8
రాజు మరియు షూనేము స్త్రీ
ఎవరి కొడుకునైతే సజీవునిగా ఎలీషా చేసేనో, ఆ స్త్రీతో ఎలీషా మాటలాడెను. ఎలీషా చెప్పాడు. “నీవు నీ కుటుంబము మరొక దేశానికి వెళ్లాలి. ఎందుకనగా, ఇక్కడ కరువుకాలం ఏర్పాడుతుందని యెహోవా నిశ్చయించినాడు. ఈ విధమైన కరువు ఈ దేశంలో ఏడు సంవత్సరముల పాటు ఉంటుంది.”
అందువల్ల ఆ స్త్రీ దేవుని మనిషి చెప్పినట్లుగా చేసింది. తన కుటుంబంతో ఆమె ఫిలిష్తీయుల దేశంలో ఏడేండ్లు ఉండటానికి వెళ్లింది. ఆ ఏడు సంవత్సరములు పూర్తి అయిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంనుంచి తిరిగి వచ్చింది.
ఆ స్త్రీ రాజుతో మాట్లడడానికి వెళ్లింది. తన ఇల్లు తన పొలము తనకు చేరునట్లుగా కోరుటకే ఆమె వెళ్లింది.
దేవుని వ్యక్తికి (ఎలీషా) సేవకుడైన గేహజీతో రాజు మాట్లాడుతూ ఉన్నాడు. రాజు విధంగా అడిగాడు: “దయచేసి ఎలీషా చేసిన గొప్ప కార్యాలను తెలుపండి.”
మృతజీవి ఒకనిని సజీవునిగా ఎలీషా చేసెనన్న విషయాన్ని గేహజీ రాజుకి చెప్పుచున్నాడు. ఆ సమయాన తన కొడుకుని ఎలీషా బ్రతికింపజేసిన ఆ స్త్రీ రాజువద్దకు పోయింది. తన పొలమూ తన యీల్లూ తాను పొందుటకు సహాయం చేయుమని రాజుని అడగటానికి ఆమె వెళ్లింది. గేహాజీ, “నా ప్రభువా, రాజా, ఈమెయే ఆ స్త్రీ. ఇతడే ఎలీషా బ్రతికించిన ఆ కుమారుడు” అని చెప్పాడు.
ఏమి కావలెనో చెప్పమని రాజు ఆమెని అడిగాడు. ఆ స్త్రీ రాజుతో చెప్పింది.
తర్వాత ఆ స్త్రీ కి సహాయము చేయడానికై రాజు ఒక అధికారిని ఎన్నుకున్నాడు. “ఆమెకున్నదంతా ఆమెకు వచ్చేలా చేయండి. ఆమె దేశం విడిచిపెట్టిన నాటినుంచీ నేటిదాకా కోతలవల్ల ఆమెకు రావలసినదంతా ఇప్పించడి” అని చెప్పాడు.
బెన్హదదు హజాయేలును ఎలీషా వద్దకు పంపుట
ఎలీషా దమస్కుకు వెళ్లాడు. సిరియా రాజయిన బెన్హదదు జబ్బుతో వున్నాడు. “దేవుని వ్యక్తి ఇచ్చటికి వచ్చాడు.” అని ఒకడు బెన్హదదుకు చెప్పాడు.
అప్పుడు బెన్హదదు హజాయేలుతో ఇట్లన్నాడు: “ఒక కానుక తీసుకొని దేవుని వ్యక్తిని కలుసుకొనుము. నేను నా జబ్బునుండి కోలుకొందునో లేదో అతడు యెహోవాని అడగమని అతనితో చెప్పుము.”
అందువల్ల హజాయేలు ఎలీషాని కలుసు కొనడానికి వెళ్లాడు. తనతో పాటు హజాయేలు కానుకలు తెచ్చాడు. దమస్కు నుండి అతడు అన్ని రకాల మంచి వస్తువులు తెచ్చాడు. వాటిని మోయడానికి 40 ఒంటెలు కావలసిన వచ్చింది. హజాయేలు ఎలీషా వద్దకు పోయాడు. “నీ అనుచరుడైన* సిరియా రాజు నన్ను నీ వద్దకు పంపించాడు. ఆయన జబ్బునుండి కోలు కొనునో లేదో అడగమని, నన్ను పంపెను,” అని హజాయేలు చెప్పాడు.
10 అప్పుడు ఎలీషా, “నీవు బాగుపడెదవని బెన్హదదుతో చెప్పు. కాని నీవు చనిపోదువని నిజముగా యెహోవా నాతో చెప్పాడు.” అన్నాడు.
హజాయేలుకి సంబంధించి ఎలీషా ఒక ప్రవచనము చెప్పుట
11 ఎలీషా పైకి క్రిందికి చూడసాగాడు. హజాయేలు ఇబ్బందిలో పడేంతవరకూ అతను చూసెను. దైవజనుడు ఏడవసాగెను. 12 “అయ్యా, మీరెందుకు ఏడుస్తున్నారు?”
అని హజయేలు అడిగాడు. “ఇశ్రాయేలు వారికి మీరేమి చెడుపనులు చేయగలరో తెలిసి నేను ఏడుస్తున్నాను. మీరు వారి బలమైన నగరాలను దగ్ధం చేస్తారు. ఖడ్గాలతో మీరు ఆ యువకులను చంపుతారు. వారి పసిపిల్లలను కూడా మీరు హతమారుస్తారు. మీరు వారి గర్భవతులను చీల్చి వేస్తారు” అని ఎలీషా సమాధానం చెప్పాడు.
