3
నీనెవెకు దుర్వార్త
1 ఆ హంతకుల నగరానికి చాలా కీడు మూడుతుంది.
నీనెవె నగరం అబద్ధాల పుట్ట.
ఇతర దేశాలనుండి దోచుకున్న వస్తువులతో అది నిండివుంది.
అది వెంటాడి చంపిన అనేకమందితో అది నిండివుంది!
2 కొరడా ఝళిపింపుల ధ్వని,
చక్రాల సవ్వడి, స్వారీ గుర్రాల గిట్టల ధ్వనులు,
ఎగిరిపడే రథాల చప్పుడు నీవు వినవచ్చు!
3 అశ్వదళం వారు దాడి చేస్తున్నారు.
వారి కత్తులు మెరుస్తున్నాయి.
వారి ఈటెలు తళుక్కుమంటున్నాయి!
అక్కడ ఎంతోమంది చనిపోయారు.
శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. శవాలు లెక్కకుమించివున్నాయి.
శవాలకు అడ్డంపడి ప్రజలు తొట్రిల్లుతున్నారు.
4 నీనెవె మూలంగా ఇవన్నీ జరిగాయి.
తృప్తి చందని వేశ్యలా నీనెవె ఉంది.
ఆమె మరింత మందిని కోరుకుంది.
తనను తాను అనేక జనులకు అమ్ముకుంది.
వారిని తన బానిసలుగా చేసుకోటానికి ఆమె తన మంత్ర విద్యలను ఉపయోగించింది.
5 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు:
“నీనెవె, నీకు నేను విరోధిని.
నీ బట్టలను నీ ముఖం మీదకి లాగుతాను.
నీ నగ్నత్వాన్ని రాజ్యాలన్నిటికీ చూపిస్తాను.
ఆ రాజ్యాలన్నీ నీవు సిగ్గుపడటం చూస్తాయి.
6 నీ మీదకు మురికి వస్తువులు విసురుతాను.
నిన్ను ఏహ్యభావంతో చూస్తాను.
ప్రజలు నీవంక చూసి నవ్వుతారు.
7 నిన్ను చూసిన ప్రతి ఒక్కడూ పారిపోతాడు.
‘నీనెవె నాశనమయ్యింది.
ఆమెను గురించి ఏడ్చేవారెవరు?’ అనివారు అంటారు.
నీనెవె నిన్ను ఓదార్చే వారెవ్వరినీ నేను చూడలేనని నాకు తెలుసు.”
8 నీనెవె, నైలు నది మీద వున్న తేబేస్ (నో-అమోను) నగరం కంటే నీవు మెరుగైన దానవా? కాదు! తేబేస్ చుట్టూ కూడ నీరువుంది. తేబేస్ ఆ నీటిని శత్రువుల నుండి తనను తాను కాపాడుకోటానికి వినియోగించుకొనేది. ఆమె ఆ నీటిని ఒక గోడలా కూడా వినియోగించుకొనేది!
9 కూషీయులును, ఈజిప్టు వారును తేబేస్‌కు మంచి బలాన్నిచ్చారు. పూతు వారు, లూబీయులు ఆమెకు మద్దతు ఇచ్చారు.
10 అయినా తేబేస్ ఓడింపబడింది. ఆమె ప్రజలు పర దేశానికి బందీలుగా పట్టుకుపోబడ్డారు. ప్రతీ వీధిమూలా సైనికులు ఆమె పిల్లలను చావగొట్టారు. ముఖ్యలైన ప్రజలను ఎవరు బానిసలుగా ఉంచుకోవాలి అనే విషయంలో వారు చీట్లు వేశారు. తేబేస్‌లో ప్రముఖులైన వారందరికీ వారు సంకెళ్లు వేశారు.
11 కావున నీనెవే, నీవు కూడా తాగినవానిలా పడిపోతావు! నీవు దాగటానికి ప్రయత్నిస్తావు. శత్రువుకు దూరంగా ఒక సురక్షిత ప్రదేశం కొరకు నీవు చూస్తావు.
