12
దావీదుతో కలిసిన శూరులు
1 దావీదు సిక్లగు పట్టణంలో ఉన్నాడు. ఆ సమయంలో కొందరు మనుష్యులు దావీదును కలుసుకొన్నారు. దావీదు పారిపోయి సౌలుకు కనపడకుండా దాగివున్న రోజులవి. కీషు కుమారుడు సౌలు. ఈ వచ్చిన మనుష్యులు దావీదుకు యుద్ధంలో సహాయపడ్డారు.
2 ఈ మనుష్యులు కుడి చేతితోను, ఎడమ చేతితోను బాణాలు ఒడుపుగా వేయగల నేర్పరులు. వడిసెలకూడ వారు కుడి ఎడమల తేడా లేకుండా తిప్పి రాళ్లు విసరగల సమర్థులు. వారంతా సౌలు బంధువులైన బెన్యామీనీయులు.
3 వారెవరనగా:
అహీయెజెరు వారి నాయకుడు. వారిలో యోవాషు కూడ వున్నాడు. అహీయెజెరు, యోవాషులిద్దరూ షెమయా కుమారులు. షెమయా అనేవాడు గిబియావాడు. వారిలో ఇంకా యెజీయేలు, పెలెటు వున్నారు. యెజీయేలు, పెలెటులిరువురూ అజ్మావెతు కుమారులు. బెరాకా, అనాతోతీయుడైన యెహూ అనేవారు కూడ వారితో వున్నారు.
4 గిబియోనీయుడైన ఇష్మయా బలపరాక్రమ సంపన్నుడు. ముప్పై మంది యోధుల్లో ఒకడు మరియు వారి నాయకుడు. యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు కూడ వున్నారు.
5 ఎలూజై, యెరీమోతు, బెయల్యా మరియు షెమర్యా. హరీపీయుడైన షెఫట్యా.
6 ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజేరు, యాషాబాము అనే వారు కోరహు వంశీయులు.
7 యెరోహాము కుమారులైన యోహేలా మరియు జెబద్యా. వారు గెదోరు గ్రామానికి చెందిన వారు.
గాదీయులు
8 గాదీయులలో కొంతమంది ఎడారి ప్రాంతంలో కోటలో దాగివున్న దావీదును కలిశారు. వారు బాగా యుద్ధ శిక్షణ పొందిన సైనికులు. వారు డాలు పట్టి ఈటెను ఉపయోగించటంలో ఆరితేరినవారు. వారు సింహం లాంటి ముఖాలతో భయంకరంగా వుంటారు. వారు కొండల్లో జింకల్లా పరుగెత్తగలరు.
9 ఏజెరు గాదు సైన్యానికి అధిపతి. ఓబద్యా రెండవ ముఖ్యాధికారి. ఏలీయాబు మూడవ స్థానంలో వున్నాడు.
10 మిష్మన్నా నాల్గవ స్థానంలోను, యిర్మీయా ఐదవ స్థానంలోను వున్నారు.
11 అత్తయి ఆరవ స్థానంలోను, ఏలీయేలు ఏడవ స్థానంలోను వున్నారు.
12 యోహానాను ఎనిమిదవ స్థానంలోను, ఎల్జాబాదు తొమ్మిదవ స్థానంలోను వున్నారు.
13 యిర్మీయా పదవ స్థానంలోను, మక్బన్నయి పదకొండవ వాడుగాను వున్నారు.
14 వారు గాదీయుల సైన్యంలో అధికారులు. వారిలో అతి బలహీనుడైనవాడు కూడ కనీసం వంద మందితో పోరాడగలడు. వారిలో మిక్కిలి బలవంతుడు వేయి మంది శత్రు సైనికులను ఎదుర్కొనగలడు.
15 ఈ గాదు వంశీయులే మొదటి నెలలో యొర్దాను నదికి వరదలు వచ్చే సమయంలో లోయల్లో వుండే వారందరినీ తరిమికొట్టారు. వారా ప్రజలను తూర్పునకు, పడమరకు తరిమివేశారు.
ఇతర సైనికులు దావీదుతో కలవటం
16 బెన్యామీను, యూదా వంశాలకు చెందిన ఇతర ప్రజలు కూడ కోటలో వున్న దావీదు వద్దకు వచ్చారు.
