14
జ్ఞానముగల స్త్రీ తన ఇల్లు ఎలా ఉండాలో అలా చేసుకొనేందుకు జ్ఞానము ప్రయోగిస్తుంది. కానీ బుద్ధిహీనురాలు ఆమె చేసే బుద్ధిహీనమైన పనుల మూలంగా తన ఇల్లు నాశనం చేసికొంటుంది.
సరిగ్గా జీవించే మనిషి యెహోవాను గౌరవిస్తాడు. కానీ నిజాయితీ లేని మనిషి యెహోవాను ద్వేషిస్తాడు.
బుద్ధిహీనుని మాటలు అతనికి కష్టం తెచ్చిపెడతాయి. కాని జ్ఞానముగలవాని మాటలు అతణ్ణి కాపాడతాయి.
పని చేయటానికి ఎద్దులు లేకపోతే గాదెలో ధాన్య ముండదు ఒక గొప్ప పంట పండించటానికి మనుష్యులు ఎద్దు బలాన్ని ఉపయోగించవచ్చు.
సత్యవంతుడు అబద్ధం చెప్పడు. అతడు మంచి సాక్షి. కాని నమ్మదగని వ్యక్తి ఎన్నడూ సత్యం చెప్పడు అతడు చెడ్డ సాక్షి.
ఇతరులకంటె తాను మంచివాడను అని తలంచే గర్విష్ఠుడు ఒకవేళ జ్ఞానిగా ఉండాలి అనుకోవచ్చు. కానీ ఆ గర్విష్ఠుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు. అయితే నిజంగా జ్ఞానముగల వానికి (దేవుని నమ్మినవానికి) తెలివి సులభంగా అబ్బుతుంది.
తెలివి తక్కువ వానితో స్నేహం చేయవద్దు. తెలివి తక్కువ మనిషి నీకు నేర్పించగలది ఏమీ లేదు.
తెలివిగల మనుష్యులు వారు చేసే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తారు, గనుక వారు జ్ఞానము గలవారు. కానీ బుద్ధిహీనులు మోసం చేసి జీవించవచ్చు. అనుకొంటారు గనుక వారు తెలివితక్కువ వారు.
తెలివి తక్కువ వాడు, తాను చేసిన చెడు విషయాలకు శిక్ష పొందాలి అనే మాటను గూర్చి నవ్వేస్తాడు. కానీ మంచి మనుష్యులు క్షమాపణ పొందటానికి చాలా కష్టపడి ప్రయత్నిస్తారు.
10 ఒక మనిషి విచారంగా ఉంటే దాని ప్రభావం అతను ఒక్కడే అనుభవిస్తాడు. అదే విధంగా ఒక మనిషి సంతోషంగా ఉంటే అతను ఒక్కడు మాత్రమే ఆ ఆనందం అనుభవిస్తాడు.
11 దుర్మార్గుని ఇల్లు నాశనం చేయబడుతుంది. కానీ మంచివాని ఇల్లు శాశ్వతంగా ఉంటుంది.
12 సరిగ్గా ఉంది అని మనుష్యులు తలంచే ఒక మార్గం ఉంది. కానీ ఆ మార్గం మరణానికి మాత్రమే దారి తీస్తుంది.
13 ఒక మనిషి నవ్వుతూ ఉన్నా, అతడు విచారంగానే ఉండవచ్చు. నవ్యటం అయిపొయ్యాకగూడ ఆ విచారం అలాగే ఉంటుంది.
14 దుర్మార్గులు చేసే చెడుపనులకు వారికి పూర్తిగా చెల్లించబడుతుంది (శిక్షించబడుతారు). మరియు మంచివాళ్లు చేసే మంచి పనులకు పూర్తిగా బహుమానం పొందుతారు.
15 బుద్ధిహీనుడు ఏది వింటే అది నమ్ముతాడు. కానీ జ్ఞానము గలవాడు ప్రతిదాని గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తాడు.
16 జ్ఞానముగలవాడు యెహోవాను గౌరవిస్తాడు, దుర్మార్గానికి దూరంగా ఉంటాడు. కానీ బుద్ధిహీనుడు ఆలోచన లేకుండా పనులు చేస్తాడు జాగ్రత్తగా ఉండడు.
17 త్వరగా కోపగించుకొనేవాడు బుద్ధిహీనమైన పనులు చేస్తాడు. కాని జ్ఞానముగలవాడు ఓర్పు కలిగి ఉంటాడు.
