలో ఇది జరిగింది. ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేమును ముట్టడిస్తూ వచ్చింది. ( యూదా రాజైన సిద్కియా యిర్మీయాను ఆ ప్రదేశంలో ఖైదు చేశాడు. యిర్మీయా, చెప్పిన భవిష్యవాణి సిద్కియాకు నచ్చలేదు. యిర్మీయా ఇలా చెప్పాడు: “యెహోవా ఇలా అన్నాడు, ‘యెరూషలేమునగరాన్ని నేను త్వరలో బబులోను రాజుకు ఇవ్వబో తున్నాను. నెబుకద్నెజరు ఈ నగరాన్ని స్వధీనపర్చుకుంటాడు. కల్దీయుల సైనికుల నుండి యూదా రాజైన సిద్కియా తప్పించుకోలేడు. అతడు నిశ్చయంగా బబులోను రాజుకు అప్పగించబడతాడు. సిద్కియా బబులోను రాజుతో ఎదురుపడి ముఖాముఖిగా మాట్లాడుతాడు. సిద్కియా స్వయంగా అతనిని తన కన్నులతో చూస్తాడు. బబులోను రాజు సిద్కియాను బబులోనుకు తీసికొని పోతాడు. సిద్కియాను. నేను శిక్షించేవరకు అతనక్కడ ఉంటాడు.’ ఇదే యెహోవా వాక్కు. ‘నీవు కల్దీయుల సైన్యంతో పోరాడినా నీవు గెలవలేవు.’ ”)
యిర్మీయా బందీగా వుండగా అతనిలా చెప్పాడు, “యెహోవా సందేశం నాకు అందినది. ఆ సందేశం ఇలా ఉంది: నీ పినతండ్రి కుమారుడైన హనమేలు త్వరలో నీ వద్దకు వస్తాడు. అతడు నీ తండ్రి సోదరుడైన షల్లూము కుమారుడు హనమేలు నీ వద్దకు వచ్చి. ‘అనాతోతు వద్ధ నున్న తన పొలం కొనమని నిన్ను అడుగుతాడు. నీవు అతని దగ్గరి బంధువు గనుక తన పొలం కొనమని అడుగుతాడు. ఆ పొలాన్ని కొనటానికి నీకు హక్కు ఉన్నది. అది నీ బాధ్యత అయి కూడ ఉంది’ అని అంటాడు.
“తరువాత యెహోవా చెప్పినట్లే జరిగింది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు రక్షక భటుని ఆవరణలోనున్న నా యొద్దకు వచ్చాడు. హనమేలు నాతో ఇలా అన్నాడు, ‘యిర్మీయా, అనాతోతు పట్టణం వద్ద నున్న నా పొలాన్ని కొను. ఆ పొలం బెన్యామీను వంశం వారి రాజ్యంలో వుంది. నీవా పొలం కొనుగోలు చేయి. ఎందుకంటే అది నీవు కొని స్వంతం చేసికొనే హక్కు నీకుంది.’ ”
అయితే ఇది యెహోవా నుండి వర్తమానం అని నాకు అర్థమయ్యింది. అనాతోతు వద్ద వున్న పొలాన్ని నా పినతండ్రి కుమారుడైన హ నమేలు నుండి కొన్నాను. దాని వెలగా పదునేడు తులాల వెండిని తూచి ఇచ్చినాను. 10 క్రయ దస్తావేజు మీద సంతకం చేశాను దాని ప్రతినొక దానిని తీసికొని ముద్రవేయించాను. ఇందుకు సాక్షులను కూడా నియమించాను. వారి ఎదుట వెండిని తూచ్చాను. 11 మడత పెట్టి ముద్ర వేసిన దస్తావేజును, ముద్ర వేయించి దాని ప్రతిని నేను తీసికున్నాను. 12 తరువాత వాటిని నేను బారూకునకు ఇచ్చినాను. బారూకు అనేవాడు నేరీయా కుమారుడు. నేరీయా అనేవాడు మహసేయా అను వాని కుమారుడు. ముద్ర వేసి మూసిన క్రయ దస్తావేజులో నేను పొలం ఖరీదు చేసిన నియమ నిబంధనావళి ఉంది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు, మరియు ఇతర సాక్షుల యొదట నేనా దస్తావేజులను బారూనకు ఇచ్చాను. ఆ సాక్షులు కూడా దస్తావేజుల మీద సంతకాలు చేశారు. ఆ ఆవరణలో కూర్చుని వున్న అనేక మంది యూదా ప్రజలు కూడా నేను బారుకునకు దస్తావేజులను అప్పగించటం చూశారు.