17 దావీదు వారిని కలిసేందుకు ఎదురు వెళ్లి, వారితో ఇలా అన్నాడు: “మీరు శాంతి భావంతో నాకు సహాయం చేయగోరి వస్తే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను! నాతో కలిసి ఉండండి. ఒకవేళ నేను ఏమీ తప్పు చేయకపోయినా మీరు నా మీద నిఘావేసి నన్ను శత్రువులకు అప్పజెప్పటానికి కనుక వస్తే, మన పూర్వీకుల దేవుడు మీరు చేసేది చూచి మిమ్మల్ని శిక్షించుగాక!”
18 అప్పుడు దేవుని ఆత్మ అమాశై మీదికి వచ్చింది. అమాశై ముప్పదిమంది వీరుల నాయకుడు. అమాశై అప్పుడు ఇలా అన్నాడు:
“ఓ దావీదూ, మేము నీవారం!
ఓ యెష్షయి కుమారుడా, మేము నీతో వున్నాము.
శాంతి! నీకు శాంతి కలుగుగాక!
నీకు సహాయపడే ప్రజలకు కూడ శాంతి. ఎందువల్లననగా నీ దైవం నీకు సహాయపడుతున్నాడు!”
అప్పుడు దావీదు వారికి స్వాగతం పలికి వారిని చేరదీశాడు. తన పక్షాన వారిని దళాధిపతులుగా నియమించాడు.
19 కొందరు మనష్షే వంశంలోని వారు కూడ వచ్చి దావీదు పక్షం వహించారు. అతడు ఫిలిష్తీయులతో కలిసి సౌలుపై యుద్ధానికి వెళ్లినప్పుడు వారు వచ్చి దావీదు పక్షం వహించారు. కాని దావీదు, అతని మనుష్యులు నిజానికి ఫిలిష్తీయులకు సహాయపడలేదు. దావీదు తమకు సహాయం చేసే విషయం ఫిలిష్తీయుల అధికారులు చర్చించి, పిమ్మట అతనిని పంపివేయటానికి నిశ్చయించారు. ఫిలిష్తీయుల పాలకులు ఇలా అన్నారు: “ఒకవేళ దావీదు మధ్యలో తన యజమాని సౌలు వద్దకు వెళ్లిపోతే మన తలలు తెగిపోతాయి!”
20 దావీదు సిక్లగు పట్టణానికి వెళ్లినప్పుడు అతనితో కలిసిన మనష్షీయులు ఎవరనగా: అద్నా, యోజాబాదు, మెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు మరియు జిల్లెతై. వీరిలో ప్రతి ఒక్కడూ మనష్షే వంశీయులలో వెయ్యి మందికి నాయకుడు.
21 దుష్టశక్తులను ఎదుర్కొనటంలో వారు దావీదుకు తోడ్పడ్డారు. ఈ దుష్టులు దేశం మీద పడి ప్రజలను దోచుకోసాగారు. దావీదును చేరిన మనష్షీయులంతా ధైర్యంగల సేనానులు. వారు దావీదు సైన్యంలో అధిపతులయ్యారు.
22 రోజురోజుకూ దావీదు వద్దకు వచ్చి సహాయపడేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దానితో దావీదుకు శక్తివంతమైన ఒక మహా సైన్యం ఏర్పడింది.
హెబ్రోనులో మరికొందరు దావీదును చేరటం
23 దావీదును హెబ్రోను పట్టణంలో కలిసిన వారి వివరాలు, సంఖ్యాబలం ఈ విధంగా వున్నాయి: వారు యుద్ధ వీరులు. సౌలు సామ్రాజ్యాన్ని దావీదుకు అప్పజెప్పటానికి వచ్చారు. ఇది ఇలా జరుగుతుందని యెహోవా చెప్పియున్నాడు. వారి బలగం ఏదనగా:
24 యుద్ధానికి అర్హతగల యూదా వంశీయులు ఆరువేల ఎనిమిది వందల మంది వున్నారు. వారు డాళ్లను, ఈటెలను పట్టగల సమర్థులు.
25 షిమ్యోనీయులు ఏడువేల వందమంది వున్నారు. వారంతా ధైర్య సాహసాలుగల సైనికులు.
26 లేవీయులు నాలుగువేల ఆరువందల మంది వున్నారు.