18 తెలివితక్కువ వారు తమ తెలివితక్కువ తనాన్ని బట్టి శిక్షించబడుతారు. కానీ జ్ఞానముగలవారికి తెలివి బహుమానంగా ఇవ్వబడుతుంది.
19 చివరికి చెడ్డవారిమీద మంచి వాళ్లు గెలుస్తారు. చెడ్డవాళ్లు మంచివాళ్లకు నేవ చేయుటకు బలవంతం చేయబడుతారు.
20 పేదవానికి స్నేహితులు ఎవ్వరూ ఉండరు. అతనికి పొరుగువారు కూడ ఉండరు. కానీ ధనికులకు చాలా మంది స్నేహితులు ఉంటారు.
21 ఇతరులకంటే నీవే మంచివాడవని తలచటం తప్పు. నీవు సంతోషంగా ఉండాలంటే పేదవారి యెడలదయ కలిగి ఉండు.
22 దుర్మార్గం చేయాలనే వ్యక్తి ఎవరైనా సరే అతడు తప్పు చేస్తున్నాడు. అయితే మంచి జరిగించడానికి ప్రయత్నించే వ్యక్తికి, అతన్ని ప్రేమించి అత న్ని నమ్ముకొనే స్నేహితులు ఉంటారు.
23 నీవు కష్టపడి పని చేస్తే, అప్పుడు నీవు కోరుకొనేవి నీకు ఉంటాయి. కాని నీవు మాట్లాడటం తప్ప పని ఏమి చేయకపోతే నీవు పేదవానివిగా ఉంటావు.
24 జ్ఞానముగలవారు ఐశ్వర్యాన్ని బహుమానంగా పొందుతారు. కాని బుద్ధిహీనులు తెలివితక్కువ తనాన్ని బహుమానంగా పొందుతారు.
25 సత్యం పలికే మనిషి ఇతరులకు సహాయం చేస్తాడు. అబద్ధాలు చెప్పే మనిషి ఇతరులకు హాని చేస్తాడు.
26 యెహోవాను గౌరవించే మనిషి క్షేమంగా ఉంటాడు. మరియు అతని పిల్లలు క్షేమంగా జీవిస్తారు.
27 యెహోవా యెడల భక్తి నిజమైన జీవాన్ని ప్రసాదిస్తుంది. అది ఒక వ్యక్తిని మరణవు ఉచ్చునుండి రక్షిస్తుంది.
28 ఒక రాజు అనేకమంది ప్రజలను పాలిస్తే అతడు గొప్పవాడు. కాని ప్రజలు ఎవ్వరూ లేకపోతే అప్పుడు ఆ రాజు యొక్క విలువ శూన్యం.
29 సహనంగల మనిషి చాలా తెలివిగలవాడు. త్వరగా కోపపడు మనిషి బుద్ధిహీనుడని కనపరచుకుంటాడు.
30 ఒక మనిషి మనస్సులో శాంతి ఉంటే అతని శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ అసూయ శరీరంలో వ్యాధి కలిగిస్తుంది.
31 పేద ప్రజలకు కష్టాలు కలిగించే మనిషి దేవుణ్ణి గౌరవించటం లేదని చూపెడతాడు. ఇద్దరినీ దేవుడే చేశాడు. కాని ఒక మనిషి పేద ప్రజల యెడల దయ కలిగి ఉంటే, అప్పుడు అతడు దేవుని గౌరవిస్తాడు.
32 కష్టకాలంలో దుర్మార్గులు ఓడించబడతారు. కాని మంచివాళ్లు మరణ సమయంలో కూడా విజయం పొందుతారు.
33 జ్ఞానముగల మనిషి ఎల్లప్పుడూ జ్ఞానముగల విషయాలే తలుస్తాడు. కాని బుద్ధిహీనునిక జ్ఞానమును గూర్చి అసలు ఏమీ తెలియదు.
34 మంచితనం ఒక దేశాన్ని గొప్పగా చేస్తుంది. కాని పాపం వలన ఏ ప్రజలకైనా అవమానమే కలుగుతుంది.
35 ఒక రాజుకు జ్ఞానముగల నాయకులు ఉంటే అతడు సంతోషిస్తాడు. కాని తెలివితక్కువ నాయకుల విషయమై రాజుకు కోపం.