12 కాని నీనెవే, నీ దుర్గాలన్నీ అంజూరపు చెట్లలా ఉంటాయి. కొత్త అంజూరపు కాయలు పండుతాయి. ఒకడు వచ్చి చెట్టును కుదుపుతాడు. అంజూరపు పండ్లు వాని నోట పడతాయి. అతడు వాటిని తింటాడు. అవి అయిపోతాయి!
13 నీనెవే, నీ ప్రజలంతా స్త్రీలవలె ఉన్నారు. శత్రుసైనికులు వారిని పట్టుకు పోవటానికి సిద్ధంగా ఉన్నారు. నీ శత్రువులు లోనికి రావటానికి అనువుగా నీ దేశపు ద్వారాలు పూర్తిగా తెరవబడి ఉన్నాయి. ద్వారాలకు అడ్డంగా వున్న కర్రపట్టీలను అగ్ని కాల్చివేసింది.
14 నీరు తెచ్చి దానిని నీ నగరంలోపల నిలువ చెయ్యి. ఎందుకంటే, శత్రుసైనికులు నీ నగరాన్ని చుట్టు ముట్టుతారు. వారు ఎవ్వరినీ నగరంలోకి ఆహారాన్ని, నీటిని తీసుకు రానివ్వరు. నీ కోటలను పటిష్ట పర్చుకో! ఇటుకలు విస్తారంగా చేయటానికి బంక మట్టిని తీసుకొనిరా! సున్నము గచ్చు కలుపు! ఇటుకలు చేయటానికి అచ్చులు తీసుకొనిరా!
15 నీవు ఆ పనులన్నీ చేయవచ్చు. కాని, అగ్ని నిన్ను పూర్తిగా నాశనం చేసి వేస్తుంది! మరియు కత్తి నిన్ను హతమార్చుతుంది. మిడుతల దండు వచ్చి సమస్తాన్ని తినివేసినట్లు నీ దేశం కన్పిస్తుంది.
నీనెవే, నీవు మిక్కిలిగా పెరిగావు. నీవు మిడుతల దండులా వున్నావు.
16 వివిధ ప్రాంతాలకు వెళ్లి సరుకులు కొని వ్యాపారం చేసే వర్తకులు నీకు అనేక మంది ఉన్నారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో వారు అంతమంది ఉన్నారు! దండులా వచ్చి సర్వాన్ని తినివేసే మిడుతల్లా వారున్నారు.
17 మరియు నీ ప్రభు త్వాధికారులు కూడ మిడుతల్లా వున్నారు. చలిగా ఉన్న రోజున రాతిగోడపై కుదురుకున్న మిడుతల్లా వారున్నారు. కాని సూర్యుడు పైకి వచ్చినప్పుడు రాళ్లువేడెక్కగా మిడుతలు ఎగిరిపోతాయి. పైగా అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలియదు! నీ అధికారులు కూడా అలానేవుంటారు.
18 అష్షూరు రాజా, నీ గొర్రెల కాపరులు (నాయకులు) నిద్రకుపడ్డారు. శక్తివంతులగు ఆ మనుష్యులు నిద్రిస్తున్నారు. ఇప్పుడు నీ గొర్రెలు (ప్రజలు) పర్వతాలపై చెదిరిపోయాయి. వాటిని మరల్చుకొని వచ్చేవాడు ఎవ్వడూ లేడు.
19 నీనెవే, నీవు తీవ్రంగా దెబ్బతిన్నావు. నీ గాయాన్ని ఏదీ మాన్పలేదు. నీ వినాశాన్ని గురించి విన్నప్రతివాడూ చప్పట్లు చరుస్తాడు. వారంతా సంతోషంగా ఉంటారు! ఎందుకంటే, నీవు ఎల్లప్పుడూ కలుగజేసిన బాధను వారంతా అనుభవించారు!