16
ఎఫ్రాయిము, మనష్షే వంశీయులకు భూములు
1 యోసేపు కుటుంబానికి లభించిన దేశం ఇది. ఈ దేశం యెరికో సమీపాన యోర్దాను నది దగ్గర ప్రారంభమై యెరికో జలాల వరకు కొనసాగింది. (ఇది యెరికోకు సరిగ్గా తూర్పున ఉంది) ఆ సరిహద్దు యెరికోనుండి పైకి, బేతేలు కొండ ప్రాంతంవరకు వ్యాపించింది.
2 తర్వాత ఆ సరిహద్దు బేతేలు (లూజు)నుండి అతరోత్ వద్ద సరిహద్దువరకు కొనసాగింది.
3 తర్వాత ఆ సరిహద్దు అర్కీయ పశ్చిమాన యాఫ్లెతీయ ప్రజల సరిహద్దువైపు పోయింది. దిగువ బెత్‌హరను వరకూ ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు గెజెరుకు పోయి, సముద్రం వరకు వ్యాపించింది.
4 కనుక మనష్షే, ఎఫ్రాయిం ప్రజలకు వారి భూమి లభించింది. (మనష్షే, ఎఫ్రాయిము యోసేపు కుమారులు)
5 ఎఫ్రాయిము ప్రజలకు ఇవ్వబడిన భూమి ఇది: తూర్పున ఎగువ బేత్‌హోరోను సమీపంలో అతారోతు అద్దారు వద్ద వారి సరిహద్దు మొదలయింది.
6 మరియు పశ్చిమ సరిహద్దు మిస్మెతతు వద్ద మొదలయింది. ఆ సరిహద్దు తూర్పున తానతు షిలోహుకు మళ్లి, యానోయకు విస్తరించింది.
7 అప్పుడు ఆ సరిహద్దు యానోయనుండి క్రిందికి అతారోతు మరియు నారాకు వెళ్ళింది. ఆ సరిహద్దు యెరికోను తాకి, యోర్దాను నది దగ్గర నిలిచిపోయేంతవరకు కొనసాగింది.
8 ఆ సరిహద్దు తప్పూయ మొదలుకొని కానా ఏటివరకు పశ్చిమంగా వ్యాపించి, సముద్రం దగ్గర అంతమయింది. అది మొత్తం ఎఫ్రాయిము ప్రజలకు ఇవ్వబడిన దేశం. ఆ వంశంలోని ఒక్కో కుటుంబానికి ఈ దేశంలో కొంత భాగం దొరికింది.
9 ఎఫ్రాయిము వారి సరిహద్దు పట్టణాలు అనేకం నిజానికి మనష్షే వారి సరిహద్దుల్లోనే ఉన్నాయి. కానీ ఆ పట్టణాలు, ఆ పొలాలు ఎఫ్రాయిము వారికే వచ్చాయి.
10 అయితే గెజరు పట్టణంనుండి కనానీ ప్రజలను ఎఫ్రాయిము ప్రజలు వెళ్లగొట్టలేకపోయారు. కనుక నేటికీ ఎఫ్రాయిము ప్రజల మధ్య కనానీ ప్రజలు నివసిస్తున్నారు. కానీ కనానీ ప్రజలు ఎఫ్రాయిము ప్రజలకు బానిసలుగా అయ్యారు.