101
దావీదు కీర్తన.
ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
యెహోవా నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
నాయెదుట ఏ విగ్రహాలు* ఉంచుకోను.
అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
నేను అలా చేయను!
నేను నిజాయితీగా ఉంటాను.
నేను దుర్మార్గపు పనులు చేయను.
ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచి వారమని తలుస్తూ
అతిశయించడం నేను జరుగ నివ్వను.
 
నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
యదార్థ జీవితాలు జీవించే వాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.
 
* 101:3 విగ్రహాలు అక్షరార్థముగా భయంకర సంగతులు.