23
ఆలయ సేవకై లేవీయులకు ఏర్పాట్లు
దావీదు ముసలివాడయ్యాడు. అందువల్ల అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలుకు కొత్త రాజుగా చేసాడు. సొలొమోను దావీదు కుమారుడు. ఇశ్రాయేలు పెద్దలందరినీ దావీదు పిలిపించాడు. అతడు యాజకులను, లేవీయులను కూడ పిలిచాడు. లేవీయులలో ముఫైయేండ్ల వారిని, అంతకు పైబడిన వయస్సు వారిని దావీదు లెక్కించాడు. ఆ లేవీయులు మొత్తం ముప్పై ఎనిమిది వేలమంది వున్నారు. దావీదు ఇలా చెప్పాడు: “ఇరవై నాలుగు వేలమంది లేవీయులు దేవాలయ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆరువేల మంది రక్షక భటులుగాను, న్యాయాధిపతులుగాను వ్యవహరిస్తారు. నాలుగు వేల మంది లేవీయులు ద్వారపాలకులుగా పనిచేస్తారు. మరి నాలుగు వేలమంది లేవీయులు ఆలయ గాయకులుగా వుంటారు. వారికొరకు నేను ప్రత్యేక వాద్యపరికరాలను సిద్ధం చేశాను. వారా వాద్య విశేషాలను యెహోవాను స్తుతించటానికి వినియోగిస్తారు.”
దావీదు లేవీయులను మూడు వర్గాలుగా విభజించాడు. ఆ మూడు వర్గాలకు లేవీ ముగ్గురు కుమారులు ఆధిపత్యం వహించారు. గెర్షోను, కహాతు, మెరారి అని ఆ ముగ్గురు కుమారుల పేర్లు.
గెర్షోను వంశం
లద్దాను, షిమీ అనేవారు గెర్షోను వంశంలోని వారు. లద్దానుకు ముగ్గురు కుమారులు. అతని పెద్ద కుమారుని పేరు యెహీయేలు. అతని మిగిలిన కుమారుల పేర్లు జేతాము, యోవేలు. షిమీ కుమారులు షెలోమీతు, హజీయేలు, హారాను అనువారు. ఈ ముగ్గురు కుమారులు లద్దాను వంశంలో పెద్దలు.
10 షిమీకి మరి నలుగురు కుమారులు. వారి పేర్లు యహతు, జీజా,* యూషు, బెరీయా. 11 యహతు పెద్ద కుమారుడు. జీజా రెండువవాడు. కాని యూషుకు, బెరీయాకు ఎక్కువ మంది పిల్లలు లేరు. కావున యూషు, బెరీయా లిరువురూ ఒకే కుటుంబంగా పరిగిణింపబడ్డారు.
కహాతు సంతతివారు
12 కహాతుకు నలుగురు కుమారులు. వారు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. 13 అమ్రాము కుమారుల పేర్లు అహరోను, మోషే. అహరోను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా చూడబడ్డాడు. అహరోను, అతని సంతతి వారు ఎల్లకాలమూ ప్రత్యేకమైన వ్యక్తులుగానే ఎంపిక చేయబడ్డారు. వారు శాశ్వత ప్రాతిపదికపై యాజకులుగా వుండటానికి ప్రత్యేకింపబడ్డారు. అందువల్లనే వారు శాశ్వతంగా వేరుచేయబడ్డారు. అహరోను, అతని సంతతి వారు యెహోవా ముందు ధూపం వేయటానికి నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. ఎల్లకాలమూ యెహోవా పేరుమీద వారు ప్రజలను ఆశీర్వదించటానికి ఎంపిక చేయబడ్డారు.
14 మోషే దైవజనుడు. మోషే కుమారులు కూడ లేవి వంశానికి చెందినవారుగానే పరిగణింపబడ్డారు. 15 గెర్షోము, ఎలీయెజెరు అనువారు మోషే కుమారులు. 16 గెర్షోము పెద్ద కుమారుని పేరు షూబాయేలు. 17 ఎలీయెజెరు మొదటి కుమారుని పేరు రెహబ్యా. ఎలీయెజెరుకు కుమారులు మరెవ్వరూ లేరు. కాని రెహబ్యాకు మాత్రం చాలామంది కుమారులు కలిగారు.
18 ఇస్హారు పెద్ద కుమారుని పేరు షెలోమీతు.
19 హెబ్రోను పెద్ద కుమారుని పేరు యెరీయా. హెబ్రోను రెండవ కుమారుడు అమర్యా. మూడవవాడు యహజీయేలు. నాల్గవవాని పేరు యెక్మెయాము.
