17
దావీదుకు దేవుని వాగ్దానం
దావీదు తన కొత్త ఇంట్లో ప్రవేశించాక యాజకుడైన నాతానును పిలిచి ఇలా అన్నాడు: “చూడండి, నేను దేవదారు కలపతో నిర్మించిన ఇంటిలో వుంటున్నాను. కాని దేవుని ఒడంబడిక పెట్టె మాత్రం గుడారంలోనే వుంది! నేను దేవునికి ఒక ఆలయం నిర్మింపదలిచాను.”
“నీవు ఏది చేయదలచుకొంటే అది చేయవచ్చు. దేవుడు నీకు తోడై వున్నాడు” అని నాతాను దావీదుకు సమాధానమిచ్చాడు.
కాని ఆ రోజు రాత్రి దేవుని వాక్కు నాతానుకు వినిపించింది. యెహోవా ఇలా అన్నాడు:
 
“నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఈ విషయాలు చెప్పు: యెహోవా ఇలా అంటున్నాడు: ‘దావీదూ, నేను నివసించటానికి ఆలయం కట్టించేది నీవు కాదు. 5-6 ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు నుండి బయటికి తీసుకొని వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు నేను ఒక ఆలయంలో నివసించలేదు. ఇక్కడికీ, అక్కడికీ నేను గుడారంలో వుండి కదలి వెళ్తూనే వున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేక నాయకులను నేను ఎంపిక చేస్తూ వచ్చాను. ఆ నాయకులు నా ప్రజలకు గొర్రెల కాపరులవలె వున్నారు. ఇశ్రాయేలులో నేను ఒక చోటినుండి మరియొక చోటికి వెళ్లెటప్పుడు ఆ నాయకులెవ్వరితోనూ, మీరు నాకు దేవదారు కలపతో ఒక ఆలయాన్ని ఎందుకు కట్టలేదు? అని నేను అనలేదు.’
“కనుక, ఇప్పుడు ఈ విషయాలు నా సేవకుడైన దావీదుకు చెప్పుము: సర్వశక్తిమంతుడగు యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘పొలాల్లో గొర్రెల మందలను కాస్తున్న నిన్ను నేను తీసుకొన్నాను. నా ప్రజలకు నిన్ను రాజుగా చేశాను. నీవు వెళ్లిన ప్రతిచోటా నేను నీతో వున్నాను. నీకు ముందుగా నేను నడిచాను. నీ శత్రువులను సంహరించాను. నిన్ను ఇప్పుడు ఈ భూమిమీద మిక్కిలి ప్రముఖ వ్యక్తిగా చేసాను. ఈ ప్రదేశాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాను. వారు తమ మొక్కలను నాటుతారు. వారి చెట్లక్రింద వారు ప్రశాంతంగా కూర్చుంటారు. ఇక ఏ మాత్రం వారు అవస్థపడవలసిన అవసరం లేదు. దుష్టులెవ్వరూ ఇకమీదట పూర్వంవలె వారిని బాధించరు. 10 ప్రమాదాలు సంభవించినందువల్లనే నా ప్రజలైన ఇశ్రాయేలీయుల సంరక్షణకై నేను నాయకులను ఎంపిక చేశాను. నేనింకా నీ శత్రువులను ఓడిస్తాను.
“ ‘యెహోవా నీకు ఒక నివాసం ఏర్పాటు చేయునని నేను నీకు చెప్పుచున్నాను.* 11 నీవు చనిపోయి నీ పూర్వీకులను చేరినప్పుడు నీ సంతానాన్ని నూతన రాజుగా చేస్తాను. కొత్త రాజు నీ కుమారులలో ఒకడవుతాడు. అతని రాజ్యాన్ని నేను బలపర్చుతాను. 12 నీ కుమారుడు నాకొక ఆలయం కట్టిస్తాడు. నీ కుమారుని సంతానం సదా పరిపాలించేలా నేను చేస్తాను. 13 నేను అతనికి తండ్రిలా వుంటాను. అతను నాకు బిడ్డలా వుంటాడు. నీకు ముందు సౌలు రాజుగా వున్నాడు. సౌలుకు నా మద్దతును ఉపసంహరించుకున్నాను. కాని నీ కుమారుని మాత్రం నేను సదా ప్రేమిస్తాను 14 ఎప్పటికీ అతని అధీనంలో నా ఆలయాన్ని, ఈ రాజ్యాన్ని వుంచుతాను. అతని పాలన శాశ్వతంగా కొనసాగుతుంది!’ ”
 