13 హజయేలు “నేను శక్తిమంతుడను కానని చెప్పాడు. ఈ గొప్ప విషయాలు నేను చేయలేను.”
“నీవు సిరియా రాజువి కాగలవని యెహోవా చూపాడు.” అని ఎలీషా సమాధాన మిచ్చాడు.
14 ఆ తర్వాత హజయేలు ఎలీషాని విడిచి తన రాజు వద్దకు వెళ్లాడు. “ఎలీషా నీతో ఏమి చెప్పాడు?” అని బెన్హదదు హజయేలును అడిగాడు.
“నీవు జీవించెదవు అని ఎలీషా చెప్పాడు” అని హజయేలు చెప్పాడు.
హజాయేలు బెన్హదదును హత్య చేయుట
15 కాని ఆ మరునాడే హజాయేలు ఒక ముతక వస్త్రం తీసుకుని దాన్ని నీటిలో తడిపాడు. తర్వాత బెన్హదదు ముఖాన్ని కప్పివేసి, వుక్కిరి బిక్కిరి చేయడంలో అతడు మరణించాడు. హజాయేలు కొత్తగా రాజు అయ్యాడు.
యెహోరాము తన పాలన ప్రారంభించుట
16 ఇశ్రాయేలుకు రాజైన అహాబు కొడుకు యెహోరాము పరిపాలనలోని, అయిదవ సంవత్సరమున, యూదా రాజైన యెహోషాపాతు కొడుకు యెహోరాము యూదాకు రాజయ్యాడు. 17 యెహోరాము పరిపాలించు నాటికి అతను ముఫ్పై రెండు యేండ్లు వాడు. యెరూషలేములో అతను ఎనిమిదేళ్ల పరిపాలించాడు. 18 కాని పూర్వపు ఇశ్రాయేలు రాజుల చెడు మార్గాలను ఇతడు అనుసరించాడు. అహాబు కుటుంబీ కులు చేసినట్లుగా యెహోవా దృష్ఠికి తప్పు అని ఎంచుబడిన చెడుకార్యాలు చేశాడు. 19 కాని తన సేవకుడైన దావీదుకు వాగ్దానం చేయడంవల్ల యెహోవా యూదాను నాశనం చేయలేదు. అతని వంశానికి చెందిన వారు ఎవరో ఒకరు ఎప్పుడూ రాజుగా వుంటారని దావీదుకు యెహోవా వాగ్దానం చేశాడు.
20 యెహోరాము కాలంలో యూదా పరిపాలన నుండి ఎదోమీయులు విడిపోయి తమకు ఒక రాజుని ఎన్నుకున్నారు.
21 అప్పుడు యెహోరాము అతని రథములన్నిటినీ తీసుకుని జాయీరుకు వెళ్లెను. రాత్రివేళ ఎదోము సైన్యము వారిని చుట్టుముట్టింది. యెహోరాము అతని అధికారులు వారిని ఎదుర్కొని, తప్పించు కున్నారు. యెహోరాము సైనికులందురు పారిపోయి తమ దేశం చేరుకున్నారు. 22 ఈ కారణంచేత ఎదోము వారు యూదా పరిపాలనకు ఎదురు తిరిగారు. అదే సమయమున లిబ్నా కూడా యూదా పరిపాలనకు ఎదురు తిరిగింది.
23 యెహోరాము చేసిన ఇతర పనులన్నియు “యూదా రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి.
24 తరువాత యెహోరాము మరణించాడు. దావీదు నగరంలో తన పూర్వికులతో పాటు అతను సమాధి చేయబడ్డాడు. యెహోరాము కుమారుడైన అహజ్యా కొత్తగా రాజయ్యాడు.
అహజ్యా తన పరిపాలన ప్రారంభించుట
25 అహాబు కుమారుడైన యెహోరాము ఇశ్రాయేలుకు రాజయిన పన్నెండవ సంవత్సరమున, యెహోరాము కుమారుడైన అహజ్యా యూదా రాజ్యానికి రాజయ్యాడు. 26 అహజ్యా పరిపాలన ప్రారంభించినప్పుడు అతని వయస్సు ఇరవైరెండు సంవత్సరములు. అతను యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు. అతని తల్లి పేరు అతల్యా. ఆమె ఇశ్రాయేలు రాజయిన ఒమ్రీ కుమార్తె. 27 యెహోవా తప్పని చెప్పిన పనులనే అహజ్యా చేశాడు. అహాబు వంశీయులవలె అహజ్యా అనేక చెడుకార్యాలు చేశాడు. అతని భార్య అహాబు వంశానికి చెందినదగుట్టచే, అహజ్యా ఈ విధంగా నివసించాడు.
హజాయేలుకు ప్రతిగా జరిగిన యుద్ధంలో యెహోరాము గాయపడుట
28 యెహోరాము అహాబు వంశానికి చెందినవాడు. సిరియా రాజయిన హజయేలుతో రామోత్గిలాదు అనేచోట యుద్ధం చేసేందుకు అహజ్యా యెహోరాముతో కలిసి వెళ్లాడు. సిరియన్లు యెహోరాముని గాయపరచిరి. 29 ఆ గాయముల నుండి బాగు పడుటకు గాను యెహోరాము రాజు ఇశ్రాయేలుకి తిరిగి వెళ్లిపోయాడు. యెహోరాము యెజ్రెయేలు అనే ప్రదేశానికి పోయాడు. యెహోరాము కుమారుడైన అహజ్యా యూదా యొక్క రాజు. అహజ్యా యెహోరాముని చూడటానికి యెజ్రెయేలు వెళ్లాడు.
* 8:9 అనుచరుడు అక్షరాల “కొడుకు”.