23
ప్రత్యేక సెలవు రోజులు
మోషేతో యెహోవా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: యెహోవా ఏర్పాటు చేసిన పండుగలను పవిత్ర సమావేశాలుగా మీరు ప్రకటించాలి. నా ప్రత్యేక దినాలు ఏవంటే:
సబ్బాతు
“ఆరు రోజులు పని చేయండి. అయితే ఏడో రోజు సబ్బాతు, అది పవిత్ర సమావేశం జరిగే రోజు. మీరేమీ పని చేయకూడదు. మీ అందరి గృహాల్లోను ఆది యెహోవా నియమించిన సబ్బాతు.
పస్కా
“ఇవి యెహోవా ఏర్పాటు చేసిన పండుగ రోజులు. నిర్ణీత సమాయాల్లో పవిత్ర సమావేశాల్ని గూర్చి మీరు ప్రకటించాలి. మొదటి నెల 14వ రోజు సాయంకాలం యెహోవా పస్కాపండుగ.
పులియని రొట్టెల పండుగ
“అదే నెల 15వ రోజు పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెలను ఏడు రోజులు మీరు తినాలి. ఈ సెలవల్లో మొదటి రోజున మీకు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. ఏడు రోజులవరకు మీరు యెహోవాకు బలి అర్పించాలి. ఏడవ రోజున ఒక పవిత్ర సమావేశం జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.”
పంటకూర్చే పండుగ
మోషేతో యెహోవా చెప్పాడు: 10 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇచ్చే దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు అక్కడ పంటలు కోస్తారు. ఆ సమయంలో మీ పంటలోని ప్రథమ పనను యాజకుని దగ్గరకు మీరు తీసుకొని రావాలి. 11 ఆ పనను యాజకుడు యెహోవా ఎదుట అల్లాడిస్తాడు. అప్పుడు మీరు స్వీకరించబడతారు. యాజకుడు ఆదివారం ఉదయం ఆ పనను అల్లాడిస్తాడు.
12 “మీరు పనను అల్లాడించే రోజున, ఒక సంవత్సరపు పోతు గొర్రె పిల్లను మీరు అర్పించాలి. ఆ గొర్రె పిల్లకు ఏ దోషం ఉండకూడదు. ఆ గొర్రెపిల్ల యెహోవాకు దహనబలి. 13 ఒలీవ నూనెతో కలిపిన రెండు పదోవంతుల పిండిని ధాన్యార్పణగా మీరు అర్పించాలి. ముప్పావు ద్రాక్షారసమును కూడా మీరు అర్పించాలి. ఆ అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసన. 14 దేవునికి ఆ అర్పణలు చెల్లించేవరకు, కొత్త ధాన్యంగాని, ఫలాలుగాని, లేక కొత్త ధాన్యంతో చేయబడిన రొట్టెగాని మీరు తినకూడదు. మీరు ఎక్కడ నివసించినా సరే మీ తరాలన్నింటినీ ఈ ఆజ్ఞ కొన సాగుతుంది.
పెంతెకొస్తు పండుగ
15 “ఆ ఆదివారం మొదలు కొని (నైవేద్యం కోసం మీరు పన తీసుకొని వచ్చిన రోజునుండి) ఏడు వారాలు లెక్కించండి. 16 ఏడవ వారం తర్వాత ఆదివారం నాడు (అంటే యాభై రోజుల తర్వాత) యెహోవాకు మీరు కొత్త ధాన్యార్పణను తీసుకొని రావాలి. 17 ఆ రోజున మీ యిండ్ల నుండి రెండు రొట్టెలు తీసుకొని రండి. ఆ రొట్టె నైవేద్యంకోసం. 4 పావులు గోధుమ పిండిలో, పులిసిన పదార్థం ఉపయోగించి ఆ రొట్టెలు తయారుచేయాలి. అది మీ ప్రథమ పంటల్లోనుంచి మీరు యెహోవాకు అర్పించే కానుక.
18 “ప్రజలు ధాన్యార్పణతో బాటు ఒక దూడను ఒక పొట్టేలును, ఏడాది పోతును, ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి. వాటిలో ఏ దోషమూ ఉండకూడదు. అవి యెహోవాకు దహనబలి అర్పణ. అవి హోమంగా అర్పించబడి, యెహోవాకు కమ్మని సువాసనగా ఉంటాయి. 19 పాప పరిహారార్థ బలిగా ఒక మేకపోతును, సమాధాన బలిగా రెండు ఏడాది మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి.
20 “నైవేద్యంగా ప్రథమ ఫలంలోని రొట్టెతో పాటు వాటిని, రెండు గొర్రెపిల్లలను యెహోవా ఎదుట యాజకుడు అల్లాడించాలి. అవి యెహోవాకు పవిత్రమైనది. అవి యాజకునికి చెందుతాయి. 21 అదే రోజున మీరు ఒక పవిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రోజులలో మీరేమి పని చేయకూడదు. మీ గృహాలన్నింటిలో ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది.
22 “మరియు, మీరు మీ పొలంలో పంట కోసేటప్పుడు పొలం అంచులమట్టుకు కోసి వేయవద్దు. నేలమీద పడే కంకులు ఏరుకోవద్దు. పేదవారికోసమూ, మీ దేశం గుండా ప్రయాణించే విదేశీయుల కోసమూ వాటిని విడిచిపెట్టండి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి!”
