10
సూర్యుడు కదలక నిలచిన రోజు
1 అప్పట్లో అదోనీసెదెకు యెరూషలేము రాజు. యెహోషువ హాయిని ఓడించి, దానిని సర్వ నాశనం చేసాడని ఈ రాజు విన్నాడు. యెరికోకు, దాని రాజుకుకూడా యెహోషువ అలానే చేసాడని ఆ రాజు తెలుసుకొన్నాడు. గిబియోను ప్రజలు ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొన్నారని, ఆ ప్రజలు యెరూషలేంకు సమీపంగానే నివసిస్తున్నారని కూడా ఆ రాజు తెలుసుకొన్నాడు.
2 అందుచేత ఈ విషయాల మూలంగా అదోనీ సెదెక్, అతని ప్రజలు చాలా భయపడ్డారు. హాయివలె గిబియోను చిన్న పట్టణం కాదు. ఏ రాజధాని పట్టణమైనా ఎంత పెద్దగా ఉంటుందో, గిబియోను అంత పెద్ద పట్టణం. మరియు ఆ పట్టణంలోని పురుషులంతా మంచి శూరులు. కనుక వారు భయపడ్డారు.
3 యెరూషలేము రాజు అదోనీసెదెక్, హెబ్రోను రాజైన హోహంతో మాట్లాడాడు. యార్మూత్ రాజైన పిరాముతో, లాకీషు రాజు యాఫీయతో, ఎగ్లోన్ రాజైన దెబీరుతో కూడా అతడు మాట్లాడాడు.
4 “మీరు నాతో కూడా గిబియోను మీద దాడి చేసేందుకు వచ్చి సహాయం చేయండి. యెహోషువతో, ఇశ్రాయేలు ప్రజలతో గిబియోను శాంతి ఒడంబడిక కుదుర్చు కొంది” అని యెరూషలేము రాజు వీళ్లను బతిమిలాడాడు.
5 అందుచేత ఈ అయిదుగురు ఆమోరీ రాజులూ వారి సైన్యాలను ఏకం చేసారు. (అయిదుగురు రాజులు ఎవరనగా, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యార్మూత్ రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు) మరియ వారి సైన్యాలు గిబియోను మీదికి వెళ్లాయి. ఆ సైన్యాలు పట్టణాన్ని చుట్టు ముట్టడించి, దానిమీద పోరాటం మొదలు పెట్టాయి.
6 గిల్గాలులో తన పాళెములో ఉన్న యెహోషువ దగ్గరకు గిబియోను పట్టణం లోని ప్రజలు సందేశం పంపించారు. “మేము నీ సేవకులము. మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకు. వచ్చి మాకు సహాయంచేయి. త్వరపడు. మమ్మల్ని రక్షించు. కొండ దేశంలోని అమోరీ రాజులంతా వారి సైన్యాలను ఏకంచేసారు. మామీద వాళ్లు యుద్ధం చేస్తున్నారు” ఇదీ ఆ సందేశం.
7 కనుక యెహోషువ తన సైన్యం అంతటితో గిల్గాలునుండి బయల్దేరాడు. యెహోషువ యొక్క మంచి శూరులంతా అతనితో ఉన్నారు.
8 యెహోవా, “ఆ సైన్యాల విషయమైన భయపడకు. నీవు వాళ్లను జయించేటట్టు నేను చేస్తాను. ఆ సైన్యాల్లో ఏదీ నిన్ను జయించజాలదు” అని యెహోషువతో చెప్పాడు.
9 యెహోషువ, అతని సైన్యం రాత్రంతా గిబియోనుకు ప్రయాణం చేసారు. (యెహోషువ వస్తున్నట్టు శత్రువుకు తెలియదు.) అందుచేత యెహోషువ వారిమీద దాడి చేసి వాళ్లకు ఆశ్చర్యం కలిగించాడు.