15 తనకు కల్గిన దైవ దర్శనాన్ని గురించి, దేవుడు చెప్పిన విషయాలన్నిటి గురించి దావీదుకు నాతాను వివరింగా చెప్పాడు.
దావీదు ప్రార్థన
16 అది విన్న రాజైన దావీదు పవిత్ర గుడారంలోకి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు:
 
“యెహోవా దేవా, నీవు నాకు, నా కుటుంబానికి ఎంతో మేలు చేశావు! కారణం మాత్రం నాకు తెలియదు. 17 వాటన్నిటికీ మంచి, భవిష్యత్తులో నా కుటుంబానికి ఏమి జరుగుతుందో కూడ నీవు నాకు తెలియపర్చావు. నన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నీవు పరిగణించావు! 18 నేను ఇంతకంటే ఏమి చెప్పగలను? నీవు నాకు ఎంతో చేసావు! కేవలం నేను నీ సేవకుడను. అది నీకు తెలుసు! 19 యెహోవా, ఈ అద్భుత క్రియ నీవు నాపట్ల జరిపించావు. నీవు సంకల్పించావు గనుక నీవది చేసావు! 20 నీవంటి దేవుడు మరొక్కడు లేడు ప్రభూ! నీవు తప్ప వేరొక దేవుడు లేడు! ఈ విధంగా మరేదైవం అద్భుత కార్యాలు జరిపించినట్లు మేము వినలేదు! 21 ఇశ్రాయేలు వంటి మరో దేశం వున్నదా? లేదు! ఈ అద్భుతకార్యాలు నీవు జరిపించిన దేశం భూమి మీద ఇశ్రాయేలు ఒక్కటే. నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి మాకు స్వేచ్ఛ కలుగజేశావు. ఆ విధంగా నీ ఘనతను చాటావు! నీ ప్రజలకు ముందుగా నీవు నడిచి అన్యులు మా కొరకు వారి రాజ్యాన్ని విడిచి పోయేలా చేశావు! 22 ఇశ్రాయేలును నీవు స్వీకరించి శాశ్వతంగా వారిని నీ ప్రజలుగా చేసుకొన్నావు. ప్రభువా, నీవు వారికి దేవుడవై యున్నావు!
23 “యెహోవా నాకు, నా కుటుంబానికి నీవు ఈ వాగ్దానం చేశావు. సదా నీ మాట నిలబెట్టుకో. దేవా! నీవు చేస్తానని చెప్పినదంతా జరిగేలా చెయ్యి! 24 నీవు నమ్మతగిన వాడవని నిరూపించు తండ్రీ! ప్రజలు నీ పేరును ఎల్లప్పుడూ గౌరవించుదురుగాక! అప్పుడు సర్వశక్తుడగు యెహోవా ఇశ్రాయేలు దైవమని ప్రజలు అంటారు! నేను నీ సేవకుడను! దయచేసి నా కుటుంబాన్ని బలపర్చి, నీ సన్నిధిలో వర్థిల్లేలా చేయి.
25 “నా దేవా, నీవు నాకొక నివాసం ఏర్పాటు చేస్తాను అని అన్నావు. అందుచే నీ సేవకుడనైన నేను మనోధైర్యము కలిగివున్నాను. అందుచే నేను నిన్ను ఈ సంగతులను చేయమని అడుగుతున్నాను. 26 యెహోవా, నీవే దేవుడవు, ఈ మేలు చేస్తానని నీవు నాకు వాగ్దానం చేశావు. 27 యెహోవా, నా కుటుంబాన్ని దీవించటంలో నీవు చాలా ఉదారంగా వ్యవహరించావు! నీ సన్నిధిలో నా కుటుంబం సదా మెలగుతుందని నీవు అన్నావు. నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించావు. యెహోవా, నా కుటుంబం ఎల్లవేళలా నీ ఆశీర్వాదం పొందుతుంది.”
* 17:10 యెహోవా … చెప్పుచున్నాను నివాసం అనగా నిజమైన ఇల్లు కాదు. యెహోవా దావీదు వంశం వారిని చాలా సంవత్సరాల వరకు రాజులుగా చేస్తాడని అర్థం.