20 ఉజ్జీయేలు పెద్ద కుమారుని పేరు మీకా. రెండవవాడు యెషీయా.
మెరారి సంతతివారు
21 మెరారి కుమారులు మహలి, మూషి అనేవారు. మహలి కుమారుల పేర్లు ఎలియాజరు, కీషు. 22 ఎలియాజరు కుమారులు లేకుండగనే మరణించాడు. అతనికి కేవలం కుమార్తెలు మాత్రం వున్నారు. ఎలియాజరు కుమార్తెలు తమ బంధువులనే వివాహమాడారు. కీషు కుమారులు వారి బంధువులు. 23 మూషి కుమారులు మహలి, ఏదెరు, యెరీమోతు అనే ముగ్గురు.
లేవీయుల పని
24 లేవి సంతతివారు వారి వారి వంశకర్తలననుసరించి లెక్కింపబడ్డారు. వారు తమ తమ కుటుంబాలకు పెద్దలు. ప్రతి ఒక్కని పేరు పట్టికలో రాయబడింది. అలా ఎంచబడిన వారిలో ఇరవై ఏండ్లవారు, అంతకు పైబడిన వయస్సువారు వున్నారు. వారు దేవాలయంలో సేవ చేశారు.
25 దావీదు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా తన ప్రజలకు శాంతి సమకూర్చిపెట్టాడు. యెహోవా ఇశ్రాయేలులో శాశ్వతంగా వుండటానికి వచ్చాడు. 26 కావున లేవీయులు ఇక మీదట పవిత్ర గుడారాన్ని గాని, దేవుని సేవలో వినియోగించే ఇతర పరికరాలను గాని మోసే పనిలేదు.”
27 దావీదు ఇశ్రాయేలు వారికి లేవి వంశంవారిని లెక్కించుమని చివరిసారిగా ఆజ్ఞ ఇచ్చాడు. వారు లేవీయులలో ఇరవై ఏండ్లు, అంతకు పైబడిన వారిని లెక్కించారు.
28 అహరోను సంతతివారికి లేవీయులు ఆలయంలో యెహోవా సేవలో తోడ్పడేవారు. వారు ఆలయ ఆవరణ, పక్క గదుల పరిశుభ్రత విషయంలో కూడ శ్రద్ధ తీసుకొనేవారు. అన్ని పవిత్ర వస్తువులను అపవిత్రపడకుండ చూసేవారు. ఆ విధంగా దేవాలయంలో సేవ చేయటం వారి పని. 29 ప్రత్యేకంగా తయారుచేసిన రొట్టెను అర్పణగా ఆలయంలో బల్ల మీద వుంచటం వారి బాధ్యత. పిండి తయారు చేయటం, ధాన్యార్పణను చెల్లించటం, పులియనిరొట్టె తయారుచేయటం కూడ వారి బాధ్యత. రొట్టెలుచేసే పెనాలు, రకరకాల కలగలుపు అర్పణల విషయంలో వారు శ్రద్ధ తీసుకొనేవారు. ఆయా ద్రవ్యాల కొలతల విషయంలో కూడ వారు జాగ్రత్త తీసుకొనే వారు. 30 లేవీయులు ప్రతి ఉదయం నిలబడి యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు అర్పించి, స్తుతి పాటలు పాడేవారు. వారలా ప్రతి సాయత్రం కూడ చేసేవారు. 31 ప్రత్యేక విశ్రాంతి దినాలలోను, అమావాస్య విందుల సమయంలోను మరియు ప్రత్యేక సెలవు దినాలలోను లేవీయులు యెహోవాకి దహన బలులు సమర్పించే వారు. వారు నిత్యం యెహోవా సన్నిధిలో సేవ చేసేవారు. ప్రతిసారీ ఎంతమంది లేవీయులు సేవ చేయాలి అనే విషయంలో వారికి ప్రత్యేక నియమాలుండేవి. 32 కావున తాము ఏఏ పనులు చేయాలో అవన్నీ లేవీయులు నిర్వహించేవారు. వారు పవిత్ర గుడారం, పవిత్ర స్థలాల విషయంలో కూడ వారు తగిన జాగ్రత్తలు తీసుకొనేవారు. ఆ విధంగా వారి బంధువులగు అహరోను వంశీయులకు వారు సహాయపడ్డారు. అహరోను సంతతివారెవరనగా యాజకులు, ప్రధాన యాజకులు. ఆలయంలో యెహోవా సేవలో ఈ యాజకులకు లేవీయులు సహాయపడ్డారు.
* 23:10 జీజా జీనా అని పాఠాంతరం. 23:16 షూబాయేలు షేబూయేలు అని పాఠాంతరం.