10 ఇశ్రాయేలీయులు దాడి చేసినప్పుడు అవతలి సైన్యాలను యెహోవా చాల గలిబిలి చేసాడు. కనుక ఇశ్రాయేలీయులు గొప్ప విజయంతో వారిని ఓడించారు. ఇశ్రాయేలీయులు గిబియోనునుండి వారిని తరిమివేసారు. బేత్‌హోరోను మార్గంవరకు ఇశ్రాయేలీయులు వారిని తరిమివేసారు. అజెకా, మక్కెదా వరకు ఇశ్రాయేలు సైన్యం ఆ మనుష్యుల్ని చంపారు.
11 ఇశ్రాయేలు సైన్యం వారి శత్రువుల్ని బెత్హారాన్ నుండి అజెకావరకు దారి పొడవునా తరిమారు. వారు శత్రువును తరుముతూ ఉండగా, యెహోవా ఆకాశంనుండి పెద్ద వడగండ్లు కురిపించాడు. ఈ పెద్ద వడగండ్ల మూలంగా శత్రువులు అనేకమంది చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఖడ్గంతో చంపిన వారికంటె ఈ వడగండ్ల మూలంగానే చాల ఎక్కువమంది మరణించారు.
12 ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలను ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. మరియు ఆ రోజు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నిలిచి యెహోవాతో ఇలా చెప్పాడు:
“ఓ సూర్యుడా, గిబియోనుకు పైగా ఆకాశంలో నిలిచి ఉండు,
ఓ చంద్రుడా, అయ్యాలోను లోయలో నిలిచి ఉండు.”
13 కనుక సూర్యుడు కదలలేదు. ప్రజలు తమ శత్రువులను ఓడించేంతవరకు చంద్రుడు కూడ నిలిచిపోయాడు. ఇది యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆకాశం మధ్యలో సూర్యుడు స్తంభించిపోయాడు. ఒక రోజంతా అది కదల్లేదు.
14 ఆ రోజుకు ముందు ఎన్నడూ అలా జరుగలేదు. ఆ తర్వాత కూడ ఎన్నడూ మళ్లీ అలా జరుగలేదు. ఆ రోజు మనిషి మాట యెహోవా విన్నరోజు. నిజంగా ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవా యుద్ధం చేసాడు!
15 ఇది జరిగిన తర్వాత యెహోషువా, అతని సైన్యం తిరిగి గిల్గాలు దగ్గర గుడారాలకు వెళ్లిపోయారు.
16 యుద్ధ సమయంలో ఆ అయిదుగురు రాజులూ పారిపోయారు. మక్కెదా సమీపంలో ఒక గుహలో వారు దాగుకొన్నారు.
17 అయితే ఆ అయిదుగురు రాజులు ఆ గుహలో దాగుకోవటం ఎవరో కనుక్కొన్నారు. యెహోషువకు ఈ విషయం తెలిసింది.
18 యెహోషువ చెప్పాడు, “ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండలతో మూసివేయండి. ఆ గుహకు కాపలాగా కొందరు మనుష్యుల్ని అక్కడ ఉంచండి.
19 కానీ మీరు అక్కడ ఉండొద్దు. శత్రువును తరుముతూనే ఉండండి. వెనుకనుండి వారిమీద మీ దాడి కొనసాగించండి. శత్రువుల్ని తిరిగి పట్టణాలకు క్షేమంగా వెళ్లనీయకండి. మీ యెహోవా దేవుడు వారిమీద మీకు విజయం ఇచ్చాడు.”
20 కనుక యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలూ శత్రువులను చంపేసారు. అయితే శత్రువులు కొందరు తప్పించుకొని, వారి పట్టణాలకు వెళ్లి దాగుకోగలిగారు. వీళ్లు చంపబడలేదు.