బూరల పండుగ
23 మరల మోషేతో యెహోవా చెప్పాడు: 24 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు ఏడవ నెల మొదటి రోజున మీకు ప్రత్యేకమైన విశ్రాంతి రోజు ఉండాలి. అప్పుడు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ప్రత్యేక జ్ఞాపకార్థ సమయంగా మీరు బూర ఊదాలి. 25 ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీరు యెహోవాకు హోమ అర్పణలు అర్పించాలి”
ప్రాయశ్చిత్త దినం
26 మోషేతో యెహోవా చెప్పాడు, 27 “ఏడవ నెల పదవరోజు ప్రాయశ్చిత్త దినంగా ఉంటుంది. ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు భోజనం చేయకూడదు, యోహోవాకు మీరు హోమ అర్పణ తీసుకొని రావాలి. 28 ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. ఎందు చేతనంటే అది ప్రాయశ్చిత్త దినం. ఆ రోజు, యాజకులు యెహోవా ఎదుటికి వెళ్లి, మిమ్మల్ని పవిత్రం చేసే ఆచారక్రమాన్ని జరిగిస్తారు.
29 “ఆ రోజున భోజనం చేయకుండా ఉండేందుకు ఎవరైనా తిరస్కరిస్తే, ఆ వ్యక్తిని తన ప్రజలనుండి వేరు చేయాలి. 30 ఆ రోజున ఎవరైనా పని చేస్తే ఆ వ్యక్తిని తన ప్రజల్లోనుంచి నేను నాశనం చేస్తాను. 31 మీరు అసలు ఏమీ పని చేయాకూడదు. మీరు ఎక్కడ నివసించినా ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. 32 అది మీకు ఒక ప్రత్యేక విశ్రాంతి దినం. మీరు భోజనం చేయకూడదు. నెలలో తొమ్మిదవ రోజు తర్వాత సాయంకాలంనుండి ఈ ప్రత్యేక విశ్రాంతి దినం మీరు ప్రారంభించాలి. ఆ సాయంత్రంనుండి మర్నాటి సాయంకాలం వరకు ఈ ప్రత్యేక విశ్రాంతి దినం కొనసాగుతుంది.”
పర్ణశాలల పండుగ
33 మరల మోషేతో యెహోవా చెప్పాడు, 34 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఏడవ నెల పదిహేనోవ తేదీన పర్ణశాలల పండుగ యెహోవాకు ఈ పండుగ ఏడు రోజులపాటు కొనసాగుతుంది. 35 మొదటి రోజున పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు. 36 ఏడు రోజులు యెహోవాకు హోమార్పణలు మీరు అర్పించాలి. ఎనిమిదో రోజు మీకు మరో పవిత్ర సమావేశం జరుగుతుంది. మీరు యెహోవాకు హోమార్పణలు అర్పించాలి. ఇది పవిత్ర సమావేశంగా ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు.
37 “అవి యెహోవా ప్రత్యేక పండుగలు. ఆ పండుగల్లో పవిత్ర సమావేశాలు జరుగుతాయి. అర్పణలు, బలి అర్పణలు, పానార్పణలు, దహనబలులు, ధాన్యార్పణలు మీరు యెహోవాకు తీసుకొని రావాల్సిన హోమార్పణలు. ఆ కానుకలు తగిన సమయంలో మీరు తీసుకొని రావాలి. 38 యెహోవా సబ్బాతు రోజులు జ్ఞాపకం చేసుకోవటంతోబాటు ఈ పండుగలన్నీ మీరు ఆచరించాలి. యెహోవాకు మీరు అర్పించే మీ ఇతర అర్పణలుగాక ఈ కానుకలు అర్పించాలి. మీ ప్రత్యేక వాగ్దానాల చెల్లింపుగా మీరు అర్పించే అర్పణలు గాక వీటిని మీరు అర్పించాలి. మీరు యెహోవాకు ఇవ్వాలనుకొన్న ప్రత్యేక అర్పణలుకాక ఇవి మీరు ఇవ్వాలి.
39 “ఏడువ నెల పదిహేనొవ రోజున, దేశంలో మీరు పంటలు కూర్చుకొన్నప్పుడు, యెహోవా పండుగను ఏడు రోజుల పాటు మీరు ఆచరించాలి. మొదటి రోజున, ఏడో రోజున మీరు విశ్రాంతి తీసుకోవాలి. 40 మొదటి రోజు పండ్ల చెట్లనుండి మంచి పండ్లు మీరు కూర్చాలి. ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలువల దగ్గరి నిరవంజి చెట్లు మీరు తీసుకోవాలి. మీ యెహోవా దేవుని ఎదుట ఏడు రోజులు మీరు పండుగ ఆచరించాలి. 41 ప్రతి సంవత్సరం ఏడు రోజులు యెహోవాకు పండుగగా మీరు దీనిని ఆచరించాలి. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ఏడవ నెలలో మీరు ఈ పండుగను ఆచరించాలి. 42 ఏడు రోజులు తాత్కాలిక గుడారాల్లో మీరు నివసించాలి. ఇశ్రాయేలీయులలో పుట్టిన వాళ్ళంతా ఆ పర్ణశాలల్లోనే నివసించాలి. 43 ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి నేను బయటకు తీసుకొని వచ్చినప్పుడు, తాత్కాలిక గుడారాల్లో నేను వారిని నివసింపజేసానని మీ సంతానం అంతా తెలుసుకోవాలి. నేను మీ దేవుడనైన యోహోవాను!”
44 కనుక యెహోవా పండుగ రోజులు అన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే చెప్పాడు.