27 యెహోయాదా ఆ వర్గంలో వాడు. అతడు అహరోను కుటుంబ పెద్ద. యెహోయాదాతో మూడువేల ఏడువందల మంది మనుష్యులున్నారు.
28 ఆ వర్గంలో సాదోకు కూడా వున్నాడు. అతడు మంచి ధైర్యంగల యువ సైనికుడు. అతడు తన కుటుంబీకులలో ఇరవై ఇద్దరు అధికారులతో వచ్చాడు.
29 బెన్యామీను వంశం వారు మూడువేలమంది వున్నారు. వారంతా సౌలుకు బంధువులు. అప్పటి వరకు వారిలో అధిక సంఖ్యాకులు సౌలు కుటుంబం పట్ల విశ్వాసంగా వున్నారు.
30 ఎఫ్రాయిము వంశంవారు ఇరవైవేల ఎనిమిది వందలమంది వున్నారు. వారు ధైర్యంగల సేనానులు. వారి వారి కుటుంబాలలో వారు ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు.
31 మనష్షే వంశీయులలో సగంమంది నుండి వచ్చిన వారు పద్దెనిమిదివేల మంది. వారు పేరు పేరున దావీదును రాజుగా చేయటానికి ఎంపిక చేయబడినవారు.
32 ఇశ్శాఖారు వంశీయులలో తెలివైన పెద్దలు రెండు వందల మంది. ఇశ్రాయేలుకు చేయదగిన మంచి యేదో వారు సరియైన సమయంలో గుర్తించారు. వారి బంధువులంతా వారి మాటకు కట్టుబడి వున్నారు.
33 జెబూలూనీయులు ఏబదివేల మంది వున్నారు. వారంతా అనుభవజ్ఞులైన సైనికులు. వారు రకరకాల ఆయుధాలు చేపట్టి యుద్ధానికి సిద్ధంగా వున్నారు. వారు దావీదుకు మిక్కిలి నమ్మకస్తులై వున్నారు.
34 నఫ్తాలీయుల నుండి ఒక వెయ్యిమంది అధిపతులు వచ్చారు. వారికి ముప్పది ఏడువేల మంది అనుచరులు వున్నారు. వారు ఈటెలు, డాళ్లు పట్టి వున్నారు.
35 దాను వంశం నుండి యుద్ధానికి సిద్ధంగా వున్న వారు ఇరవై ఎనిమిదివేల ఆరువందల మంది.
36 ఆషేరు వంశం నుండి కాకలు తీరిన సైనికులు యుద్ధానికి సిద్ధమై నలభై వేలమంది వచ్చారు.
37 యొర్దాను నదికి ఆవలివైపు (నదికి తూర్పు) నుండి రూబేను, గాదు, సగం మనష్షే వంశీయుల నుండి ఒక లక్షా ఇరవై వేల మంది వచ్చారు. వారంతా రకరకాల ఆయుధాలు ధరించియున్నారు.
38 ఆ వచ్చిన మనుష్యులంతా పోరాట యోధులు. దావీదును ఇశ్రాయేలుకంతటికి రాజుగా చేయాలనే కృతనిశ్చయంతో ఆ వీరులందరూ హెబ్రోను పట్టణానికి వచ్చారు. మిగిలిన ఇశ్రాయేలీయులు కూడ దావీదును రాజుగా చేయటానికి ఒప్పుకున్నారు.
39 ఆ మనుష్యులంతా దావీదుతో మూడు రోజులు హెబ్రోనులో గడిపారు. వారి బంధువులంతా తగినన్ని ఆహార పదార్థాలను తయారు చేయటంతో వారు బాగా అన్నపానాదులు సేవించి కాలం గడిపారు.
40 ఇశ్శాఖారు, జెబూలూను మరియు నఫ్తాలి వంశాల వారి ఇరుగు పొరుగు వారు కూడ గాడిదలమీద, ఒంటెలమీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద ఆహార పదార్థాలు వేసుకొని వచ్చారు. వారు కావలసినంత పిండిని, అంజూర పండ్ల భక్ష్యాలను, ఎండుద్రాక్షను, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులను, గొర్రెలను తీసుకొని వచ్చారు. ఇశ్రాయేలంతటా సంతోషం వెల్లివిరిసింది.