10
సౌలు రాజు మరణం
1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. అనేకమంది ఇశ్రాయేలు ప్రజలు గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు.
2 ఫిలిష్తీయులు సౌలును, అతని కుమారులను తరుముకుంటూ పోయి, వారిని పట్టుకుని చంపివేశారు. సౌలు కుమారులు యోనాతాను, అబీనాదాబు, మల్కీ షూవలను ఫిలిష్తీయులు చంపివేశారు.
3 సౌలు చుట్టూ యుద్ధం ముమ్మరంగా సాగింది. విలుకాండ్రు సౌలుపై బాణాలు వదిలి గాయపర్చారు.
4 అప్పుడు తన ఆయుధాలు మోసే వానితో సౌలు ఇలా చెప్పాడు: “నీ కత్తి దూసి నన్ను చంపివేయి. నీవలా చేస్తే ఆ పరదేశీయులు వచ్చి నన్ను హింసించి ఎగతాళి చేయరు.”
కాని ఆయుధాలు మోసే సౌలు సేవకుడు భయపడ్డాడు. సౌలును చంపటానికి నిరాకరించాడు. అప్పుడు సౌలు తన కత్తినే ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కత్తి మొనపై అతను పడి తనను తాను చంపుకున్నాడు.
5 సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూసాడు. తర్వాత అతను కూడా తన కత్తి మొనపై పడి తనను తాను చంపుకున్నాడు.
6 ఆ విధంగా సౌలు, అతని ముగ్గురు కుమారులు మరణించారు. పైగా సౌలు కుటుంబం వారంతా కలిసి చనిపోయారు.
7 లోయలో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలంతా తమ సైన్యం పారిపోవటం చూసారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం ప్రజలు చూసారు. దానితో వారు కూడ భయపడి తమ పట్టణాలను వదలి పారిపోయారు. తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు వదిలిపోయిన పట్టణాలకు వచ్చి, అక్కడ నివసించసాగారు.
8 శవాలనుండి విలువైన వస్తువులను సేకరించటానికి ఫిలిష్తీయులు మరునాడు వచ్చారు. వారు గిల్బోవ పర్వతం మీద సౌలు శవాన్ని, అతని ముగ్గురు కుమారుల శవాలను చూసారు.
9 ఫిలిష్తీయులు సౌలు శరీరంమీద విలువైన వస్తువులను తీసుకొన్నారు. వారు సౌలు తలను, అతని ఆయుధాలను తీసుకొన్నారు. పిమ్మట వారు తమ దేశం నలుమూలలా ఉన్న బూటకపు దేవుళ్ల గుళ్లకు, ప్రజలకు ఈ వార్తను అందజేయటానికి దూతలను పంపారు.
10 సౌలు ఆయుధాలను ఫిలిష్తీయులు తమ బూటకపు దేవుళ్ల గుళ్లల్లో దాచారు. సౌలు తలను వారు దాగోను గుడిలో వేలాడదీసారు.
11 యాబేష్గిలాదు పట్టణంలో నివసించే వారంతా ఫిలిష్తీయులు సౌలుకు చేసినదంతా విన్నారు.
12 యాబేష్గిలాదులో వున్న యోధులంతా వెళ్లి సౌలు, అతని కుమారుల శవాలను యాబేష్గిలాదుకు తిరిగి తెచ్చారు. ఆ యోధులు సౌలు, అతని కుమారుల ఎముకలను యాబేషులో ఒక పెద్ద చెట్టు క్రింద పాతిపెట్టారు. తర్వాత వారు ఏడు రోజులు ఉపవాసమున్నారు.
13 సౌలు మరణానికి ముఖ్య కారణం అతను యెహోవాపట్ల విశ్వాసంగా లేకపోవటం. సౌలు యెహోవా మాటను లెక్కపెట్టలేదు.
14 యెహోవాకు ప్రార్థన చేయకుండా తన సంశయాలను నివారించుకొనటానికి, కర్ణ పిశాచిగల స్త్రీని ఆశ్రయించాడు. అందువల్ల యెహోవా సౌలును చంపి, రాజ్యాన్ని దావీదుకు అప్పగించాడు. దావీదు తండ్రి పేరు యెష్షయి.