121
యాత్ర కీర్తన. 
 
1 కొండల తట్టు నేను చూసాను.  
కానీ నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?   
2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి  
నాకు సహాయం వస్తుంది.   
3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు.  
నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.   
4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.  
దేవుడు ఎన్నడూ నిద్రపోడు.   
5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు.  
యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.   
6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.  
రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.   
7 ప్రతి అపాయం నుండి యోహోవా నిన్ను కాపాడుతాడు.  
యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.   
8 నీవు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.  
ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.