13 ఆ ప్రజలంతా చూస్తూ ఉండగా, నేను బారూకుతో ఇలా చెప్పాను: 14 “సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పుచున్నాడు: ‘ముద్ర వేసిన, ముద్ర వేయని దస్తావేజుల రెంటిని నీవు తీసికొని ఒక మట్టి కుండలో భద్రం చేయుము. ఆ దస్తావేజులు ఎక్కువ కాలం సురక్షితంగా ఉండేలాగున నీవు ఆ విధంగానే చేయుము.’ 15 ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడునగు యెహోవా ఇలా అంటున్నాడు: ‘భవిష్యత్తులో నా ప్రజలు తిరిగి ఇండ్లను, పొలాలను, ద్రాక్షతోటలను ఇశ్రాయేలులో కొనుగోలు చేస్తారు.’ ”
16 నేరీయా కుమారుడైన బారూకునకు దస్తావేజులను ఇచ్చిన పిమ్మట నేను దేవుని ప్రార్థించాను. నేనిలా అన్నాను:
 
17 “యెహోవా నా దేవా, చాపబడిన నీ బల ప్రభావాలచే నీవీ భూమ్యాకాశాలను సృష్టించావు. తిరుగులేని నీ మహిమచే వాటిని నీవు సృష్టించినావు. నీవు చేసే పనులలో నీకు ఆశ్చర్యకరమైనది, అసాధ్యమైనది ఏదియు లేదు. 18 యెహోవా, నీవు వేలాది ప్రజలకు దయా మయుడవు, నమ్మకస్తుడవు అయివున్నావు. కాని పెద్దల తప్పులకు వారి పిల్లలను కూడా శిక్షింపగలవాడవు. మహోన్నతుడవు, శక్తి సంపన్నుడవు, సర్వశక్తిమంతుడైన యెహోవా అని నీకు పేరు. 19 దేవా, నీవు యోచించి ఘనమైన కార్యాలు సాధిస్తావు. ప్రజలు చేసే ప్రతీ పనినీ నీవు చూస్తావు. మంచి పనులు చేసేవారికి ప్రతిఫలాలిస్తావు. చెడుకార్యాలు చేసే వారికి తగిన శిక్ష విధిస్తావు. 20 యెహోవా, ఈజిప్టు రాజ్యంలో నీవు అమోఘమైన అద్భుతాలు జరిపించినావు. ఈ నాటి వరకు నీవు నీ శక్తివంతమైన కార్యాలు జరిపిస్తూనే ఉన్నావు. ఆ పనులు నీవు ఇశ్రాయేలులో మాత్రమే గాక, నీ ప్రజలు ఎక్కడ వుంటే అక్కడ నీవా అధ్భత కార్యాలు చేశావు. వీటి కారణంగా నీవు మిక్కిలి ఘనత వహించినావు. 21 యెహోవా, నీవు ఎన్నో మహాశక్తిగల అధ్భుతాలు జరిపించి, ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి బయటికి తీసికొని వచ్చావు. నీ శక్తవంతమైన హస్తాన్ని వినియోగించి నీవీ పనులు చేశావు! నీ శక్తి అశ్ఛర్యాన్ని కలుగ జేస్తూఉంది!
22 “యెహోవా, నీవీ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకిచ్చావు. ఈ దేశాన్ని ఇస్తానని వారి పితరులకు నీవు ఏనాడో వాగ్దానం చేశావు. ఈ దేశం మిక్కిలి చాలా మంచిది. ఇది ఎన్నో మంచి వస్తువులతో నిండివున్నది. 23 ఇశ్రాయేలీయులు ఈ దేశంలోనికి వచ్చి దీనిని వారు స్వంతం చేసికున్నారు. కాని ఆ ప్రజలే నీకు విధేయులు కాకుండా పోయారు. వారు నీ బోధనలను అనుసరించ లేదు. నీవు ఆజ్ఞాపించినట్లు వారు నడుచుకోలేదు. అందువల్లనే ఇశ్రాయేలు ప్రజలకు ఈ భయంకర మైనవన్నీ జరిగేటట్టు నీవు చేశావు.
24 “మరియు ఇప్పుడు శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు. యెరూషలేము నగర ప్రాకారం చుట్టూ దిమ్మలు, మెట్లు నిర్మిస్తున్నారు. తద్వారా వారు నగరపు గోడలు సులభంగా ఎక్కి నగరాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు. శత్రువుల కత్తుల మూలంగా కరువులు, రోగాలు మొదలైన ఈతి బాధల కారణంగా, కల్దీయుల సైన్యం యోరూషలేము నగరాన్ని ఓడిస్తుంది. ఇప్పుడు బబులోను సైన్యం నగరాన్ని ఎదుర్కొంటూ వుంది! యెహోవా, ఇది జరుగుతుందని నీవు చెప్పావు. పైగా అది నీవు చూస్తూ వుండగానే జరుగుతూ ఉంది.