21 పోరాటం అయిపోయిన తర్వాత యెహోషువ మనుష్యులు మక్కెదా దగ్గర అతని దగ్గరకు తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఒక్కమాట పలికే ధైర్యంగలవాళ్లు ఆ దేశంలో ఒక్కరూ లేకపోయారు.
22 యెహోషువ చెప్పాడు, “గుహను మూసిన బండలను తీసివేసి, ఆ అయిదుగురు రాజులనూ నా దగ్గరకు తీసుకొని రండి” అని.
23 కనుక యెహోషువ మనుష్యులు ఆ అయిదుగురు రాజులనూ గుహలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. ఈ అయిదుగురు రాజులూ యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు.
24 కనుక ఆ ఐదుగురు రాజులనూ వారు యెహోషువ దగ్గరకు తీసుకొని వచ్చారు. యెహోషువ తన మనుష్యులందరినీ ఆ చోటుకి పిలిచాడు. “ఇక్కడికి వచ్చి, ఈ రాజుల మెడలమీద మీ పాదాలు పెట్టండి” అని తన సైన్యాధికారులతో యెహోషువ చెప్పాడు. అందుచేత యెహుషువ సైన్యాధికారులు దగ్గరగా వచ్చారు. వారు ఆ రాజుల మెడలమీద తమ పాదాలు పెట్టారు.
25 అప్పుడు యెహోషువ: “బలంగా, ధైర్యంగా ఉండండి. భవిష్యత్తులో మీరు యుద్ధం చేసే శత్రువులందరికీ యెహోవా ఏమి చేస్తాడో నేను మీకు చూపిస్తాను” అన్నాడు తన మనుష్యులతో.
26 అప్పుడు యెహోషువ ఆ అయిదుగురు రాజులనూ చంపేసాడు. అతడు వారి శరీరాలను ఐదు చెట్లకు వేలాడదీసాడు. యెహోషువ వాళ్లను అలానే సాయంత్రంవరకు చెట్లకు వేలాడనిచ్చాడు.
27 సూర్యాస్తమయమప్పుడు ఆ శవాలను చెట్లనుండి దించమని యెహోషువ తన మనుష్యులతో చెప్పాడు. అప్పుడు వారు ఆ శవాలను, అంతకు ముందు వారు దాగుకొన్న గుహలోనే పడవేసారు. ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండలతో వారు మూసివేసారు. నేటికీ ఆ శవాలు ఆ గుహలోనే ఉన్నాయి.
28 ఆ రోజు యెహోషువ మక్కెదాను జయించాడు. ఆ పట్టణంలోని రాజును, ప్రజలను యెహోషువ చంపేసాడు. మనుష్యులు ఎవ్వరూ ప్రాణాలతో విడిచి పెట్టబడలేదు. యెరికో రాజుకు చేసినట్టే మక్కెదా రాజుకు యెహోషువ చేసాడు.
దక్షిణ ప్రాంతాలను ఓడించటం
29 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ మక్కెదానుండి ప్రయాణం చేసారు. వారు లిబ్నా వెళ్లి ఆ పట్టణంపై దాడి చేసారు.
30 ఆ పట్టణాన్ని, దాని రాజును ఇశ్రాయేలు ప్రజలు ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తినీ ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. మనుష్యులెవ్వరూ ప్రాణాలతో విడువబడలేదు. మరియు ప్రజలు యెరికో రాజుకు చేసినట్టే ఆ రాజుకుకూడ చేసారు.
31 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ లిబ్నా విడిచి, లాకీషుకు ప్రయాణమయ్యారు. యెహోషువ, అతని సైన్యం లిబ్నా దగ్గర్లోనే ఉండి, ఆ పట్టణం మీద దాడి చేసారు.
32 ఇశ్రాయేలు ప్రజలు లాకీషు పట్టణాన్ని ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. వారు ఆ పట్టణాన్ని రెండో రోజున ఓడించారు. ఆ పట్టణంలో ప్రతి వ్యక్తినీ ఇశ్రాయేలు ప్రజలు చంపేసారు. లిబ్నాకు అతడు చేసిందికూడ ఇదే.