25 “నా యెహోవా ప్రభువా, ఆపద ముంచుకు వస్తున్నది. కాని, నీవు నాతో, ‘యిర్మీయా, వెండినిచ్చి పొలం కొనమనీ, ఆ కొనుగోలుకు సాక్షులను నియమించ!’ మనీ చెపుతున్నాను. కల్దీయుల సైన్యం నగరాన్ని కైవసం చేసికోడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నీవు నాకీ విషయం చెపుతున్నావు. నా ధనం అలా ఎందుకు వృధా చేయాలి?”
 
26 అప్పుడు యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది: 27 “యిర్మీయా, నేనే యెహోవాను, ఈ భూమి మీద ప్రతి వానికి నేనే దైవాన్ని. యిర్మీయా, నాకు అసాధ్యమైనదేదీ లేదని నీకు తెలుసు.” 28 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “యెరూషలేము నగరాన్ని నేను అతి త్వరలో కల్దీయుల సైన్యానికి, బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. ఆ సైన్యం నగరాన్ని పట్టుకుంటుంది. 29 కల్దీయుల సైన్యం ఇప్పటికే యెరూషలేము నగరాన్ని! ఎదుర్కొంటూ వుంది. వారు త్వరలో నగరం ప్రవేశించి నిప్పు పెడతారు. వారీ నగరాన్ని తగులబెడతారు. బూటకపు దేవతైన బయలుకు ప్రజలు ఇండ్ల పైకప్పులపై బలులు అర్పించారు. అలా నాకు కోపం తెప్పించిన కొన్ని ఇండ్లు ఈ నగరంలో వున్నాయి. విగ్రహాలకు మద్యం సమర్పించి పూజించిన వారు కూడ ఉన్నారు. ఆ నివాసములన్నిటినీ కల్దీయుల సైన్యం తగుల బెడుతుంది. 30 ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను నేను గమనిస్తూవున్నాను. వారు చేసే ప్రతీదీ దుష్టకరమైనది! వారి చిన్నతనం నుండి వారు చెడు కార్యాలకు పాల్పడ్డారు. ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం తెప్పించారు. చేతులతో చేసిన విగ్రహాలను పూజించి ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం కలుగజేశారు!” ఇది యెహోవా వాక్కు. 31 “యెరూషలేము కట్టబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నగర ప్రజలు నాకు కోపం కల్గిస్తూనే ఉన్నారు. ఈ నగరం నాకెంతో కోపం తెప్పించింది. కావున నేను దానిని నా దృష్టి పథం నుండి తొలగిస్తాను. 32 ఇశ్రాయేలు, యూదా ప్రజలు చేసిన చెడు కార్యాల కారణంగా నేను యెరూషలేము నగరాన్ని నాశనం చేస్తాను. ప్రజలు, రాజులు, నాయకులు, వారి యాజకులు, ప్రవక్తలు, యూదాప్రజలు, యెరూషలేము నగర వాసులు అందరూ నాకు కోపం కలుగజేశారు.
33 “ఆ ప్రజలు సహాయం కొరకు నన్ను చేరవలసింది. కాని వారు నాకు విముఖులైనారు. వారికి నేను పదే పదే బుద్ధి చెప్ప చూశాను. కాని వారు నా మాట వినిపించుకోలేదు. నేను వారిని సరిజేయ చూశాను. అయినా వారు పట్టించుకోలేదు. 34 వారు విగ్రహాలను చేస్తూనే వచ్చారు. నేనా విగ్రహాలను ఏవగించుకున్నాను. పైగా నా పేరు మీద పిలవబడే ఆలయంలో వారా విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ విధంగా వారు నా మందిరాన్ని ‘అపవిత్రం’ చేశారు.
35 “బెన్‌హిన్నోము లోయలో వారు బూటకపు దేవత బయలుకు ఉన్నత పూజా స్థలాలు ఏర్పాటు చేశారు. వారా పూజా స్థలాలలో తమ కుమారులను, కుమార్తెలను శిశు బలులుగా మొలెకుకు సమర్పించటానికి ఏర్పాటు చేశారు. అటువంటి భయంకరమైన పని చేయమని నేనెప్పుడు ఆజ్ఞ ఇవ్వలేదు! అటువంటి ఘోరమైన పని యూదా ప్రజలు చేస్తారని కూడా నేనెప్పుడు అనుకోలేదు!