33 ఇదే సమయంలో గెజెరు రాజైన హోరాము, లాకీషుకు సహాయం చేసేందుకు వచ్చాడు. కానీ అతణ్ణి, అతని సైన్యాన్ని కూడ యెహోషువ ఓడించాడు. అక్కడ మనుష్యులు ఎవరూ బతికి బయటపడలేదు.
34 అప్పుడు యెహోషువ, అతని ప్రజలు అందరూ లాకీషునుండి ఎగ్లోనుకు ప్రయాణ మయ్యారు. వారు ఎగ్లోను చుట్టు పక్కల బసచేసి దానిమీద దాడిచేసారు.
35 ఆ రోజు వారు ఆ పట్టణాన్ని పట్టుకొని, ఆ పట్టణంలో ప్రజలందరినీ చంపేసారు. వారు లాకీషుకు చేసిందికూడ ఇదే.
36 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఎగ్లోను నుండి హెబ్రోనుకు ప్రయాణమయ్యారు. అప్పుడు వారు హెబ్రోను మీద దాడి చేసారు.
37 ఆ పట్టణాన్ని, హెబ్రోను చుట్టుపట్ల ఉన్న చిన్న చిన్న ఊళ్లను వారు పట్టుకొన్నారు. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ ఇశ్రాయేలు ప్రజలు చంపేసారు. అక్కడ ఏ ఒక్కరినీ వారు బ్రతకనియ్యలేదు. వారు ఎగ్లోనుకు చేసింది కూడ ఇదే. వారు ఆ పట్టణాన్ని నాశనంచేసి, అందులోని ప్రజలందరినీ చంపివేసారు.
38 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ తిరిగి దెబీరుకు వెళ్లి, ఆ పట్టణం మీద దాడి చేసారు.
39 వారు ఆ పట్టణాన్ని, దాని రాజును, దెబీరు సమీపంలోవున్న చిన్న చిన్న పట్టణాలన్నింటినీ స్వాధీనం చేసుకొన్నారు. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ వారు చంపేసారు. అక్కడ ఎవరినీ బ్రతకనియ్యలేదు. హెబ్రోనుకు, దాని రాజుకు చేసినట్టే, దెబీరుకు, దాని రాజుకు ఇశ్రాయేలు ప్రజలు చేసారు. లిబ్నాకు, దాని రాజుకు కూడ వారు ఇలానే చేసారు.
40 కనుక నెగెవు, కొండ ప్రాంతపు పట్టణాల రాజులందరినీ, పడమటి కొండ చరియలనూ, తూర్పు కొండ చరియలనూ, యెహోషువ ఓడించేసాడు. ఆ ప్రజలందరినీ చంపివేయుమని ఇశ్రాయేలీయుల దేవుడైన యోహోవా యోహోషువతో చెప్పాడు. అందుచేత ఆ స్థలాల్లో ఎవ్వరినీ యెహోషువ ప్రాణాలతో విడిచిపెట్టలేదు.
41 కాదేషు బర్నేయనుండి గాజా వరకు గల పట్టణాలన్నింటినీ యెహోషువ స్వాధీనం చేసుకొన్నాడు. గోషేను (ఈజిప్టు) దేశం నుండి గిబియోను వరకుగల పట్టణాలన్నింటినీ అతడు స్వాధీనం చేసుకొన్నాడు.
42 ఆ ప్రయాణంలో ఆ పట్టణాలన్నింటినీ, వాటి రాజులందరినీ యెహోషువ పట్టుకొన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేసినందువల్ల యెహోషువ ఇలా చేయగలిగాడు.
43 అప్పుడు యెహోషువ, ఇశ్రేయేలు ప్రజలు అందరు గిల్గాలు లోని వారి గుడారాలకు తిరిగి వెళ్లారు.