36 “మీ ప్రజలిలా అంటున్నారు, ‘బబులోను రాజు యెరూషలేమును పట్టుకుంటాడు. అతడు కత్తని వినియోగిస్తాడు. కరువు, రోగాలు ఆవరిస్తాయి. ఈ నగరాన్ని ఓడించటానికి అతనికి అవి తోడ్పడుతాయి.’ కాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: 37 ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలను తమ దేశం వదిలి పోయేలా నేనే ఒత్తిడి చేశాను. నేను వారి పట్ల మిక్కిలి కోపగించియున్నాను. కాని వారందరిని నేను మరల ఈ ప్రదేశానికి తీసికొని వస్తాను! నేను బలవంతంగా పంపిన అన్ని దేశాల నుండి వారిని మరల కూడదీస్తాను. కూడదీసి ఈ దేశానికి మరల తీసికొనివస్తాను. వారు శాంతి కలిగి జీవించేలా చేస్తాను. 38 ఇశ్రాయేలు, యూదా ప్రజలు నా ప్రజలుగా వర్ధిల్లుతారు. నేను వారి దేవుడనవుతాను. 39 వాస్తవంగా వారంతా ఒకే ప్రజగా జీవించాలనే ఆకాంక్ష నేను వారిని కలిగిస్తాను. వారంతా తమ జీవితాంతం నిజంగా నన్నే ఆరాధించాలనే ధ్యేయ్యం కలిగివుంటారు. నన్ను ఆరాధించి, గౌరవించటం వారికిని, వారి పిల్లలకు మంచిని చేస్తుంది.
40 “ ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలతో నేనొక ఒడంబడిక కుదుర్చుకుంటాను. ఈ నిబంధన శాశ్వతంగా ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం నేనెప్పుడూ వారికి దూరం కాను. నేను వారికెప్పుడు సుముఖంగా ఉంటాను. వారు నన్ను గౌరవించాలనే కోరికతో ఉండేలా చేస్తాను. వారిక ఎన్నడూ నాకు విముఖులు కారు. 41 వారు నన్ను సంతోష పర్చుతారు. వారికి మేలు చేయటానికి నేనెంతో ఉత్సాహం చూపిస్తాను. వారిని ఖచ్చితంగా ఈ దేశంలో నాటి వారు బాగా ఎదిగేలా తోడ్పడతాను. ఇది నా పూర్ణ హృదయంతోను, ఆత్మ సాక్షిగాను చేస్తాను.’ ”
42 యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఈ మహా విపత్తును నేనే సంభవింపజేశాను. అదే మాదిరి నేను వారికి మేలు కూడా చేస్తాను. వారికి శుభం కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాను. 43 ప్రజలు, ఈ దేశం వట్టి ఎడారి భూమి. ఇందులో మనుష్యులు, లేరు జంతువులు గాని లేవు. కల్దీయుల సైన్యం ఈ దేశాన్ని నాశనం చేసింది లేదు. అని అనుకుంటాను. కాని భవిష్యత్తులో ప్రజలు మళ్లీ ఇక్కడ పొలాలు కొంటారు. 44 ప్రజలు తమ ధనాన్ని వెచ్చించి పంట భూములు కొంటారు. ప్రజలు తమ క్రయదస్తావేజులపై సంతకాలు చేసి వాటిపై ముద్రలు వేసి భద్ర పరుస్తారు. ప్రజలు తమ దస్తావేజులపై సంతకాలు చేయునట్లు సాక్షులను నియమిస్తారు. బెన్యామీను వంశస్తులు నివసించే ప్రాంతంలో కూడా ప్రజలు మళ్లీ భూములు కొంటారు వారు యెరూషలేము చుట్టుపట్ల పొలాలు కొంటారు. వారు యూదా పట్టణ ప్రాంతాలలోను, మన్య ప్రాంతాల లోను, పడమటి కొండవాలు ప్రాంతంలోను, మరియు దక్షిణ ఎడారి ప్రాంతంలోను భూములు కొంటారు. మీ ప్రజలందరిని నేను తిరిగి స్వదేశానికి తీసికొని వస్తాను. గనుక ఇదంతా జరుగుతుంది.” ఈ సందేశం యెహోవా నుండి వచ్చినది.
* 32:1 యూదా … పదవ సంవత్సరం ఇది క్రీ. పూ. 588-587వ సంవత్సరంలోనే నెబుకద్నెజరు యెరూషలేమును నాశనంచేశాడు. 32:35 బెన్ హిన్నోము ఈ లోయను ‘గెహెన్నా’ అని కూడా అంటారు. ఈ పేరు హెబ్రీ పేరు ‘గేహిన్నోము – హిన్నోము యొక్క లోయ’ అను పదంనుండి వచ్చింది. దుష్టులను దేవుడు ఎలా శిక్షిస్తాడో చూపటానికి ఈ ప్రదేశం ఒక ఉదాహరణ అయ్యింది.